వ్యవస్థలు- సంస్థలలో అవినీతి ఎక్కువైపోపోయింది. అక్రమాలను, అవినీతిని ప్రభుత్వాలు అదుపుచేయకపోవడంతో అక్రమార్కులకు, అవినీతిపరులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కొందరు ప్రబుద్ధులైతే అక్రమాలు, అవినీతి చేసి, క్యాసినోలాంటి ఆటలు ఆడి అప్పులు చేసి- అప్పుల నుంచి బయటపడడానికి గూండాగిరి చేసి చివరికి మేక తోలు కప్పుకొని రాజకీయ నాయకులుగా కూడా చెలామణి అవుతున్నారు. మరికొందరు తెరచాటున రాజకీయ నాయకులతో స్నేహం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.
ఇలా అవినీతి, అక్రమాలతో నిండిపోయిన సమాజంలో 2025 అక్టోబర్ 24న వేమూరి కావేరి బస్సు దుర్ఘటనలాంటివి జరుగుతూనే ఉంటాయి. సంపాదనే లక్ష్యంగా అనేక అక్రమాలకు పాల్పడి, 19మంది సజీవ దహనానికి బాధ్యుడైన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానిని హత్యా నేరం కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి. వేమూరి కావేరి బస్సు దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికరమైనది. ప్రమాదంలో చనిపోయినవారికి ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి.
బస్సు ప్రమాదానికి కారణాలను వెలికితీయడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ప్రభుత్వం విచారణ జరిపించాలి. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ఇతోదికంగా పారతోషికం చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
ప్రమాదం ఎలా జరిగింది?
1 బస్సులో పెద్ద మొత్తంలో సెల్ ఫోన్లు ఉన్నాయని, అవి పేలుడుకు దోహదపడ్డాయని ప్రాథమిక నివేదిక తెలియజేసింది. ప్రయాణికులను మాత్రమే చేరవేయాల్సిన బస్సులో వాణిజ్య సరుకులు, పేలుడుకు అవకాశమున్న వస్తువులను బస్సులో అనుమతించారు.
2 బస్సు కింది భాగానికి ఏవి వెళ్లకుండా నిరోధించడానికి సేఫ్టీ గార్డ్ ఉండాలని అగ్నిమాపక నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ ప్రమాదానికి గురైన బస్సుకు అలాంటి సేఫ్టీ గార్డ్లేని కారణంగా ద్విచక్ర వాహనం బస్సు కిందికి దూసుకు వెళ్లి ప్రమాదానికి కారణమైందనీ ప్రాథమిక నివేదికలో తేలిన మరొక అంశం. ఆ బస్సుకే కాదు, దాదాపు ఏ భారీ వాహనానికి అలాంటి ఏర్పాట్లు లేవు.
3 ప్రమాదానికి గురైన బస్సు, కేవలం కూర్చోడానికి మాత్రమే అవకాశమున్న బస్సుగా అనుమతి తీసుకున్నట్టుగా రవాణాధికారులు ధ్రువీకరించారు. కానీ దానిని స్లీపర్ బస్సుగా మార్చడానికి అనుమతి పొందారా లేదానేది తమకు తెలియదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చెప్పినట్టుగా వివిధ వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి.
4 ఏసీ బస్సులన్నింటిలో అద్దాలు ముందుకు వెనుకకు జరపడానికి వీలు లేకుండా బిగించబడి ఉంటాయి. ప్రమాదకర పరిస్థితులలో అద్దాలను పగలగొట్టి ప్రయాణికులు బయటకు రావడానికి అనువుగా సుత్తిలాంటి పరికరాలు బస్సు లోపల అమర్చి, ప్రయాణికులకు ప్రమాదకర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియజేయాలి. కానీ ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సులో అలాంటి పరికరాలు లేవని, ఫలితంగా ప్రయాణికులు వెంటనే అద్దాలు పగలగొట్టుకుని బయటకు రాలేకపోయారని వార్తల్లో వచ్చింది.
వివిధ వార్తా కథనాల ప్రకారం, ప్రమాదానికి గురై ఆగి ఉన్న వేమూరి కావేరి బస్సులో పొగలు రావడం చూసి ఆ మార్గంలో వెళ్తున్న కొందరు యువకులు తమ కారును ఆపారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక రాయితో అద్దాలు పగలగొట్టి, కొంతమంది ప్రయాణికులు బయటకు వచ్చేందుకు సహాయపడ్డారు. యువకుల బృందం సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు అత్యంత అభినందనీయం. వారిని మొత్తం దేశానికి పరిచయం చేసి అభినందించాలి. కానీ విచారకరమైన విషయమేంటంటే ఈ కనీస స్పృహ ప్రభుత్వానికి లేదు.
5 లగేజి క్యాబిన్ మీది బెర్త్‌లలో పడుకున్న ప్రయాణికులే ఎక్కువ మంది చనిపోయినట్లుగా కూడా వివిధ వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి.
వీటన్నింటిని పరిశీలిస్తే బస్సులు చాలా లోపాలున్నాయని అర్థమవుతోంది. ఈ విధంగా నిర్లక్ష్యానికి, అక్రమాలకు పాల్పడిన వేమూరి కావేరి బస్సు యజమాని ఈ ప్రమాదంలో ప్రథమ ముద్దాయి. చట్ట నిబంధనలు, రక్షణ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండవ ముద్దాయి.
ఇలా జరగడానికి కారణాలేంటి?
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాల మీద ఆంక్షలు విధించడం, తనిఖీలు చేయడం పనికిరాదు. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనేది నేటి ప్రభుత్వ నీతిగా మారింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ప్రభుత్వాలు తాము నిర్వహించాల్సిన, ప్రజలకు బాధ్యత వహించాల్సిన కర్తవ్యాలను సమాధి చేయడం నేడు సర్వత్ర మనం చూస్తున్నాం.
వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దానానికి కారణమైన బస్సు యజమానిని హత్యా నేరం కింద అరెస్టు చేసి జైలుకు పంపాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. కారణమేంటంటే, పైన చెప్పినట్టుగా ప్రైవేటు యాజమాన్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛ కల్పించాలనే విధానంలో భాగంగానే ఇది జరిగింది.
మరోవైపు, ఒక వస్తువు దొంగలించబడిందని ఫిర్యాదందిన వెంటనే పోలీసులు స్పందించి ఒక పేదవాడినో, దళితుడినో లేదా ముస్లింనో అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీతో చిత్రహింసలు పెడుతున్నారు. మరీ ఇంతమంది చావుకు కారణమైన వారిని ఎందుకు వదిలిపెడుతున్నారు? చట్టం అందరికి ఒకటి కాదా? ఒకరికి చట్టం మరొకరికి చుట్టమా? అనే సందేహాలు వస్తున్నాయి.
అయితే, తమ ప్రభుత్వ విధానాలలో భాగంగా 2019 సంవత్సరంలో మోటారు వాహనాల చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఆ సవరణ ప్రధాన లక్ష్యం దేశంలోని మొత్తం రోడ్డు రవాణా(ఆటో, టాక్సీ, బస్సు, లారీ వగైరాలన్నింటినీ) పెద్ద కార్పోరేట్ కంపెనీలకు అప్పగించటం. ఈ లక్ష్యంతోనే కొత్తగా “అగ్రిగేటర్”అనే సెక్షన్‌ను చట్టంలో చేర్చారు.
టూరిస్ట్, కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ నిబంధనలను రద్దుచేసి అన్నిటినీ కలిపి “ట్రాన్స్పోర్ట్ పర్మిట్”గా చట్టంలో మరొక సవరణ చేశారు. అలాగే ఆర్టీసీలకి సమాధి కట్టి, ప్రైవేట్వారిని ప్రోత్సహించేందుకు కొన్ని సెక్షన్లు అదనంగా చేర్చారు. తదనంతరం 2021లో ఒకే దేశం ఒకే చట్టం నినాదంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం “నేషనల్ పర్మిట్ సిస్టం”ప్రవేశపెట్టింది.
నేషనల్ పర్మిట్ విధానం ప్రకారం, ప్రైవేట్ బస్సు యజమానులు కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయల పన్ను చెల్లించి నేషనల్ పర్మిట్ తీసుకోవచ్చు. విడివిడిగా ప్రయాణికులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా రవాణా చేయవచ్చు.
నేషనల్ పర్మిట్ తీసుకున్న బస్సు యజమాని ఆ వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి మోటార్ వాహనాల పన్ను చెల్లించాలి. దీంతో ప్రైవేట్ బస్సు యజమానులు ఎంవీ ట్యాక్స్ ఎక్కడ తక్కువ ఉంటే ఆ రాష్ట్రంలో బస్సును రిజిస్టర్ చేసుకొని, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలలోనీ ప్రధాన మార్గాలలో విచ్చలవిడిగా బస్సులను తిప్పుతున్నారు.
బస్సు తిరిగే రాష్ట్రంలో పన్ను చెల్లించడం లేదు కాబట్టి, పర్మిట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి; నిబంధనలు- తనిఖీలు తమకు సంబంధం లేదని ఆయా రాష్ట్రాలలోని అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సేవలు..
ముఖ్యవిషయమేంటంటే, బస్సు ప్రమాదం జరిగినప్పుడు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించి భారీ ప్రమాదం జరగడానికి కారణం లగేజీ క్యారియర్‌లో 400 సెల్ ఫోన్లను అనుమతించడమే. దీంతో మండే స్వభావ బ్యాటరీల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ప్రయాణికుల వద్ద మండే స్వభావ లగేజ్‌ను కూడా అనుమతించకూడదనే నిబంధన ఉన్నది. కానీ లాభాలే పరమావధిగా భావించే యజమానులు, చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘించి- వీటిని అనుమతించిన ఫలితంగా జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం గరిష్ట స్థాయికి చేరుకున్నది.
8 గంటలకు మించి డ్రైవర్లు పనిచేయడానికి అనుమతించకూడదని, ప్రతి ఐదు గంటల డ్రైవింగ్ తర్వాత అరగంట విశ్రాంతి ఉండాలని మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం- 1961 నిర్దేశిస్తున్నది. దీనిని కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడిచి, పని గంటలు పెంచే విధంగా లేబర్ కోడ్స్ రూపొందించింది. అతనికంటే ఘనుడు ఆ చంటి మల్లననే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ ఇటీవలే శాసనసభలో చట్ట సవరణ కూడా చేసింది.
అనుభవం, అర్హత లేని డ్రైవర్లకు బస్సులను అప్పజెప్పి ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలాగా వదిలేశారు.
డ్రైవర్లకు ఎలాంటి శిక్షణ ఉండదు. వేగ నియంత్రణ నిబంధనను తుంగలో తొక్కి, వాయువేగంతో ప్రైవేటు బస్సులు రోడ్లపై వెళ్తుంటాయి. వాహన పరిస్థితి పట్ల అధికారులకు ఎలాంటి శ్రద్ధ కూడా ఉండదు.
ప్రస్తుత ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ప్రైవేట్ బస్సు తనిఖీలో 16 ఈ చలాన్లు, 23,120 జరిమానా పెండింగ్‌లో ఉండడమనేది వీరి అక్రమ పద్ధతులకు పరాకాష్ట అని నిరూపించబడింది. ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పులను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యజమానులు నిబంధనలను పాతర పెట్టీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వెరసి నేడు జరుగుతోన్న బస్సు ప్రమాదాలు, ప్రయాణికుల మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ముద్దాయిలు.
2025 అక్టోబర్ 15న రాజస్తాన్‌లోని జైసల్మేర్ ప్రమాదంలో 21మంది సజీవ దహనమైనారు. రెండు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఒక ప్రైవేటు బస్సు తగలబడిన ఘటనలో 25మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 12 ఏళ్ల క్రితం మహబూబ్ న గర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బర్ ట్రావెల్స్ ఘోర దుర్ఘటనలో 45మంది సజీవ దహనమయ్యారు. ఆ కోవలోనిదే ఈ ప్రమాదం కూడా.
ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడల్లా తాత్కాలికంగా ప్రభుత్వాలు హడావిడి చేయడం షరామాములే. తర్వాత ఏ చర్యలు ఉండవనేది మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కలసి ప్రైవేటు బస్సు యజమానులకు ఆయుధాలుగా మారి కర్నూలు ప్రమాద సంఘటనలాంటి ఘోర దురాగతాలకు దారితీసి మృత్యుకేలికి కారణమవుతున్నాయి.
మీడియా పాత్ర..
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా మొదటగా డ్రైవర్‌ను దోషిగా నిలబెట్టి, ప్రభుత్వ- యాజమాన్య వైఫల్యాలను కప్పిపుచ్చే విధంగా నేటి ప్రధాన మీడియా వ్యవహరిస్తున్నది. నిజంగా డ్రైవర్ తప్పిదం ఉన్నదా లేదా అసలు ప్రమాదానికి దారి తీసిన ప్రధానమైన కారణాలు, వైఫల్యాలు ఏమిటనే విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగిన రోజు, ఆ తర్వాత ఒకటి రెండు రోజులు తామే ఛాంపియనేట్టుగా ప్రజలను నమ్మించడానికి కొన్ని వార్తా సంస్థలు పెద్ద ఎత్తున విశ్లేషణలు, వార్తా కథనాలను వెల్లువెత్తించి చేతులు దులుపుకుంటున్నాయి. కానీ నిరంతరం అందులో లోపాలను ఎత్తిచూపి, ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది, అక్రమాలను అరికట్టి, బాధ్యులను శిక్షించే వరకు ప్రజలను చైతన్యవంతం చేసే పాత్ర నేటి ప్రధాన మీడియా పోషించకపోవడం అత్యంత సోచనీయం.
భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కనీస ప్రణాళికలు ఏమిటి?
ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేషనల్ పర్మిట్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకొని ఆయా రాష్ట్రాలలోనీ ఆర్టీసీలకు వాటిని అప్పజెప్పాలి. ప్రయాణికుల క్షేమానికి, సౌకర్యాలకు, జవాబుదారీతనానికి మారుపేరుగా నిలచిన ఆర్టీసీలను బలోపేతం చేయాలి. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి. రవాణా, ఆర్టీసీ అధికారులతో పాటు పాలనా, సాంకేతిక, సేఫ్టీ నిపుణులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో సేఫ్టీ కమిటీ నియామకం చేయాలి.
అంతేకాకుండా, ప్రైవేట్ బస్సు యజమానులతో ఎలాంటి సంబంధాలు లేని ప్రయాణికులకు ప్రాతినిధ్యం వహించే సంఘాల వారిని కూడా ఈ కమిటీలో చేర్చాలి. తక్షణం ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులను క్షుణ్ణంగా పరీక్షించాలి. నివేదిక ఆధారంగా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను చిత్తశుద్ధితో, పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలి. ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వము ప్రజల ప్రాణాలను కాపాడాలి.
సరియైన విధానాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు జరిపే విధంగా- కార్మికులు, ప్రయాణికులు, ప్రజలు, ప్రజా సంఘాలు కదలి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేట్ యజమానుల అక్రమాల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి. అప్పుడే ప్రజల ప్రాణాలకు భద్రత చేకూరుతుంది.
(వ్యాస రచయిత ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పూర్వ కోశాధికారి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
