తను అత్తిపత్తి పువ్వై ముడుచుకుంటుంది
నీటి చర్మంపై కష్టాల పురుగులను మోసుకుంటుంది
పుస్తకాలాన్నీ అది తన్యత సిద్ధాంతమని ప్రకటిస్తాయి కానీ
ఎవరికి తెలుసు
అది మన అవ్వల కన్నీటి సిద్ధాంతమని
మనం రోజూ పాటించే అన్యతల వేదాంతమని
నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి
నా గొంతు పుడిగెకున్న నిశ్శబ్ద దారాలను నిదానంగా విప్పాలనిపించేది
ఈ అవ్వలందరి తలపై
అసెయ్ ఒసేయ్ అనే మాటల మోపునెవరు కట్టారో అడగాలనిపించేది
అమ్మంటే వంటింటి గోడలపై
పొగజూరిన సంతకం కాదు
ప్రతి ఉదయం నలిగిన తన నిదుర కాగితంపై
చేయాల్సిన పని పట్టికలు గీసుకునే
ఇంటి గుమస్తా అంతకన్నా కాదు
సుక్క పొద్దు పొడవడమే ఆలస్యం
అవ్వలంతా సెకండ్ల ముళ్లై
ఏదో పని సుట్టూ తిరుగుతూనే ఉన్నా
అంతా గంటల ముళ్ళై వెనక నుండి పరీక్షిస్తూనే ఉంటారు.
అయినా నాకప్పుడప్పుడు సందేహమేస్తుంది
వాళ్ళు దోపుకున్న ఆ బొడ్లె సంచిలోనే
చెక్కుడు గుత్తిని ఊహించుకుంటున్నారా?
ఆ బోసి మెడకున్న సెమటబిళ్ళల్లోనే
కాసుల పేరుని తెలుసుకుంటున్నారా అని.
అయినా కోరికలపోపులను గుండె డబ్బాలో మడతబెట్టి
ఇంటి వృక్షం కింద జ్ఞానబోధ చేసే ఈ అవ్వలందరు
ఎప్పుడో పెండ్లప్పగింతలల్లో
కుటుంబాన్ని బుద్ధుడిలా వదిలినోళ్ళే కదా
అవును
వాళ్ళు కొడుకుల జీవితం కోసం
బాధ్యతల రంపంపై నుజ్జు నుజ్జుగా నలిగిన వాళ్లే.
అంతమాత్రాన
వాళ్లని త్యాగాలకు ప్రతీకలని
ఆశలు లేని ఆడ బుద్ధుళ్ళని
మీ చాదస్తపు క్యాలెండర్లను తగిలించి
తమను తాము మర్చిపోయేలా చేస్తారా?
తల్లులారా మీకిప్పుడు స్వార్ధం తెలియాలి
బంధాల బాట్లను తక్కెడలా మోయటమే కాదు
మీకూ స్వేచ్ఛ ఉంటుందని తూకమేసి చూపించాలి
అచ్చం న్యాయ దేవతలా కనిపించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
