బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 1857కు ముందే పోరాడిన వీర యోధుడు ఉమాజీ నాయక్. ఆయన జననం 7 సెప్టెంబర్ 1791. జన్మస్థలం భివడి, పురందర్ తాలూకా, పుణే జిల్లా, మహారాష్ట్ర. వీరమరణం 3 ఫిబ్రవరి 1832, పుణే.
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను పరిశీలించినప్పుడు సాధారణంగా 1857 సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి పెద్ద సాయుధ తిరుగుబాటుగా గుర్తిస్తాం.
అయితే 1857కు ఎన్నో దశాబ్దాల ముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా అనేక స్థానిక తిరుగుబాట్లు జరిగాయి. అలాంటి తొలి ప్రతిఘటనల్లో మహారాష్ట్రలో జరిగిన రామోషీ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉమాజీ నాయక్ ది ఒక ముఖ్యమైన అధ్యాయం. అందుకే ఆయనను మహారాష్ట్ర చరిత్రలో “ఆద్య క్రాంతి వీరుడు”గా గౌరవిస్తారు.
ఉమాజీ నాయక్ ఎవరు?
1791 సెప్టెంబర్ 7న పుణే జిల్లాలోని పురందర్ తాలూకాలో భివడి గ్రామంలో జన్మించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా ఆయన 1791 సెప్టెంబర్ 7న రామోషీ సమాజంలో జన్మించినట్లు నమోదు చేయబడింది.
కుటుంబ నేపథ్యం..
ఉమాజీ నాయక్ రామోషీ–బేరడ్ సమాజానికి చెందినవారు. ఆయన తండ్రి దాదోజీ ఖోమణే. ఆ కుటుంబానికి పురందర్ కోట రక్షణతో సంబంధం ఉండేది. మరాఠీ విశ్వకోశం ప్రకారం దాదోజీ ఖోమణే పురందర్ కోటకు రక్షకుడిగా పనిచేశారు.
రామోషీ సమాజానికి మరాఠా పాలనలో ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉండేది. కోటల రక్షణ, రాత్రి పహారా, సమాచార సేకరణ, గ్రామాల భద్రత వంటి పనులను వారు నిర్వహించేవారు. అంటే వారు కేవలం సాధారణ కూలీలు కాదు, స్థానిక భద్రతా వ్యవస్థలో భాగంగా పనిచేసిన సమాజం. అందువల్లే ఉమాజీ చిన్ననాటి నుంచే ధైర్యం, శారీరక దారుఢ్యం, యుద్ధ నైపుణ్యం, అటవీ ప్రాంతాల్లో సంచరించే సామర్థ్యం వంటి లక్షణాలను అలవర్చుకున్నారు.
18వ శతాబ్దం చివరి, 19వ శతాబ్దం ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాష్ట్రలో తన అధికారాన్ని విస్తరించింది. మరాఠా సామ్రాజ్యం బలహీనపడుతూ చివరకు 1818లో పతనమైన తర్వాత బ్రిటిష్ అధికార వ్యవస్థ మరింత బలపడింది.
రామోషీలకు సంప్రదాయంగా ఉన్న భద్రతా బాధ్యతలు, హక్కులు, జీవనాధారాలు దెబ్బతిన్నాయి. ఇది క్రమంగా ఆర్థిక అసంతృప్తి నుంచి సామాజిక అసంతృప్తిగా మారి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణమించింది.
బ్రిటిష్ పాలన స్థానిక ప్రజల సంప్రదాయ హక్కులను హరిస్తూ, తమ పరిపాలనా వ్యవస్థను రుద్దుతున్న పరిస్థితిని ఉమాజీ నాయక్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పోరాటం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిన దోపిడీ లేదా స్థానిక గొడవ కాదు. క్రమంగా అది విదేశీ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ప్రతిఘటనగా రూపుదిద్దుకుంది.
భారత ప్రభుత్వ చారిత్రక రికార్డుల ప్రకారం ఉమాజీ నాయక్ చిన్న సైనిక దళాన్ని సమీకరించి బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేశారు.
1826లో ఆయన తనను తాను రాజుగా ప్రకటించుకున్నట్లు కూడా ఆ రికార్డులు పేర్కొంటున్నాయి.
గెరిల్లా పోరాటం..
ఉమాజీ నాయక్‌కు పెద్ద సైన్యం లేదు. ఆధునిక ఆయుధాలు లేవు. బ్రిటిష్ సైన్యంతో నేరుగా సమానంగా యుద్ధం చేసే వనరులు లేవు. అయినా ఆయనకు ప్రజల సహకారం ఉంది. భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ పద్ధతి బాగా తెలుసు.
పర్వతాలు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను ఉపయోగించుకుని బ్రిటిష్ అధికార వ్యవస్థపై దాడులు నిర్వహించారు.
బ్రిటిష్ పోలీస్ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్తులు, బ్రిటిష్‌కు అనుకూలంగా పనిచేసే వ్యవస్థలపై దాడులు జరిగాయి.
భారత ప్రభుత్వ జిల్లా రిపోజిటరీ ప్రకారం బ్రిటిష్ అధికారులు ఆయనను పట్టుకోవడానికి అనేక ప్రకటనలు జారీ చేశారు. అనేక మంది అధికారులు కలిసి ప్రయత్నించినప్పటికీ ఆయనను వెంటనే పట్టుకోలేకపోయారు.
ఉమాజీ నాయక్ పోరాటంలో ఒక ముఖ్యమైన అంశం సామాజిక న్యాయం. బ్రిటిష్ పాలనతో పాటు స్థానికంగా ప్రజలను దోచుకునే ధనిక వర్గాలు, వడ్డీ వ్యాపారులు కూడా ఆయన లక్ష్యాలుగా మారాయి. ఆయన ధనికుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచేవారు. అందువల్ల ఆయనను బ్రిటిష్ వ్యతిరేక యోధుడిగానే కాకుండా అణగారిన వర్గాల ప్రతిఘటనకు ప్రతీకగా కూడా చూడవచ్చు.
ఉమాజీ నాయక్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బ్రిటిష్ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఆయనను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం రూ 10,000 భారీ బహుమతి ప్రకటించింది.
అది ఆ కాలానికి చాలా పెద్ద మొత్తం. దీనిని బట్టి ఉమాజీ నాయక్ బ్రిటిష్ పరిపాలనకు ఎంతటి సవాలుగా మారారో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఉమాజీ నాయక్ చాలా కాలం వారి చేతికి చిక్కలేదు.
చివరకు బ్రిటిష్ అధికారులు ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించి ఆయనను పట్టుకునే వ్యూహాన్ని రచించారు.
1831 డిసెంబర్ 15న భోర్ తాలూకాలోని ఉత్రోలి గ్రామంలో ఉమాజీ నాయక్‌ను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పుణేలోని మామ్లేదార్ కచేరీ జైలులో నిర్బంధించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉమాజీ నాయక్‌పై దేశద్రోహం వంటి అభియోగాలు మోపింది.
న్యాయమూర్తి జేమ్స్ టేలర్ ఆయనకు మరణశిక్ష విధించారు. చివరకు 1832 ఫిబ్రవరి 3న పుణేలో ఉమాజీ నాయక్‌ను ఉరితీశారు.
అప్పుడు ఆయన వయస్సు సుమారు నలభై, నలభై ఒక్క సంవత్సరాలు. ఆయన మృతదేహాన్ని కూడా కొంతకాలం అక్కడే వేలాడదీసి ప్రజల్లో భయాన్ని కలిగించాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అది ప్రజలలో ఉమాజీ నాయక్‌ను ఒక త్యాగధనుడిగా, వీరుడిగా గుర్తుంచుకునేలా చేసింది.
ఉమాజీ నాయక్ పోరాటం బ్రిటిష్ అధికారులను ఎంతగా ప్రభావితం చేసిందో వారి సొంత వ్యాఖ్యల ద్వారా కూడా తెలుస్తుంది.
ఒక బ్రిటిష్ అధికారి రాబర్ట్ నివేదిక ప్రకారం, ఉమాజీ నాయక్‌కు ప్రజల మద్దతు పెరుగుతోందని, ఆయన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాడని బ్రిటిష్ అధికారులు గమనించారని భారత ప్రభుత్వం తయారు చేసిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో పేర్కొన్నారు.
అతన్ని అరెస్టు చేసిన కెప్టెన్ మెకింటోష్ కూడా ఉమాజీ నాయక్‌లో ఉన్న నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించినట్లు అదే ప్రభుత్వ ఆధారం పేర్కొంది.
ఉమాజీ నాయక్ మరణించిన పాతిక సంవత్సరాల తర్వాత భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది.
ఇది ఉమాజీ నాయక్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. కాబట్టి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కేవలం 1857 నుంచి ప్రారంభమైన ఉద్యమంగా చూడటం పూర్తి చరిత్ర కాదు.
1857కు ముందే పహారియా తిరుగుబాట్లు, సంతాల్ తిరుగుబాటు, భీల్ తిరుగుబాట్లు, పైకా తిరుగుబాటు, కోల్ తిరుగుబాటు, రామోషీ తిరుగుబాటు, ఇతర గిరిజన, రైతాంగ ప్రతిఘటనలు వంటి అనేక పోరాటాలు జరిగాయి. ఈ విస్తృత ప్రతిఘటనల పరంపరలో ఉమాజీ నాయక్ ఒక ముఖ్యమైన ముందడుగు.
చారిత్రక ప్రాధాన్యత..
ఉమాజీ నాయక్‌ను మనం మూడు కోణాల్లో అర్థం చేసుకోవాలి.
జాతీయ స్వాతంత్ర్య కోణం – విదేశీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు.
సామాజిక కోణం – అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన రామోషీ సమాజం హక్కుల కోసం పోరాడారు.
రాజకీయ కోణం – బ్రిటిష్ పాలనకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ అధికార వ్యవస్థను నిర్మించాలనే ప్రయత్నం చేశారు. ఈ మూడు అంశాల కలయికే ఆయన పోరాటాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్ వంటి అనేక మహనీయులు విస్తృతంగా గుర్తింపు పొందారు. కానీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అంతకంటే ముందే పోరాడిన అనేక మంది స్థానిక వీరులు చరిత్రలో తగిన స్థానం పొందలేదు.
ఉమాజీ నాయక్ కూడా అలాంటి వారిలో ఒకరు. ఆయన పోరాటాన్ని కేవలం ఒక ప్రాంతీయ తిరుగుబాటుగా కాకుండా భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా ప్రతిఘటనలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా చూడాలి.
నేటి తరానికి ఉమాజీ నాయక్ సందేశం..
ఉమాజీ నాయక్ జీవితం మనకు అనేక విలువలను నేర్పుతుంది. అన్యాయాన్ని ప్రశ్నించాలి. అణచివేతకు ఎదురు నిలవాలి. అధికార బలం కంటే ప్రజల మద్దతు గొప్పది.
స్వేచ్ఛ కోసం పోరాడిన వారిని కులం, ప్రాంతం, భాష ఆధారంగా కాకుండా వారి త్యాగం ఆధారంగా గుర్తించాలి.
అతను పెద్ద రాజు కాదు, అతనికి ఆధునిక సైన్యం లేదు, అతనికి అపారమైన ఆర్థిక వనరులు లేవు. అయినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేశాడు. అందుకే ఆయన జీవితం “స్వేచ్ఛకు ధర ఉంటుంది. ఆ ధరను చెల్లించడానికి సిద్ధమైన వారే చరిత్రలో నిలుస్తారు” అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.
1791 సెప్టెంబర్ 7న జన్మించిన ఉమాజీ నాయక్, 1832 ఫిబ్రవరి 3న బ్రిటిష్ చేతిలో ఉరితీయబడ్డారు. కానీ ఒక విప్లవకారుడి జీవితాన్ని అతని మరణంతో ముగించలేం.
ఉమాజీ నాయక్ వెలిగించిన ప్రతిఘటన జ్వాల తరువాతి తరాల పోరాటాల్లో కొనసాగింది. 1857 మహా తిరుగుబాటుకు ముందే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరిగాయని ఆయన చరిత్ర మనకు గుర్తుచేస్తుంది.
కేవలం ఒక వీరుడిని స్మరించుకునే రోజు మాత్రమే కాదు. భారత స్వాతంత్ర్య పోరాటం అనేక వేల మంది పేరు పొందని, అణగారిన వర్గాల ప్రజల త్యాగాలతో నిర్మించబడిందని గుర్తుచేసుకునే రోజు కూడా. “వీరుల త్యాగాలను స్మరించుకుందాం – స్వాతంత్ర్య విలువలలు కాపాడుకుందాం.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
