కొత్త జీడీపీ డేటా విడుదల కావడం, ఎప్పటిలాగే వివాదాస్పదమై, తీవ్ర చర్చకు దారితీసింది.
మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్, సౌరభ్ గార్గ్ నేతృత్వంలోని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ(ఎంఓఎస్పీఐ) మునుపటి సంవత్సరం ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఈ ఏడాది వృద్ధిని చాలా ఎక్కువగా అంచనా వేసిందని ఆరోపించారు.
ఇందులో ఎవరు చెప్పేది నిజం? అది నిగ్గు తేలాలంటే ఐదు అంశాల అంచనాను పరిశీలించాలి.
పాత పద్ధతికి కొత్త పద్ధతికి పొంతన ఉందా?
మొదటిది, సాంకేతిక పరంగా ఎంఓఎస్పీఐ స్పందన సహేతుకంగానే కనిపిస్తోంది. సుభాష్ గార్గ్ 2026-27 జీడీపీని పాత బేస్ అలాగే మునుపటి మెథడాలజీ(పద్ధతి) ద్వారా లెక్కించి, 2025-26 సంఖ్యలతో పోలుస్తున్నారు. ఇది ఆపిల్స్‌ను ఆరెంజెస్‌తో పోల్చడం లాంటిది.
రెండు సంవత్సరాలకూ కొత్త మెథడాలజీని వర్తింపజేస్తే నిజమైన వృద్ధి కనిపిస్తుంది.
అలాగే, సీపీఐ లేదా డబ్ల్యూపీఐ కంటే వ్యాల్యూ యాడెడ్ డిఫ్లేటర్లు తక్కువగా పెరగడం లేదా రుణాత్మకం(నెగెటివ్) కావడం కూడా సాధ్యమే(అయితే, అవుట్‌పుట్ ధరలతో పోలిస్తే ఇన్పుట్ ధరలు బాగా పెరిగినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది).
అంతకంటే ముఖ్యంగా, మొదటి త్రైమాసికంలో వృద్ధి బాగుందని నమ్మడానికి కారణాలు ఉన్నాయి.
ప్రభుత్వ ప్రతినిధులు ఎత్తిచూపినట్లుగా, కొన్ని స్థూల ఆర్థిక సూచీలు — ఎగుమతులు, క్రెడిట్, విక్రయాలు — ఈ కాలంలో బాగా పెరిగాయి.
అయితే మరి ఈ వివాదం అంతా ఎందుకు తలెత్తింది? ఇది మన రెండో అంశానికి దారితీస్తుంది.
ప్రభుత్వంపై పెరిగిన అపనమ్మకం..
ప్రభుత్వం డేటాను నిర్వహించే తీరు ప్రాథమిక విశ్వాస లోటును సృష్టించింది.
జీడీపీ డేటాపై సందేహాలు కనీసం 2016-17 నుంచే ఉన్నాయి. అప్పట్లో 86 శాతం నగదు రద్దయిన సంవత్సరంలో అధికారిక డేటా వృద్ధి రేటు ఏకంగా 8.2 శాతానికి పెరిగినట్లు చూపించింది. ఈ సమస్యలు జీడీపీ అంశాన్ని మించి ఉన్నాయి.
ఆలస్యమైన జనాభా గణన, ఉపసంహరించుకున్న 2017 వినియోగ సర్వే, తక్కువగా చూపించిన కోవిడ్ మరణాలు, బహిరంగ మలవిసర్జన రహిత ప్రతిపాదనలపై అతిశయోక్తి వ్యాఖ్యలు ఇందులో భాగమే.
ఫలితంగా, ప్రజలు తమ పాత “నమ్మి-సరిచూసుకునే” వైఖరిని వదిలి, ప్రభుత్వం అందించే డేటా పట్ల “అనుమానిస్తూనే-తెరిచి ఉంచే” వైఖరికి మారారు.
ప్రాథమిక బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైనే ఉంది. ఈ విశ్వాస లోటు కారణంగానే సుభాష్ గార్గ్ విమర్శలకు మద్దతు లభించింది.
వృద్ధి రేట్లను పెంచి చూపడానికే సవరణలు చేశారనే ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టలేకపోయింది. మెథడాలజీ మారినప్పుడు, వృద్ధి ఎక్కడ తగ్గిందో వివరించే లాంగ్-బ్యాక్ సిరీస్‌ను విడుదల చేయకుండా 2025-26 జీడీపీని 7 శాతం ఎందుకు తగ్గించారో స్పష్టం చేయలేదు.
అంతేకాకుండా, వార్షిక జీడీపీ సిరీస్‌లోని అనేక సమస్యలను ఎంఓఎస్పీఐ పరిష్కరించినప్పటికీ, త్రైమాసిక జీడీపీ సంఖ్యలతో సవాళ్లు అలాగే ఉన్నాయి.
లిస్ట్ అవ్వని సంస్థలు లేదా అసంఘటిత రంగం తాజా సమాచారం ఎంఓఎస్పీఐ వద్ద లేదు, ఇవి ఆర్థిక వ్యవస్థలో దాదాపు 45 శాతంగా ఉన్నాయి.
చారిత్రకంగా, వీటి పనితీరును పెద్ద లిస్టెడ్ కంపెనీల ఆధారంగా అంచనా వేసేవారు. అయితే పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ వర్కింగ్ పేపర్ ప్రకారం, గత దశాబ్దంలో ఈ అంచనా నిజం కాలేదు.
మొదటి త్రైమాసికంలో ఇంధన ధరల షాక్ చిన్న తరహా పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేయడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమై ఉండవచ్చు.
సహజ పరిస్థితులకు.. గణాంకాలకు వ్యత్యాసం..
మూడవది ఈ సంఖ్యలు ప్రజల నిజ జీవిత అనుభవాలకు, ఆర్థిక తర్కానికి చాలా పెడగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి.
ఏప్రిల్ – మే 2026 నాటి పరిస్థితుల్లో ఇంధన రేషనింగ్, ప్రయాణాల తగ్గింపు, రెస్టారెంట్ల వంటి వ్యాపారాలు బ్లాక్ మార్కెట్లో ఎల్పీజీ సిలిండర్లను కొనుగోలు చేయడం లేదా మూసివేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
స్థిరమైన వేతన వృద్ధి లేకపోవడం, షేర్ మార్కెట్ మందగించడం, రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి — ఇవన్నీ యువతలో పెరుగుతున్న ఆందోళనకు కారణమయ్యాయి, ఇది ఇటీవలి విద్యార్థుల నిరసనలలో స్పష్టమైంది.
అలాగే, ఇంత పెద్ద ఇంధన షాక్ మధ్య ఆర్థిక వ్యవస్థ ఎలా వేగవంతమైందో అర్థం చేసుకోవడం కష్టం. దశాబ్దం క్రితం చమురు ధరలు తగ్గడం భారత్ వృద్ధికి వరంగా భావించారు. అదే తర్కం ప్రకారం, ఇటీవలి ఇంధన వ్యయాల పెరుగుదల — జీడీపీలో దాదాపు 1.5 శాతానికి సమానమైన పన్ను పెంపుతో సమానం — గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాలి.
ఆర్థిక ఉద్దీపన, బలమైన ఎగుమతులు వంటి అనుకూల అంశాలు ఉన్నప్పటికీ, దిగుమతి ధరల 32 శాతం పెంపు వల్ల జరిగిన నష్టం ముందు ఇవి చిన్నవిగా కనిపిస్తాయి.
మొదటి త్రైమాసికంలో వృద్ధి మందగించిందని రిజర్వ్ బ్యాంక్ స్వయంగా అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితులలో కేవలం వృద్ధిని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం. కానీ, జీడీపీ వృద్ధి దాదాపు ఒక శాతం పాయింట్ పెరిగిందని ఎంఓఎస్పీఐ అంచనా వేసింది.
మరొక వివరణగా, కొందరు వ్యాఖ్యాతలు ఇతర ఆసియా దేశాలు బాగానే రాణిస్తున్నాయని ఎత్తి చూపారు. అయితే కొరియా, సింగపూర్ కృత్రిమ మేధ(ఏఐ) విప్లవం ద్వారా లబ్ధి పొందుతుండగా, ఇతర దేశాలు ఎగుమతి సరుకుల ధరల పెంపుతో ప్రయోజనం పొందుతున్నాయి— వీటిలో ఏవీ భారతదేశానికి వర్తించవు. కాబట్టి, నమ్మదగిన వివరణ ఇంకా దొరకలేదు.
విశ్వసనీయత కోల్పోతున్న సర్కార్..
నాలుగోది, ప్రభుత్వం తన విశ్వసనీయతను పునర్నిర్మించుకోవాలి. ఆర్థిక పరిశోధనల ఆధారంగా, ఇంధన ఇబ్బందుల మధ్య ఆర్థిక వ్యవస్థ వేగవంతం కావడానికి అసలు కారణమేంటో వివరించాలి.
ఈ వివరణ కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ నిజంగానే పుంజుకుంటే, పన్ను రేట్ల కోతలు ఉన్నప్పటికీ నికర జీఎస్టీ రాబడి కేవలం 5 శాతమే ఎందుకు పెరిగింది?
దిగుమతి పరిమాణాలు ఎందుకు పడిపోయాయి? వ్యాపార మార్జిన్లు మెరుగుపడ్డాయని రిజర్వ్ బ్యాంక్ డేటా చూపుతున్నప్పుడు తయారీ డిఫ్లేటర్ రుణాత్మకంగా ఎలా వచ్చింది?
ప్రభుత్వం పూర్తి “సోర్సెస్ అండ్ మెథడ్స్” పత్రాన్ని విడుదల చేయాలి. ఇందులో జీడీపీని ఎలా లెక్కిస్తారు, సరిచేస్తారు, డబుల్ డిఫ్లేషన్ ఎలా చేస్తారు, ఏ ధరల ఆధారంగా చేశారు అనే విషయాలను స్పష్టంగా వివరించాలి.
ఎంఓఎస్పీఐ కొత్త మెథడాలజీని పబ్లిక్ చేస్తే, స్వతంత్ర ఆర్థికవేత్తలు ఆ సంఖ్యలను ఎలా పొందారో గ్రహించి ప్రజలకు స్పష్టత ఇవ్వగలరు.
ప్రభుత్వ వాదనలో స్థిరత్వం లోపించింది..
ఐదోది, గతంలో జీడీపీని ఎక్కువగా అంచనా వేసిన విషయాన్ని ప్రభుత్వం అంగీకరించాలి. ప్రభుత్వ వాదనల్లో స్థిరత్వంతో ఉండాలి.
పైన పేర్కొన్న కొన్ని స్థూల సూచీల ఆధారంగా ప్రభుత్వం ప్రస్తుత సంఖ్యలను సమర్థిస్తోంది. కానీ అదే తర్కం ప్రకారం, గత 14 ఏళ్లలో నమోదైన 7-8 శాతం జీడీపీ వృద్ధిపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
ఈ సూచీలను రెండు కాలాలకు పోల్చి చూపుతుంది: ప్రస్తుత త్రైమాసికం, మునుపటి మూడు సంవత్సరాలు(అన్నీ కొత్త మెథడాలజీ ఆధారంగా). ఈ సూచీలు నేటి 7.8 శాతం జీడీపీ వృద్ధికి మద్దతు ఇస్తుంటే, ఇవే సూచీలు (ముఖ్యంగా విక్రయాలు, వాణిజ్యం, విద్యుత్, పెట్టుబడులు) చాలా బలహీనంగా ఉన్నప్పుడు మునుపటి సంవత్సరాల్లో అంతటి జీడీపీ వృద్ధి ఎలా సాధ్యమైంది?
చివరగా, గతంలో వర్తించిన నియమాలు, తర్కాలు ప్రస్తుతానికి కూడా వర్తిస్తాయి కదా.
(అభిషేక్ ఆనంద్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు, ఫెల్మన్ జేహెచ్ కన్సల్టింగ్తో ఉన్నారు, సుబ్రమణియన్ భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు)
అనువాదం: కె సత్యరంజన్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
