సీజేపీ ప్రస్తుతం ఒక ఒత్తిడి బృందంగా (ప్రెజర్ గ్రూప్) మాత్రమే కొనసాగుతుందని, ఎన్నికల రాజకీయంలోకి ప్రవేశించదని స్పష్టం చేసింది. జాతీయ ఎజెండా కోసం వారి పర్యటన సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.
న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ ఆగస్టు 6 ‘క్యా బోల్తీ పబ్లిక్‘ పేరుతో తన జాతీయ ఎజెండాను ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే తమ కార్యాచరణ ప్రణాళికను అందులో పేర్కొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగిన రెండు రోజుల సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ ఎజెండాను వెల్లడించారు.
ఇందులో భాగంగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన విజయవంతమై వివిధ రాష్ట్రాల్లో యువత ఉద్యమాలకు దారితీసిన అనంతరం, సీజేపీ నాయకత్వం దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు ప్రకటించింది. భారత దేశంలోని ప్రతి మూల లో ఉన్న యువకులతో నేరుగా మమేకమై, నాలుగు ప్రధాన స్తంభాల ఆధారంగా పౌర ఆధారిత ‘యువజన సంస్కరణల ఛార్టర్’ ను రూపొందించాలని నిర్ణయించింది. ఆ నాలుగు స్తంభాలు సమగ్ర విద్యా సంస్కరణలు, విద్య-ఉద్యోగాల అనుసంధానం, వ్యవస్థాగత జవాబుదారీతనం, విశాల ఐక్యత.
తమ ప్రాథమిక లక్ష్యం నెరవేరిన తర్వాత సీజేపీ తదుపరి ఏమి చేయాలని నిర్ణయించు కుంటుందనే దానిపై ప్రశ్నలు వెల్లు వెత్తాయి. ఆ సంస్థ రద్దవుతుందా లేదా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ బృందం ఒక ఆన్లైన్ వ్యంగ్యంగా ప్రారంభమై, త్వరలోనే విస్తృతమైన మైదాన స్థాయి నిరసనగా మారింది. చివరికి తమ హయాంలో జరిగిన నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ కుంభకోణం వంటి వివిధ పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసింది. ఈ దశలో తాము ఒత్తిడి బృందంగానే ఉంటామని, ఎన్నికల రాజకీయంలోకి ప్రవేశించబోమని వారు స్పష్టం చేశారు.
“సీట్ల కోసం పోటీపడే మరో రాజకీయ పార్టీ భారత దేశానికి అవసరం లేదు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి, బయటి నుండే విధానపరమైన మార్పును తీసుకురావడానికి సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసే పట్టుదలతో కూడిన ఉద్యమం అవసరం,” అని సీజేపీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది.
విలేకరుల సమావేశంలో దీప్కే, ప్రధాన్ రాజీనామాను విద్యార్థుల ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఈ విలేకరుల సమావేశంలో సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
సీజేపీ ప్రణాళికపై దీప్కే మాట్లాడుతూ, “‘క్యా బోల్తీ పబ్లిక్‘ ప్రచారంలో భాగంగా, దేశంలో ప్రస్తుత పరిస్థితిపై ప్రజలు ఏమనుకుంటున్నారో, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మేము తెలుసుకుంటాము” అని అన్నారు. “గడిచిన 10-12 ఏళ్లలో ఈ ప్రభుత్వం ప్రజల మనస్సుల్లో సృష్టించిన భయం ఇప్పుడు తొలగింది. ప్రజలు ఇప్పుడు రోడ్ల పైకి వస్తారు. ఈ రోజు ఒకరి రాజీనామాను కోరారు. రేపు ఇతరుల రాజీనామాలను డిమాండ్ చేస్తారు” అని దీప్కే పేర్కొన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనకు విద్యార్థులే కాకుండా ఉద్యోగాలు లేని యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారని ఆయన గుర్తుచేశారు. “నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్య. మేము దాన్ని దేశవ్యాప్త సమస్యగా మారుస్తాము. మేము విద్యా సంస్కరణలపై పనిచేస్తాము. బడి విద్య నుండి విద్య అందరికీ అందుబాటులో లేకుండా ఖరీదైనది గా మారింది. విద్యను లాభాలు ఆర్జించడానికి ఉపయోగిస్తున్నారు. మేము దానిని మార్చాలనుకుంటున్నాము” అని ఆయన అన్నారు. దీనికి తోడు, మీడియా విశ్వసనీయతను తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా సీజేపీ వ్యవస్థాపకుడు తెలిపారు.
“అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూల దార్శనికత కు అనుగుణంగా సీజేపీ పనిచేస్తుంది,” అని పేర్కొంటూ, “మా సిద్ధాంతం భారత రాజ్యాంగంతో సమానమైనది” అని ఆయన అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
