ఈసీ పనితీరుపై ప్రశ్నలు పెరుగుతున్నా, మోడీ, షాల నుంచి చిన్న స్పందన కూడా లేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అతనికి గట్టి మద్దతు ఇవ్వటం ఆందోళన కలిగిస్తోంది.
అయితే జరిగిన అవినీతికి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కారణం కాదు. మొత్తం వ్యవస్థలోనే ఒక తీవ్రమైన అనారోగ్య సంస్కృతి వేళ్ళూనుకుపోయిందన్న విషయం స్పష్టమవుతోంది.
ప్రజాస్వామ్యంలో విశ్వాసమే మూలం
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండే సామాజిక అవగాహనకు విశ్వాసమే మూలం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, న్యాయం అందిస్తుందని, హక్కులను కాపాడుతుందని ఆశిస్తాం.
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది ప్రాథమికమైనది మాత్రమే కాదు, పవిత్రమైనది కూడా. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలించని ప్రభుత్వం వారి విశ్వాసాన్ని కోల్పోతుంది.
ముఖ్యంగా ప్రజల ఓటు హక్కును లాక్కున్నా, లేదా తారుమారు చేసినా విశ్వాసమనేది తుడిచిపెట్టుకుపోతుంది.
పరస్పర నమ్మకం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సామాజిక బంధం తెగిపోయిందని అర్థం.
ప్రజల విశ్వాసం లేకుండా నడిచే ఏ ప్రభుత్వమైనా పరిపాలించే నైతిక హక్కును కోల్పోతుంది. ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ మునుపెన్నడూ ఇలా ఓట్లను తారుమారు చేయడం, దొంగిలించడం లాంటివి చేయలేదు. కాబట్టి ఇండియా ఇప్పుడు ఒక కొత్త పరిస్థితిలోకి ప్రవేశించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సముచితమే.
ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన పరిణామం.
ఎన్నికల సంఘం అప్రతిష్ట – ప్రభుత్వ మద్దతు
గత కొన్నేళ్లుగా ఎన్నికల సంఘం పాల్పడుతున్న అక్రమాలపై ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియల సమగ్రతపై ఓటర్లలోనూ అనేక ఎడతెగని సందేహాలు బలంగా నాటుకు పోయాయి.
అయితే ఎన్నికల సంఘంలోనే తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నాయన్న విషయాలు తాజాగా బయటపడటంతో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పనితీరును పూర్తిగా అప్రతిష్టపాలు చేసింది.
ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే విశ్వసనీయత కోల్పోయిన సీఈసీకి బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా నిలిచాయి. దీంతో ఈ సమస్య ఒక వ్యక్తి తప్పిదం మాత్రమే కాదని, మొత్తం వ్యవస్థే విషతుల్యమైందనే భయంకరమైన సత్యం తేటతెల్లమవుతోంది.
ఓటర్ల తొలగింపు – పాలకుల మౌనం
అక్రమాలు జరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ- ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన ఎదురైనప్పటికీ- ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయటం కాదనే విషయాన్ని గ్రహించడంలో సుప్రీంకోర్టు విఫలమైంది.
అలాగే ప్రభుత్వం కూడా ఈ రాజకీయ-న్యాయపోరాటంలో మొదటి నుంచి ఎన్నికల కమిషన్‌కే పూర్తి మద్దతునిస్తూ వచ్చింది.
బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన ప్రజల ఆవేదనను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పట్టించుకోలేదు.
పైగా ఓటర్ల తొలగింపు ప్రక్రియను ‘ఘుస్ ఫైటియా'(అక్రమ చొరబాటుదారుల)పై జరుగుతున్న ధర్మ యుద్ధంగా అభివర్ణిస్తూ వారి ఆవేదనను అవమానించారు. సుమారు 13 కోట్లకు పైచిలుకే ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు.
ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ చొరబాటుదారుల రాజకీయ అంశం చుట్టూ ఉన్న ఊబిలోనే కొట్టుమిట్టాడుతోంది.
కనీసం బాధితులకు మోడీ, అమిత్ షాల నుంచి ఒక్క సానుభూతి మాట గాని, న్యాయం జరుగుతుందనే హామీ గాని రాలేదు.
పుండుపై కారం చల్లినట్టు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల మెజారిటీ నిర్ణయాన్ని తోసిపుచ్చి, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన జ్ఞానేష్ కుమార్‌కు బీజేపీ అధికార ప్రతినిధులు కొమ్ము కాశారు.
ఇప్పటివరకు ప్రధాని, హోంమంత్రి ఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలకు రాజకీయంగా, మానసికంగా పూర్తిగా వారి ఆమోదాన్ని తెలుపుతూ వచ్చారు. అంటే ఈ చట్టవిరుద్ధ వ్యవహారాలను సాధారణ విషయాలుగా మార్చేయడానికి వారు కంకణం కట్టుకున్నారా?
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఎన్నికల వ్యవస్థ దెబ్బతింటే ప్రజాస్వామ్యం తనంతట తానే నశిస్తుంది. మనుగడ ఉండదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ దుశ్చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా పరిస్థితి నిస్సహాయ స్థితిలోనే ఉంది.
అమృత్ కాల్(2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక) సాధన దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పుకుంటున్న ఈ దేశం ఎక్కడికి చేరుకుంది?
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ దాష్టీకం ప్రజలను ఒక భయంకరమైన పీడకల ఎందుకు వెంటాడుతోంది? ఒకప్పుడు నేరస్తులు అంటే దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటివాళ్లే గుర్తొచ్చేవారు.
నేరం అనేది అలాంటి వారికి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భర్తీ చేస్తున్నారు. కానీ ఆ స్థానం వారితో నిండిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
రాహుల్ గాంధీ వాదనలు – వాస్తవాలు
మోసపూరిత పొరలను దాటుకుని సమస్య మూల కారణాన్ని గుర్తించే సామర్థ్యం గొప్ప నాయకులకు ఉంటుంది.
2019లో మోడీ గెలుపుకు విశ్లేషకులు రకరకాల విశ్లేషణలతో కాలం గడుపుతున్న సమయంలో, రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయా అని ప్రశ్నించారు.
అంతేకాదు ఎన్నికల ప్రక్రియ కేవలం ఒక నామ మాత్రపు తంతుగా రూపుదిద్దుకుంటోందని, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును స్పష్టంగా వివరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ‘మేము పోరాడింది ఒక రాజకీయ పార్టీతో మాత్రమే కాదు. దేశ ప్రభుత్వ అధికార వ్యవస్థలన్నింటితో పోరాడాము. కానీ ప్రతి వ్యవస్థనూ ప్రతిపక్షాలను అణచివేయడానికే ఉపయోగించారు. ఒకప్పుడు మనదేశంలో ఎంతగానో గౌరవించుకున్న స్వతంత్ర వ్యవస్థలు నిస్పాక్షికంగా వ్యవహరించే రోజులు ఇక ఎంత మాత్రమూ ఉనికిలో ఉండబోవని తేటతెల్లమైంది. దేశ వ్యవస్థాగత నిర్మాణాన్ని(రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థలు) హస్తగతం చేసుకోవాలని ఆశించిన ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఇప్పుడు పూర్తిగా నెరవేరింది. దీంతో ప్రజాస్వామ్య పునాదులు క్షీణదశలో ఉన్నాయి. ఇప్పటినుంచి ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవిగా కాక నామమాత్రపు తంతుగా మిగిలిపోతాయేమోనన్న భయం వెంటాడుతోంది’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఆయన అనుమానాలను మరింత బలపరుస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. ఆ ఫలితాలు ఓటర్ల జాబితాను, ఎన్నికల సంఘం పారదర్శకతలేని పనితీరును పరిశీలించేలా ప్రేరేపించాయి.
అప్పుడే కర్ణాటకలోని మహదేవ్ పూర్, అలంద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా పథకం ప్రకారం ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం వెనుక ఉన్న దిగ్బ్రాంతికరమైన విషయాలను రాహుల్ వెలికి తీశారు.
సాక్ష్యాలతో సహా ఆ గుట్టురట్టు చేశారు. ఇదంతా ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరగకుండా ఎన్నికల సంఘమే అడ్డుకుంటోందని ఆరోపించారు.
నిజనిజాలను వెలికి తీసేందుకు సహకరించాల్సిన జ్ఞానేష్ కుమార్ రాహుల్ గాంధీని బెదిరించారు. ఫిర్యాదులపై అఫిడవిట్ దాఖలు చేయమని పట్టుబట్టారు.
మోడీ ప్రభుత్వం, బీజేపీ రాహుల్ వ్యాఖ్యలను గేలిచేశాయి. ఆయన పెట్టిన కాన్ఫరెన్స్‌లు అన్నీ ఫర్జీ(నకిలీ) అని, అవి రాజ్యాంగ వ్యవస్థల ఉనికిని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించాయి.
విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘దయచేసి అర్ధం చేసుకోండి. నేను చెప్పే ప్రతి విషయానికి నూటికి నూరు శాతం ఆధారాలు ఉంటాయి. సాక్ష్యాలు లేకుండా నేను ఏదీ మాట్లాడను అనే విషయాన్ని గ్రహించండి. నా దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమించే వ్యక్తిని నేను. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికే నేను పోరాడుతున్నాను. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలను మీ ముందు ఉంచుతున్నాం. నిజాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. అదే మేము నిర్వర్తిస్తున్నాం. మన దేశంలో ఒక్క ఎన్నికల సంఘం మాత్రమే కాదు ఇంకా చాలా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయా వ్యవస్థలు కూడా ఈ వ్యవహారాలను లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మీడియా సంస్థలు తమ తమ బాధ్యతలను విస్మరించి అవకతవకగా వ్యవహరించడంతో దేశాన్ని ఒక పెద్ద విపత్తు ఆవహించింది.
ప్రజల స్పందన – పరిశోధనాత్మక కథనాలు
హర్యానా, మహారాష్ట్రల్లోని ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, లోపాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆయన డిసెంబర్ 2025లో ఓట్ చోరీ అంశంపై రామ్ లీలా మైదానంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. బీహార్‌లో యాత్రను చేపట్టారు.
ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సాధారణంగా అయితే ఈ పరిణామాలు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంతో సహా మొత్తం దేశాన్నే కుదిపేయాల్సిన పరిస్థితి. కానీ అంతటి చైతన్యం కనిపించలేదు. అంతేకాక ఈ పోరాటంలో రాహుల్ గాంధీతో కలిసి రావడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సొంత పార్టీ నాయకులు కూడా వెనుకంజ వేశారు.
272 మంది మాజీ ప్రభుత్వ అధికారులు, రక్షణ రంగ అధికారులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, నకిలీ కార్యకర్తల బృందం రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఒక లేఖ రాసింది. ఆ లేఖలో రాజ్యాంగ వ్యవస్థలపై వెలువడుతున్న విషపూరిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని పేర్కొంది.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారన్న అంశంపై రాహుల్ చేసిన కృషి దేశవ్యాప్తంగా తిరుగుబాటుకు దారితీయలేదు కానీ, ఎన్నికల ప్రక్రియ నిస్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించగలిగింది.
హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ ఫోటోను రాహుల్ బయట పెట్టడంతో, ఈసీపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ రితికా చోప్రా చేసిన సాహసోపేతమైన పరిశోధనాత్మక కథనం నిద్రాణంగా ఉన్న ఓట్ చోరీ రక్కసి మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా చేసింది.
భిన్న స్వరాలు
ఎన్నికల సంఘం నిర్వర్తించే చట్ట విరుద్ధ చర్యలపై దేశం మొత్తం తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ- ప్రధానమంత్రి, హోం మంత్రి నుంచి ఇప్పటివరకు చిన్న మాట కూడా రాలేదు. అధికారంలో ఉన్న ఈ నాయకులు ప్రజల్లో నెలకొంటున్న ఆందోళన, అసంతృప్తిని గమనిస్తారని ఆశిద్దాం.
వివిధ వ్యక్తుల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థపై వచ్చిన విమర్శల సమాహారం.
♦ మాజీ బీజేపీ నాయకుడు, ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఇంత దిగజారిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. చట్టాలు తనను ఏమీ చేయలేవు అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. నాకు సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం పోయింది. అది కూడా ఒక ప్రభుత్వ విభాగంలానే ప్రవర్తిస్తోంది అన్నారు.
♦ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను దొంగ, దేశద్రోహి అని సంబోధిస్తూ – ‘ఆయన తప్పించుకోలేరు. మోడీ, షాలు కూడా తప్పించుకోలేరు. ఎన్నికలు తారుమారు అవుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో దారితప్పిన ఎన్నికల కమిషనర్ కోట్ల మంది ప్రజలను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారు. దేశం ఇక పై దీనిని సహించదు’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
♦ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపడానికి అనుమతి తీసుకోలేదని చెప్పినప్పుడు, విద్యార్థి నాయకురాలు స్నేహబోరా స్పందిస్తూ- ‘మా ఓట్లను తొలగించే ముందు వారు మా అనుమతి తీసుకున్నారా? నిబంధనలను ఉల్లంఘించి ఇద్దరు ఎన్నికల కమిషనర్లను పక్కన పెట్టి నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషనర్ మా అనుమతి తీసుకున్నారా? అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టేటప్పుడు దేశ ప్రజల అనుమతి తీసుకున్నారా? అని ఆమె నిలదీశారు.
♦ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషి మాట్లాడుతూ- “ముగ్గురు సభ్యులు ఉండే ఎన్నికల సంఘాన్ని తమ ఇష్టారాజ్యంగా ఒకే ఒక్క వ్యక్తి చేతుల్లో పెట్టి నడిపించారు. అలా అక్రమంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వెంటనే రద్దు చేయాలని’ ఆయన పేర్కొన్నారు.
♦ మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా మాట్లాడుతూ, ‘ఇతర ఎన్నికల కమిషనర్ల మెజారిటీ అభిప్రాయాన్ని జ్ఞానేష్ కుమార్ తోసిపుచ్చారు. దానికి సంబంధించిన ప్రతి ఫైలు, ప్రతి అభ్యంతరం, ఆ అభ్యంతరాలకు ఇచ్చిన సమాధానాలను లోతుగా పరిశీలించాలి. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. మెజారిటీ అభిప్రాయాన్ని తోసిపుచ్చి ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమైనవి, అధికార పరిధికి మించినవి’ అని వ్యాఖ్యానించారు.
♦ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ‘ఎన్నికల కమిషనర్ పనితీరు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. జ్ఞానేష్ కుమార్ పాపాల చిట్టా నిండిపోయింది’ అని వ్యాఖ్యానించారు.
♦ మోడీ మద్దతుదారు వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని, పౌరుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశించిన విధానాన్నే మళ్లీ తీసుకురావాలని కోరారు. చిత్రం ఏమిటంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తలకిందులు చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గతంలో జగన్ పార్టీ మద్దతు ఇచ్చింది. చివరకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, లోక్ జనశక్తి పార్టీలు కూడా ఈసీ నుంచి వివరణ కోరాయి. మిస్టర్ మోడీ ఈ మార్పును మీరు గమనిస్తున్నారా?
అనువాదం: టాన్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
