“మేము మెజారిటీ” అని తమకు తాము చెప్పుకుంటూ తమ ఇష్టానుసారంగా ఇతరులకు హాని తలపెట్టే విధంగా బెదిరింపులకు పాల్పడితే అదే నాణెంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ ఎంపీ భట్టాచార్య హెచ్చరించారు.
న్యూఢిల్లీ: బీజేపీ ‘చెడు ధర్మం’ ఆచరిస్తోందని ఈద్ వేదిక నుంచి ఎవరైనా అంటే ఆ వ్యక్తి నామరూపాలు లేకుండా చేయడం జరుగుతుందని పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య సెప్టెంబర్ 6న చెప్పినట్లు డెక్కన్ క్రానికల్ కథనం తెలియజేసింది.
“బీజేపీ చెడు ధర్మాన్ని ఆచరిస్తోందని ఈద్-ఉల్-ఫితర్ వేదిక నుంచి ఎవరైనా ప్రకటించినట్లయితే, వేదిక నుంచి దిగక ముందే ఆ వ్యక్తిని నామరూపాలు లేకుండా ప్రజలు చేయగలరు” అని నగరంలోని బౌబజార్లో శతదళ్ సంఘ్ దుర్గా పూజ పండుగకు ముందు ఆచారాల ప్రకారం జరిపే ఖుటీపూజలో భట్టాచార్య చెప్పారు.
“మేము మెజారిటీ” అంటూ తమకు తాము చెప్పుకుంటూ ఎవరైనా తమ ఇష్టానుసారంగా ఇతరులకు హాని తలపెట్టే విధంగా బెదిరింపులకు పాల్పడితే అదే నాణెంతో వారు తిరిగి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ ఎంపీ భట్టాచార్య హెచ్చరించారు.
మెజారిటీ పేరుతో బెదిరిస్తే భగీరథీ నదిలో ముంచేస్తాం..
“ఈ నేలపై మేము 70 శాతం ఉన్నామని, మిగతావారు 30 శాతమే ఉన్నారని గర్విస్తూ, ఎప్పుడు పడితే అప్పుడు ఆ 30 శాతం మందిని నరికి భగీరథీ నదిలో పడేస్తామని ఈ గడ్డపై ఎవరైనా ప్రగల్భాలు పలికితే, అక్కడికక్కడే వారిని కూడా అదే భగీరథీ నదిలో ముంచేయాల్సి ఉంటుంది” అని భట్టాచార్య అన్నారు.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమజ్జనం సమయాన్ని నిర్ణయించి దుర్గా పూజ పండుగను నిర్దేశించేదని కూడా భట్టాచార్య ఆరోపించారు. ఈ ఏడాది పండుగ వేరుగా ఉంటుందని ఆయన అన్నారు.
దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే ముక్కలు చేస్తాం..
జాదవ్పూర్ విశ్వవిద్యాలయం(జేయూ) ప్రాంగణంలో ఇటీవల గోడలపై రాసిన రాతల చుట్టూ ముసిరిన వివాదాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
“విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత కొందరు గోడలపై నినాదాలు రాస్తున్నారు. వారికి మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, మేము ఏ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించం పోలీసులూ రారు. కానీ ఆ పని చేస్తున్న వారిని గుర్తిస్తాం. అలాంటి వారు ఆరోగ్యంగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘భారత్ తేరే తుక్డే హోంగే'(భారత్ ముక్కలవుతుంది) అని ఎవరైనా అంటే, వారిని ముక్కలు ముక్కలుగా చేయాల్సిందే. దీన్ని ఇలాగే కొనసాగనివ్వలేం కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని భట్టాచార్య అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
