ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఈ శతాబ్దం మధ్య నాటికి దాదాపు 3.8 బిలియన్ల ప్రజలు లేదా ప్రపంచ జనాభాలో దాదాపు 41 శాతం మంది ప్రమాదకరమైన వేడి పరిస్థితులను ఎదుర్కొంటారు.
2010లో ఇది 1.54 బిలియన్లు (23 శాతం)గా ఉంది. భారతదేశం ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాలలో ఒకటిగా ఉండబోతోంది.
న్యూఢిల్లీ: శిలాజ ఇంధనాల నిరంతర వినియోగం కారణంగా, 2010 స్థాయిలతో పోలిస్తే 2050 నాటికి ప్రపంచ జనాభాలో తీవ్రమైన వేడికి గురయ్యే వారి సంఖ్య రెట్టింపు కావచ్చని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం హెచ్చరించింది.
భారతదేశం అత్యంత ప్రభావిత దేశాలలో ఒకటిగా నిలుస్తోంది.
పర్యావరణ అధ్యయనాల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ సస్టైనబిలిటీ’లో ప్రచురించబడిన ఈ అధ్యయనాన్ని, రచయితలలో ఒకరు “హెచ్చరిక సంకేతం”గా అభివర్ణించారు.
ఈ అధ్యయనం అంచనా ప్రకారం, ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 41 శాతం మంది లేదా 3.8 బిలియన్ల మంది ప్రమాదకరమైన వేడి పరిస్థితులను ఎదుర్కొంటారు.
2010లో ఈ సంఖ్య 1.54 బిలియన్లు (23 శాతం)గా ఉండేది.
విపరీతమైన వేడి అంటే అసాధారణంగా వేడిగా ఉండే వాతావరణాన్ని సూచిస్తుంది, ఇందులో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వరుసగా చాలా రోజులు కొనసాగుతాయి.
‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం, ఈ అధ్యయన ప్రధాన రచయిత జీసస్ లిజానా మాట్లాడుతూ “భారతదేశం, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక జనాభా అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారు.
ఈ దేశాలలోని ప్రజలు 3,000 కంటే ఎక్కువ శీతలీకరణ డిగ్రీ రోజుల పరిస్థితులలో జీవిస్తారు” అని తెలిపారు.
ఇళ్ల లోపల అనుకూలమైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి అవసరమైన శక్తిని ‘శీతలీకరణ డిగ్రీ రోజులు’ సూచిస్తాయి. “3,000 కంటే ఎక్కువ సీడీడీలు ఉండటం అంటే, ఏడాది పొడవునా తీవ్రమైన వేడి ఉంటుందని అర్థం” అని నివేదిక పేర్కొంది.
“మా అధ్యయనం ప్రకారం, శీతలీకరణ- తాపన డిమాండ్లో చాలా మార్పులు భూతాపం 1.5°C పరిమితిని చేరుకోవడానికి ముందే సంభవిస్తాయి” అని లిజానా చెప్పారు.
“రాబోయే ఐదు సంవత్సరాలలో చాలా ఇళ్లకు ఎయిర్ కండిషనింగ్ అవసరం కావచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రతలు 2°Cకి చేరుకుంటే, ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి” అని అన్నారు.
ఇదో హెచ్చరిక
“మా పరిశోధన ఫలితాలు తీవ్రమైన హెచ్చరిక లాంటివి” అని అధ్యయన సహ రచయిత్రి, ప్రొఫెసర్ రాధిక ఖోస్లా అన్నారు.
1.5°C స్థాయిని దాటడం వల్ల విద్య, ఆరోగ్యం, వలసలు, వ్యవసాయం వరకు ప్రతి రంగంపై చాలా ఎక్కువ ప్రభావాలు ఉంటాయి.
“పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధోరణిని తిప్పికొట్టడానికి ఏకైక మార్గం నికర-సున్నా స్థిరమైన అభివృద్ధి. ఈ దిశలో రాజకీయ నాయకులు చొరవ చూపడం చాలా ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.
పారిశ్రామికీకరణకు ముందు కాలంతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్(గరిష్టంగా 2 డిగ్రీలు)కు పరిమితం చేయాలనే లక్ష్యంతో 2015లో పారిస్ వాతావరణ ఒప్పందం కుదిరినప్పటికీ, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీలకు చేరువలో ఉంది.
భవిష్యత్తులో అతి శీతల ప్రాంతాలు తగ్గిపోనుండటంతో, ప్రపంచ జనాభాలో అటువంటి ప్రాంతాల్లో నివసించే వారి శాతం 14 శాతం నుంచి 7 శాతానికి పడిపోవచ్చని కూడా నివేదిక వెల్లడించింది.
గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులలో తీవ్రమైన వేడికి గురయ్యే జనాభా ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటని నివేదిక స్పష్టం చేస్తోంది.
వ్యూహాల అవసరం
“ఈ పరిశోధనలు భారత జనాభాలో పెరుగుతున్న దుర్బలత్వాన్ని నొక్కి చెబుతున్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేక అనుసరణ; ఉపశమన వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి” అని నివేదిక పేర్కొంది.
“వాతావరణ మార్పుల విషయంలో ఈ ఆక్స్ఫర్డ్ అధ్యయనం ఒక ముఖ్యమైన మైలురాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని త్వరగా తగ్గించకపోతే, ఇప్పటికే ప్రాణాంతకంగా మారిన తీవ్రమైన వేడి- 2050 నాటికి ప్రస్తుత ప్రపంచ జనాభాకు రెండింతల ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలకు ఇది పెద్ద సవాలు” అని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) ప్రొఫెసర్, వాతావరణ నిపుణుడు అంజల్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు.
“జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఇది సామాజిక అసమానతలను మరింత పెంచుతుంది” అని ఆయన హెచ్చరించారు.
“భారతదేశం, ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో వడగాల్పులు వాయు కాలుష్య సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. తక్షణ చర్యలు తీసుకోవడం చాలా కీలకం. పునరుత్పాదక శక్తి, గ్రీన్ ఫైనాన్స్, వాతావరణ ఒప్పందాలకు అనుగుణంగా విధానాలను వేగంగా అమలు చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా కోలుకోలేని పరిణామాలు ఎదురవుతాయి” అని ప్రకాష్ అన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, దక్షిణ సూడాన్, లావోస్, బ్రెజిల్ దేశాలలో తలసరి శీతలీకరణ అవసరాలు భారీగా పెరుగుతాయి.
అదే సమయంలో కెనడా, రష్యా, ఫిన్లాండ్, స్వీడన్, నార్వేలలో వాతావరణం వేడెక్కుతున్నందున తాపన అవసరాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
