“బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, హల్దీరామ్ నమ్కీన్ ఇప్పుడు ముస్లింల ఆధీనంలో ఉంది. దీని యజమాని నరేష్ ఖండేల్వాల్ ఈ కంపెనీని ఒక ముస్లింకు విక్రయించారు.
హల్దీరామ్ వీరి తాత, ఆయనే నమ్కీన్ తయారీని ప్రారంభించారు. అది బాగా సాగడంతో హల్దీరామ్ కుమారుడు ఘాసీలాల్ ఫ్యాక్టరీ పెట్టి దానిని ప్రజలందరికీ చేరేలా చేశాడు.
ఆ తర్వాత అతని కుమారులు యోగేష్, నరేష్ ఖండేల్వాల్ ఇద్దరూ కలిసి ఈ కంపెనీని ముస్లింకు అమ్మేశారు. హల్దీరామ్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది కానీ ఇప్పుడు అది విధర్మీయుల ఆధీనంలో ఉంది. కాబట్టి ఇందులో పరిశుభ్రత/స్వచ్ఛత అనేది ఏమాత్రం మిగలలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఇకపై హల్దీరామ్ ఉత్పత్తులను కొనకండి. ఈ నిజాన్ని ఇతరులకు షేర్ చేసి ఒక జాగరూక హిందువుగా మీ బాధ్యతను నెరవేర్చండి. – కృతజ్ఞతలతో..” – ఇది 2025లో సంఘ్ పరివారీయులు ప్రచారంలో పెట్టిన ఒక ఆణిముత్యం.
‘ఒకప్పుడు హిందువుల అధీనంలో ఉన్న చుడ్వాలు, కారప్పూసలు, ఇతర భారతీయ స్నాక్స్ తయారు చేసే కంపెనీ హల్దీరాం ఇప్పుడు విధర్మీయులైన ముస్లింల అధీనంలోకి వెళ్ళిపోయింది. శుభ్రతను పాటించని విధర్మీయులైన ముస్లింల అధీనంలో ఉన్న హల్దీరామ్ ఉత్పత్తులను కొనవద్దని, జాగరూకులైన హిందువులుగా మారండి’ అని బోధిస్తున్నది ఈ సర్క్యులర్.
ఇక్కడ మతాన్ని పేర్కొనకుండా ‘విధర్మీయులు’ అనే ముసుగును తగిలించారు.
ముసుగు తొలగిన మతోన్మాదం: వాట్సాప్ గ్రూపుల్లో విష ప్రచారం..
ఏడాది గడచిందో లేదో ఆ ముసుగును కూడా వదిలించుకున్నారు.
ఇప్పుడు 2026లో సంఘ్ పరివారీయులు ప్రచారంలో పెట్టిన సర్క్యులర్‌లో ముసుగు లేకుండానే బాజాప్తాగా “ముల్లాల(ముస్లింల) వద్ద సరుకులు కొనకండి, ముల్లాల అధీనంలో ఉన్న కంపెనీలు తయారు చేస్తున్న వస్తువులను కొనకండి, ముల్లాల నుంచి సేవలు పొందకండి..” ఇట్లా ప్రచారం మొదలయ్యింది. అందులో ముల్లాల వ్యాపార సంస్థలు ఏమిటో కూడా పేర్కొన్నారు.
ఎంత కష్టమైనా సరే ముల్లాల నుంచి ఎటువంటి సేవలు పొందకూడదో పేర్కొన్నారు. ఇవన్నీ పాటిస్తే నెల రోజుల్లోనే దేశం హిందూ దేశంగా మారిపోతుందట. ఇదంతా హిందూ ధర్మ పరిరక్షణ కోసమేనట.
వాట్సాప్ గ్రూపుల్లో మహారాష్ట్రలో ఇటీవల సంఘ్ పరివారీయుల ద్వారా ప్రచారంలో ఉన్న ఒక సర్క్యులర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా నాకూ చేరింది. ఆ వాక్యాలను యధాతథంగా ఉటంకిస్తున్నాను.
వాట్సాప్‌లో వచ్చిన సర్క్యులర్‌లో ఉన్న ఈ వాక్యాలు అన్నీ వారివే తప్ప కల్పించి రాసినవి కావని పాఠకులకు మనవి చేస్తున్నాను.
ఆర్థిక బహిష్కరణకు రంగం సిద్ధం…
జాబితా సిద్ధమైంది, ప్రతి హిందువూ దీన్ని కనీసం 10 గ్రూపులకు పంపండి…!
ఆర్థిక బహిష్కరణ ఎలా ఉండాలంటే వచ్చే నెలకల్లా వారి బ్యాలెన్స్ షీట్ సగానికి పడిపోవాలి. అప్పుడు వాళ్ళ షేర్లు దారుణంగా పడిపోతాయి. వాళ్ళను తుపాకీతో కాల్చలేకపోవచ్చు, కానీ వేలితో (ఫోన్లో ఫార్వర్డ్ చేయడం ద్వారా) దెబ్బతీయండి.
జిహాదీలను నాశనం చేయండి. మీ డబ్బులతోనే వాళ్లు మిమ్మల్ని చంపుతున్నారు. మీకు ఆ మాత్రం దమ్ము లేకపోతే ఇక చావక తప్పదు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఈ జాబితాలో ఇంకా ఏవైనా పేర్లు తెలిస్తే వాటిని కూడా కలపండి.
01. ఏ దర్గాకూ వెళ్లకండి.
02. నెమలి ఈకలు పట్టుకునే బాబాలకు చందాలు ఇవ్వకండి.
03. ముల్లాల(ముస్లింల) దగ్గర పండ్లు, కూరగాయలు కొనకండి.
04. ముస్లిం దర్జీల దగ్గర బట్టలు కుట్టించుకోకండి.
05. ముస్లిం బార్బర్ల దగ్గర జుట్టు కత్తిరించుకోకండి.
06. ముస్లింల ట్యాక్సీ/రిక్షాలో ఎక్కకండి.
07. ముస్లింల దగ్గర మెహందీ/బ్యూటీక్ సేవలు పొందకండి.
08. ముస్లింల హోటళ్లలో తినకండి.
09. ముస్లిం ప్లంబర్/ఎలక్ట్రీషియన్/వెల్డర్లను మార్చేయండి.
ప్రొడక్ట్ లేదా కంపెనీ పేరు – యజమాని లేదా బ్రాండ్ అంబాసిడర్..
01. హమ్దర్ద్ ఉత్పత్తులన్నీ – హకీమ్ అబ్దుల్ హమీద్
02. జారా – పాకిస్థానీ బ్రాండ్
03. మెట్రో షూస్ – ఫరా మాలిక్ భాంజీ
04. రెడ్ టేప్ – ఇర్షాద్ మీర్జా, రషీద్ మీర్జా
05. దా మిలానో – సాహిల్ మాలిక్
06. అలెన్ కూపర్ – ముఖ్తారుల్ అమీన్
07. ఆక్మే బ్రాండ్ – షాహిద్ అమీన్ ఖాన్
08. ఢిల్లీ దర్బార్ (హోటల్ చైన్) – హాజీ షఫీ మన్సూరీ
09. హైవేపై ఉండే డాబాలు – చిలియా ముస్లిం
10. ఫరీదా ఫుట్ వేర్ – రఫీక్ అహ్మద్
11. అల్లానా గ్రూప్ (ఫుడ్ ప్రొడక్ట్) – అబ్దుల్ రజాక్
12. కరెన్స్ సాఫ్ట్వేర్ – ఆసిఫ్ ఖాదర్, ముక్రమ్ జాన్
13. రెడ్ చిల్లీస్ – షారుఖ్ ఖాన్
14. డేటా స్మార్ట్ ESPL – జాకీర్ వహాబ్
15. ప్రొఫెషనల్ కొరియర్ – అహ్మద్ మీరాన్
16. షానాజ్ హుస్సేన్ గ్రూప్ – షానాజ్ హుస్సేన్
17. ST కొరియర్ – కే నవాస్ కానీ
18. లిబర్టీ గ్రూప్ – పర్వేజ్ ఖాదర్
19. సిప్లా బ్రాండ్ – యూసుఫ్ ఖ్వాజా హమీద్
20. వొకార్డ్ – హబిల్ ఖోరకీవాలా
21. హిమాలయ హెర్బల్ హెల్త్‌కేర్ – మేరాజ్ మనల్
22. క్వీన్ బీ టెలికాం – మహ్మద్ అలీ ఇస్మాయిల్
23. స్పోర్ట్స్ వీక్ – ఖాలిద్ అన్సారీ
24. జావేద్ హబీబ్ జెంట్స్ పార్లర్ చైన్ – జావేద్ హబీబ్
25. ముస్లింలు నటించిన/రాసిన/సంగీతం అందించిన/నిర్మించిన/పంపిణీ చేసిన సినిమాలన్నింటినీ బహిష్కరించండి.
ఈ జాబితాలో లేని పేర్లు లేదా ప్రొడక్ట్స్ ఉంటే కలుపుతూ దీన్ని పెంచండి.
1. ఏ ముస్లిం దగ్గరా పంక్చర్ వేయించుకోకండి లేదా వాహనం బాగు చేయించుకోకండి. దీనివల్ల పేద హిందువులు పంక్చర్ దుకాణాలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది.
2. ముస్లింల దగ్గర పండ్లు, కూరగాయలు కొనకండి. వాళ్లపై నమ్మకం లేదు, వాళ్ళు అందులో ఉమ్మి వేయవచ్చు లేదా ఇంకేదైనా కలపవచ్చు.
3. ఏ ముస్లిం బేకరీ నుంచి కేక్, పేస్ట్రీ వంటివి కొనకండి.. వారి మతం ప్రకారం వాళ్ళు తినే వస్తువుల్లో ఉమ్మి వేస్తారట, అలా చేయడం వల్ల సోదరభావం పెరుగుతుందని వారి మతం చెబుతుందట.
4. వేసవిలో మనం తెచ్చుకునే రూహ్ అఫ్జా షర్బత్‌ను హమ్జా అనే ముస్లిం కంపెనీ తయారు చేస్తుంది. దానికి బదులు మీరు పతంజలి పానీయాలు తెచ్చుకోవడం మంచిది.
5. ఇల్లు, దుకాణం, ఫ్లాట్ వంటివి నిర్మించేటప్పుడు పనులు చేయడానికి పేద హిందూ కార్మిక సంఘాన్ని పిలవండి. అంతేగానీ ముస్లిం కాంట్రాక్టర్ లేదా కూలీలను కాదు.
6. జుట్టు కత్తిరింపు కూడా ముస్లిం సెలూన్లలో చేయించుకోకండి. ఉదాహరణకు హబీబ్స్, ఐకానిక్ లాంటివి.
7. ఏ ముస్లిం నటుడి సినిమాను చూడకండి, అలాగే ముస్లింల సినిమా హాల్స్‌కు కూడా వెళ్ళకండి.
8. ఏ ముస్లిం పెట్రోల్ పంపులోనూ పెట్రోల్ కొట్టించకండి.
ఈ విధంగా మనం మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు, హిందూ సోదరులకు అండగా నిలబడవచ్చు. ఈ ఆర్థిక బహిష్కరణ ద్వారా భారతదేశంలో ముస్లింల అరాచకత్వం, ఉగ్రవాదం, మత మార్పిడులు, ఇస్లామీకరణ, హిందువుల హత్యలు వంటి వాటికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
🚩 జై శ్రీరామ్! 🚩
వందేమాతరం…! హిందూ సోదరసోదరీమణులందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టి తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి, ఇది కచ్చితంగా చేయండి:-
1) హిందూ నాయకుడిని ఎన్నుకోండి.
2) హిందూ లాయర్‌ను ఎంచుకోండి.
3) హిందూ ఇంజనీర్‌ను ఎంచుకోండి.
4) హిందూ సీఏను ఎంచుకోండి.
5) హిందూ కూరగాయల వ్యాపారిని ఎంచుకోండి.
6) హిందూ మొబైల్ రీఛార్జ్ షాపును ఎంచుకోండి.
7) హిందూ మెడికల్ స్టోర్‌ను ఎంచుకోండి.
8) హిందూ పాల డెయిరీని ఎంచుకోండి.
9) హిందూ ప్రింటింగ్ ప్రెస్‌ను ఎంచుకోండి.
10) హిందూ పాలు అమ్మేవాడిని ఎంచుకోండి.
11) హిందూ స్టేషనరీ స్టోర్స్‌ను ఎంచుకోండి.
12) హిందూ బట్టల షోరూమ్/దుకాణాన్ని ఎంచుకోండి.
13) హిందూ ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ స్టోర్‌ను ఎంచుకోండి.
14) హిందూ వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి.
15) హిందూ ట్రావెల్ బుకింగ్‌ను ఎంచుకోండి.
16) హిందూ ఫ్లోర్ మిల్లును ఎంచుకోండి.
17) హిందూ కిరాణా దుకాణాన్ని ఎంచుకోండి.
18) హిందూ హార్డ్‌వేర్ దుకాణాన్ని ఎంచుకోండి.
19) హిందూ జిరాక్స్ సెంటర్‌ను ఎంచుకోండి.
20) హిందూ హోటల్‌ను ఎంచుకోండి.
21) హిందూ కూరగాయలు, పండ్ల వ్యాపారిని ఎంచుకోండి.
22) హిందూ మేస్త్రీని ఎంచుకోండి.
23) హిందూ స్వీట్ షాపును ఎంచుకోండి.
24) ఇలా అన్ని పనులకు హిందూ వ్యాపారులనే ఎంచుకోండి.
కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదు. ఒక్క నెలలోనే మీ దేశం హిందూ రాష్ట్రంగా మారిపోతుంది.
ప్రతి హిందువూ ఇలాంటి ఆలోచనే కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ చిన్న ఆలోచనే భవిష్యత్తులో మీ ఉనికిని కాపాడే గొప్ప ఆలోచనగా మారుతుంది.
ఒక్కసారి అందరం కలిసికట్టుగా ఉండి చూద్దాం, జిహాదీలందరూ తలవంచకపోతే అప్పుడు అడగండి.
|| జై శ్రీరామ్ || || వందేమాతరం ||
హిందూ ధర్మ పరిరక్షణా? లేక కుల, వర్ణ వివక్షల కొనసాగింపా?
ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఆర్థికం. రెండవది సాంస్కృతికం. చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు అనుకున్నారేమో- గత ఏడాది ప్రచారంలో పెట్టిన ‘విధర్మీయులు’ ఎవరో ఈ కొత్త సర్క్యులర్‌లో స్పష్టత ఇచ్చేశారు. ఇందులో క్రిస్టియన్ల ప్రస్తావన లేకపోయినా సంఘ్ పరివార్ దృష్టిలో క్రిస్టియన్లు కూడా విధర్మీయులే.
విధర్మీయులైన ముస్లింల వస్తు సేవలను బహిష్కరించండి అని నిస్సిగ్గుగా హిందువులకు పిలుపునిస్తున్నారు. ఇదంతా హిందూ ధర్మ పరిరక్షణ కోసమని బుకాయిస్తున్నారు.
ముస్లింల వస్తు సేవలను బహిష్కరిస్తే హిందూ ధర్మం ఎట్లా రక్షించబడుతుందో, హిందూధర్మంలో అంతర్గతంగా ఉన్న వర్ణ, కుల అసమానతలను, దళితుల పట్ల అంటరానితనాన్ని, వివక్షతను పరిష్కరించకుండా హిందూ ధర్మ పరిరక్షణ ఎట్లా సాధ్యం?
ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో దళితులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. పెండ్లి బారాత్‌లో దళితులు గుర్రం మీద ఊరేగితే శిక్షలకు గురవుతున్నారు. ఇప్పటికీ చాలా స్కూళ్ళలో దళితులు వండిన అన్నాన్ని తమ పిల్లలు తినడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు.
తమది సనాతన ధర్మం అంటారు? సనాతన ధర్మం అంటే శూద్రులకు, అంటరానివారికి అమానుషమైన శిక్షలు ప్రవచించిన మనుధర్మ శాస్త్రమా? బ్రాహ్మణీయ వైదిక ధర్మమా? మరి బ్రాహ్మణీయ వైదిక ధర్మంలో వేళ్ళూనుకొని ఉన్న వర్ణ వివక్షను, యజ్ఞాలు, యాగాలలో జంతు బలిని, హింసను వ్యతిరేకించిన, ప్రజల మధ్య సమానత్వాన్ని ప్రబోధించిన, వైదిక ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేసిన ‘బౌద్ధ ధమ్మం’ కూడా ఈ దేశంలో వైదిక ధర్మం అంత సనాతనమైనది.
మరి బౌద్ధ ధమ్మాన్ని సనాతన ధర్మంగా సంఘ్ పరివారీయులు అంగీకరిస్తారా?
గ్లోబలైజేషన్ యుగంలో బహిష్కరణల సాధ్యసాధ్యాలు..
ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్‌ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజా దాకా- అన్ని రకాలైన ఉత్పత్తుల మీద నిషేధం విధించమని భారత ప్రభుత్వానికి సంఘ్ పరివారీయులు సూచన చేయగలరా?
ఒక దేశం మరొక దేశం ఉత్పత్తుల మీద ఆధారపడిన గ్లోబలీకరణ చెందిన ఈ ప్రపంచంలో ఇది అసాధ్యమని వారికి తెలియనిది కాదు.
అయితే ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషించి, సామరస్యతను ధ్వంసం చేసి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, ఫాసిస్టు మతతత్వ పునాదుల మీద దేశాన్ని నిలబెట్టాలన్న వారి ఆకాంక్ష ఈ సర్క్యులర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నది.
కళకు మతం లేదు: హిందుస్తానీ సంగీతానికి ముస్లింల మహోన్నత సేవ..
ముస్లిం కళాకారులు నటించిన/రచించిన /నిర్మించిన సినిమాలు చూడవద్దట. ముస్లింలు సమకూర్చిన సంగీతాన్ని వినవద్దట. మనం ఎంతో ఇష్టంగా, గౌరవంతో, గర్వంతో నేర్చుకునే, పాడుకునే, వినే హిందుస్తానీ సంగీతాన్ని కాపాడింది, అభివృద్ధి చేసింది ముస్లిం ఉస్తాదులే. వారు మత భేదాలకు అతీతంగా తరం నుంచి తరానికి ఆ మహోన్నత సంగీత వారసత్వాన్ని అందిస్తున్నారు.
భారతరత్న అందుకున్న పండిట్ భీంసేన్ జోషి గురువు సవాయ్ గంధర్వ, అతని గురువు కిరాణా ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్.
మరో భారతరత్న సితార్ వాద్య విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గురువు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. రవిశంకర్ అతని అల్లుడు కూడా. కిరాణా, పాటియాలా, ఆగ్రా, గ్వాలియర్, భేండీ బజార్, రాంపూర్, జైపూర్ తదితర హిందుస్తానీ సంగీత ఘరానాల వ్యవస్థాపకులు అందరూ ముస్లిం ఉస్తాదులే.
మరి విధర్మీయులైన ముస్లిం ఉస్తాదులు అభివృద్ధి చేసిన హిందుస్తానీ సంగీతాన్ని ఈ దేశంలో నిషేధించమని, వారి వద్ద శిష్యరికం చేసి, హిందుస్తానీ సంగీత శిరోమణులుగా ఎదిగిన ఇద్దరు పండిట్లకు ప్రదానం చేసిన భారతరత్నలను వాపస్ తీసుకోమని, కాశీలో గంగా నదిలో తన షెహనాయ్‌ని సంప్రోక్షణ చేయకుండా దినచర్య ప్రారంభించని షెహనాయ్ వాద్య విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌కు ప్రదానం చేసిన భారతరత్నను రద్దు చేయమని భారత ప్రభుత్వానికి సంఘ్ పరివారీయులు సూచన చేయగలరా?
హిందుస్తానీ సంగీత శిఖరాలైన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్.. మరెందరో ముస్లిం ఉస్తాదుల రాగాలు, ఠుమ్రీలను, వాద్య సంగీతాన్ని; నౌషాద్, ఖయ్యాం సినిమా సంగీతాన్ని వినవద్దని, రఫీ పాడిన పాటలను వినవద్దని, సాహిర్ లుధియానవి, కైఫీ ఆజ్మీ, షకీల్ బదాయూనీ రచించిన సినీ గేయాలను వినవద్దని, భారతీయ సినిమా రంగంలో అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయిన మొఘల్-ఏ-ఆజం, పాకీజా, మదర్ ఇండియా సినిమాలను చూడవద్దని వీరు భారత ప్రజలకు చెప్పగలరా?
చరిత్ర పునరావృతం కానుందా? మహారాష్ట్ర మరో గుజరాత్‌గా మారుతుందా?
నా అనుభవంలో మహారాష్ట్ర నుంచి ఇటువంటి సర్క్యులర్లు రావడం ఏడాది కాలంలో ఇది రెండవసారి. 2002 గుజరాత్లో సంఘ్ పరివారీయులు ముస్లింల మీద జరిపిన జాతి హననానికి ముందు సరిగ్గా ఇటువంటి ప్రయోగమే జరిగిందని ఇవ్వాళ గుర్తుకు వస్తున్నది. మహారాష్ట్ర మరొక గుజరాత్ ప్రయోగ వేదిక కానున్నదా? అన్న అనుమానం కలుగుతున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
