పాశవిక దాడులపై ‘4 పీఎం’ అక్షర సమరం. ఒత్తిళ్లకు తలవంచని సంపాదకత్వం. కలం బలాన్ని, ప్రశ్నించే గొంతుకను ఏ అధికార గర్వమూ లొంగదీసుకోలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని సాధారణ పట్టణమైన బుదౌన్‌లో వేసిన తొలి అడుగులు, నేడు దేశ రాజకీయాంబరంలో స్వతంత్ర జర్నలిజానికి దిక్సూచిగా మారతాయని ఎవరూ ఊహించలేదు.
సంజయ్ శర్మ జీవిత ప్రయాణం ఏ ప్రాపకం లేకుండా స్వయంకృషితో సాగిన ఒక అసాధారణ సమరం.
దేశ రాజధానిలో వీఐపీల కవరేజ్ వేళ ‘4 పీఎం’ మహిళా జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌లపై పోలీసులు సాగించిన పాశవిక దాడి, మతోన్మాద వేధింపులు నేడు దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛపై చర్చను రాజేశాయి.
ఈ ఘటన 4 పీఎం ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ శర్మ దాదాపు మూడు దశాబ్దాల జర్నలిజం ప్రస్థానంలో మరో కీలక మలుపుగా నిలిచింది.
అధికారంలో ఎవరు ఉన్నా ప్రశ్నించాలన్న సంపాదకీయ వైఖరితో 4 పీఎంను ముందుకు నడిపిస్తున్న సంజయ్ శర్మకు ప్రభుత్వాలతో ఘర్షణలు కొత్తవి కావు.
తన ఛానెల్ ప్రభుత్వాలను వ్యతిరేకించడం కోసం కాదు, ప్రజల తరఫున ప్రశ్నలు అడగడం కోసం పనిచేస్తుందని ఆయన పదేపదే చెబుతూ వచ్చారు.
ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కే కుట్రలు సాగుతున్న వేళ, అణచివేతలు ఎదురైనా వెనకడుగు వేయని సంజయ్ శర్మ సత్యశోధన ప్రయాణం లక్నో నుంచి దేశరాజధాని వరకు మరింత పదునుదేరింది.
మూడు పదుల అనుభవం..
‘4 పీఎం’ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు సంజయ్ శర్మ ముప్పై ఏళ్లపాటు ముద్రణా రంగాన, టీవీ జర్నలిజంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్రీయ సహారా, ఈటీవీ, స్టార్ న్యూస్ వంటి అగ్రశ్రేణి సంస్థలలో పనిచేస్తూ వార్తలోని లోతుపాతులను, రాజకీయ విశ్లేషణలోని పదునును ఒంటబట్టించుకున్నారు.
ఈ సుదీర్ఘ ప్రస్థానంలో కార్పొరేట్ మీడియా పరిమితులను, రాజీపడే వైఖరిని గమనించిన ఆయన, పూర్తి స్వతంత్ర గొంతుకగా నిలవాలని సంకల్పించారు.
లక్నో సాయంత్రపు సంచలనం – ఫోర్ పీఎం ఆవిర్భావం..
2013లో సంజయ్ శర్మ లక్నో కేంద్రంగా ‘4 పీఎం’ పేరిట ఒక హిందీ సాయంత్రపు దినపత్రికను ప్రారంభించారు. నాటి ముద్రణా ప్రపంచంలో సాయంత్రం వేళల్లో ప్రజా సమస్యలను, అంతర్లీన రాజకీయాలను నిరభ్యంతరంగా ముద్రించిన ఏకైక పత్రికగా ‘4 పీఎం’ గుర్తింపు పొందింది.
ముద్రణ రంగంలో ఎదురైన ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమిస్తూ, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తెచ్చే క్రమంలో లక్నో పాఠకుల గుండెల్లో ‘4 పీఎం’ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రింట్ నుంచి డిజిటల్ విప్లవం వైపు అడుగులు..
కాలంతో పాటు వస్తున్న మార్పులను ముందే పసిగట్టిన సంజయ్ శర్మ, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వైపు తన ప్రస్థానాన్ని మళ్లించారు.
యూట్యూబ్ వేదికగా ‘4 పీఎం న్యూస్ నెట్వర్క్’ను ఒక మహా నెట్‌వర్క్‌గా మలిచారు. క్షేత్రస్థాయి విశ్లేషణలు, భయం లేని వ్యాఖ్యానాలతో డిజిటల్ ప్రపంచంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ మార్పు ఆయన వార్తా ప్రసార శైలికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిది కోట్లకు పైగా గొంతుకలు..
నేడు ‘4 పీఎం’ న్యూస్ నెట్వర్క్ పరిధిలోని విభిన్న ప్రాంతీయ ఛానెళ్లు(4 పీఎం యూపీ, 4 పీఎం బీహార్, 4 పీఎం హర్యానా మొదలైనవి) దాదాపు 8.7 కోట్లకు పైగా (ఎనభై ఏడు మిలియన్ల పైగా) సబ్స్క్రైబర్లతో, నెలకు వందల మిలియన్ల వీక్షణలతో దూసుకుపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లోని హిందీ వీక్షకులు ఈ విశ్లేషణలను ఆదరిస్తున్నారు. ధ్రువ్ రాతీ, రవీష్ కుమార్ వంటి స్వతంత్ర జర్నలిస్టుల సరసన 4 పీఎం నేడు అత్యంత ఆదరణ పొందిన రాజకీయ వ్యాఖ్యాన ఛానెల్‌గా నిలిచింది.
అధికార పీఠాలను కదిలించిన పరిశోధనాత్మక జర్నలిజం..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే, వారి తప్పులను ఎండగట్టడమే సంజయ్ శర్మ విధివిధానం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాల్లోని లోపాలు, ప్రజా సమస్యలపై ఆయన చేసిన గ్రౌండ్ రిపోర్టులు అధికార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయాల్సిన పనిని ఒక పత్రికగా 4 పీఎం చేసి చూపించిందని పాఠకులు విశ్వసించారు.
వేధింపులు, ఆఫీసుపై దాడులు – బెదరని ఆత్మవిశ్వాసం..
నిజాయితీకి ఇచ్చే మూల్యం ఎప్పుడూ భారీగానే ఉంటుంది. 2017 నుంచి శర్మ తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్నారు.
లక్నోలోని 4 పీఎం కార్యాలయంపై గుర్తుతెలియని మూకల దాడులు, మహిళా సిబ్బందిపై వేధింపులు, ఐటీ (ఆదాయపు పన్ను), ఈఓడబ్ల్యూ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల నోటీసులు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. అయినా ‘మేం ఏ ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదు, వాస్తవాలను మాత్రమే చెబుతున్నాం’ అని ప్రకటిస్తూ ఆయన నిలబడ్డారు.
యూట్యూబ్ ఛానెల్ బ్లాకింగ్ – సుప్రీంకోర్టు పోరాటం..
పహల్గామ్ ఘటన తదితర సున్నిత రాజకీయ అంశాలపై ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసినందుకు, జాతీయ భద్రత నెపంతో ఏడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న 4 పీఎం ఛానెల్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయించింది.
అయితే, ఈ ఆంక్షలకు లొంగకుండా భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని సంజయ్ శర్మ ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన విప్లవాత్మక పోరాటం ప్రారంభించారు.
రాజధానిలో రాజ్యాంగ ధిక్కారం… ‘4 పీఎం’ మహిళా జర్నలిస్టులపై పాశవిక దాడి..
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ‘4 పీఎం’ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షహీన్ ఖాన్, తోటి జర్నలిస్ట్ నఫీసా ఖాన్‌లపై సాకేత్ పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, నిర్బంధం పత్రికా స్వేచ్ఛపై జరిగిన ముష్కర దాడి.
సీఎం, హోం మంత్రులను ప్రశ్న అడిగిన ఏకైక కారణంతో వారిని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి, మతాన్ని ఉద్దేశించి ‘ఖాన్’ అనే పేరును బూతులతో నిందిస్తూ, విచక్షణారహితంగా కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర కళంకం.
లాఠీ దెబ్బల ఎర్రటి గాయాలతో, నడవలేని స్థితిలో ఉన్న నఫీసాను, స్టేషన్ నేలపై పడి ఉన్న షహీన్‌ను చూపిస్తూ విడుదల చేసిన వీడియో దృశ్యాలు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగిలించాయి.
జర్నలిస్టుల వెన్నుదన్నుగా ‘4 పీఎం’ అధినేత నైతిక సమరం..
ఈ దాడి ఘటన వెనుక 4 పీఎం నిరంతరం ప్రభుత్వంపై సంధిస్తున్న పదునైన ప్రశ్నలే కారణమని ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ శర్మ సూటిగా ఎండగట్టారు.
‘ముఖ్యమంత్రికి ప్రశ్నలు అడగడం నేరమా? జర్నలిస్ట్ పేరులో ఖాన్ ఉంటే దాడి చేస్తారా?’ అని ఆయన సంధించిన అక్షర శరాలు అధికార పీఠాలను కుదిపేశాయి.
ఈ పాశవిక దాడిని డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్ (భారత డిజిటల్ న్యూస్ మీడియా సంస్థల సమాఖ్య), ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ (భారత మహిళా పాత్రికేయుల సంఘం), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఢిల్లీ పాత్రికేయుల సంఘం) సహా అనేక మీడియా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
క్షేత్రస్థాయి జర్నలిస్టుల రక్షణ కోసం, దోషులైన పోలీసులపై చర్యల కోసం సంజయ్ శర్మ సాగిస్తున్న ఈ పోరాటం, 4 పీఎం నెట్వర్క్ స్వతంత్ర విలువలకు అద్దం పడుతోంది.
వ్యక్తిగత జీవితం – కష్టాల్లో తోడుగా నిలిచిన కుటుంబం..
ఈ కంటకప్రాయమైన ప్రయాణంలో ఆయన కుటుంబం ఆయనకు అతిపెద్ద బలంగా నిలిచింది.
1999 మార్చి 13న బబితా చతుర్వేదితో వివాహం జరిగినప్పటి నుంచి, అనేక బెదిరింపులు, ఆర్థిక ఇబ్బందులు, భౌతిక దాడులు ఎదురైనప్పటికీ ఆ దంపతులు అధైర్యపడలేదు.
ఇద్దరు పిల్లలతో కూడిన ఆయన కుటుంబం సంజయ్ శర్మ ఆదర్శవంతమైన జర్నలిజానికి నిశ్శబ్ద మద్దతుగా నిలిచింది.
కార్పొరేట్ రహిత, స్వతంత్ర ప్రత్యామ్నాయ మీడియాకు నిదర్శనం..
నేటి గోడీ మీడియా, కార్పొరేట్ ప్రయోజనాల నీడలో నడిచే ఛానెళ్ల మధ్య, స్వతంత్ర డిజిటల్ మీడియా ద్వారా కూడా ప్రజాదరణ పొంది ఆర్థికంగా, సైద్ధాంతికంగా నిలబడవచ్చని 4 పీఎం నిరూపించింది.
వ్యూహాత్మక ప్రాంతీయ విస్తరణ, నిర్భయమైన విశ్లేషణల ద్వారా సంజయ్ శర్మ స్వతంత్ర జర్నలిజానికి ఒక కొత్త వ్యవస్థను, భావజాలాన్ని అందించారు.
యువతరానికి మార్గదర్శనం..
జర్నలిజం అంటే అధికారాన్ని పొగడటం కాదు. ప్రజలు అడగలేని ప్రశ్నలను అడగడం. అధికారిక ప్రకటన వెనుక దాగిన వాస్తవాన్ని వెతకడం. ప్రజల గొంతు వినిపించని చోట మైక్రోఫోన్ పెట్టడం. తప్పు ఎవరిదైనా ప్రశ్నించడం.
సంజయ్ శర్మ ప్రయాణం నుంచి యువ జర్నలిస్టులకు తీసుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఇదే. మీడియా సంస్థ ఎంత పెద్దదైనా, దాని అసలు బలం కెమెరాలు, స్టూడియోలు, సబ్స్క్రైబర్లు కాదు ప్రశ్నించే ధైర్యం, ఆధారాలతో మాట్లాడే నిజాయితీ, ఒత్తిడిలోనూ వృత్తి నిబద్ధతను కాపాడే వెన్నెముక.
ఒక ఛానల్‌ను బ్లాక్ చేయవచ్చు. ఒక వీడియోను తొలగించవచ్చు. ఒక జర్నలిస్టుపై కేసులు పెట్టవచ్చు. ఒక కార్యాలయంపై ఒత్తిడి తేవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అవసరాన్ని శాశ్వతంగా బ్లాక్ చేయడం సాధ్యం కాదు.
సంజయ్ శర్మ కథ అందుకే ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు స్వతంత్ర జర్నలిజం కోసం పోరాడుతున్న ప్రతి కలానికి, ప్రతి కెమెరాకు, ప్రతి యువ రిపోర్టర్‌కు ఒక హెచ్చరిక కూడా… ఒక ప్రేరణ కూడా.
చిన్న పట్టణంలో ప్రారంభమై, అధికార బలాన్ని సవాలు చేస్తూ కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న సంజయ్ శర్మ జీవితం ప్రజాస్వామ్య రక్షణలో పత్రికా రంగానికి ఉన్న శక్తిని చాటిచెబుతోంది.
‘వార్తలు వ్యాపారం కాదు… అదొక సామాజిక బాధ్యత’ అని నిరూపించిన ఆయన ప్రయాణం, స్వతంత్ర డిజిటల్ జర్నలిజంలోకి రావాలనుకునే ప్రతి యువ పాత్రికేయుడికి నిరంతర స్ఫూర్తిప్రదాత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
