లద్ధాఖ్‌లో చెలరేగిన హింసకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హింసలో చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఇరవై సంవత్సరాల వయసు పైబడిన వారున్నారు. వారి మొండెం, తలలో చాలా తూటాల గాయాలున్నాయి.
లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించి, ఆరవ షెడ్యూల్ కింద భద్రతను విస్తరించాలనే తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచడానికి యువజన, విద్యార్థి సంఘాలు నడుంబిగించాయి. సెప్టెంబర్ 24న బుధవారంనాడు బంద్(షెట్‌డౌన్)కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా బంద్ రోజు లేహ్‌లో నిరసన చేస్తున్న యువతను చెదరగట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇది కాస్తా హింసకు దారితీసింది. ఈ హింసలో నలుగురు చనిపోయారు.
రాష్ట్రహోదా కోసం జరిగిన నిరసనలో పాల్గొనడానికి లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం నలుమూలల నుంచి పలువురు విద్యార్థులు, యువకులు సెప్టెంబర్ 24న లేహ్‌కు చేరుకున్నారు. అందులో రాజధానికి 160 కిలో మీటర్ల దూరంలో ఉన్న హను గ్రామ నివాసి ఒకరు ఉన్నారు. మరొకరు 200 కిలోమీటర్ల దూరంలోని స్కుర్ బుచన్కు చెందిన వ్యక్తి, మిగితా ఇద్దరు ఇగూ గ్రామం ఖర్నాక్లింగ్ నివాసులున్నారు. ఖర్నాక్లింగ్ రాజధానికి సమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీరిలో ముగ్గురు 20 సంవత్సరాలు దాటిన వారుండగా- అందులో ఒకరు మాజీ సైనికుడు, మిగితా ఇద్దరు లేహ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.
నిరసన సందర్బంగా లేహ్‌లో చెలరేగిన హింసలో అనేక తూటా గాయాలతో మరణించారని విశ్వసనీయ సమాచారవర్గాలు తెలిపినట్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలియజేసింది.
మరణించిన వారిలో ఖర్నాక్లింగ్కు చెందిన జిగ్మెట్ డోర్జాయ్(25), ఇగూ గ్రామం నుంచి స్టాన్జిన్ నంగ్యాల్(23) హనూ నుంచి రించెన్ దాదుల్(20), స్కుర్ బుచన్ ప్రాంతానికి చెందిన త్సేవాంగ్ థార్చిన్(46)గా గుర్తించారు.
మాజీ సైనికుడైన థార్చిన్ ప్రస్తుతం లేహ్‌లో చదువుకుంటున్నాడని, చనిపోయే కొన్నిరోజుల ముందే ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగంలో చేరాడని థార్చిన్ కుటుంబసభ్యుడైన నామ్‌గ్యాల్ చెప్పాడు.
“అతడు మంచి పిల్లాడు, ఇంతకు మించి మేము ఏమీ చెప్పలేము. సహృదయంతో అర్ధం చేసుకోండి. మేము మీడియాతో మాట్లాడకూడదని ఆదేశాలు ఉన్నాయి”అని నామ్‌గ్యాల్ అన్నారు.
లేహ్ అధికారులు నోరువిప్పకపోవడంతో, మరణించిన వారితో సహా ఇతర బాధిత కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నట్టుగా సమాచార వర్గాలు తెలియజేశాయి. ఏదిఏమైన్నప్పటికీ, మృతదేహాలను వారి కటుంబ సభ్యులకు సెప్టెంబర్ 25న అందజేశారు.
సెప్టెంబర్ 24 మధ్యాహ్నం, లేహ్‌లోని ఎస్ఎన్ఎం ఆసుపత్రికి 50 మందికి పైగా క్షతగాత్రులను తీసుకుచ్చారు. ఆసుపత్రికి తరలించే సమయంలో ఇద్దరు బాధితులు ప్రాణాలతోనే ఉన్నారు. కానీ తగిలిన గాయాల వల్ల ఆ తర్వాత వారు చనిపోయారు. వారి మొండెం, తల భాగంలో అనేక తూటా గాయాలున్నాయి. తుపాకి కాల్పుల్లో మరో అరడజను మంది తీవ్రంగా గాయపడినా, వారు మాత్రం బతికి బయటపడ్డారు.
రబ్బరు తూటాలు, లాఠీ దెబ్బలకు విగితా కొందరి కాళ్లు ఇతర అవయవాలు విరిగిపోయాయి. దీంతో వాళ్లు చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కొంతరికి చికిత్స పూర్తికావడంతో, వారిని డిశ్చార్జ్ చేసినట్టుగా చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నవారిలో లోబ్జాంగ్ రించెన్ కూడా ఉన్నారు. ఆయన మామ అప్పర్ లేహ్ కౌన్సిలర్ ఫంట్‌సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హింసలో పాల్గొని బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. దీని కోసం ఒక వీడియో క్లిప్పింగ్‌ను ఆధారంగా చూపించింది.
హింస చెలరేగినప్పుడు త్సెపాగ్ గుంపులోనే ఉన్నారన్న విషయాన్ని లేహ్‌లో డ్రక్ లద్ధాఖ్ హోటల్‌ను నిర్వహిస్తున్న 56 ఏళ్ల రించిన్ త్రోసిపుచ్చారు.
“త్సెపాగ్ ఉదయం నిరసనలో పాల్గొని మధ్యాహ్నం 12:50 గంటలకే హోటల్‌కు వచ్చారు. హింస 1.15 గంటలకు మొదలైంది. ఆయన హోటల్లో ఉన్నట్టు చూపించడానికి తమ వద్ద సీసీటీవీ ఫుటేజిలున్నాయి. ఆ తర్వాత సాయంత్రం ఆయన కౌన్సిలర్ల హాస్టల్‌కు వెల్లారు”అని రించిన్ వివరించారు.
“మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు హోటల్‌కు వచ్చి మమ్మల్ని ధూషిస్తూ త్సెపాగ్ ఎక్కడున్నాడని అడిగారు. వారికి అన్ని విషయాలను వివరించాము. అయినప్పటికీ వారు మమ్మల్ని నమ్మలేదు. ఆ తర్వాత నన్ను పోలీసు స్టేషన్‌కు రమ్మని పిలిచి, బాగా చితకబాదారు. నేను ఇప్పుడు ఇక్కడ గాయాలకు చికిత్స పొందుతున్నాను” అని రించిన్ చెప్పారు.
రించిన్ వాదనలపై వివరణ కోరడానికి తమ వార్తా సంస్థ ప్రయత్నించిందని, కానీ లద్ధాఖ్ డీజీపీ ఎస్డిసింగ్ జాంవాల్ స్పందించలేదని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

