రాజధాని నడిబొడ్డున
వేడెక్కిన యువ నెత్తురు సాక్షిగా నవ శకం పూరించాలి
పూరించి తీయాల్సిందే… కదం తొక్కి నడవాలి…
పాలకుల జెండాలను మోసి మోసి
భుజాలకు పట్టిన ఆరాధన భావాన్ని
విదిలించి యువత ఓ సారి తలెత్తి చూడు.
జాతి కోసమని చప్పట్లు కొట్టి
కులాల కోసం రోడ్డు మీద కొట్టుకుంటూ
స్వార్థపు స్వర్గాలకు మెట్లు వేస్తున్న
స్వలాభ రాజకీయాలను
యువత ఓ సారి తలెత్తి చూడు.
మద్యం మత్తులో తూలుతూ,
గంజాయి మైకంలో తేలుతూ,
రిల్స్, స్టేటస్లకే జీవితాన్ని అమ్మేస్తూ,
ప్రపంచాన్ని మరచిన చేవలేని
యువత ఓ సారి తల ఎత్తి చూడు.
ఉద్యోగాల కోసం,
ఉనికి కోసం కొట్లాడాల్సిన సమయంలో
వ్యసనాలకు బానిసై
నీ కలను తాకట్టు పెడుతున్నావు కదా—
విద్యను అంగట్లో సరుకు చేసి
విలాస పాలకులకు
అడ్డు తిరిగి ఎదురు నిలిచిన
యువ వాహినిని ఓ సారి తలెత్తి చూడు.
ప్రజాస్వామ్య ముసుగులో
నియంతలు అవినీతి అరాచకాలతో
రాబందుల్లా రాజ్యమేలుతుంటే
చదువుకున్న చదువు అక్షరాలకు
అర్థం లేకుండా పోతుంటే
ఎన్ని దినాలు? ఇంకా ఎన్నాళ్లు?
ఓ సారి తలెత్తి చూడు?
తుప్పు పట్టిన మెదళ్లతో,
పాషాణ హృదయాలతో
బతికున్న శవాల్లా జీవిస్తారా?
రాజ్యం సృష్టిస్తున్న అలజడులు
తిలోదకాలొదిన విధానాలకు
విలువలు లేని నేతలను
ఓ సారి తల ఎత్తి చూడు.
లే..
చరిత్రను తిరగేయ్.
ప్రశ్నించే గొంతు అవ్వు.
నీ రక్తంలో ఉంది
భగత్ సింగ్ ఆవేశం,
అంబేద్కర్ ఆలోచన,
చెగువేరా తిరుగుబాటు.
ఎందుకంటే
రక్తం చిందించిన తావునే
రేపటి భవిష్యత్తు వికసిస్తుంది.
ఆ నవ శకానికి నీవే పునాది.. నీవే నిర్మాత..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
