“పోలీసు అధికారుల నుంచి ఆశించే నిబద్ధత మాయమైపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం” అని ఒక పుస్తకావిష్కరణ వేడుకలో మాట్లాడుతూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
న్యూఢిల్లీ: నీట్ 2026 పరీక్ష అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థుల ఆందోళన సందర్భంగా నిరాయుధులైన నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సెప్టెంబర్ 4న ఆందోళన వ్యక్తం చేశారు.
“పోలీసు అధికారుల నుంచి ఆశించే నిబద్ధత మాయమైపోతున్నట్లు కనిపిస్తోంది” అని అన్నారు.
మాజీ భద్రతా కార్యదర్శి యశోవర్ధన్ ఆజాద్ పుస్తకం “పోలీసింగ్ ది రిపబ్లిక్” ఆవిష్కరణలో జస్టిస్ భుయాన్ మాట్లాడుతూ ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులు పౌరులపై దాడి చేయడం “చాలా చాలా బాధ కలిగిస్తోంది” అని చెప్పారు.
“ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన యువ అధికారులు నిరసనకారులు, ప్రదర్శనకారుల వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి దాడి చేయడం చూసి మనమందరం దిగులు పడ్డాం. అది పరిశీలిస్తే ఏదో చాలా చాలా బాధ కలుగుతుంది” అని ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వెల్లడించింది.
“పోలీసు అధికారుల నుంచి ఆశించే నిబద్ధత ఏదో విధంగా మాయమైపోతున్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన అంశం” అని భుయాన్ స్పష్టం చేశారు.
సమర్థవంతమైన పోలీసింగ్‌కు మితిమీరిన బలాన్ని ఉపయోగించడం లేదా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడాల్సిన అవసరం ఉండదని, ప్రత్యేకంగా నిత్య జీవితంలో పోలీసు అధికారులతో తారసపడే పౌరుల కోసం రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమని ఆయన నొక్కిచెప్పినట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం తెలియజేసింది.
“అనేక మంది సామాన్య ప్రజలకు వీధుల్లో విజిల్, లాఠీతో ఉండే పోలీసు సిబ్బంది రాజ్య అధికారానికి, బలానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. తమకేదైనా అన్యాయం జరిగిందని భావిస్తే పోలీసు సహాయాన్ని కోరుతారు. కాబట్టి విశ్వసనీయతను కాపాడుకోవడం పోలీసు బలగానికి చాలా ముఖ్యం” అని ఆయన అన్నారు.
పోలీసుల విశ్వసనీయత – కస్టోడియల్ చిత్రహింసలు..
రాజ్యాంగానికి కఠినంగా కట్టుబడి చట్టబద్ధమైన పాలనను రక్షిస్తూ నిష్పాక్షపాతంగా పనిచేస్తూ నమ్మకాన్ని, విశ్వసనీయతను పోలీసులు నిర్వహించుకోవాలని సూచించారు.
అంతేకాకుండా పోలీసింగ్‌లో లౌకిక విధానాల పట్ల సమగ్రత, ధైర్యం, నేరారోపణలకు కట్టుబడి ఉండటం కూడా ముఖ్యమని గుర్తు చేశారు.
“చట్టబద్ధమైన పాలనను పరిరక్షించడం, లౌకిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సమగ్రతను కాపాడుకుంటూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ నిష్పాక్షపాతంగా పనిచేసినప్పుడే నిజమైన వృత్తిపరమైన దళంగా నిలుస్తుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం” అని జస్టిస్ భుయాన్ అన్నారు.
భారత్‌లో కస్టోడియల్ చిత్రహింసలు, మరణాల కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ కస్టోడియల్ మరణాలు “చట్టబద్ధమైన పాలనలో ఉన్న నాగరిక సమాజంలో అతి ఘోరమైన నేరాల్లో ఇదొకటి” అని అభిప్రాయపడ్డారు.
దర్యాప్తు, విచారణ లేదా ఇతర ఏ దశలోనైనా చిత్రహింసలు లేదా అమానవీయంగా వ్యవహరిస్తే, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పరిధిలోకి వస్తాయని కూడా జస్టిస్ భుయాన్ అన్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం తెలిపింది.
అరెస్టు తర్వాత పౌరులు ప్రాథమిక హక్కులను కోల్పోతారా?..
డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి 1997 సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. అరెస్టుకు సంబంధించిన రక్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్న బాధితులకు నష్టపరిహారం అవసరాన్ని జస్టిస్ భుయాన్ స్పష్టంగా చెప్పారు.
ఆ తీర్పు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది: పోలీసు అధికారి అరెస్టు చేసిన వెంటనే ఆ వ్యక్తి తన ప్రాథమిక హక్కులను కోల్పోతాడా? అరెస్టు తర్వాత జీవించే హక్కును నిలుపుదల చేస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
“లేదు అనే సమాధానాన్ని గట్టిగా నొక్కి చెప్పాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.
అరెస్టు, విచారణకు సంబంధించి పోలీసుల సంరక్షణలో ఉన్న ప్రజల కోసం రాజ్యాంగపరమైన రక్షణ అమలుపై ఆ తీర్పు కొన్ని ఆదేశాలిచ్చిందని జస్టిస్ భుయాన్ తెలిపారు.
న్యాయ ప్రక్రియ లేకుండా చేసే హత్యలు, ‘బూటకపు ఎన్కౌంటర్ల’పై కూడా న్యాయమూర్తి మాట్లాడినట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలియజేసింది.
ఇలాంటి సంఘటనలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. 2011 తీర్పును ప్రస్తావిస్తూ, బూటకపు ఎన్కౌంటర్లు “చట్టబద్ధమైన పాలన సారాంశాన్ని దెబ్బతీస్తాయని కోర్టు పేర్కొంది.”
అలాంటి ఎన్కౌంటర్ల కేసుల్లో సర్వీసులో ఉన్న పోలీసు సిబ్బంది ప్రమేయాన్ని అతి తీవ్రంగా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
“ఎన్కౌంటర్ తత్వం ఒక నేర తత్వం. అది పోలీసింగ్‌లో భాగం కారాదు” అని జస్టిస్ భుయాన్ చెప్పారు.
పోలీసు సంస్కరణల అవసరం..
పోలీసు సంస్కరణలకు పిలుపునిస్తూ పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని అడ్డుకోవాలని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించడం మరొక ముఖ్యమైన అంశం.
పౌరుల రాజ్యాంగపరమైన హక్కుల పరిరక్షణకు సంస్థాగతపరంగా బాధ్యతతో పాటు చట్టాన్ని అమలుపరచే ఏజెన్సీగా పోలీసుల పనితీరు, పాత్రను పరిశీలించడానికి ప్రభుత్వం 1977లో ఏర్పాటు చేసిన జాతీయ పోలీసు కమిషన్‌ను ఆయన ప్రస్తావించారు.
పోలీసులకు వృత్తిపరంగా స్వాతంత్ర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకోవడం, అలాగే వారి వ్యవహారశైలిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు వంటి వాటిపై కమిషన్ సిఫార్సులు చేసింది.
జాతీయ పోలీసు కమిషన్ చేసిన సిఫార్సులు, సూచనలను అమలు చేయకపోవడం తర్వాత పోలీసు సంస్కరణలకు సంబంధించి ప్రకాశ్ సింగ్ ఇతరుల కేసులో సుప్రీం కోర్టు 2006 తీర్పును ఈ సందర్భంగా జస్టిస్ భుయాన్ ప్రస్తావించారు.
పోలీసు ఫిర్యాదుల అధికారులు, పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డుల స్థాపన, పోలీసుల ఇతర పనుల నుంచి దర్యాప్తును వేరు చేయడం, పోలీసు డైరెక్టర్ జనరల్ ఎంపిక, కనీస పదవీకాలం, రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిషన్ల ఏర్పాటు వంటి విషయాలపై సుప్రీం కోర్టు అనేక ఆదేశాలను జారీ చేసింది.
మణిపూర్‌పై ఆందోళన..
పోలీసింగ్ ది రిపబ్లిక్ పుస్తకంలో మణిపూర్ చాప్టర్ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసను నొక్కి చెబుతూ ఆ రాష్ట్రానికి గొప్ప ప్రతిభ, సంస్కృతి ఉందని వర్ణించారు.
మితిమీరిన రాష్ట్ర పోలీసు, మణిపూర్ రైఫిల్స్, పారా మిలటరీ దళాలు, సైన్యం వంటి భద్రతా దళాల ఉనికి ఉన్నప్పటికీ “శాంతి అంతుచిక్కకుండానే పోతోంది” అని అన్నారు.
“అక్కడ మనందరికీ ఒక గుణపాఠం ఉంది. భారత్‌కు కూడా ఒక గుణపాఠం ఉంది” అని ఆయన ముగించారు.
ఈ వేడుక న్యూఢిల్లీలోని వైస్రాయ్ హాల్లో జరిగింది. కాంగ్రెస్ ఎంపీ పీ. చిదంబరం, మాజీ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీ. శివానందన్ కూడా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నట్లు తెలిసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
