చరిత్రలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయి. ఈజిప్ట్, సిరియాల్లో మమ్లుక్ సుల్తానేట్—అంటే బానిస సైనికుల పాలన— బానిసలుగా కొనుగోలు చేయబడిన స్థితి నుంచి ఎదిగి, చివరకు శక్తివంతమైన రాజవంశాన్ని స్థాపించింది.
మమ్లుక్ సుల్తానేట్ యుగం 1250లో ఆరంభమై, 1517లో రక్తపాతంతో ముగిసింది. అరబిక్‌లో “మమ్లుక్” అనే పదానికి “సొంతం చేసుకున్నవాడు” లేదా “యాజమాన్యంలో ఉన్నవాడు” అనే అర్థం వస్తుంది. ఈ పదమే మమ్లుకుల ఆవిర్భావం, వారి నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
9వ శతాబ్దం నుంచే బానిసలను మమ్లుక్ సైనికులుగా తీర్చిదిద్దడం ప్రారంభమైంది. వీరు మధ్యప్రాచ్య ప్రాంతాల సరిహద్దుల్లోని లేదా మధ్యప్రాచ్యం వెలుపల ప్రాంతాల నుంచి తీసుకురాబడేవారు. వీరిలో ఎక్కువగా తుర్కులు, జార్జియన్లు, రష్యన్లు, గ్రీకులు ఉండేవారు.
1250లో అధికారాన్ని స్వాధీనం చేసుకునే వరకు, మమ్లుకులు తమ పాలకులకు అత్యంత విధేయులైన, అవసరమైతే ఎంతటి కఠిన చర్యకైనా వెనుకాడని అమలు దళాలుగా పనిచేశారు.
స్థానిక సమాజంతో వారికి ఎలాంటి బంధాలు ఉండేవి కావు. వారి స్థానంలో కొత్త సైనికులను తీసుకురావాలంటే కొత్తగా కొనుగోలు చేసిన బానిసలనే నియమించేవారు.
మమ్లుకులుగా ఉన్న బానిసలకు పుట్టిన కుమారులకు మాత్రం వారి తండ్రుల హోదా వారసత్వంగా సంక్రమించేది కాదు. వారికి వారసత్వ హక్కు గానీ, మమ్లుక్ సైనిక వ్యవస్థలో చేరే అవకాశం గానీ ఉండేది కాదు.
సైనిక, పరిపాలనా శిక్షణ..
మమ్లుకుల జీవితం యుద్ధాలకే పరిమితం కాలేదు. ప్రతిభ, సామర్థ్యం చూపిన మమ్లుకులకు పదోన్నతులు లభించేవి. అలా వారు క్రమంగా ఎదిగి, పాలకుల ప్రభుత్వంలో ఉన్నతమైన అధికార పదవులను చేపట్టేవారు.
మమ్లుకులు ‘ఫురూసియ్యా’ అనే నియమావళిని అనుసరించేవారు. ఇందులో సాహిత్యం, కళలు, విజ్ఞానం వంటి మూడు అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది.
అంతేకాకుండా ఉదారత, సైనిక వ్యూహాలు, గుర్రపు స్వారీ, అశ్వికదళ యుద్ధ విద్య, పరిపాలనా నైపుణ్యం వంటి విషయాల్లోనూ వారికి శిక్షణ ఇచ్చేవారు.
ఈ శిక్షణకు వారి సహజమైన యుద్ధ నైపుణ్యం, కఠినమైన పోరాట స్వభావం తోడవడంతో, మమ్లుకులు సమర్థులైన సైనిక-పరిపాలకులుగా రూపుదిద్దుకున్నారు.
రక్తపాత తిరుగుబాటు: బానిస యోధులు సుల్తానులుగా ఎలా మారారు?
1249లో మమ్లుకులు తిరుగుబాటుకు పూనుకున్నారు. అప్పటికే దశాబ్దాలుగా పాలకుల విశ్వాసాన్ని చూరగొని, వారి పాలనా వ్యవహారాల్లో కీలకంగా సహకరిస్తూ వచ్చిన మమ్లుకులు, చివరకు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వారు అయ్యూబీ సుల్తాన్‌ను పదవీచ్యుతుడిని చేసి, అతని వారసుడిని హతమార్చారు.
అనంతరం తమ నాయకుడైన అయ్బక్ను సుల్తాన్‌గా ప్రతిష్ఠించి, 1250లో మమ్లుక్ సుల్తానేట్కు పునాది వేశారు.
ఈ కొత్త సుల్తానేట్కు ఈజిప్ట్, సిరియా ప్రధాన అధికార కేంద్రాలుగా నిలిచాయి.
మమ్లుకులు తమకు అప్పటికే అలవడిన పాలనా సంప్రదాయాలు, వ్యవస్థలను ఆధారంగా చేసుకుని, తమ రాజకీయ, పరిపాలనా అధికారానికి బలమైన పునాదులు నిర్మించుకున్నారు.
అధికార పదవులు, ఉన్నత హోదాలు ప్రధానంగా మమ్లుకుల వర్గానికే పరిమితం చేయడం ద్వారా తమలో పరస్పర విధేయతను, అధికార వ్యవస్థపై పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు.
వారి రాజకీయ విజయాలు, సైనిక పరాక్రమం మమ్లుకుల అధికారాన్ని క్రమంగా సుస్థిరం చేశాయి. ఫలితంగా, 1517 వరకు వారు ఈజిప్ట్, సిరియాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించగలిగారు.
మమ్లుకుల పాలనలో సమాజం ఒక కఠినమైన సామాజిక శ్రేణీకరణ వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ఆ వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని మమ్లుకుల పాలక వర్గమే ఆక్రమించింది.
క్రూసేడర్ రాజ్యాలను చిత్తుచేసి, మంగోలుల దండయాత్రను అడ్డుకున్న మమ్లుకులు..
మమ్లుకుల పాలనా కాలంలో వారు తమకు ఎదురైన రెండు ప్రధాన ప్రత్యర్థులను ఓడించి, లెవాంట్ ప్రాంతం ఇస్లామిక్ ఆధిపత్యంలోనే కొనసాగేలా చేశారు.
మొదటగా, 1244 నుంచి అక్కడ మిగిలి ఉన్న యూరోపియన్ క్రూసేడర్ రాజ్యాలపై మమ్లుకులు నిర్ణయాత్మక దాడులు ప్రారంభించారు.
1287లో జెరూసలెంను స్వాధీనం చేసుకున్న మమ్లుకులు, ఆ తర్వాత క్రూసేడర్ల ప్రధాన కేంద్రంగా ఉన్న ఏకర్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ విధంగా క్రూసేడర్ల చివరి బలమైన స్థావరాలను సైతం వారు క్రమంగా నిర్మూలించారు.
అత్యంత శక్తిమంతులైన ఈ బానిస సైనికులు యుద్ధ నైపుణ్యం, అపారమైన సైనిక బలం, సమర్థవంతమైన ముట్టడి యంత్రాలు వంటి వాటి సహాయంతో తమ ప్రత్యర్థులను ఓడించారు.
క్రూసేడర్లకు వ్యతిరేకంగా మమ్లుకుల పోరాటం కొనసాగుతుండగానే, వారు మరో మహా ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నారు.
1260లో నేటి ఇజ్రాయెల్‌లో జరిగిన ఐన్ జలూత్ యుద్ధంలో మంగోలుల దండయాత్రకు మమ్లుకులు అడ్డుకట్ట వేశారు.
అప్పటికి మంగోలుల సైనిక శక్తి తూర్పు నుంచి పడమర వరకు విస్తరిస్తోంది. కొరియా నుంచి సిరియా వరకు అనేక ప్రాంతాలను జయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న మంగోలులు, 1258లో బాగ్దాద్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రెండు లక్షలకు పైగా ప్రజలను హతమార్చినట్లు చారిత్రక వర్ణనలు చెబుతున్నాయి. ఆ తరువాత కొద్దికాలానికే డమాస్కస్ కూడా మంగోలుల వశమైంది.
కానీ ఐన్ జలూత్ వద్ద మంగోలుల విజయ పరంపరకు తొలిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన అశ్వికదళాల్లో ఒకటిగా పేరొందిన మంగోలులకు, వారికి దీటుగా పోరాడగల మమ్లుకులు ఎదురయ్యారు.
మమ్లుకులు మాయదాడులు, వ్యూహాత్మక ఎత్తుగడలు, ఆకస్మిక దాడులు వంటి యుద్ధతంత్రాలను చాకచక్యంగా ప్రయోగించి మంగోలులను ఓడించారు.
ఐన్ జలూత్ విజయం మంగోలుల అప్రతిహత సైనిక దండయాత్రకు గట్టి అడ్డుకట్టగా నిలిచింది.
ఈ పరాజయంతో మంగోలుల ముప్పు క్రమంగా తగ్గిపోయింది. మమ్లుకులు మంగోలుల నుంచి విముక్తమైన ఈ కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించి, అక్కడి వాణిజ్య వ్యవస్థపై పట్టు సాధించడంతో పాటు, పరిపాలనా బాధ్యతలను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు.
సుగంధ ద్రవ్యాల వాణిజ్యంతో అపార సంపద — సామ్రాజ్యాన్ని కూలదోసిన సంక్షోభం..
ప్రారంభ దశలో మమ్లుక్ సుల్తానేట్ వాణిజ్యం ఎంతో వృద్ధి చెందింది. ఆసియా, ఐరోపా మధ్య సాగిన ప్రధాన వాణిజ్య మార్గాల కూడలిలో ఈజిప్ట్ ఉండటం వల్ల, వాణిజ్యంపై విధించిన పన్నుల ద్వారా సుల్తానేట్కు విస్తారమైన ఆదాయం సమకూరేది.
అంతేకాకుండా, అవసరానికి అనుగుణంగా మమ్లుక్ సుల్తానులు వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించేవారు.
సుగంధ ద్రవ్యాలు, లోహాలు, వస్త్రాలు వంటి అనేక రకాల సరుకులు మమ్లుకుల ఆధీనంలోని అలెగ్జాండ్రియా వంటి రేవు పట్టణాల ద్వారా చేతులు మారుతూ వివిధ ప్రాంతాలకు చేరేవి.
ఈ వాణిజ్యం ద్వారా లభించిన అపారమైన సంపదతో మమ్లుక్ సుల్తానేట్ తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడంతో పాటు, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోగలిగింది.
మమ్లుక్ సుల్తానేట్ ఆర్థిక రంగంలో ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోటీ పడేది. ఇస్తాంబుల్ కేంద్రంగా ఒట్టోమన్లు సిల్క్ రోడ్‌తో పాటు మధ్యధరా సముద్ర వాణిజ్యంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
ఒట్టోమన్ సామ్రాజ్యం విస్తృతి, ప్రభావం పెరుగుతున్న కొద్దీ మమ్లుకులు అప్రమత్తమయ్యారు. అందుకే వెనిస్, జెనోవా వంటి వాణిజ్య శక్తులతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
మరోవైపు, నైలు నదీ డెల్టా ప్రాంతంలోని విస్తారమైన వ్యవసాయ ఉత్పత్తి మమ్లుక్ సుల్తానేట్ ఆర్థిక సుసంపన్నతకు ప్రధాన ఆధారాల్లో ఒకటిగా నిలిచింది.
14వ శతాబ్దం చివరి నాటికి మమ్లుక్ సుల్తానేట్ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు బయటపడటం ప్రారంభమయ్యాయి.
1347లో సంభవించిన బ్లాక్ డెత్(కలరా కాదు—మహమ్మారి ప్లేగు) మొదటి తీవ్రమైన దెబ్బ. ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ముఖ్యంగా కైరో నగరం తీవ్రంగా ప్రభావితమైంది.
జనాభా తగ్గిపోవడంతో మమ్లుకులకు తమ సైన్యంలో చేర్చుకునేందుకు తగినంత మంది సైనికులు, బానిసలు అందుబాటులో లేకుండా పోయారు.
మరోవైపు, ఒట్టోమన్ సామ్రాజ్యంతో ఆర్థిక పోటీ మరింత తీవ్రమైంది. అయితే, ఆఫ్రికా దక్షిణ కొసను చుట్టి పోర్చుగీసులు భారత మహాసముద్రానికి చేరుకోవడం మమ్లుకుల ఆర్థిక వ్యవస్థకు మరింత తీవ్రమైన దెబ్బగా పరిణమించింది.
భారతదేశంలో పోర్చుగీసులు స్థాపించిన వాణిజ్య కేంద్రాలు భారతదేశం నుంచి ఐరోపాకు నేరుగా వాణిజ్యం సాగించే మార్గాన్ని తెరిచాయి. దీంతో గతంలో మమ్లుకుల ఆధీనంలోని అలెగ్జాండ్రియా రేవు ద్వారా సాగిన పాత వాణిజ్య మార్గాన్ని వ్యాపారులు క్రమంగా పక్కనపెట్టారు.
ఫలితంగా మమ్లుకుల చేతుల్లోకి వచ్చే వాణిజ్య ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
ఒట్టోమన్ల చేతిలో తుది పతనం — మమ్లుకులు అందించిన చిరస్థాయి వారసత్వం..
మిగతా సామ్రాజ్యాల మాదిరిగానే మమ్లుక్ సుల్తానేట్ కూడా చివరకు క్షీణించడం ప్రారంభించింది. అవినీతి, వరుసగా సంభవించిన మహమ్మారులు, ప్రకృతి వైపరీత్యాలు కలిసి రాజ్యాన్ని క్రమంగా బలహీనపరిచాయి.
చివరకు, మమ్లుకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఒట్టోమన్ సామ్రాజ్యం వారి పతనానికి కారణమైంది.
1516లో ఇరు సామ్రాజ్యాల మధ్య యుద్ధం ప్రారంభమై, 1517లో కైరోను ఒట్టోమన్లు స్వాధీనం చేసుకోవడంతో మమ్లుకులపై వారి సంపూర్ణ విజయం ఖరారైంది.
ఆ తరువాత ఒట్టోమన్లు మమ్లుకుల సాంప్రదాయ ఆధిపత్య ప్రాంతాలైన సిరియా, ఈజిప్ట్‌లను తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు.
మమ్లుక్ సుల్తానేట్ వారసత్వం నేటికీ లెవాంట్ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, మంగోలుల దండయాత్రను అడ్డుకోవడం ద్వారా అరబ్ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగడానికి మమ్లుకులు కీలకంగా దోహదపడ్డారు. వారి సైనిక నైపుణ్యం లేకపోయి ఉంటే, లెవాంట్ ప్రాంత చరిత్ర, సంస్కృతి నేడు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
మమ్లుకులు మిగిల్చిన ప్రభావం వాస్తుశిల్పం, వాణిజ్యం, న్యాయ వ్యవస్థ వంటి అనేక రంగాల్లోనూ కనిపిస్తుంది.
రాజకీయ, ఆర్థిక కల్లోలాలతో నిండిన ఆ కాలంలో ఐరోపా నుంచి భారతదేశానికి సాగిన వాణిజ్యంలో ఈజిప్ట్ కీలక స్థానాన్ని తిరిగి పొందేలా చేయడం ద్వారా, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి కొనసాగడానికి మమ్లుకులు దోహదపడ్డారు.
అనువాదం: మనోహర రాజు
