తెలుగునాట “బహుజన రాజకీయం” పేరు తరుచుగా వినిపిస్తున్నది. అంబేద్కర్ సిద్ధాంతం, కాన్షీరాం ఆచరణల గురించీ మాట్లాడుతున్నారు.
ఇదే సందర్భంలో, బహుజన సమాజ్ పార్టీ భవిష్యత్తు ఏంటని చర్చా జరుగుతున్నది.
రెండేళ్ల కింద బీఎస్పీ, ఆర్ఎస్పీ, కాన్షీరాం, బహుజన రాజకీయం అంటూ సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో హడావుడి కనిపించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఎస్పీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.
ఏదో జరుగుతుందనే, పునర్వైభవం వస్తుందనే అంచనాలు వేసుకున్నారు. అవి తల కిందులయ్యాయి.
అంతేకాదు, పాపులారిటీ ఓట్ల పర్సంటేజ్లను తులనాత్మక పరిశీలనలు చేసుకున్నారు. అలా ఉండి పోయారు.
ఈ మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ పేరుతో అంబేద్కర్-ఫూలే తాత్వికతను బలంగా వ్యక్తీకరిస్తున్నారు.
కాన్షీరాం ఐడియాలజీని తామే భర్తీ చేస్తున్నామని ధర్మ సమాజ్ పార్టీ కార్యాచరణ ద్వారా చూపిస్తామంటున్నారు.
తగు రాజకీయ వాతావరణం లేకున్నప్పటికీ బీసీలు సైతం బహుజనవాదాన్ని ఎత్తుకుంటున్నారు.
ఆ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని పదేపదే అంటున్నారు.

రిటైర్డ్ జడ్జీలు, మాజీ ఐఏఎస్‌లు, మేధో వర్గం సామూహిక బహుజన గొంతుకవుతామని అంటున్నది.
శక్తినిచ్చే భవిష్యత్తు కార్యాచరణ..
ఈ నేపథ్యంలోనే బహుజన సమాజ్ పార్టీ ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటామని చెపుతున్నది.
మొన్నీ మధ్య మాయావతి జన్మదిన వేడుకలకు వేలాదిమంది బీఎస్పీ అభిమానులు షాద్ నగర్లో కనిపించారు.
కార్యకర్తల బలం ఉన్నప్పటికీ సరైన నాయకుడు లేని కారణంగా ఆ పార్టీ స్తబ్ధతలో ఉండిపోయిందని రాజకీయ పండితుల విశ్లేషణ.
తాజాగా ఇబ్రాం శేఖర్‌ను తెలంగాణకు కొత్త అధ్యక్షులిగా ఎంపిక చేసింది.
కాన్షీరాం జయంతి ఉత్సవాన్ని పార్టీ ప్రేరణకు శక్తినిచ్చేలా భవిష్యత్తు కార్యాచరణ పూనుకుంటామని ఆ పార్టీ కొత్త అధ్యక్షులు శేఖర్ అంటున్న మాటలు.
గత అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారడంతో బహుజన రాజకీయ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నామని ఆ పార్టీ నాయకత్వం అంటున్నది.
భిన్న శిబిరాలుగా విడివడి ఉన్నా బహుజన రాజకీయ సమూహాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చే ప్రయత్నమూ చేస్తామని అంటున్నారు ఆ పార్టీ నాయకులు.
తెలంగాణలో ఒక రాజకీయ శూన్యత ఉన్నదని, దాన్ని తామే భర్తీ చేస్తామని కూడా వారు భావిస్తున్నారు.
పునర్వైభవం దిశగా..
గత లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల-సీట్ల శాతాన్ని పెంచుకున్నది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కనిపించింది.
బీఎస్పీకి పట్టున్న ఉత్తరప్రదేశ్‌లో కమలం పార్టీ అనుకున్న స్థాయిలో పార్లమెంటు సీట్లను సంపాదించలేదు. అంతేకాదు, ఓట్ల శాతం తగ్గింది.
బహుజన సమాజ్ పార్టీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన బీజేపీని కట్టడి చేయగలిగామని, అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేస్తామని కొత్త అధ్యక్షులు శేఖర్ అభిప్రాయం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని దాటి బీఎస్పీ తన ప్రాబల్యాన్ని, తన ప్రభావాన్ని విస్పష్టంగా వ్యక్తీకరిస్తుందనే ధీమానూ వ్యక్తం చేశారు.
1990లో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను కాన్షీరాం తీవ్రంగా ప్రభావితం చేశారు. నాటి నాయకత్వ లోపం కారణంగా ఆనాటి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోలేకపోయామని ఇప్పటి తరం బీఎస్పీ నాయకులు చెపుతున్న మాట.
కొత్త తరం బీసీ, ఎస్సీ, ఎస్టీలు- అంబేద్కర్, కాన్షీరాం ఆలోచన-ఆచరణను అమలు చేస్తామని చెపుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల హవా కనిపించింది.
బహుజన వాణి ప్రభావం వలనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని బీసీ సంఘాల నాయకులు సైతం చెపుతున్నారు.
నేటి రాజకీయ చైతన్యాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత వేగిరం చేసే కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని బీఎస్పీ నాయకులు అంటున్నారు.
మూసధోరణి వద్దు..
బహుజన సమాజ్ పార్టీ వీధి పోరాటాలలో కనబడదు. 80ల నాటి ఆలోచనతోనే ముందుకు సాగాలని అనుకుంటున్నది. కమ్యూనిస్టు పార్టీల ప్రభావమున్న తెలంగాణలో, గత మూస ధోరణి పనికొస్తుందానేది పెద్ద సవాలు.
కులమూ, దాని ప్రభావమూ- గతంలో మాదిరిగా వ్యక్తీకరించబడడం లేదు. కులం విషయాన్ని ఉపరితల అంశంగా బలంగా ప్రజల్లోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ తీసుకెళ్తున్నాయి. దళితులను తమలో కలుపుకుంటామని, చారిత్రకంగా పొరపాటు జరిగిందని మోహన్ భగవత్ చాలా సార్లు చెప్పారు. కాలంతో పాటు మనమూ మారాలని అంటున్నారు.
తమ కార్యక్రమాల్లో దళితులకు అగ్రస్థానం ఇస్తామని చెపుతున్నారు. వీటికి కౌంటర్‌గా బహుజన సమాజ్ పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకోవడం లేదు.
ఉత్తర- దక్షిణ భారతదేశ దళిత, బహుజన ఆలోచనల్లో చాలా తేడా ఉంది. ఉత్తరాదిన ఉన్నంత కులపీడన, దాని దాష్టికం ఇక్కడ తక్కువ.
ఉత్తరాది సామాజిక, రాజకీయ మైండ్‌సెట్‌తో ప్రొగ్రామింగ్ దక్షిణాదిన నడవదు. ఈ విషయాన్ని బీఎస్పీ అధిష్టానం గుర్తిస్తుందో లేదో తెలియదు.
గత స్థితిని మార్చుతారా..!
తమదైన సొంత కార్యాచరణతో డీఎస్పీ, ఆర్పీఐ, ఇతర బహుజన రాజకీయ శక్తులు ముందుకు వెళ్తున్నాయి. ఇవన్నీ విడివిడిగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో ప్రధాన రాజకీయాల పార్టీలను మించి కార్యాచరణను తీసుకుంటున్నాయి. వీటిల్లో బీఎస్పీ కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భాగమైన బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ గత స్థితిని మార్చుతారని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.
వారి కుటుంబం ముందు నుంచి అంబేద్కర్- ఫూలే సిద్ధాంతంతో పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
80ల నుంచి నిన్నా మొన్నటి వరకు అంబేద్కర్ సంఘాల ఆధారంగా పలు సామాజిక ఉద్యమాలు నిర్మించిన చరిత్రకూడా వారికి ఉన్నది.
పార్టీ ఎదుగుదలకు పెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో బీజేపీని తామే ఢీకొంటామని తెలంగాణ శాఖ అధ్యక్షులు శేఖర్ మాటలు ఎంత వరకు నిజమవుతాయో తెలియదు. కానీ, కాలానుగుణంగా పార్టీ అధినేత ఆలోచన, ఆచరణ మారాలని ఆ పార్టీ అభిమానులు, అంబేద్కర్-ఫూలే వాదులు కోరుకుంటున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
