నకిలీ క్రీడా ధ్రువపత్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వరకు— నిజానిజాలు వెలికి తీయాల్సిన సమయం. క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కోటా ఒక సామాజిక న్యాయ విధానం.
గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది జీవితాన్ని మార్చే అవకాశం. అటువంటి పవిత్రమైన కోటా వ్యవస్థలోనే నకిలీ ధ్రువపత్రాలు, కల్పిత క్రీడా విజయాలు, గుర్తింపు లేని సంఘాల సర్టిఫికెట్లు, సరైన ధ్రువీకరణ లేకుండానే నియామకాలు జరిగాయనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరమైన విషయం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.
వివాదం ఎలా మొదలైంది?..
మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టినప్పుడు స్పోర్ట్స్ కోటాకు కూడా పోస్టులు కేటాయించారు.
శాప్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025లో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 3,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని వారి అర్హతలను నిర్ధారించే 5,328 సర్టిఫికెట్లను సమర్పించారు.
ప్రతి సర్టిఫికెట్‌ను సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ద్వారా ధ్రువీకరించిన తరువాతే పరిశీలించామని శాప్ పేర్కొంది.
అయితే ఆ తరువాత కొందరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా పోటీలు జరిగినట్లు రికార్డ్ లేని సర్టిఫికెట్లు, పోటీ జరిగినట్లు పేర్కొన్న తేదీ, స్థలం, విభాగం విషయాలలో తేడాలు, అధికారిక క్రీడా రికార్డుల్లో ధ్రువీకరించని విజయాలు, గుర్తింపు లేని లేదా అనుమానాస్పద క్రీడా సంఘాలు జారీ చేసిన సర్టిఫికెట్లు, గతంలో క్రీడల్లో పాల్గొన్న ఆధారాలు లేని వ్యక్తులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా చూపడం వంటి ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
జూడో సర్టిఫికెట్లపై తీవ్ర అనుమానాలు..
ఈ వ్యవహారంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో జూడో క్రీడా ధ్రువపత్రాలు ఒకటి. ఒక అభ్యర్థి సమర్పించిన సర్టిఫికెట్లో 2013 అక్టోబర్ 19–21 తేదీలలో ఖమ్మంలో “సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్” జరిగినట్లు పేర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ సంబంధిత సంఘం రికార్డుల ప్రకారం ఆ తేదీల్లో ఖమ్మంలో జరిగిన పోటీ జూనియర్ కేటగిరీకి సంబంధించినదని, సీనియర్ ఛాంపియన్షిప్ వేరే తేదీల్లో హైదరాబాద్‌లో జరిగినట్లు పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇది నిజమైతే సమస్య చాలా తీవ్రమైనది. ఒక సర్టిఫికెట్లో ఉన్న పోటీ వివరాలను సంబంధిత క్రీడా సంఘం అధికారిక రికార్డులతో ముందుగానే ఎందుకు క్రాస్ చెక్ చేయలేదు?
హైకోర్టు జోక్యం..
ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. 2026 జూలైలో హైకోర్టు నకిలీ క్రీడా ధ్రువపత్రాల ఆరోపణలను పరిశీలించి, ప్రభుత్వం విచారణ చేపట్టి, ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంలో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి నాలుగు నెలల వ్యవధి ఇచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అంటే విషయం కేవలం రాజకీయ ఆరోపణల స్థాయిలో మాత్రమే కాక న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లింది.
సీఐడీ ఎఫ్ఐఆర్.. ఆరోపణలపై అధికారిక దర్యాప్తు..
మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ 2026 ఆగస్టు 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తాజా సమాచారం. ఇది ఆరోపణల తీవ్రతను సూచించే ముఖ్యమైన పరిణామం.
అయితే ఎఫ్ఐఆర్ నమోదు కావడం అంటే ఆరోపణలు నిరూపితమయ్యాయని కాదు. దర్యాప్తు ద్వారా ఆధారాలు సేకరించి, బాధ్యత ఎవరిదో చట్టపరంగా నిర్ణయించాల్సి ఉంటుంది.
టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయ నియామకం?..
ఇటీవల వెలుగులోకి వచ్చిన మరో అంశం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటా ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా నియమితుడైన ఒక అభ్యర్థికి టెట్‌లో పాస్ అయిన అర్హత లేదని జిల్లా విద్యాశాఖ అధికారి ధ్రువీకరించినట్లు సెప్టెంబర్ 4న వచ్చిన నివేదిక పేర్కొంది.
ఇక్కడ ప్రధాన అంశం ఏమంటే స్పోర్ట్స్ కోటా అయినప్పటికీ, సాధారణ విద్యా అర్హతలు ఎందుకు మినహాయించబడాలి?
స్పోర్ట్స్ కోటా అనేది క్రీడా ప్రతిభకు ఇచ్చే ప్రత్యేక అవకాశం మాత్రమే. అది నియామకానికి అవసరమైన ఇతర తప్పనిసరి అర్హతలను ఆటోమెటిక్‌గా రద్దు చేయకూడదు. ఈ అంశంపై కూడా సమగ్ర విచారణ అవసరం.
80 నుంచి 100 మంది వరకు అనర్హులు..
సుమారు 80 నుంచి 100 మంది వరకు అనర్హులు స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌కు వర్గాలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
అదే సమయంలో పిల్లో కనీసం 29 అనుమానాస్పద/తప్పుడు క్లెయిమ్‌లు, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఉదాహరణలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇవి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే. కాబట్టి ఈ సంఖ్యలను దర్యాప్తు చేయాల్సిన ఆరోపణలుగా చూడాలి.
బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్‌పై కూడా సందేహాలు..
జూడోతో పాటు బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, ఫెన్సింగ్ వంటి క్రీడలకు సంబంధించిన ధ్రువపత్రాలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఒక నివేదిక ప్రకారం 2025 డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో బాల్ బ్యాడ్మింటన్ నుంచి 48 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందినట్లు, ఈ క్రీడకు రాష్ట్రంలో కోచ్‌ల నియామకంపై కూడా అనుమానాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అదే విధంగా అథ్లెటిక్స్‌కు సంబంధించిన కొన్ని సర్టిఫికెట్లలో అభ్యర్థుల వయస్సు, పోటీ స్థాయి, గత క్రీడా రికార్డుల మధ్య అసమానతలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.
క్రీడా సంఘాల అసలు రికార్డులు, జాతీయ ఫెడరేషన్ల డేటా, పోటీ నిర్వాహకుల రికార్డులను పరిశీలించడం ద్వారా మాత్రమే వీటి నిజానిజాలు వెలుగులోకి వస్తాయి.
అసలు సమస్య ఎక్కడ?..
ఈ వివాదంలో ముందుకొచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఒక క్రీడా సర్టిఫికెట్ నిజమైనదా కాదా అని ఎవరు నిర్ణయించాలి? అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను సంబంధిత సంఘాలు, ఫెడరేషన్ల ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన తరువాతే ఎంపిక ప్రక్రియలో పరిగణించామని శాప్ వాదన. తన ప్రక్రియ పారదర్శకమైనది, నియమావళి ప్రకారం జరిగినదిగా శాప్ పేర్కొంది.
సర్టిఫికెట్లు శాప్ స్వయంగా జారీ చేయవని, సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేస్తాయని కూడా తెలిపింది. కానీ ఆరోపణలు నిజమని విచారణలో తేలితే మరో ప్రశ్న ముందుకు వస్తుంది.
సంబంధిత సంస్థలు తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే, దాన్ని ధ్రువీకరించడానికి మరొక యంత్రాంగం ఎందుకు లేదు?
గతంలోనూ ఫిర్యాదులు..
ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల దుర్వినియోగంపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి వైద్య విద్య ప్రవేశాల్లో కూడా క్రీడా కోటా దుర్వినియోగంపై గతంలో ప్రశ్నలు తలెత్తినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇంకా ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల ధ్రువీకరణకు కఠినమైన విధానం అవసరమని సూచించే అధికారిక మార్గదర్శకాలు ఉన్నాయి.
రాష్ట్ర స్థాయి పోటీల సర్టిఫికెట్లను శాప్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అంశాలను సంబంధిత జాతీయ సంస్థల ద్వారా పరిశీలించే విధానం గురించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే నియామకాలు జరిగేటప్పుడు వాటి అమలు ఎందుకు విఫలమయిందో తేల్చాలి.
ఈ వ్యవహారంలో అత్యంత బాధాకరమైన అంశం నిజమైన క్రీడాకారుడికి అన్యాయం. ఒక గ్రామీణ యువకుడు లేదా యువతి చిన్ననాటి నుంచి కష్టపడి పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఎదిగి, చివరకు స్పోర్ట్స్ కోటా ద్వారా ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశిస్తారు. కానీ నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి ఎవరో ఒకరు ఆ అవకాశాన్ని దక్కించుకుంటే, నష్టపోయేది కేవలం ఒక ఉద్యోగం కాదు ఒక నిజమైన క్రీడాకారుడి జీవితకాల శ్రమకు జరిగిన అన్యాయం.
ఇతర ఆరోపణలు..
స్పోర్ట్స్ కోటా నియామకాలలో కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా కులాలు, ఇతర అంశాలకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆరంభంలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో మాత్రమే వివాదంగా భావించినప్పటికీ రానురాను ఈ అంశంలో ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇతర కేటగిరీల మీద కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుల సర్టిఫికెట్ల విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు బయటకు వచ్చాయి.
దివ్యాంగుల సర్టిఫికెట్ల విషయం మీద కూడా ఫిర్యాదులున్నాయి. బీసీ-సీ కేటగిరీకి చెందిన ఓ మహిళకు బీసీ-బీ కోటాలో ఉద్యోగం ఇవ్వడం పట్ల కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల మీద పలు అభియోగాలున్నాయి.
బీసీ కేటగిరీ వారికి సైతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చారంటూ అనేక మంది ఆధారాలతో సహా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు.
ఇలా కుల సర్టిఫికెట్ల అంశం మీద వచ్చిన ఫిర్యాదులు, వివాదాలను జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన సమయంలో ఆమె స్పందన కూడా చర్చనీయాంశమయ్యింది. ఆయా సర్టిఫికెట్ల పరిశీలన రెవెన్యూ శాఖ తేల్చాలంటూ పేర్కొనడం విస్మయకరంగా మారింది.
రాజకీయాలకు అతీతంగా విచారణ జరగాలి..
అందువల్ల స్పోర్ట్స్ కోటా నియామకాలలో అన్ని కోణాల నుండి రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర విచారణ జరపాలి.
ప్రస్తుతం అధికారపక్షం, ప్రతిపక్షం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షం ఈ వ్యవహారంపై మరింత విస్తృతమైన విచారణ కోరుతోంది. ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, నియమాల ప్రకారమే ఎంపిక జరిగిందని చెబుతోంది. కానీ దీన్ని అధికార-ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యగా చూడకూడదు.
ఇది నిజమైన క్రీడాకారుడు వర్సెస్ నకిలీ సర్టిఫికెట్ అనే సమస్య. అందువల్ల రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు నిర్దిష్ట కాల పరిమితి లోపు జరగాలి.
తక్షణ చర్యలు..
అన్ని స్పోర్ట్స్ కోటా నియామకాలను పునః పరిశీలించాలి. మెగా డీఎస్సీ–2025లో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్‌ను తిరిగి పరిశీలించాలి. అసలు క్రీడా రికార్డులతో క్రాస్ చెక్ చేయాలి.
కేవలం సర్టిఫికెట్ ఇచ్చిన సంఘం ధ్రువీకరణ సరిపోదు. సంబంధిత రాష్ట్ర సంఘం, జాతీయ సమాఖ్య, పోటీ నిర్వహణ కమిటీ, శాప్, అవసరమైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డులతో క్రాస్ చెక్ చేయాలి.
వాస్తవంగా పోటీలను నిర్వహించారా? సర్టిఫికెట్లో పేర్కొన్న తేదీ, ప్రదేశం, పోటీ, వయస్సు, విభాగం, బరువు, పాల్గొన్న క్రీడాకారులు, ఫలితాలు అన్నింటినీ ధ్రువీకరించాలి. క్రీడాకారుల పూర్తి క్రీడా చరిత్ర పరిశీలించాలి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా 35–40 ఏళ్ల వయస్సులో “జాతీయ స్థాయి క్రీడాకారుడు”గా ప్రత్యక్షమైతే, అతని పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి రికార్డులు కూడా పరిశీలించాలి.
సర్టిఫికెట్ నకిలీ అని దర్యాప్తులో నిర్ధారణ అయితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత క్రీడా సంఘంపై చర్య తీసుకోవాలి. నకిలీ సర్టిఫికెట్ జారీ చేసిన వారిపై కూడా కేసులు పెట్టాలి. అభ్యర్థి తప్పుడు సర్టిఫికెట్ సమర్పించడం తప్పు. దానిని పరిశీలించాల్సిన అధికార యంత్రాంగం తెలిసీ తెలియనట్టు వ్యవహరిస్తే, వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ స్పోర్ట్స్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి.
ప్రతి క్రీడాకారుడికి ప్రత్యేక ఐడీ ఇవ్వాలి. అందులో పుట్టిన తేదీ, క్రీడ పేరు, పోటీ స్థాయి, పోటీ తేదీ, పోటీ జరిగిన ప్రదేశం, స్థానం, మెడల్, సంబంధిత ఫెడరేషన్, సర్టిఫికెట్ నంబర్, కుల ధ్రువీకరణ, అంగవైకల్య ధ్రువీకరణ, డిజిటల్ రికార్డులు అందులో పొందుపరచాలి. అప్పుడు ఒక తప్పుడు సర్టిఫికెట్‌ను తయారు చేసి ఉద్యోగం పొందడం చాలా కష్టమవుతుంది.
పారదర్శకత కోసం ప్రజలకు వివరాలు వెల్లడించాలి..
ప్రభుత్వం, శాప్ తమపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎంపికైన అభ్యర్థుల స్పోర్ట్స్ కోటా మెరిట్ వివరాలు, క్రీడా విభాగం, సాధించిన స్థాయి, సర్టిఫికెట్ ధ్రువీకరణ స్థితి వంటి సమాచారాన్ని చట్టపరమైన గోప్యతా పరిమితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇది నిజమైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తుంది.
స్పోర్ట్స్ కోటా అనేది ఉద్యోగాలు పంచే మరో మార్గం కాదు. అది క్రీడా ప్రతిభకు ఇచ్చే గౌరవం. ఒక క్రీడాకారుడు తన యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని, కుటుంబ జీవితాన్ని పణంగా పెట్టి సాధించిన విజయానికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపే స్పోర్ట్స్ కోటా. అటువంటి కోటాలో నకిలీ సర్టిఫికెట్లు ప్రవేశిస్తే అది కేవలం నియామక అవకతవక కాదు.
నిజమైన క్రీడాకారుడి హక్కుపై దాడి. అందువల్ల ప్రస్తుత ఆరోపణలను రాజకీయ కోణంలో కాకుండా, నిజానిజాలను వెలికితీసే ప్రజా ప్రయోజన దృక్కోణంలో చూడాలి. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారు ఎవరైనా శిక్షించాలి. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినవారు ఎవరైనా శిక్షించాలి. వాటిని ధ్రువీకరించడంలో నిర్లక్ష్యం చేసిన అధికారులు ఎవరైనా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
అదే సమయంలో నిర్దోషులైన నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి.
“స్పోర్ట్స్ కోటా కాపాడాలి. నిజమైన క్రీడాకారుడి హక్కును కాపాడాలి. నిజం బయటకు రావాలి. బాధ్యులు శిక్షించబడాలి. నిర్దోషులకు న్యాయం జరగాలి. స్పోర్ట్స్ కోటా వ్యవస్థపై ప్రజల విశ్వాసం పునరుద్ధరించాలి”.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
