భారత ఎన్నికల సంఘం, ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, సబార్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన రికార్డుల ఆధారంగా ‘ఓటర్ అధికార మంచ్‘ జరిపిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల జాబితాలో ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్) ప్రారంభానికి ముందుగానే 11 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు.
దేశ రాజధానిలో 70 నియోజకవర్గాల్లో 68 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో తొలగింపులు జరిగాయని, ఈ సంఖ్య 2025 శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు మార్జిన్‌ను కూడా మించిపోయిందని ఒక కొత్త నివేదిక బట్టబయలు చేసింది.
భారత ఎన్నికల సంఘం, ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)తో సహా సబార్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రచురించిన రికార్డుల ఆధారంగా ఓటర్ అధికార మంచ్ చేసిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాలను కనుగొనడమైంది.
ఎస్ఐఆర్ మొదలు కాగానే ఢిల్లీ ఓటర్ల జాబితా 2025 జనవరి 31కి ఉన్న 1,56,14,000 నుంచి 2026 జూన్ 30 నాటికి 1,45,10,299కి కుచించుకుపోయినట్లు నివేదిక కనుగొన్నది.
సవరణలకు మధ్యలో మామూలుగా జరిగే నెలవారీ పూలింగ్ ద్వారా 11,03,701 ఓటర్లను తొలగించారు. దీనికోసం ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల చేరికలు, తొలగింపుల నెలవారీ జాబితాను ఢిల్లీ సీఈఓ ప్రచురిస్తారు.
ఎస్ఐఆర్ మొదలు కాక దాదాపు 2-3 మాసాల ముందుగానే తొలగింపులు పెరిగినట్లు అలాంటి డేటాను విశ్లేషించగా బహిర్గతమైంది.
ఏప్రిల్‌లోనే 3 లక్షలకు పైగా తొలగింపులు..
“మొత్తం 70 నియోజకవర్గాల వ్యాప్తంగా 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు నికర మార్పులో 1,00,613 మంది ఓటర్లు పెరిగారు. 2026 జనవరి నుంచి జూన్ వరకు నికర మార్పు చూస్తే ఏకంగా 11,70,885 ఓట్లు పడిపోయాయి. ఒక్క 2026 ఏప్రిల్ లోనే 3,39,509 తొలగింపులు నమోదయ్యాయి. గడచిన ఆరు మాసాల నుంచి నెలవారీగా చూస్తే ఈ సగటు సుమారు ఇరవై రెట్లు ఉంది. 2025 జులై నుంచి డిసెంబర్ వ్యాప్తంగా నమోదైన ప్రతి తొలగింపుతో పోలిస్తే ఇది మూడు రెట్లకు మించి జరిగిందని” నివేదిక తెలియజేసింది.
పదికి పైగా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్లో సగటు తొలగింపులు 40 శాతానికి మించి జరిగాయి. అందులో తుగ్లకాబాద్, ఓఖ్లా, ఆర్కే పురం, కస్తూర్బా నగర్, కాల్కాజీ వంటి నియోజకవర్గాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో 68 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో తొలగింపులు జరిగాయని, 2025 శాసనసభ ఎన్నికల్లో గెలుపు తేడాలతో పోలిస్తే ఈ ఓటర్ల తొలగింపు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సబార్ ఇన్స్టిట్యూట్ డేటాను ఉపయోగించడం ద్వారా కనుగొన్నట్లు నివేదిక పేర్కొంది.
యోగేంద్ర యాదవ్ ఆందోళన..
ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఈ విషయాలను పంచుకున్నారు.
ఎస్ఐఆర్ ముగిసే సమయానికి దేశంలో 103 కోట్ల మంది వయోజనులు ఉంటారని అంచనాలు చూపిస్తున్నాయని, కానీ భారత్‌లో కేవలం 88 కోట్ల ఓటర్లే ఉన్నారని చెప్పారు.
“2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి దేశంలో 99 కోట్ల మంది వయోజనులు ఉండగా, అందులోంచి 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ సాధించిన ఘనత ఏమిటంటే.. అది ముగిసే సమయానికి 103 కోట్ల వయోజనులు ఉండాలి, కానీ దేశంలో కేవలం 88 కోట్ల ఓటర్లు మాత్రమే ఉన్నారు” అని ఆయన అన్నారు.
ప్రణాళిక లేకుండా ఇదంతా జరగదు..
“ఇది సాధారణం కాదు. వ్యవస్థలోని వారి ప్రమేయంతో పక్కా ప్రణాళిక లేకుండా ఇది జరగడానికి అవకాశం లేదు. ప్రత్యేకంగా ఎస్ఐఆర్ మొదలు కాకముందే ఇంత పెద్ద ఎత్తున తొలగింపులు జరగడంపై నేరపూరిత కుట్రగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్ అనేది మన ప్రజాస్వామ్యంపై జరిగిన ఒక మోసం. ప్రజలను ఓటు హక్కు లేకుండా చేయడానికి దీన్ని రూపకల్పన చేశారు”.
గతంలోనూ ‘ది వైర్’ కథనాలు..
గడచిన మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర – 2024, కర్ణాటక – 2023, తెలంగాణ – 2023, ఢిల్లీ – 2025, ఆంధ్రప్రదేశ్ – 2024) అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపులు జరిగినట్లు ఎస్ఐఆర్ మూడవ దశ ముసాయిదా జాబితా చూపిస్తోందని ‘ది వైర్’ గతంలోనే రిపోర్ట్ చేసింది.
ఎన్నికల ఫలితాలకు పవిత్రత ఏది?..
ఓటర్ల జాబితాలో ఇన్ని తప్పులు ఉన్నప్పుడు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలకు ఇక పవిత్రత ఏమి మిగిలిందని పారదర్శకత కార్యకర్త అంజలి భరద్వాజ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
“ఢిల్లీ ఎన్నికలు 1.56 కోట్ల మంది ఓటర్లతో 2025 ఫిబ్రవరిలో జరిగాయి. ఇప్పుడు దాదాపు 91 లక్షల మంది ఓటర్లు తొలగించబడతారు లేదా నోటీసులను అందుకోనున్నారు. 2025 శాసనసభ ఎన్నికల ఫలితాలకు పవిత్రత ఏమి మిగిలి ఉంది? ఈ ప్రక్రియను ప్రజలు ఎలా నమ్మాలి? తన సొంత ఓటర్ జాబితాలోనే ఇన్ని తప్పులను ఇప్పుడు భారత ఎన్నికల సంఘం కనుగొన్నట్లయితే, దానికి బాధ్యులైన ఎవరిపై చర్యలు తీసుకుంటారు?” అని ఆమె అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
