భారతదేశంలో ముస్లిం సమాజం చాలా కాలంగా ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారిపై ఆరోపణలు వస్తాయి. వారు వివరణ ఇవ్వాలి. వారిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. వారు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి.
ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎప్పుడో జరిగిన చరిత్రకు, మరెక్కడో జరిగిన నేరానికి కూడా భారతీయ ముస్లింలను సమాధానం చెప్పమంటారు.
పాకిస్తాన్ ఏజెంట్లు. బంగ్లాదేశీయులు. రోహింగ్యాలు. లవ్ జిహాద్. ల్యాండ్ జిహాద్. బీఫ్. హలాల్. హిజాబ్. సీఏఏ. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్. మార్కజ్. ఇలా ఆరోపణల జాబితాకు అంతం ఉండదు.
ఈ రకం నైతిక దాడులకు ముస్లిం సమాజం ఇచ్చిన సమాధానం ఎక్కువగా రక్షణాత్మకంగానే ఉంది. ఆరోపణలకు వివరణ. అనుమానాలకు ఖండన. దూషణకు మౌనం.
జెన్-జీ ఉద్యమం తెచ్చిన కొత్త ఆశ
అయితే, 2026లో పురివిప్పిన జెన్-జీ, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని విద్యార్థి యువజన ఉద్యమం, ఈ రాజకీయ సంభాషణలో ఒక కొత్త మలుపును చూపించింది. అది ముస్లింల ఉద్యమం కాదు. అయితే ముస్లింలకు అది ఎందుకు ఆశ కలిగించింది? అదే ఈరోజు అసలు ప్రశ్న.
రక్షణాత్మక స్థితి నుంచి ప్రతిస్పందన వరకు
భారతీయ ముస్లిం సమాజం మీద సాగుతున్న దుష్ప్రచారం కొత్తది కాదు. అయితే సోషల్ మీడియా యుగంలో దాని వేగం పెరిగింది.
ఒక ఆరోపణను వందసార్లు చెబితే అది “నిజం”లా కనిపిస్తుంది. ఇదే పోస్ట్-ట్రూత్ రాజకీయాల ప్రమాదం. మార్కజ్ సమావేశాన్ని “కోవిడ్ జిహాద్”గా చిత్రీకరించిన సందర్భం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక సంఘటనతో ఒక సమాజాన్ని మొత్తంగా అనుమానాస్పదంగా చిత్రీకరించడం ఎంత ప్రమాదకరమో ఆ అనుభవం చూపించింది.
బీఫ్ విషయంలోనూ అదే జరుగుతోంది. మాంసాహారం తినడం ఒక మతాచారంగానూ శాకాహారం మాత్రమే తినడం మరో మతాచారంగానూ సరళీకరించి ప్రచారం చేస్తున్నారు.
భారత సమాజంలోని వాస్తవ వైవిధ్యాన్ని కప్పిపుచ్చుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని “వాళ్ళు శ్రావణ మాసంలో మటన్ తింటూ ఇతరుల మనోభావాలను గాయపరుస్తున్నారు” అంటే ఏం చేయాలి?
హిందూ సమాజంలో అత్యధికులు మాంసాహారులనే వాస్తవం ఎక్కడ తలదాచుకోవాలి. ఇటీవల జరిగిన బ్రిక్స్ అధికార సమావేశం మంటపంలో 21 దేశాధినేతలకు శాకాహారాన్ని వడ్డించి భారత ఆహార సాంప్రదాయం శాకాహారమని ఒక సంకేతాన్ని ఇచ్చారు.
హిందువులందరూ మాంసాహారం మానేస్తే మార్కెట్ క్రాష్ అయ్యి చికెన్, మటన్ ధరలు కూరగాయల ధరలతో సమానమైపోవా? బీఫ్ నిందలు మోయలేక ముస్లింలు దాన్ని త్యజించారు.
ఆవును జాతీయ పశువుగా ప్రకటించమని సూచించారు. ప్రభుత్వం ఆ పని చేయగలుగుతుందా? బీఫ్ ఎగుమతుల్లో ఇండియాది అగ్రస్థానం, ఇండియాలో ఉత్తరప్రదేశ్‌ది అగ్రస్థానం.
అంతేకాదు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి భారీ విరాళాలు ఇచ్చినవారిలో బీఫ్ ఎక్స్‌పోర్టర్లు ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
లవ్ జిహాద్ వంటి ఆరోపణలు కూడా ఈ రకమైన నేరేటివ్స్నే ప్రచారంలో పెడుతున్నాయి. ముస్లిం యువకుడు అంటే అనుమానం, ముస్లిం వ్యాపారి అంటే అనుమానం, ముస్లిం పౌరుడు అంటే అనుమానం. వాళ్లందరూ ముందుగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.
ముస్లిం సమాజంపై కొనసాగుతున్న దాడులు
రైల్లో, బస్సుల్లో, విమానాల్లో, రోడ్ల మీద, ఉత్సవాల్లో లేదా ఇంట్లో దూరి ఎవరైనా ఎక్కడైనా ముస్లింల మెడపట్టుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బెదిరించవచ్చు.
మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు వాటితో లించింగ్ ముఠాలకు పనిలేదు.
ముస్లింలు బీఫ్ తినడం మానేస్తామన్నా ఈ వివాదాలు ఆగడంలేదు. హిందూత్వ ప్రేమికులే ఆవుల్ని కోసి ఆ నేరాన్ని ముస్లింల మీద మోపుతున్నారు.
తమ చెల్లెళ్ళను ముస్లిం యువకులను ఆకర్షించమని ఆదేశించి లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు. కథ ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి చేరింది?
ఈ వాతావరణంలో ముస్లిం సమాజం సహజంగానే డిఫెన్స్‌లోకి వెళ్లింది, అంతర్ముఖంగా మారిపోయింది. ముస్లింలను సమర్థించడానికి విపక్షాలు కూడ జంకాయి. హిందూ ఓట్ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేస్తుందని భయపడ్డాయి. ఈలోగా, దేశంలో జెన్-జీ రాజకీయ సంస్కృతి రంగప్రవేశం చేసింది. అది కొత్త ప్రశ్నలు సంధించి కొత్త సమాధానాలు కోరింది.
అవమానాన్ని ఆయుధంగా మార్చిన జెన్-జీ
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఒక రాజకీయ పార్టీగా సంప్రదాయ అర్థంలో పుట్టలేదు. వ్యంగ్యంతో, సోషల్ మీడియా సంస్కృతితో ప్రారంభమైంది.
పరీక్షలలో అక్రమాలు, నీట్-యూజీ వివాదాలు, యువత ఉద్యోగ–విద్యా భద్రత వంటి అంశాలను చేపట్టి పెద్ద నిరసనోద్యమంగా మారింది.
జంతర్ మంతర్‌లో జరిగిన దీర్ఘకాలిక నిరసన చివరకు జాతీయ స్థాయి చర్చగా మారింది. 2026 జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. “బొద్దింకలు గెలిచాయి, ప్రజాస్వామ్యం గెలిచింది.”
ఆసక్తికరమైన రాజకీయ మార్పు ఏంటంటే, ఎవరినైనా “బొద్దింక” అని తక్కువ చేసి మాట్లాడితే తను తనను తాను సమర్థించుకోవడమే కాదు; “అవును, నేను బొద్దింకనే, నన్ను చంపలేరు” అని చెపుతున్నాడు.
అవమానాన్ని ప్రతిఘటనగా మార్చడం. ఇది జెన్-జీ రాజకీయ భాషలోని ఒక ముఖ్యమైన లక్షణం. అభిజిత్ దీప్కే కొత్త అధ్యాయానికి తెర తీశాడు.
పౌర సమాజాన్ని ఆవరించిన భయాన్ని తన్ని తరిమేశాడు దళితుడు నేటి హీరోగా మారాడు. సింహాసనం వణికింది.
మీడియా మారింది, ప్రేక్షకుడు కూడా మారాడు
ఇప్పటివరకు ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తిచేసే శక్తి పెద్ద మీడియా సంస్థల చేతుల్లో ఉండేది. ఆ మీడియా సంస్థలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మెలిగేవి.
వాచ్ డాగ్‌లు లాప్ డాగ్‌లు అయిపోయాయి. దీనికి అనువాదం గోదీ మీడియా. సాధారణ ప్రజానీకం దీన్ని మోదీ మీడియా అనుకుంటున్నారు.
మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే భారీ ప్రచురణ సంస్థలు భారీ టెలివిజన్ స్టూడియో సెట్టింగులు పేరు మోసిన సంపాదకులు ఆకాశం అంత ఎత్తున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ సెటప్ అంతా పోయింది.
ప్రతి మొబైల్ ఫోన్ ఒక చిన్న మీడియా సంస్థగా మారిపోయింది. ప్రతి ప్రత్యక్ష ప్రసారం ఒక ప్రత్యామ్నాయ వార్తా వేదిక. ప్రతి రీల్ ఒక రాజకీయ పోస్టర్. ప్రతి మీమ్ ఒక వ్యంగ్య సంపాదకీయంగా మారిపోతోంది.
అరచేతిలో మీడియా. ఒక సభకు లక్షమంది వస్తే లక్ష ప్రత్యక్ష ప్రసారాలు జరిగిపోతున్నాయి. వీటి మధ్య మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఊపిరి ఆడడంలేదు. కాక్రోచ్ ఉద్యమంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
బొద్దింకల ఉద్యమం సాంప్రదాయ కేడర్ నిర్మాణం లేకుండానే వాలంటీర్ల నెట్వర్క్ ద్వారా కొనసాగుతోంది. వ్యవస్థీకృత రాజకీయ పార్టీలకు ఇది ఒక పెద్ద ప్రశ్న.
కేడర్ లేకుండా ఉద్యమం ఎలా సాగుతుంది? సమాధానం—నెట్వర్క్. ఇది నాయకుడి ఆదేశం కోసం వేచి ఉండే కేడర్ కాదు. ఒకే లక్ష్యంతో స్వచ్ఛందంగా కలిసే పౌరులు. ఇదే జెన్-జీ రాజకీయ శైలికి ప్రత్యేకత.
ముస్లింలకు ఇందులో కనిపించిన ఆశ
ముస్లిం పౌర సమాజం బొద్దింకల ఉద్యమాన్ని ప్రత్యేకంగా గమనించింది. సీఏఏ-ఎన్ఆర్సీ-ఎన్పీఆర్ వ్యతిరేక షాహీన్ బాగ్ ఉద్యమంలో ముస్లింలు ముందున్నారు. అప్పుడు వాళ్ళను “పాకిస్తానీయులు” అని నిందించారు.
రైతు ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో కనిపించారు. వారిని “ఖలిస్తానీలు” అని నిందించారు. ముస్లింలు, సిక్కులకు విజిబిలిటీ ఎక్కువ. ఎక్కడున్నా ప్రస్ఫుటంగా కనిపించిపోతారు. గత రెండు అనుభవాలు ఒక పాఠాన్ని నేర్పాయి:
ఒక ఉద్యమంలో ఒక సమూహం ఎక్కువగా కనిపిస్తే, ఆ సమూహాన్నే దేశానికి కుట్రదారులుగా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే కాక్రోచ్ ఉద్యమం విషయంలో కొన్ని ముస్లిం సంస్థలు వ్యూహాత్మకంగా దూరంగా ఉండాలని భావించాయి.
ముస్లింలు పెద్ద సంఖ్యలో కనిపిస్తే మొత్తం ఉద్యమాన్నే “టోపీ వాలాల” లేదా “పాకిస్తాన్ కుట్రదారులు”గా చిత్రీకరించే ప్రమాదం లేకపోలేదు.
అయితే, నిందలొస్తాయని ఒక సామాజిక ఉద్యమానికి పూర్తిగా దూరంగా ఉండిపోవడమూ న్యాయం కాదు.
అనేక ముస్లిం సంస్థలు, వ్యక్తులు గుప్తంగా ఉంటూ నిరసనకారులకు మంచినీరు, ఆహారం, ఇతర సహాయాలను అందించాయి.
కొంతమంది ముస్లిం యువకులు ప్రత్యక్ష వాలంటీర్లుగా కూడా పనిచేశారు. అంటే ఒక కొత్త రాజకీయ పద్ధతిని వాళ్ళు రూపొందించారు.
కర్ణాటకకు చెందిన ఆఫ్రీన్ నవాజ్ సీజేపీలో క్రియాశీల పాత్ర వహించారు. ఆమె సీజేపీ కోర్ టీమ్ సభ్యురాలు, ఆ పార్టీకి జాతీయ కార్యదర్శి. ఘాజియాబాద్‌కు చెందిన ముహమ్మద్ జునైద్ జంతర్ మంతర్ క్యాంపులో ప్రధాన వాలంటీర్‌గా పనిచేశాడు.
ముందుండి నడిపించడం మాత్రమే నాయకత్వం కాదు. అవసరమైనప్పుడు వెనుకవుండి ఉద్యమానికి అండగా నిలబడటం కూడా పౌర నాయకత్వమే.
“ముస్లిం సమస్య” నుంచి “ప్రజల సమస్య” వైపు
ఇక్కడ ముస్లిం పౌర సమాజం ఒక పెద్ద రాజకీయ పాఠాన్ని నేర్చుకున్నది అనుకోవచ్చు. కేవలం ముస్లింల సమస్యల మీద ఉద్యమిస్తే వాటికి పరిమిత మద్దతు మాత్రమే లభిస్తుంది.
విద్య ఎవరి సమస్య? ముస్లింలది మాత్రమేనా? కాదు. నిరుద్యోగం ఎవరి సమస్య? ముస్లింలది మాత్రమేనా? కాదు.
పరీక్షా పేపర్ల లీక్ హిందూ విద్యార్థులకూ, ముస్లిం విద్యార్థులకూ ఒకే సమస్య. ప్రభుత్వ పాఠశాలల మూసివేత హిందూ పిల్లలకూ, ముస్లిం పిల్లలకు ఉమ్మడి సమస్య. ప్రభుత్వ వైద్యసేవల కొరత హిందువుకూ, ముస్లింకూ ఒకే సమస్య.
ఆర్థిక అసమానతకు మతం ఉండదు. నిరుద్యోగ యువకుల నిరాశకు మతం ఉండదు. అందుకే ముస్లిం పౌర సమాజం తన ప్రత్యేక సమస్యలపై మాట్లాడటంతో పాటు, దేశంలోని సాధారణ ప్రజల సమస్యలపై కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. దాన్ని ఆ సమాజం గుర్తించింది కూడ.
సాధారణ సమస్యలు ప్రజలందరి కోసం, ప్రత్యేక సమస్యలు ముస్లింల కోసం. ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాడినపుడే వాటిల్లో భాగంగా ముస్లింల ప్రత్యేక సమస్యలు కూడ పరిష్కారం అవుతాయి. ఈ రెండు మార్గాలు పరస్పర విరుద్ధాలు కావు.
అసలు ప్రమాదం ఎక్కడుంది?
భారతదేశంలో మతపరమైన విభజనకు మరో కారణం ఆర్థిక అసమానత కూడా కావచ్చు. ప్రజలకు ఉద్యోగాలు లేవు. విద్య ఖరీదవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ప్రశ్నలు ఉన్నాయి. వైద్యం సామాన్య కుటుంబానికి భారమవుతోంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. ఇలాంటి సమాజంలో అసంతృప్తి సహజం. ఆ అసంతృప్తి పాలకులపైకి మళ్ళవచ్చు. అక్కడే రాజకీయాల్లోని పాత కపట సూత్రం ముందుకు వస్తుంది. డివైడ్ అండ్ రూల్. విభజించి పాలించు.
ప్రజల్లో ఒక సమూహాన్ని మరో సమూహానికి శత్రువులుగా చూపించగలిగితే, వాళ్ళ మధ్య అనుమానం పెరుగుతుంది. ఒక సమూహం మరో సమూహాన్ని భయపెడుతుంది. ఇంకో సమూహం భయపడుతుంది. అప్పుడు అసలు ప్రశ్నలన్నీ మరుగున పడిపోతాయి.
ఉద్యోగం ఎక్కడ? విద్య ఎందుకు ఖరీదైంది? ఆరోగ్యం ఎందుకు అందుబాటులో లేదు? సంపద ఎందుకు కేంద్రీకృతమవుతోంది? ఈ ప్రశ్నల స్థానంలో మరో ప్రశ్న వస్తుంది: “వాళ్ళతో మనకు ముప్పు.” ఇదే మత రాజకీయాల పన్నాగం.
ఎన్నికల గణితం, సామాజిక భయం
భారతదేశంలో మెజారిటీ సమాజం రాజకీయంగా అత్యంత ప్రధానమైన ఓటర్ సమూహం. అందువల్ల మెజారిటీ సమాజాన్ని సమీకరించే రాజకీయ వ్యూహానికి మతపరమైన గుర్తింపు ఉపయోగపడవచ్చు. కానీ దీనికి ఒక వ్యతిరేక నిజం కూడా ఉంది.
హిందూ సమాజం ఏకశిల వంటి రాజకీయ సమూహం కాదు. కులం, ప్రాంతం, వర్గం, భాష, ఆర్థిక స్థితి, విద్య, వృత్తి— అనేక భేదాలు ఉన్నాయి. అందువల్ల “ముస్లింల వల్ల హిందువులకు ప్రమాదం” అనే సరళమైన కథనం, ఆర్థిక–సామాజిక సమస్యలన్నింటినీ పరిష్కరించదు.
14 శాతం జనాభా 80 శాతం జనాభాను ఆక్రమించబోతోందనే భయం సాధారణ గణితానికి సరిపోదు.
అయితే రాజకీయాల్లో గణితం ఒక్కటే పనిచేయదు. భయం కూడా పనిచేస్తుంది. అదే పోస్ట్-ట్రూత్ రాజకీయాల ప్రమాదం.
హిందువు ప్రమాదంలో ఉన్నాడు అంటే చాలు. ఒక మాటను పదిసార్లు చెప్పడం ద్వారా దాన్ని నిజంగా మార్చలేము. కానీ అది నిజమని నమ్మించే అవకాశం మాత్రం పెరుగుతుంది.
ప్రతిస్పందనలో కొత్త భాష
ఇప్పటివరకు ముస్లింలను “పాకిస్తాన్ వాలా” అంటే వారు తమ దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు జెన్-జీ శైలిలో ప్రతిస్పందన మారుతోంది.
“పాకిస్తాన్ వాలా” అంటే— “కాదు, నేను భారతీయుడిని. నీ ఆరోపణకు నేను ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి?” “ముందు ఇది చెప్పు; పాకిస్తాన్ వెళ్ళి బిర్యానీ తిని వచ్చింది ఎవరో తేల్చు” అంటున్నారు.
“పంక్చర్ వాలా” అంటే— “అవును, నేను పంక్చర్ వాలానే. నీ బూటకపు రాజకీయ ఇమేజ్‌కు పంక్చర్ వేయడానికి వచ్చాను.” “తాలా వాలా” అంటే— “అవును. నీ నోటికి తాళం వేయడానికి, నీ అబద్ధాలకు తాళం వేయడానికి వచ్చాను.”
ఇది కేవలం మాటల ఆట కాదు. ఇది మానసిక స్థితిలో మార్పు. ఆత్మగౌరవం ఏపుగా వికసిస్తున్న సంకేతం. రక్షణాత్మక రాజకీయాల నుంచి హక్కుల సాధన దిశగా పయనం. ఇదే రూపాంతర ప్రక్రియ. జెన్-జీ ఉద్యమం ముస్లిం పౌర సమాజానికి ఇచ్చిన వరం.
ఒక జాగ్రత్త అవసరం
అయితే ఏ ఉద్యమాన్నీ రొమాంటిక్‌గా చూడటం సరైంది కాదు. జెన్-జీ ఉద్యమానికి కూడా పరిమితులు ఉన్నాయి.
యువతలో ఉత్సాహం ఎక్కువ. సంస్థాగత నిర్మాణం తక్కువ కావచ్చు. సోషల్ మీడియా వేగంగా ప్రజలను సమీకరించగలదు. అదే వేగంతో ప్రజలను విడదీయగలదు. మీమ్ ఒక రోజులో వైరల్ అవుతుంది. కానీ ప్రజాస్వామ్య సంస్థను నిర్మించడానికి సంవత్సరాలు పడతాయి. అందువల్ల ఒక నిరసన విజయాన్ని అంతిమ రాజకీయ పరిష్కారం అనుకోవడం సరికాదు.
అయితే ఒక విషయం మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. యువతను నిర్లక్ష్యం చేయడం ఇక అంత సులువు కాదు. యువతరం గొంతును ప్రభుత్వం కూడా ఆలకించక తప్పలేదు. సింహాసనం కదిలింది.
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభంలో అది ఒక వ్యంగ్య సోషల్ మీడియా ప్రయోగంలా కనిపించింది. తరువాత అది జంతర్ మంతర్ నిరసనగా మారింది. ఆపై కేంద్ర ప్రభుత్వంతో చర్చల స్థాయికి చేరింది.
జూలై 20న కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్యమ ప్రతినిధులతో సమావేశమై, నిరసనకారులు తమ ఆందోళనను ముగించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని కోరారు. తరువాత చర్చలు కొనసాగాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఒక ప్రజాస్వామ్య పాఠం.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదైనాసరే, ప్రజా నిరసనను శాశ్వతంగా నిర్లక్ష్యం చేయజాలదు.
ముస్లిం పౌర సమాజానికి ఇప్పుడు ఏం చేయాలి?
ఇక్కడి నుంచి ముస్లిం పౌర సమాజం ముందుకు వెళ్లాల్సిన మార్గం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది— రక్షణాత్మక రాజకీయాలను తగ్గించాలి. రెండవది—ప్రతి ఆరోపణకు స్పందించడం అవసరం లేదు. ఏ ఆరోపణకు స్పందించాలో, ఏ ఆరోపణను విస్మరించాలో నిర్ణయించే రాజకీయ పరిపక్వత అవసరం. మూడవది—ముస్లింల సమస్యలను రాజ్యాంగ హక్కుల సమస్యలుగా ప్రస్తావించాలి. నాలుగవది—హిందూ, సిక్కు, క్రైస్తవ, దళిత, ఆదివాసీ, బీసీ, ఇతర ప్రజాసమూహాలతో పౌర ఐక్యతను పెంచాలి. ఐదవది—జెన్-జీ, జెన్-ఆల్ఫా తరాలతో సంభాషణ పెంచాలి. ముఖ్యంగా— ముస్లింల తరఫున మాత్రమే మాట్లాడే సమూహం నుండి ప్రజల తరఫున మాట్లాడే ముస్లిం పౌర సమాజంగా మారాలి. అదే దీర్ఘకాలిక పనితీరుకు కొలమానం.
కొత్త గొంతు
జెన్-జీ ఉద్యమం ముస్లింల సమస్యలను పరిష్కరించలేదు. ముస్లింలపై వివక్ష అంతరించిపోలేదు. మత విద్వేష రాజకీయాలు కూడా ముగియలేదు.
కానీ ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ముస్లింలపై ఏ ఆరోపణ చేసినా దేశం మొత్తం నమ్మేస్తుందనే అహంభావానికి ఇప్పుడు పగుళ్ళు పడ్డాయి.
ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త తరం ప్రశ్నిస్తోంది. “ఎందుకు?” “దానికి ఆధారం ఏమిటి?” “ఎవరు చెప్పారు?” “ఎందుకు మళ్లీ మళ్లీ ఇదే కథ చెబుతున్నారు?” అంటూ ఒక నిందను వంద ప్రశ్నలతో చుట్టుముడుతోంది.
ఇది చిన్న మార్పు కాదు. ప్రజాస్వామ్యంలో మొదటి తిరుగుబాటు చాలాసార్లు నినాదంతో ప్రారంభం కాదు; ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ముస్లిం పౌర సమాజానికి ఈ జెన్-జీ అనుభవం ఇచ్చే గొప్ప సందేశం కూడా అదే.
మౌనం రక్షణ కాదు. ప్రతిస్పందన అంటే ద్వేషం కాదు. సంఘీభావం అంటే మతాల మధ్య కొత్త గోడలు నిర్మించడం కాదు.
దేశంలోని ప్రతి పౌరుడి హక్కును తన హక్కుగా భావించడం. అందుకే ముస్లిం సమాజం ఇక కేవలం “మా మీద అన్యాయం జరుగుతోంది” అని మాత్రమే చెప్పకూడదు.
“ఎవరిపై అన్యాయం జరిగినా అది ప్రజాస్వామ్యానికి అన్యాయం” అని చెప్పాలి. అక్కడే ముస్లిం పౌర సమాజం ఒక రక్షణాత్మక సమూహం నుంచి చురుకైన ప్రజాస్వామ్య శక్తిగా మారుతుంది.
“జబ్ మోదీ డర్తా హై, హిందూ ముసల్మాన్ కర్తా హై” అని మనకు చాలాకాలంగా తెలుసు. ఆ మాటను బయటికి చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఇప్పుడా మాట దేశమంతా మార్మోగుతోంది. జెన్-జీ ఉద్యమం ఇచ్చిన కొత్త శక్తి ఇదే. కొత్త ధైర్యం ఇదే.
జెన్-జీ ఉద్యమం మార్క్సిస్టులకు, అంబేడ్కరిస్టులకు, ఫూలేయిస్టులకు, ఆదివాసులకు, ఇతర ఉనికివాద సమూహాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ శక్తులన్నీ కలవడం కొత్త పరిణామం.
కొత్త గొంతు లేచింది. అది కేవలం ముస్లిం గొంతు కాదు. అది ప్రశ్నించే భారతీయ పౌరుడి గొంతు. అందులో భాగం ముస్లిం గొంతు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
