2025 సంవత్సరానికిగాను నోబెల శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకి అందచేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. దీని తర్వాత కూడా ఈ శీర్షికతో విశ్లేషణ మొదలు పెట్టాల్సి రావటం చూస్తే పాఠకులకు సందేహం రాకమానదు. కానీ నోబెల్ బహుమతి చుట్టూ ఉన్న రాజకీయాలు, ప్రత్యేకించి నోబెల్ శాంతి బహుమతి చుట్టూ ఉన్న రాజకీయాలను గమనిస్తే, ఈ ప్రశ్నాత్మక శీర్షిక అనివార్యవుతున్నది. నోబెల్ కమిటి ద్వారా శాంతిదూతలుగా గుర్తించబడిన వారు, ఆయా దేశాల్లో నిర్మించబూనుకున్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
ఈ ప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు ఒక విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నాయి. వెనిజులాలో ప్రజాస్వామ్యం లేదన్న అపోహను కలిగించటానికి జరుగుతున్న ప్రయత్నాల్లో, అంతర్జాతీయంగా తటస్థతకు మారుపేరని చెప్పుకుంటున్న నోబెల్ కమిటీ భాగస్వామి కావటం ఇది తొలిసారి ఏమీ కాదు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో ప్రాంభమైన ఈ బహుమతి అంతర్జాతీయంగా శాంతి, సౌభ్రాతృత్వం, సహోదరత్వాన్ని ప్రచారం చేయటం లక్ష్యంగా మొదలైంది. అంతేకాదు. ‘‘దేశాల మధ్య సౌహార్ద్ర భావాలను పెంపొందించటానికీ, దేశ భధ్రతలో శాశ్వత సైన్యాల పాత్రను తగ్గించటానికీ, అంతర్జాతీయంగా శాంతి సందేశాలు వ్యాపింపచేయటానికీ’ మొదలైన నోబెల్ శాంతి బహుమతి చరిత్ర చూస్తే రానురాను అంతర్జాతీయ రాజకీయ క్రీడల్లో ప్రత్యేకించి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అప్పటి సోషలిస్టు దేశాల కూటమికి వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్వవాదం సాగించే కుట్రల్లో భాగం అయ్యింది.
1901 నుంచీ నార్వే కేంద్రంగా పని చేసే నోబెల్ కమిటీ; పలువురు వ్యక్తులు, సంస్థలను నోబెల్ శాంతిదూతలుగా ప్రకటిస్తూ వచ్చింది. శాంతి బహుమతితో పాటు నోబెల్ కమిటీ ఆర్థికరంగంలోనూ, శాస్త్రవిజ్ఞానరంగంలోనూ, వైద్య పరిశోధనల్లోనూ అద్వితీయమైన కృషి, ఫలితాలు సాధించిన వారిని ఆయా రంగాల్లో నోబెల్ విజేతలుగా ప్రకటిస్తూ వచ్చింది.
ఈ మొత్తం అవార్డుల్లో ఆర్థికరంగంలో ఇచ్చే అవార్డు, శాంతి స్థాపన దిశగా జరిగే కృషికి ఇచ్చే అవార్డులు అత్యంత పాక్షిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటున్నాయి. ఉదాహరణకు ఆర్థికరంగంలో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, సూత్రాలు, ఆచరణాత్మక విధానాలూ ఒక చోట పోగేసి చూస్తే ఇవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక సంబంధాల మనుగడకు ప్రాణం పోసేవిగానే ఉన్నాయి తప్ప ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న శాశ్వత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకటంలో ఈ మేధావులంతా విఫలమయ్యారన్న వాస్తవం అర్థమవుతుంది.
ఉదాహరణకు కనీసం యాభైఏళ్లకుపైగా సోషలిస్టు శిబిరంగా ఉన్న దేశాల్లో గౌరవప్రదమైన వ్యక్తిగత జీవితానికి అవసరమైన విద్య, వైద్యం, నివాసం, ఉపాధి వంటి రంగాల్లో నూటికి నూరు మార్కులు సాధించిన సోషలిస్టు ఆర్థిక విధానాల్లో ఉన్న సృజనాత్మకు ఒక్క సంవత్సరం కూడా ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి రాకపోవటం ఈ వాస్తవాన్ని ధృవీకరిస్తుంది. తాజా చర్చ శాంతి బహుమతి గురించి, కాబట్టి మన పరిశీలనను ఇంతవరకే పరిమితం చేసుకుందాం.
2025కు సంబంధించినంతవరకూ ఉక్రెయిన్, గాజాలతో పాటు భారత్- పాకిస్తాన్ల మధ్య ఉన్న యుద్ధ వాతావరణానికి శాశ్వతంగా ముగింపు పలికాను. కాబట్టి, తనకే ప్రపంచ శాంతి బహుమతి దక్కాలని ట్రంప్ బాహాటంగా బరిలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా వెనిజులా ప్రతిపక్ష నేతను శాంతి బహుమతికి ఎంపిక చేసిన వెంటనే అమెరికా అధ్యక్ష భవనం నోబెల్ కమిటీ విరుచుకుపడ్డ తీరును గమనిస్తే, ట్రంప్ ఈ బహుమతికి అర్హుడని మొత్తం అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ అనుయాయులు భావిస్తున్నట్టు అర్థమవుతుంది.
ఆచరణలో ఈ ఘర్షణల తీవ్రత తగ్గినా ఉద్రిక్తతల తీవ్రత పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే. గాజాలో అయితే కనీసం మానవత్వంతో కూడిన సహాయాన్ని అందచేయటానికి, క్షతగాత్రులకు మందులు, ఆసుపత్రులకు వైద్యపరికరాలు, ఆక్సిజన్ వంటి కీలక వనరులు, రోగులకు ఆహారపదార్ధాలు అదించేందుకైనా కాల్పుల విరమణ పాటించాలన్న తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు వేయటం చూశాము.
వ్యాసం నిడివిని తగ్గించటానికి నోబెల్ శాంతి బహుమతిలో ఇమిడి ఉన్న రాజకీయాలను అర్థం చేసుకనేందుకు మూడు సందర్భాలను మనం ప్రస్తావించుకోవచ్చు.
మొదటిది 1973లో అప్పటి సోవియట్‌లో అసమ్మతి నేతగా ఉన్న ఆంద్రే సఖరోవ్ను నోబెల్ శాంతి బహుమతి విజేతగా ఎంపిక చేస్తే, పోలండ్‌లో అప్పటి సోషలిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐఏ ప్రోత్సాహంతో ఆర్థిక హార్ధిక సహాయ సహకారాలతో ఉద్యమించి సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చటంలో కీలకపాత్ర పోషించిన లేక్ వాలేసాను 1983 సంవత్సరానికి గాను శాంతి బహుమతి విజేతగా నోబెల్ కమటీ గుర్తించింది.
తాజా మూడో సందర్భం..
తనను నోబెల్ బహుమతి విజేతగా ప్రకటించిన వెంటనే వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సాగుతున్న ఉద్యమానికి అమెరికా అందించిన అండదండలకు కృతజ్ఞతగా, ఈ బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు మరియా ప్రకటించారు.
మారియా వెనిజులాలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2013లో ఛావెజ్ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరియా పావుగా మారారు. 2002 నుంచీ వెనిజులాలో అధికారంలో ఉన్న ఛావెజ్ ప్రభుత్వాన్ని దించేసి, తమకు అనుకూలంగా ఉన్న పాలకులను గద్దెనెక్కించటానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు.
ఛావేజ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే అంతర్జాతీయ చమురు అమ్మకాలపై ఆంక్షలు విధించి ఛావేజ్ ప్రారంభించిన ప్రజా సంక్షేమ చర్యలకు నిధుల కొరత సృష్టించటానికి ప్రయత్నించింది. ఈ ఆంక్షలను అధిగమించేందుకు కొన్ని చట్టపరమైన నిర్ణయాలు చేయటం, అమెరికా కంపెనీల స్వాధీనంలో ఉన్న చమురు బావులు జాతీయం చేయటం, చమురు కంపెనీలపై విధించే పన్నుల్లో మార్పులు చేయటం వంటి అనేక విధానపరమైన ప్రత్యామ్నాయాలకు ఛావేజ్ ప్రభుత్వం తెర తీసింది.
దాంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వెనిజులాలో ఎన్నికయిన ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పూనకున్నది అమెరికా. ఈ ప్రయత్నంలో తనతో గొంతు కలపటంతో సరిపెట్టుకోకుండా చేతులు కలిపే భాగస్వాములను సిద్ధం చేసుకుంది.
ఈ ప్రయత్నంలోనే మరియా నేతృత్వంలో 2002లో సమ్మేట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు శక్తులను సమీకరించటానికి జరిగిన ప్రయత్నాల్లో భాగస్వామి అయ్యారు. ఆ ప్రయత్నం విఫలం కావటంతో 2010లో ఛావేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయసేకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఛావేజ్ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల్లోనే మరియా ప్రతిపక్ష నేతగా ఎదిగారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో పార్లమెంట్లో ప్రతిపక్ష కూటమి నేతగా గుర్తింపు పొందారు.
ఆమెను పావుగా వాడుకుని గతంలో కొలంబియా, అర్జెంటీన, చీలి, నికరాగువా వంటి దేశాల్లో ప్రజా ప్రభుత్వాలను మార్చటంలో సఫలీకృతమైన విధంగా వెనిజులాలో గతంలో ఛావేజ్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు మదురో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాధ్యం కాకపోతే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో మార్చేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2024లో జరిగిన వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా తరఫున క్షేత్రస్థాయిలో రంగ ప్రవేశం చేసేందుకు సీఐఏ వ్యూహం రూపొందించింది. ఈ విషయాన్ని గుర్తించిన మదురో ప్రభుత్వం మరియాను ఎన్నికల్లో పాల్గొనకుంగా నిషేధం విధించారు.
వెనిజులాలో జరుగుతున్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి అమెరికా అందిస్తున్న చేయూతను మరియా మెచ్చుకోవడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. తాజా చర్య ద్వారా అంతర్జాతీయంగా ఉదారవాదులైన ప్రజాస్వామ్య ప్రేమికుల్లో వెనిజులా ప్రభుత్వం పట్ల ఓ స్థాయిలో వ్యతిరేకత తెచ్చి పెట్టేందుకు, సాధ్యమైతే దాని కొనసాగింపులో 1983లో పోలండ్‌లో సోషలిస్టు ప్రభుత్వం తలరాత మార్చినట్లుగా, వెనిజులా తలరాత మార్చేందుకు కూడా అమెరికా, సామ్రాజ్యవాద శక్తులు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నోబెల్ శాంతి బహుమతి ప్రదానమని నిస్సందేహంగా నిర్ధారించుకోవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
