ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య హక్కును సాధించే అసంపూర్ణ ప్రయాణం: జీవితం–మరణం మధ్య పోరాటం పుస్తకం నుంచి కొంత భాగం. ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాధారణంగా అసమతుల్య ఆహారం, ధూమపానం, మద్యం దుర్వినియోగం లాంటి అంశాలను వ్యక్తిగత జీవనశైలి ఎంపికలుగా పరిగణిస్తారు.
అయితే పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే ఈ అలవాట్లు కూడా చాలా వరకు పేదరికం, సామాజిక వెనుకబాటు, ఆర్థిక అసమానతలు లాంటి పరిస్థితుల ప్రభావంతో ఏర్పడతాయి.
అందువల్ల ప్రజారోగ్య విధానాలు కేవలం వ్యక్తుల ప్రవర్తనను మార్చడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా ప్రజలను వ్యాధుల పట్ల మరింత బలహీనులను చేసే సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా మార్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి.
ఆరోగ్యాన్ని నిర్ణయిస్తున్న ఉద్యోగ స్వభావం..
మరో ముఖ్యమైన అధ్యయనం ప్రకారం ముఖ్యంగా అధిక ఆదాయ దేశాల్లో ఒక వ్యక్తి చేసే పని, ఆ పనిని పొందే అవకాశం, అలాగే ఉద్యోగ నిబంధనలు ఆరోగ్యంపై, ఆరోగ్య అసమానతలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఈ అధ్యయనం లింగం, జాతి లేదా వర్ణం, వయస్సు, వలసదారుల హోదా లాంటి అంశాలు ఉద్యోగ పరిస్థితులతో కలిసిపోయి ఆరోగ్య అసమానతలను మరింత పెంచుతున్నాయని వివరిస్తుంది.
ఉదాహరణకు మహిళలు, వర్ణ వివక్షకు గురయ్యే ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేని, ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం ఉన్న పనుల్లోనే పనిచేయాల్సి వస్తోంది.
ఇంకా దుర్భర పరిస్థితి తాత్కాలిక ఒప్పంద కార్మికులు, శరణార్థులు ఎదుర్కొంటున్నారు. వీరు ఎక్కువగా శారీరకంగా అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన పనులు చేయవలసి వస్తుంది.
అలాగే గిగ్ ఎకానమీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు లాంటి ఉపాధి విధానాలు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లాంటి ప్రాథమిక హక్కులను కల్పించకపోవడం వల్ల కార్మికుల ఆరోగ్యానికి అదనపు ప్రమాదాలను సృష్టిస్తున్నాయి.
దీంతో పాటు అనేక మంది కార్మికులు అధిక పని గంటలు, క్రమం లేని పని సమయాలు పాటించాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, పనిలో జరిగే గాయాలు లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే ఆరోగ్యాన్ని కేవలం ఆసుపత్రులు, మందులు మాత్రమే నిర్ణయించవు.
మనిషి పనిచేసే పరిస్థితులు, ఉద్యోగ భద్రత, వేతనం, సామాజిక రక్షణ కూడా ఆరోగ్యాన్ని నిర్ణయించే కీలక సామాజిక అంశాలుగా ఉంటాయి.
వికలాంగులు, వృద్ధుల ఆరోగ్య సేవల అనుభవాలు- ఉగాండా అధ్యయనం చెప్పిన వాస్తవాలు..
ఉగాండాలో నిర్వహించిన ఒక విస్తృత అధ్యయనం, వికలాంగులు, వృద్ధులు ప్రభుత్వ ఆరోగ్య సేవలను పొందడంలో ఎదుర్కొనే కష్టాలపై విలువైన అవగాహనను అందించింది.
ఉగాండాలో ఈ పరిశోధన జరిగినప్పటికీ దాని నిర్ధారణలు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ రెండు వర్గాలు ఎదుర్కొనే సమస్యలకు కూడా వర్తిస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ అధ్యయనం ప్రకారం వికలాంగులు, వృద్ధులు నాణ్యమైన వైద్య సేవలు పొందడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో తగిన సదుపాయాలు లేకపోవడం, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కొరత, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు సాధారణంగా కనిపించాయి.
అంతేకాకుండా వికలాంగుల పట్ల సమాజం, కొన్నిసార్లు ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది కూడా గౌరవప్రదంగా వ్యవహరించడం లేదని అధ్యయనం వెల్లడించింది.
వారిని స్వతంత్రంగా ఏమీ చేయలేని వారిగా లేదా ఇతరులకు భారంగా భావించే ధోరణి కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
దీనివల్ల వారికి అవమానం, నిర్లక్ష్యం, వివక్ష లాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
ఈ అధ్యయనంలో మరో కీలక అంశం వైద్య చికిత్స ఖర్చు. పేదరికంలో జీవిస్తున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు చికిత్స ఖర్చులను భరించలేకపోతున్నారు.
వైద్యులు మందులు సూచించినప్పటికీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడం చాలా మందికి సాధ్యం కావడం లేదని పరిశోధన తెలిపింది.
ఈ అధ్యయనం స్పష్టం చేసే విషయం ఏమిటంటే ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండటం మాత్రమే సరిపోదు.
సమాన గౌరవం, తగిన సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, అందుబాటు ధరల్లో మందులు, అలాగే ఆర్థిక రక్షణ కూడా అందరికీ లభించినప్పుడే నిజమైన ఆరోగ్య హక్కు సాధ్యమవుతుంది.
వికలాంగులకు ఆరోగ్య సేవల్లో భౌతిక, సమాచార అడ్డంకులు..
ఉగాండా అధ్యయనం ప్రకారం అనేక ఆరోగ్య కేంద్రాలు నడవడంలో ఇబ్బందులు ఉన్న వికలాంగులకు అనుకూలంగా నిర్మించబడలేదు.
ర్యాంపులు, వీల్‌చైర్ సౌకర్యాలు లాంటి ప్రాథమిక ఏర్పాట్లు లేకపోవడం వల్ల వారు ఆరోగ్య సేవలను పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అలాగే వినికిడి లోపం ఉన్న వ్యక్తులు మరో పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు.
ఆసుపత్రుల్లో సంకేత భాష తెలిసిన అనువాదకులు లేకపోవడం వల్ల వారు వైద్యులతో తమ సమస్యలను సరిగా చెప్పలేకపోయారు.
వైద్యులు కూడా వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు.
ముఖ్యంగా వికలాంగ మహిళలు పునరుత్పత్తి ఆరోగ్య సేవల్లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు అధ్యయనం తెలిపింది.
గర్భిణీ వికలాంగ మహిళల అవసరాలకు అనుగుణమైన ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన లోపంగా గుర్తించబడింది.
కొంతమంది మహిళలు తమ అనుభవాలను వివరిస్తూ వైద్య సిబ్బందితో సరైన సమాచార మార్పిడి జరగకపోవడం వల్ల ప్రసవ సమయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు.
ఈ అనుభవాలు వికలాంగులకు అనుకూలమైన ఆరోగ్య వ్యవస్థ లేకపోతే వారి ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఈ అధ్యయనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
వ్యాధిని మాత్రమే కాదు, వ్యాధికి కారణమైన సామాజిక పరిస్థితులను కూడా మార్చాలి – మైకేల్ మార్మట్
ప్రజారోగ్య నిపుణుడు మైకేల్ మార్మట్ ఒక ప్రభావవంతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి చికిత్స చేసి తిరిగి అతనిని అదే పేదరికం, అసమానతలు, దారుణమైన జీవన పరిస్థితుల్లోకి పంపడం వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.
ఎందుకంటే అతని అనారోగ్యానికి కారణమైన పరిస్థితులు మారకపోతే అతను మళ్లీ అదే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
అందువల్ల ప్రజల్లో ఆరోగ్య అసమానతలను తగ్గించాలంటే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక నిర్ణాయక అంశాలు — పేదరికం, విద్య, ఉపాధి, నివాసం, పోషకాహారం, సామాజిక భద్రత లాంటి అంశాలపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని మార్మట్ వాదించారు.
ఆయన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. వైద్యులు రోగిని కేవలం ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా మాత్రమే కాకుండా అతను జీవిస్తున్న కుటుంబ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఈ విస్తృత దృష్టికోణం వైద్య సేవల్లో భాగం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా శిశు వైద్యులు పిల్లలకు చికిత్స చేయడమే కాకుండా వారి ప్రారంభ బాల్య వికాసం లాంటి అంశాలపై కూడా దృష్టి పెడతారని మార్మట్ పేర్కొన్నారు. ఎందుకంటే బాల్య పేదరికం పిల్లల జీవన ప్రమాణాలు, విద్యా అవకాశాలు, భవిష్యత్తు అవకాశాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.
అందుకే పిల్లల ఆరోగ్య సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనాలంటే వారు ఎలాంటి కుటుంబ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్నారో అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని మైకేల్ నొక్కి చెప్పారు.
ఆరోగ్యాన్ని నిర్ణయించేది ఆసుపత్రులు మాత్రమే కావు..
19వ శతాబ్దం చివరలో బొంబాయి ప్లేగు మహమ్మారిని ఎదుర్కొన్న దూరదృష్టి గల వలస పాలక అధికారులు, క్షయవ్యాధిపై పోరాడిన నార్మన్ బెత్యూన్ తమ అనుభవాల ద్వారా ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.
తరువాత అనేక మంది ప్రజారోగ్య పరిశోధకులు కూడా అదే విషయాన్ని తమ అధ్యయనాల ద్వారా మరింత బలపరిచారు.
వారి ప్రధాన నిర్ధారణ ఏమిటంటే ఒక వ్యక్తి ఆరోగ్యం కేవలం ఆరోగ్య సేవలు, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు, మందులు, పరీక్షా సదుపాయాలపై మాత్రమే ఆధారపడదు.
అతని జీవన పరిస్థితులు, పోషకాహారం, ఉపాధి, నివాసం, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత, ఆదాయం లాంటి అనేక సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తాయి.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
