మహిళాలపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు మన కుళ్ళిన సమాజ మూలాలనే ప్రశ్నిస్తున్నాయి. అమాయకపు ఆటపాటలతో, చదువు సంధ్యలతో, స్నేహానురాగాలతో వికసించాల్సిన బాల్యం నేడు మొగ్గప్రాయంలోనే వాడిపోతోంది.
‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని పైకి ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ నీతి నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన నేటి బాలలు కూడా నేడు నేరస్తులుగా మారుతున్నారు.
ఇది ఎంతో బాధను, భయాందోళనలను కలిగించే విషయం. ఇటీవల రాష్ట్రంలో, దేశంలో స్త్రీలపై వరుస అత్యాచార సంఘటనలు మన నాగరికతను, సభ్యతను, నైతికతను, ఈ వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి.
సభ్యసమాజం సిగ్గుపడే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా నగరంలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో చవిచూసిన అత్యాచారం, హత్య దేనికి నిదర్శనం?
ఆదివాసీ బిడ్డలకు రక్షణ కరువు..
పెట్టుబడిదారీ కార్పొరేట్ మైనింగ్ శక్తులు అడవులను ఆక్రమిస్తున్న తరుణంలో పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వస్తున్న ఆదివాసీ బిడ్డలకు రక్షణ ఏది? బాధ్యులెవరు? ఒకరి తర్వాత ఒకరు బాధితులు కావాల్సిందేనా?
శాస్త్రీయంగా నేటి సమాజపు మూలాలను, పరిస్థితులకు గల కారణాలను విశ్లేషించాలి.
అశ్లీలత, హింసను ప్రేరేపించే మాధ్యమాల ప్రభావం..
పిల్లలను, యువతీ యువకులను సినిమాలు, టీవీ కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హీరోయిజం పేరుతో తాగుడు, ముఠా తగాదాలు, హింస, బాధ్యతారాహిత్యం, ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలనే ధోరణి, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పెద్దలతో బాధ్యతారహితంగా ప్రవర్తించడం మొదలైన అంశాలను చిత్రీకరిస్తున్నారు.
టీవీ సీరియల్స్, ‘జబర్దస్త్’, రియాలిటీ షోలలో సభ్యత, సంస్కారం లేని విధంగా సంభాషణలు, హావభావాలు ఉంటున్నాయి.
మొబైల్ ఫోన్లలో లైక్స్ కోసం అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. మరి ఇంట, బయట నిత్యం వీటిని చూస్తూ పెరుగుతున్న పిల్లల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అందుకే నేడు చిన్నపిల్లలు కూడా జ్ఞాన సముపార్జన కంటే ప్రేమ, సెక్స్ వంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు.
పాఠశాల స్థాయి నుంచే చెడు స్నేహాలు చేయడం, ముఠా తగాదాలకు పాల్పడడం జరుగుతోంది.
మరీ ముఖ్యంగా, కోవిడ్ తర్వాత కూడా ఆన్లైన్ తరగతుల పేరిట పిల్లలు తప్పక మొబైల్ వాడకం పెరిగింది. మొబైల్స్ వాడేటప్పుడు తెలిసీ తెలియక సాఫ్ట్ పోర్నోగ్రఫీ కుళ్లు అంటించుకుంటున్నారు.
క్రమంగా బానిసలై, పక్కదారి పట్టి అత్యాచారాలకు, దాడులకు పిల్లలు పాల్పడుతున్నారు. సున్నిత మానవ భావోద్వేగాలను, నైతిక సంబంధాలను నాశనం చేసే పోర్నోగ్రఫీ వేల కోట్ల డాలర్ల పరిశ్రమగా తయారై వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ కలుషితం చేస్తోంది.
పురుషాధిక్యతా సంస్కృతి ప్రభావం..
వేల సంవత్సరాలుగా వివిధ రూపాలలో కొనసాగుతున్న పురుషాధిక్యతా సంస్కృతి ప్రభావం నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత అసహ్యకర వికృత రూపం ధరించింది.
పురుషుడి అనుభవం కొరకే స్త్రీ, అన్ని విధాలా ఆమె పురుషుడికి లోబడి ఉండాలనే ఈ సంస్కృతి బలమైన ప్రభావం వల్ల వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.
ప్రేమ, సమానత్వం, సహకారం, స్నేహం, పరస్పర విశ్వాసం పెంచే ఉన్నత సంబంధాలు స్త్రీ పురుషులలో పెంపొందనంత వరకు పురుషులలో ఆధిక్యతను, స్త్రీలలో న్యూనతను లేదా కొన్ని సందర్భాలలో వ్యతిరేక దిశలో కూడా ఈ అసహ్యకర సంబంధాలు పెంపొందుతాయి.
మద్యం, మాదకద్రవ్యాల ప్రభావం..
హేయమైన నేరాలకు పాల్పడుతున్న యువతలోనే కాక బాలల్లో కూడా మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారే కావడం గమనార్హం. ఆ మత్తులో విచక్షణ కోల్పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు.
గత ప్రభుత్వం హయాంలో అనేక పాఠశాలల్లో గంజాయి తాగుతూ బాలలు పట్టుబడ్డ ఉదంతాలు ఉన్నాయి. అంటే మాదకద్రవ్యాలను అరికట్టడం అటుంచి కొంతమంది పాలక పార్టీల రాజకీయ నాయకులు వీటి రవాణాలో ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు.
ఆధునికత పేరుతో పబ్బులు, క్లబ్బులు, రేవ్ పార్టీలలో నిషేధిత మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వాడుతున్నారు.
ఇవన్నీ ప్రభుత్వాలకు, పోలీసులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తెలిసే జరుగుతున్నాయి. అప్పుడప్పుడు దాడుల పేరుతో ప్రభుత్వాలు తతంగం నడిపినప్పటికీ వీటి రవాణా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. వీటి విష ఫలితాలను ప్రజలు ముఖ్యంగా యువత అనుభవిస్తున్నారు.
శాస్త్రీయ విద్యా విధానం లేకపోవడం..
విద్యార్థుల్ని సంపూర్ణ మూర్తిమత్వంతో జ్ఞానవంతులుగా తయారు చేయడమే విద్యా లక్ష్యం. కానీ నిజంగా ఈనాడు విద్యా విధానం ద్వారా అది నెరవేరుతోందా? ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల వల్ల విద్య నేడు పూర్తిగా ప్రైవేటుపరమై పచ్చి వ్యాపారంగా మారింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి విద్యా విధానంలో మార్పుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు ప్రవేశపెట్టాయి. వీటిలో శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విధానాలు లేకపోవడంతో ఉన్నత నీతి నైతిక విలువలను కానీ, క్రమశిక్షణను గానీ, మానసిక దృఢత్వాన్ని గానీ అందించకపోవడం గమనార్హం.
సమాజ హితం కోసం పోరాడినటువంటి ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు విద్యార్థులకు అందకపోవడం వల్ల సరైన ఆదర్శం లేక విలువలు లేని మరమనుషులుగా తయారవుతున్నారు.
నేడు విద్యా విధానంలో ర్యాంకులు, గ్రేడ్లు ధ్యేయంగా మారడంతో కెరీరిజం, పచ్చి స్వార్థం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మంచి చెడుల విచక్షణను విద్యార్థులు గ్రహించలేక మానసికంగా బలహీనులై పోతున్నారు. త్వరగా చెడు వైపుకు ఆకర్షితులవుతున్నారు.
నిరుద్యోగ సమస్య, అసమానతలు..
దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య, అసమానతలు భయంకర రూపం ధరించాయి. యువతలో తీవ్ర నిరాశ నిస్పృహ పెరిగాయి. ఫలితంగా ఒకవైపు మానసిక రోగాలు, ఆత్మహత్యలు, ఇంకోవైపు అక్రమ సంపాదన, ఆన్లైన్ మోసాలు, నేరాలు పెరిగాయి.
కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడవడం కష్టం. అలాంటప్పుడు పిల్లలు ఆలనాపాలనా లేక చెడు దారి పడుతున్నారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం దేశంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోంది. అంటే అత్యధిక లాభమే ధ్యేయంగా జరిగే ఉత్పత్తి.
ఈ విధానంలో ఉత్పత్తి సాధనాలైన భూములు, గనులు, పరిశ్రమలకు కొద్దిమంది పెట్టుబడిదారులు యజమానులుగా ఉంటూ కార్మికులు, కూలీలు, ఉద్యోగులను అమానుషంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఫలితంగా అసమానతలు పెరుగుతున్నాయి.
రోజురోజుకు ధనవంతులు మరింత ధనవంతులుగానూ, పేదలు మరింత పేదలుగానూ మారుతున్నారు. అందులోనూ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ క్షీణ దశలో ఉండటంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులను, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి, పరిరక్షించి, కొనసాగించేందుకు కృషి చేస్తున్నాయి.
ప్రజా సంక్షేమం, ప్రజాహితం కోసం కాక అంత్యదశలో ఉన్న పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మనుగడను కొనసాగించడానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. అందుకే యువత, చివరకు బాలలలో కూడా నేరప్రవృత్తి పెరుగుతోంది.
సోషలిస్టు విధానంతోనే సమస్యలకు పరిష్కారం..
కాబట్టి సమాజ అభివృద్ధి అత్యధిక లాభం కోసం చేసే ఉత్పత్తి విధానం స్థానంలో, పెరుగుతున్న సమాజ అవసరాల కోసం ఉత్పత్తి చేసే విధానం అంటే సోషలిస్టు విధానం తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను సమూలంగా నిర్మూలించగలం. ఆ దిశగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలి.
(హైదరాబాద్ నగరం తుక్కుగూడలోని ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆదివాసీ బిడ్డ శిరీష అత్యాచారం, హత్యను నిరసిస్తూ..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
