ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 24 ఏళ్ల లా విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిపై మోపిన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
కొందరు అధికారులు ఇలాగే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ‘ఓర్వెలియన్ డిస్టోపియా'(అత్యంత అణచివేతతో కూడిన భయానక వాతావరణం)గా మారే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది.
జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిస్తూ- తగిన ఆధారాలు లేకుండా, విచక్షణ రహితంగా జారీ చేసిన ఈ నిర్బంధ ఉత్తర్వుల వల్ల ఆర్టికల్ 21 ప్రకారం ఆకృతి చౌదరికి లభించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, చౌదరికి రూ 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపామ్తో పాటు, ప్రాథమిక నివేదిక తయారు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు బాధ్యులైన అధికారులందరి జీతాల నుంచి వసూలు చేయాలని సూచించింది.
బ్యూరోక్రసీ, పోలీసు వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
15 పేజీల ఈ తీర్పులో బ్యూరోక్రసీ, పోలీసుల పాత్రపై ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌరుల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమాన్ని పరిరక్షించే బాధ్యత ఉంది కాబట్టే అధికారులకు అత్యున్నత అధికారాలు కల్పించారని పేర్కొంది.
అయితే, అధికారులు తమ విశ్వసనీయతను రాజ్యాంగం పట్ల చూపించాలి తప్ప, రాజకీయ కార్యవర్గం (రాజకీయ నాయకుల) పట్ల కాదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, అధికారులు ప్రజలకు సేవకులని గుర్తుచేసింది.
అధికారులు తమ ప్రమాణ స్వీకారాన్ని మరచి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ప్రజలు వారిని బ్రిటిష్ సామ్రాజ్యపు అణచివేత ఆనవాళ్లుగా భావించే ప్రమాదం ఉందని, ఇది పౌర అశాంతికి దారితీస్తుందని హెచ్చరించింది.
పౌర హక్కులకు భంగం కలిగించే అక్రమాలను సరిదిద్దే క్రమంలో, బాధితులకు పరిహారం అందించడానికి న్యాయస్థానాలు ఇలాంటి కఠినమైన ఉత్తర్వులు జారీ చేయక తప్పదని పేర్కొంది. 
గౌతమ్ బుద్ధ నగర్ కలెక్టర్ వ్యవహార శైలిపై ధర్మాసనం ఆగ్రహం..
ఎన్ఎస్ఏ నిర్బంధ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపామ్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా నిరసించింది.
పోలీసు నివేదికలో కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నప్పుడు, బలమైన ఆధారాలు లేకపోతే, అంతటి కఠినమైన ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించవచ్చో లేదో కలెక్టర్ సమగ్రంగా పరిశీలించి ఉండాల్సిందని తెలిపింది.
ఆకృతి చౌదరి ఎటువంటి నేరచరిత్ర లేని ఒక సాధారణ విద్యార్థిని, సామాజిక కార్యకర్త అని, ఆమె హింసను ప్రేరేపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
జిల్లా మేజిస్ట్రేట్ ప్రవర్తన ‘హేయమైనది’గా అభివర్ణించింది. కార్మికులకు మద్దతుగా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడే ప్రాథమిక హక్కును ఇతరులు ఉపయోగించకుండా భయపెట్టడానికే, చౌదరిని ఒక ఉదాహరణగా చూపాలని జిల్లా మేజిస్ట్రేట్ భావించినట్లు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
పోలీసు కేసులో వ్యత్యాసాలు..
ఆకృతి చౌదరి అరెస్టుకు సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలను కోర్టు గుర్తించింది. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద 2026 ఏప్రిల్ 11 సాయంత్రం 5:30 గంటలకు తనను అదుపులోకి తీసుకున్నారని ఆమె పేర్కొనగా, ఏప్రిల్ 12న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంచి ప్రవర్తన పూచీకత్తు కోసం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 130 కింద ఇచ్చిన నోటీసును పోలీసులు సమర్పించారు.
అయితే, ఆ నోటీసులో జనరల్ డైరీ(జీడీ) నంబర్ 37 అని ఉంది, అది ఏప్రిల్ 12 ఉదయం 10:20 గంటలకు నమోదైంది.
అరెస్టుకు ముందే నోటీసు తయారు చేసి ఉంటే, అందులో అరెస్టు తర్వాత వచ్చే జీడీ నంబర్ ఎలా ఉంటుందని జస్టిస్ అచల్ సచ్దేవ్ ప్రశ్నించారు.
ఈ పరిశీలనతో ఏకీభవిస్తూ జస్టిస్ శ్రీధరన్ రాసిన ఉత్తర్వుల్లో, “బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 130 నోటీసులో జీడీ నంబర్‌ను పేర్కొనడం బట్టి, పిటిషనర్‌ను అప్పటికే అరెస్టు చేశారని, ఆ తర్వాత నోటీసు ఇవ్వడం కేవలం ఒక డ్రామా అని తేలిపోతోంది” అని పేర్కొన్నారు.
అందుకే ఆ నోటీసుపై సమయం నమోదు చేయలేదని, అది కావాలని చేసిన పొరపాటేనని తెలిపారు.
వాట్సాప్ చాట్లలో హింసను ప్రేరేపించినట్లు ఆధారాలు లేవు..
గౌతమ్ బుద్ధ నగర్లో కార్మికుల ఆందోళన సందర్భంగా చౌదరి, ఆమె సహచరులు హింసను ప్రేరేపించడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు.
అయితే, పోలీసులు సమర్పించిన వాట్సాప్ సంభాషణలు, వీడియోలను పరిశీలించిన ధర్మాసనం ‘చౌదరి ఎక్కడైనా అల్లర్లు, దహనకాండ లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించినట్లు ఉన్న ఒకే ఒక్క సందేశాన్ని లేదా వీడియో క్లిప్‌ను చూపించాలని’ ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ప్రభుత్వం అలాంటి ఆధారాలేవీ చూపలేకపోయింది.
వీడియోల్లో ప్రజలు ఎక్కువ వేతనాలు, సరైన పని వేళల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్లు మాత్రమే ఉందని, అక్కడ ఎలాంటి ఆయుధాలు కానీ, హింస కానీ లేవని కోర్టు గమనించింది.
ఎన్ఎస్ఏ నిర్బంధాలపై హైకోర్టు స్పష్టత..
జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించడం అనేది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరగాలని, దాన్ని సాధారణ క్రిమినల్ చట్టానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదని కోర్టు తెలిపింది.
ఈ కేసులో నిర్బంధానికి చూపిన కారణాలు అంచనాలు, అభిప్రాయాల ఆధారంగానే ఉన్నాయని, వాటికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
కేవలం ఆరోపణలు, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా పౌరుల స్వేచ్ఛను హరించే అత్యవసర అధికారాలను ప్రయోగించకూడదని హెచ్చరించింది.
శాంతియుత కార్మిక నిరసన రాజ్యాంగ హక్కు..
ప్రజలు వీధుల్లోకి వచ్చి, శాంతియుతంగా సమావేశమై తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఊహాగానాలతో పౌరులను నిరసనల నుంచి అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
రాజ్యాంగం కల్పించిన ఉమ్మడి భావప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వాల వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాలరాయలేమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి చౌదరి రాజ్యాంగ హక్కులను కాలరాసినందుకు గాను రూ 5 లక్షల పరిహారం సరైనదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మొత్తాన్ని గౌతమ్ బుద్ధ నగర్ కలెక్టర్, అలాగే ఎన్ఎస్ఏ నిర్బంధ నివేదికను తయారు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు ఉన్న సంబంధిత అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని ఆదేశించింది.
అంతేకాకుండా సంబంధిత కలెక్టర్, పోలీసు అధికారుల సర్వీస్ రికార్డుల్లో కోర్టు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తిని నమోదు చేయాలని స్పష్టం చేసింది.
అయితే, ఎన్ఎస్ఏ నిర్బంధ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినప్పటికీ, ఇతర క్రిమినల్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో పిటిషనర్ ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
అనువాదం: కె సత్యరంజన్
లైవ్ లా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
