ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరయ్యే వైస్ ఛాన్సలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి రోజీ ఎం జాన్, వైస్ ఛాన్సలర్లు వృత్తిపరమైన విలువలకు, నిబద్ధతకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చిన సందేశంలో కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి రోజీ ఎం జాన్, విద్యాసంస్థల బాధ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాసంస్థల గౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని కోరారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే వైస్ ఛాన్సలర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ మంత్రి “విచ్ఛిన్నకర రాజకీయాలకు వేదికగా జరిగే సమావేశాలలో పాల్గొనడం విద్యాసంస్థల అధిపతులు, నిర్వాహకులకు తగినది కాదు” అన్నారు.
మేధో స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టొద్దు..
తాము ప్రాతినిధ్యం వహించే విద్యాసంస్థలకు ఉన్న చరిత్ర, గౌరవాలను దృష్టిలో పెట్టుకొని కులపతులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
“అటువంటి భాగస్వామ్యాలు మేధో స్వయంప్రతిపత్తిని సంకుచిత రాజకీయాలకు తాకట్టు పెట్టడమే. ఇటువంటి వ్యవహారశైలి విద్యాబోధనలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఉన్నత విద్యాసంస్థలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, రాజ్యాంగ విలువలకు వేదికలుగా ఉండాలి” అన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో వీసీల భాగస్వామ్యం..
ఈ సందేశంలో ఫలానా అంటూ ఎవరి పేర్లు ప్రస్తావించనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు ఇటువంటి కార్యకలాపాలకు హాజరుకావటాన్ని దృష్టిలో పెట్టుకొని పై సందేశం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.
కేరళ వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నమ్మాల్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తాత్కాలిక వైస్ ఛాన్సలర్ మావత్తు డి, తుంచాట్ ఏజుచ్చాటన్ మలయాళం యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్సలర్ సీఆర్ ప్రసాద్ 2026 జూన్ 13న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అతిథిగా వచ్చిన సమావేశాలకు హాజరయ్యారు.
ఆగస్టు 15న ఆర్ఎస్ఎస్ నిర్వహించిన మరో కార్యక్రమంలో కూడా కున్నమ్మాల్ పాల్గొన్నారు.
త్రిస్సూర్‌లో సెప్టెంబర్ నాలుగో తేదీన బాలగోకులం సంస్థ నిర్వహించిన శోభాయాత్రను ప్రారంభించి కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్సలర్ తాజా వివాదానికి తెరతీశారు.
కుల వివక్షపై తీవ్ర ఆవేదన..
ఉపాధ్యాయులు ప్రతి తరం పట్ల ఒకేరకమైన బాధ్యతతో వ్యవహరించాలని కోరుతూ విద్యార్థుల పట్ల కుల వివక్ష పాటించే వారు విద్యాబోధన గురించిన మౌలిక సూత్రాన్ని విస్మరిస్తున్నట్టే అన్నారు.
కన్నూరు డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి ఆర్ఎల్ నితిన్ రాజ్ కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అటువంటి చర్యలకు పాల్పడే ఉపాధ్యాయులు విద్యాబోధన అంటే విలువలతో కూడిన భావి పౌరులను తీర్చిదిద్దడం అన్న మౌలిక కర్తవ్యాన్ని విస్మరించడం తప్ప మరోటి కాదన్నారు.
ప్రముఖుల కృషిని స్మరించుకుంటూ..
తన సందేశంలో కేరళ మంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం, సుకుమార్ అజికోడ్, ఓఎన్వీ కురుప్, ఎంజీఎస్ నారాయణన్, లీలావతి వంటి ప్రముఖులు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించటానికి చేసిన కృషి గురించి ప్రస్తావించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
