రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కంకర ట్రిప్పర్ వల్ల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం(నవంబర్ 3న) వేకువ జామున తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న ట్రిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయినట్టుగా, పలువురు గాయపడినట్టుగా అధికారులు వెల్లడించారు.
కంకర ట్రిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో బస్సు, ట్రిప్పర్ డ్రైవర్లు అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బోల్తాపడిన బస్సులో ట్రిప్పర్లోని కంకర నిండిపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది కంకరలో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసి, గాయాలపాలైన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో మృతులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులున్నట్టుగా గాయాలపాలైన బస్ కండాక్టర్ చెప్పారు.
ప్రమాదంలో చనిపోయినవారి వివరాలను అధికారులు ప్రకటించారు. బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారమ్ తండాకు చెందిన తారిబాయ్ (45), బోరబండకు చెందిన కల్పన (45), భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి (55), దన్నారమ్ తండా ఏమావత్ తాలీబామ్, దౌల్తాబాద్ మల్లగండ్ల హనుమంతు, యాలాల్వాసి గుర్రాల అభిత (21), బోరబండవాసి గోగుల గుణమ్మ; తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, తనుషా, సాయిప్రియా, నందిని రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ ప్రమాదంలో 32 మందికి తీవ్రగాయాలయ్యాయి, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి పేర్లు: వెంకటయ్య, దన్నారమ్ తండా చెందిన బుచ్చిబాబు, హైదరాబాద్‌వాసి అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి; తాండూరు చెందిన శ్రీను, నందిని, సాయి, అక్రమ్, అస్లామ్; కోకట్(కర్ణాటక)కు చెందిన బస్వరాజ్, వికారాబాద్వాసి ప్రేరణ.
ఘటన మీద స్పందించిన పలువురు..
రోడ్డు ప్రమాదంపై మోడీ, సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత- మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీడీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటుగా పలువురు స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తనకు సమాచారం అందిన వెంటనే, టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో రోడ్డు రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలియజేశారు.
కంకర టిప్పర్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టుగా అధికారులు తనకు చెప్పినట్టుగా పొన్నం చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా వెల్లడించారు.
బస్సు వివరాలు..
ప్రభుత్వం ఆదేశంతో పోలీసులు ప్రాథమిక విచారణనను చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు ఆర్టీసీ హైర్ వెహికల్(అద్దె)గా గుర్తించారు. బస్సు నంబర్ TG 34TA 6534. తెల్లవారుజామున 4.40 గంటలకు తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరింది. ఉదయం 6.15 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమె ఎడమవైపు కూర్చోవడం వల్లే ప్రాణాలు దక్కినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రి- ఘటనా స్థలం వద్ద ఉద్రిక్తత..
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన రాజకీయ నాయకులను మృతుల కుటుంబ సభ్యులు నిలదీశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరుకున్నారు. దీంతో వారిని చూసిన మృతుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని మండిపడ్డారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా నిరసన సెగ తగిలింది.
మరోపైపు మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని మండిపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యపై స్థానికులు రాళ్లు విసిరే ప్రయత్నం చేసినట్టుగా పలు వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. “ఎమ్మెల్యే డౌన్.. డౌన్..” అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన కారు ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
