పాలక పక్షాల వైఫల్యాలపై ఇటీవల దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష పార్టీలను అణచి వేస్తూ నోరెత్తనీయని పాలక పక్షాలను జన్ జీ తరం తమ సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ పేరున ఒక తాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పోరాటాలకు దిగింది.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన, పేపర్ లీకేజీల విషయంపై పెద్ద ఎత్తున జనంలో చైతన్యం తెచ్చి ప్రభుత్వంలో అంతర్భాగమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు పట్టుపట్టి కొత్త తరపు పోరాట పటిమను పాలకులకు రుచి చూపించింది.
భవిష్యత్తులో విద్య, వైద్యం రంగాల సంస్కరణల కోసం మరిన్ని సామాజిక పోరాటాలకు సిద్ధమని ప్రకటించింది.
వీటన్నిటినీ అడ్డుకోకపోతే అసలుకే ఎసరు వచ్చే స్థితి రావడం ఖాయమని భావించిన పాలక పక్షాల అనుకూల శక్తులు జన్ జీ తరం ఆలోచనలపై, ఉద్యమాలపై అనేక రకాలుగా విషం కక్కుతున్న పరిస్థితిని చూస్తున్నాం. దీనితో పాటే రేపటి రోజున రానున్న ప్రజాస్వామిక ఉద్యమాలను పక్కదారి పట్టించేలా తమకు కొరకరాని కొయ్యగా మారిన జన్ జీ తరాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకూ తెర లేపాయి.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొత్త కుట్రలు..
సామాజిక మాధ్యమాల నుంచి అవతరించిన కాక్రోచ్ జనతా పార్టీ తీరునే కాపీ కొట్టిన కొన్ని శక్తులు, ఆ తరహాలోనే దేశ యువతను తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని రూపొందించాయి.
దేశంలో ఇప్పుడున్న రిజర్వేషన్ వ్యవస్థను తొలగించి ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆ సంస్థ చేస్తున్న డిమాండు.
మెరిట్‌ను కాపాడడమనే నినాదాన్ని తొడుక్కొని వచ్చిన రాజకీయ ప్రేరేపిత, ప్రాయోజిత రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం పైనుంచి చూడడానికి సమానత్వాన్ని కోరుతున్నట్లుగా కనిపిస్తోంది. కొందరిని ఆకర్షిస్తున్నది.
ఈ క్రమంలో ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించి నిజానిజాలను బాహ్య ప్రపంచం ముందు పెట్టాల్సిన పని బుద్ధిజీవులదే.
రిజర్వేషన్ హటావో నినాదం ఎక్కడిది? ఎవరిది? ఏ ప్రయోజనాల కోసం వస్తున్నది? అనే అంశాలపై సమాజంలో మరింత చర్చ జరపాలి.
ఇదే డిమాండుతో ఇప్పటికే మన దేశంలో పని చేస్తున్న సంస్థలేవో కొత్త తరానికి విడమర్చి చెప్పాలి. రిజర్వేషన్లపై కొత్త కుట్రలతో, కపటపు మాటలతో జన్ జీ తరాన్ని తమ వైపు తిప్పుకునే లక్ష్యంతో భారత సమాజ చరిత్రను, కుల వ్యవస్థను, సామాజిక అసమానతలను ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచే ప్రతీఘాత శక్తుల పన్నాగాలను బహిర్గతం చేయడం ద్వారానే ఈ తరహా ప్రయత్నాలను ఎండగట్టవచ్చు.
రాజ్యాంగం కల్పించిన హక్కు..
ఇప్పుడు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల వ్యవస్థ ఎవరి దయాదాక్షిణ్యంతోనో వచ్చినవి కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 16(4), 16(4ఏ), 46ల రూపంలో సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు.
వేల సంవత్సరాలుగా ఉత్పత్తి సాధనాలు, విద్య, అధికారం, సంపద, జ్ఞానం వంటి వాటికి దూరంగా నెట్టబడిన వర్గాలకు కనీస ప్రాతినిధ్యం కల్పించేందుకు ఏర్పడిన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ.
రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని విస్తరించడం కోసం ముందుకు తెస్తున్న “మెరిట్” అనే పదాన్ని చాలా లోతుగా చూడాలి.
సమాజంలో మెరిట్ అనేది శూన్యంలో నుండి పుట్టదు. ఒక విద్యార్థి మంచి పాఠశాలలో చదివే అవకాశం, ఆర్థిక స్థోమత, చదువుకునే వాతావరణం, తల్లిదండ్రుల విద్యాస్థాయి, పోషకాహారం, పుస్తకాలు, డిజిటల్ వసతులు ఇలా అనేక అంశాల ప్రభావంతోనే మెరిట్‌ను సాధించడం సాధ్యం.
కార్పొరేట్ పాఠశాలల్లో లక్షలు ఖర్చు చేసి చదివే విద్యార్థుల పరిస్థితి, పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఒకటి కాదు. వారిద్దరికీ ఒకే పరీక్ష పెట్టి వచ్చిన మార్కులనే మెరిట్‌గా ప్రకటించడం సామాజిక వాస్తవాలను నిరాకరించడమే అవుతుంది.
ఇప్పుడు ఉన్న ఈ పాటి రిజర్వేషన్లను తొలగిస్తే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇప్పటికీ కొనసాగుతున్న సామాజిక అసమానతలు మరింత తీవ్రమవుతాయి.
అవకాశాల లోటును సరిదిద్దడమే లక్ష్యం..
దేశవ్యాప్తంగా అణచివేయబడిన వర్గాలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుల వివక్ష, అంటరానితనం, పరువు హత్యలు, గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి, వేర్వేరు శ్మశానాలు, ఆలయ ప్రవేశ ఘర్షణలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ వాస్తవాలను గమనించకుండా రిజర్వేషన్లు అవసరం లేదనడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. పేదరికం అన్ని కులాల్లో ఉంటుంది. పేదలందరికీ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు విస్తరించాలని కోరడంలో తప్పు లేదు.
అయితే రిజర్వేషన్ లక్ష్యం పేదరిక నిర్మూలన కాదని గుర్తించడమే అసలైన విజ్ఞత. తరతరాలుగా సమాజంలో కొనసాగిన వివక్ష వల్ల ఏర్పడిన అవకాశాల లోటును సరిదిద్దడమే రిజర్వేషన్ల అసలు లక్ష్యం. అగ్రకులానికి చెందిన పేద, దళిత కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్య ఒకేలా ఉండవచ్చు. కానీ కులపరంగా ఎదురయ్యే వివక్ష, సామాజిక అసమానతలు మాత్రం ఇద్దరి విషయంలో వేర్వేరుగానే ఉంటాయి. అగ్రకులానికి చెందిన పేదలకు అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యలు ఎదురుకావు. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా వెనుకబడిన వర్గాలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్న ఘటనలు అనేకం మనం గమనించవచ్చు.
దళితుడు ఒక గ్రామానికి సర్పంచ్ అయినా ఆ ఊరి గుడిలోకి వెళ్లగలిగిన గ్రామాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయో గమనిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయి.
అసలు సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడ..
కాబట్టి రిజర్వేషన్లు వద్దనడం కన్నా సమాజంలో రావాల్సిన మార్పులపై ఆలోచించడం, చర్చకు పెట్టడం ఇప్పుడు ముఖ్యం. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న 2014 నాటి ఎన్నికల హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
ప్రభుత్వ రంగంలోనే లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యావత్ ప్రభుత్వ రంగాన్నే ప్రైవేటీకరిస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలు అటకెక్కాయి. అరకొర వేతనాలతో వెట్టి చాకిరీకి తక్కువ కాని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాలు పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండు చేయకుండా, ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్లనే లక్ష్యంగా చేసుకోవడం అవివేకం. కాబట్టి రిజర్వేషన్ల రద్దు అనే ఈ డిమాండు ప్రజల మధ్య పరస్పర ఘర్షణకు దారి తీసే రాజకీయాలకు ఆధారంగా మారుతుంది.
పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల క్షీణత వంటి అసలు సమస్యలపై ఐక్యంగా పోరాడకుండా ఉండేందుకు, పాలక వర్గాలకు అండగా నిలిచేందుకే ఈ డిమాండు పనికి వస్తుంది.
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలే లేకుండా చేస్తూ, మరోవైపు రిజర్వేషన్లపై చర్చను ముందుకు తేవడం, దాన్ని ఎలాగైనా ప్రచారం చేయాలనే ప్రయత్నంలోనే రాజకీయ ఎత్తుగడ దాగి ఉంది.
సమసమాజ నిర్మాణానికి దారి..
వందల ఏళ్లుగా కొనసాగుతున్న అసమానతలను సరిదిద్దే క్రమంలో వచ్చిన రిజర్వేషన్లు సామాజిక సమానత్వానికి వ్యతిరేకం కావు, అసలైన సమానత్వాన్ని సాధించే మార్గం అని గుర్తించాలి.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనే అంశంపై కాకుండా ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను ఎలా అందించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయి, ప్రైవేటీకరణ ఎందుకు పెరుగుతోంది, కార్మిక హక్కులు ఎందుకు బలహీనపడుతున్నాయి అనే అంశాలపై జన్ జీ తరం చర్చకు తెర లేపితే సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. సమసమాజ నిర్మాణానికి దారి చూపించవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
