ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందనే సాకుతో పాఠశాలల విలీనానికి లేదా మూసివేతకు చర్యలు చేపట్టడం విద్యా రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
బడుల్లో కనీస సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడే స్థితికి చేరుతున్నప్పుడు-బాధ్యతను స్వీకరించాల్సిన ప్రభుత్వాలు, బడుల నిర్వహణను పూర్వ విద్యార్థులు, స్థానిక దాతలు లేదా సమాజ భాగస్వామ్యానికి అప్పగించాలని ప్రతిపాదించడం సరికొత్త చర్చకు తెరలేపింది.
ఈ పరిణామాలు కేవలం కొన్ని రాష్ట్రాల తాత్కాలిక సమస్యలు కావు; ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణతకు, పాలనాత్మక జవాబుదారీతనం నుంచి రాజ్యాలు తప్పుకుంటున్న తీరుకు స్పష్టమైన ఆధారాలు.
విద్యా హక్కు చట్టం, ప్రభుత్వ బాధ్యత..
దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభం కేవలం కేటాయింపుల కొరత మాత్రమే కాదు; అది విద్యా పాలనా సంస్కరణలు, రాజ్యాంగ జవాబుదారీతనం అమలులోని లోపం.
పాఠశాలల నిర్వహణలో సామాజిక పాత్రను ప్రస్తావించేటప్పుడు “ప్రజల భాగస్వామ్యం బడుల నాణ్యతను, పారదర్శకతను పెంచడానికే తప్ప, ప్రభుత్వాలు తమ ప్రాథమిక రాజ్యాంగ జవాబుదారీతనం నుంచి ఉపశమనం పొందడానికి కాదు” అనే స్పష్టమైన విధానపరమైన సరిహద్దును గీయడం అవసరం.
ఉచిత, నిర్బంధ విద్యను ప్రదానం చేసే విద్యా హక్కు చట్టం(2009) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యతలు చట్టబద్ధంగా విభజించబడ్డాయి.
చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, ఇతర వనరుల భాగస్వామ్యాన్ని వహించాల్సి ఉండగా; సెక్షన్లు 8, 9 పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంస్థలు మౌలిక వసతులు, నిధులు, ఉపాధ్యాయ నియామకాలు, నాణ్యమైన విద్యా హామీలను నెరవేర్చాల్సి ఉంది.
మరొకవైపు, చట్టంలోని సెక్షన్ 21 పరిధిలోని పాఠశాల యాజమాన్య కమిటీలు(ఎస్ఎంసీలు) పాఠశాల అభివృద్ధి ప్రణాళికను(ఎస్డీపీ) రూపొందించి సిఫారసు చేయడం, గ్రాంట్ల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి స్పష్టమైన చట్టబద్ధమైన పరిధి కలిగి ఉన్నాయి.
అలాగే పూర్వ విద్యార్థుల సాయం, మెంటరింగ్, అదనపు గ్రంథాలయ వనరులు అనేవి సానుకూల సామాజిక సహకారం కిందకే వస్తాయి. అయితే, ఉపాధ్యాయుల జీతాలు, భవనాల నిర్మాణాల వంటి ప్రాథమిక నిర్వహణ బాధ్యతలను స్థానిక విరాళాలపై లేదా కార్పొరేట్ సాయంపై నెట్టివేసి రాజ్యం పక్కకు తప్పుకోవడమే ప్రమాదకరమైన బాధ్యతల బదిలీ అవుతుంది.
బడుల మూసివేత, సామాజిక విభజన..
ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడటం వెనుక ఉపాధ్యాయ ఖాళీలు, సదుపాయాల లేమి ప్రధాన కారణాలుగా ఉంటూ, విద్యార్థుల నమోదు తీవ్రంగా పడిపోవడానికి దారితీస్తున్నాయి. దీనికితోడు జనాభా రేటులోని మార్పులు, గ్రామీణ వలసలు, ప్రైవేట్ పాఠశాలల విస్తరణ కూడా తోడై బడుల విలీనం లేదా మూసివేత పరిస్థితులను వేగవంతం చేస్తున్నాయి.
కుటుంబాల విద్యా వ్యయంపై జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన అధ్యయనాలు ప్రైవేట్ విద్యపై ఆధారపడటం వల్ల నిరుపేద, నిరుద్యోగ కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
ఇది సమాజంలో స్థోమత ఉన్నవారికి ఒక రకమైన విద్య, లేనివారికి మరొక రకమైన విద్య అనే సామాజిక విభజనను తీవ్రతరం చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాల అనేది కేవలం ఒక సేవా కేంద్రం మాత్రమే కాదు; అది సమాజంలోని ప్రతి బిడ్డ రాజ్యాంగ విద్యా హక్కును కాపాడే ప్రజాస్వామ్య వ్యవస్థ.
నిధుల కొరత, కేటాయింపుల ఆవశ్యకత..
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి నిధుల వ్యయంలో పారదర్శకత, పెరిగే కేటాయింపులు ప్రాథమిక అవసరం. కోఠారీ కమిషన్(1966) నుండి జాతీయ విద్యా విధానం (2020) ప్రతిపాదనల వరకు విద్యా వ్యయాన్ని దేశ జీడీపీలో 6 శాతానికి చేర్చాలని సూచిస్తున్నప్పటికీ, బడ్జెట్ కేటాయింపులు ఆ స్థాయికి చేరడం లేదు.
అందుబాటులో ఉన్న నిధుల్లో పెద్ద భాగం వేతనాలు, ప్రాథమిక నిర్వహణ వ్యయాలకే వెళ్తుండటంతో, పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటుకు అవసరమైన మూలధన వ్యయం సరిపడా లభించడం లేదు.
అధికారాల విభజన, నిధుల క్రమబద్ధీకరణ..
పరిపాలనా పరంగా విద్యా వ్యవస్థ స్థిరపడాలంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికార, విధుల విభజన స్పష్టంగా ఉండాలి.
ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, బడ్జెట్ కేటాయింపులు, పాఠ్యాంశాల రూపకల్పన రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కాగా, స్థానిక పంచాయతీలు, మునిసిపాలిటీలు పాఠశాలల పారిశుద్ధ్యం, భౌతిక భద్రత, డ్రాప్అవుట్ల నివారణపై పర్యవేక్షణ వహించాలి.
ప్రభుత్వ విద్యలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులను ఉపయోగించాలనుకుంటే, అది ప్రభుత్వ ప్రాథమిక వ్యయానికి ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు వనరుగా, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి వంటి వినూత్న రంగాల్లో మాత్రమే వినియోగించేలా విధానపరమైన స్పష్టత ఉండాలి. దీనిని మరింత క్రమబద్ధీకరించడానికి రాష్ట్రం ఏర్పాటు చేయగల ప్రత్యేక “రాష్ట్ర విద్యా వికాస నిధి”ని రూపొందించి, దానిని కాగ్ ఆడిట్, సోషల్ ఆడిట్ పరిధిలో ఉంచుతూ, దూరప్రాంత గిరిజన, గ్రామీణ బడులకు నిధులు సమానంగా అందేలా చూడవచ్చు.
రాజ్యాంగ బాధ్యతను నిలబెట్టుకోవాలి..
చివరగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ రక్షణ అనేది పిల్లల రాజ్యాంగ హక్కుల పరిరక్షణతో ముడిపడి ఉంది. తక్షణ స్వల్పకాలిక చర్యగా విద్యా సంవత్సరారంభంలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలి.
మూడేళ్ల మధ్యకాలిక ప్రణాళికలో భాగంగా బడ్జెట్ కేటాయింపులను దశలవారీగా పెంచుతూ పాఠశాలల మౌలిక వసతుల ప్రమాణాలను బలోపేతం చేయాలి.
ఐదేళ్ల దీర్ఘకాలిక లక్ష్యంగా ప్రతి బిడ్డకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించే రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చాలి.
సమాజ భాగస్వామ్యం విద్యా వ్యవస్థకు పారదర్శకతను ఇచ్చే ఊపిరిలా పనిచేయాలి తప్ప, అది ప్రభుత్వం తన చట్టబద్ధమైన బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవడానికి సాకుగా మారకూడదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
