న్యూఢిల్లీ: తన గొడ్డా అల్ట్రా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను భారత గ్రిడ్‌కు అనుసంధానించడానికి, ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ వేయడానికి అదానీ పవర్ లిమిటెడ్(ఏపీఎల్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, గొడ్డా ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తం కేవలం బంగ్లాదేశ్‌కు ప్రత్యేకంగా సరఫరా చేయబడుతోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ప్రతిపాదిత ట్రాన్స్మిషన్ లైన్ జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలోని గొడ్డా, పోడైయాహాట్ అనే రెండు తహసీళ్లలోని 56 గ్రామాల నుంచి వెళ్తోంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం- 1885 ప్రకారం వైర్లు, స్తంభాలను వేసుకోవడానికి టెలిగ్రాఫ్ అథారిటీకి అనుమతులు ఇచ్చిన విధంగానే, గ్రిడ్ కనెక్షన్ లైన్లు వేసుకోవడానికి అదానీ పవర్ లిమిటెడ్‌కు అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తి పైన, కింద లేదా వెంట వైర్లు, స్తంభాలను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి లభిస్తుంది.
సెప్టెంబర్ 29న విద్యుత్ శాఖ జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా, విద్యుత్ చట్టం– 2003లోని సెక్షన్ 164 కింద తన అధికారాలను వినియోగించుకుని, అదానీ పవర్ లిమిటెడ్‌కు ఈ అనుమతులను మంజూరు చేసింది.
అదానీ పవర్ లిమిటెడ్(ఏపీఎల్) గొడ్డా ప్లాంట్‌కు ట్రాన్స్మిషన్ కనెక్టివిటీని అందించడానికి అనేక అపూర్వమైన సవరణలు చేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వును జారీ చేసింది. విద్యుత్ దిగుమతి, ఎగుమతి మార్గదర్శకాలకు మంత్రిత్వ శాఖ చేసిన సవరణ, సరిహద్దు దాటిన విద్యుత్ సరఫరా విధానాలకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) చేసిన మార్పులు, అంతర్-రాష్ట్ర సరఫరా వ్యవస్థ(ఐఎస్టీఎస్)కోసం జనరల్ నెట్వర్క్ యాక్సెస్ నియమాలకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్సీ) చేసిన సవరణలు, సీమాంతర విద్యుత్ వాణిజ్యానికి సంబంధించిన నియమాలు వీటిలో ఉన్నాయి.
2019 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలం(ఎస్ఈజెడ్)గా ఏపీఎల్ గొడ్డా విద్యుత్ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోంది.
అయితే, గత ఏడాది ఆగస్టులో ఢాకాలో ప్రభుత్వం మారిన తర్వాత, తాత్కాలిక ఏర్పాటు కింద ఈ ప్లాంట్‌ను భారతదేశ హైఓల్టేజ్ ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్(ఐఎస్టీఎస్)కు అనుసంధానించడానికి అనుమతించారు.
ఈ వ్యవస్థ దేశంలోని రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా విధానాలను నిర్ధారిస్తుంది. మిగులు విద్యుత్ ఉన్న ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు పంపుతుంది, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఈ నెట్‌వర్క్‌ను సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీటీయూఐఎల్)నిర్వహిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో, అదానీ పవర్ లిమిటెడ్ ఇప్పుడు భారతదేశంలోని దేశీయ పంపిణీ సంస్థలకు కూడా విద్యుత్తును విక్రయించగలదు. తాజా అనుమతుల ప్రకరాం, అదానీ సంస్థ 25 సంవత్సరాల పాటు దేశీయంగా విద్యుత్ వినియోగ సంస్థలకు(డిస్కంలు) విద్యుత్ సరఫరా చేయవచ్చు.
గుర్తుంచుకోవాల్సిందేంటే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారం కోల్పోయిన తర్వాత రోజు(ఆగస్టు 5) అదానీ పవర్ లిమిటెడ్ 2024 ఆగస్టు 6న విద్యుత్ మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది.
ఈ లేఖలో, “భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా, బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదో కారణం చేత ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయనప్పుడు, మా జనరేషన్ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌ను తీర్చగలిగితే ప్రయోజనకరంగా ఉంటుంది” అని కంపెనీ ప్రభుత్వానికి తెలియజేసింది. కేవలం ఏడాదికి కూడా గడవకముందే, అదానీ కంపెనీ విజ్ఞప్తులను అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వాయువేగంతో నిర్ణయాలు చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
