బీజేపీ ఎమ్మెల్యే ‘తాండవం‘ పిలుపుతో రాళ్లు, గుడ్లు, ఇటుకలు, చెప్పులు, నిప్పు– జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 12 గంటల కాషాయ మూక హింస.
యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసులు పూర్తి వివరాలు తెలియజేయలేదు. అర్ధరాత్రి దహనకాండ, దాడి, బెదిరింపుల తర్వాత, పోలీసుల సమక్షంలోనే పగటిపూట ఈ విధ్వంసం జరిగింది.
కోల్‌కతా: కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ 4వ నంబర్ గేట్‌ను కాషాయ జెండాలు పట్టుకున్న వ్యక్తులు ఎక్కి, దాని తామర పువ్వుల వలయంతో ఉన్న చిహ్నాన్ని నిలబడేందుకు ఆధారంగా ఉపయోగించుకుని ఆగస్టు 20న నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు.
రెండు దశాబ్దాలకు పైగా విశ్వవిద్యాలయం చిహ్నంగా ఉన్న ఆ గేటు, నందలాల్ బోస్ రూపొందించిన వికసించిన తామర పువ్వుతో చుట్టుముట్టబడిన మూడు జ్వాలలను చూపుతుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి అనుబంధంగా ఉన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మద్దతుదారులు కాషాయ జెండాల కింద ఊరేగింపుగా వచ్చి, గేటు పైకి ఎక్కడానికి విశిష్టమైన ఆ కళాఖండంపై పాదాలు మోపి, కొంత భాగాన్ని విరగ్గొట్టి, ఆపై దానిని తొక్కేశారు.
ఒక రోజంతా జరిగిన ఈ దహనకాండ, దాడి, బెదిరింపులు పగటిపూట స్వయంగా పోలీసుల సమక్షంలోనే జరిగాయి.
అయినప్పటికీ పోలీసులు, విశ్వవిద్యాలయ యాజమాన్యం ఎంతమంది దాడిలో పాల్గొన్నారు, ఎవరి నాయకత్వంలో జరిగినదన్న వివరాలు బయటపెట్టలేదు.
ఇతరులను దేశద్రోహులని పిలుస్తూ గడిపే వ్యక్తులు కళాఖండాన్ని చెప్పులతో పగులగొట్టి దాడికి పాల్పడ్డారు. కమలం రాజకీయాల సైనికుల నుంచి ఒక కమలం కూడా సురక్షితంగా లేక ధ్వంసం కావడం అత్యంత విషాదకరం.
ఆ కళాఖండంలోని మూడు జ్వాలలు సర్వతోముఖాభివృద్ధి, భావోద్వేగం, ఊహాశక్తి, ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తాయి. తామర రేకులు కళలను సూచిస్తాయి. దానిని రూపొందించిన బోస్, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి. శాంతినికేతన్‌లోని కళా భవన్ మాజీ ప్రిన్సిపాల్. దాని స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, విశ్వవిద్యాలయం “తెలుసుకోవడం ద్వారా అభివృద్ధి” అనే నినాదాన్ని ఇచ్చింది.
పోలీసులు చూస్తుండగానే 12 గంటల ‘తాండవం’..
ఆగస్టు 20 ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుందని భావించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఆ బలగాలు చేసిందల్లా చూస్తూ నిలబడటమే. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో గొల్పార్క్ ప్రాంతం నుంచి ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ మూక ఒకదాని తర్వాత ఒకటిగా బారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ చివరికి యూనివర్సిటీలోని 4వ నంబర్ గేట్‌కు చేరుకుంది.
అర కిలోమీటరు దూరంలో ఉన్న 8బీ బస్ స్టేషన్ క్రాసింగ్ వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతుదారులు జరుపుతున్న సమావేశాన్ని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు.
“ఇక్కడ మహిళా పోలీసు అధికారులు ఎవరూ లేరు. పురుష పోలీసులే నన్ను శారీరకంగా పట్టుకున్నారు” అని ఎస్ఎఫ్ఐ నాయకురాలు దీప్సితా ధార్ చెప్పారు.
జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏబీవీపీ ర్యాలీని కాసేపు నిలిపివేశారు. కానీ వారే గార్డ్‌రైల్స్, బారికేడ్లను తొలగించి 4 వ నెంబరు గేట్ వైపు దూసుకుపోయారు.
గేటు ఎక్కడానికి, దాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడంతో సహా గేటు దాటేందుకు సకల ప్రయత్నాలు చేశారు. దాంతో ఆ చిహ్నం విరిగిపోయింది.
గోడపై నుంచి రాళ్లు, గుడ్లు, ఇటుకలు, చెప్పులు, మురికి నీళ్ల సీసాలు విసిరేస్తుంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకులలాగా నిలబడిపోయారని ప్రాంగణంలో ఉన్న విద్యార్థులు చెప్పారు.
ఇంకా వామపక్షాల కోటగా పరిగణించబడుతున్న విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా అధికార భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక మద్దతుదారులు దాడులు చేస్తుంటే పోలీసు బలగాలు పక్కకు తప్పుకున్నాయి.
ఏబీవీపీ క్యాంపస్ వైపు వస్తోందని తెలుసుకున్న వామపక్ష మద్దతుదారులు, ఇది జరగడానికి పోలీసులే కారణమని ఆరోపించారు.
ఆ తర్వాత వారు కూడా బారికేడ్లను బద్దలు కొట్టుకుని గేట్ 4 వైపు వెళ్లారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ మద్దతుదారుల మధ్య కోపతాపాలు పెరిగాయి.
ఏబీవీపీ కూడా పోలీసులపై అసంతృప్తితో ఉంది. ఆ మూకలోని ఒక మహిళ గట్టిగా అరిచింది, “ఎఖన్ అమాదేర్ సర్కార్ చోల్చే, ఆర్ అమాదేరి అట్కే దిచ్చే పోలీస్. ఏటా కి కోరే హోయ్?(ఇప్పుడు రాష్ట్రంలో మన పార్టీ ప్రభుత్వం ఉంది. అయినా పోలీసులు మనల్ని అడ్డుకుంటున్నారు- ఇదేమి చోద్యం?)”. మరొక మద్దతుదారుడు పోలీసులు “నక్సల్స్” వైపు నిలబడ్డారని ఆరోపించారు.
ముందు రోజు రాత్రి బీజేపీ ఎమ్మెల్యే ప్రకటన..
జాదవ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే సర్బరి ముఖర్జీ అతివాద మద్దతుదారులతో కలిసి యూనివర్సిటీ బయట నిలబడి సుజన్ చక్రవర్తి, సృజన్ భట్టాచార్యలతో సహా వామపక్ష నాయకులను తీవ్ర పరిణామాలకు గురిచేస్తామని బుధవారం రాత్రి బెదిరించారు.
ఆమె “ఆజ్ సారా రాత్ తాండవ్ చోల్బే(ఈ రాత్రంతా భారీ తాండవం జరుగుతుంది)” అని ప్రకటించింది.
కొద్ది గంటల వ్యవధిలోనే, విద్యార్థులు, విశ్వవిద్యాలయ సిబ్బంది ‘బయటి వ్యక్తులు’గా చెప్పబడిన వారు ప్రాంగణం లోపల ఉన్నారు.
‘ది వైర్’ గురువారం వాట్సాప్ ద్వారా ముఖర్జీని సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె స్పందించలేదు.
ఈ వ్యాసం ప్రచురించే సమయానికి అధికార పార్టీ గానీ, విశ్వవిద్యాలయ యంత్రాంగం గానీ ఆమె నుంచి బహిరంగంగా ఎలాంటి వివరణ కోరలేదు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల కంటే చాలా పెద్ద వయస్సు ఉన్న కొందరు వ్యక్తులు, వామపక్ష జెండాలను పడగొట్టడం, పోస్టర్లను చింపడం, బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టడం వంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ‘ది వైర్’ వాటిని స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది. అరవిందో భవనం వెలుపల, సామాగ్రికి నిప్పు పెడుతుండగా “హ్యాపీ దివాలి” అని మనుషులు అనడం వినిపించింది. లోపల చిక్కుకున్న విద్యార్థులు కేకలు వేయడం వినిపించింది.
ఈ హింస తర్వాత జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరువలో ఉన్న జాదవ్‌పూర్ యూనివర్సిటీ మెయిన్ హాస్టల్‌కు పాకింది. భయాందోళనకు గురైన విద్యార్థులు సహాయం కోసం వేడుకుంటుండగా, రైట్-వింగ్ గూండాలు హాస్టల్ మెయిన్ గేట్‌ను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియో చూపించింది.
మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జోక్యం చేసుకోలేదు. తమను తాము కాపాడుకోవడానికి వదిలేయడంతో, విద్యార్థులు ఎట్టకేలకు మూకలను హాస్టల్లోకి రాకుండా నిరోధించగలిగారు.
ఆ సమయంలో క్యాంపస్‌లో ఉన్న ఒక విద్యార్థి ‘ది వైర్’తో మాట్లాడుతూ, “అధికార పార్టీ మద్దతు ఉన్న బయటి వ్యక్తులు మాపై దాడి చేసి మా క్యాంపస్‌ను ధ్వంసం చేశారు. బైక్‌లపై వచ్చిన 60 మంది గూండాలు లోపలికి వచ్చి మొత్తం క్యాంపస్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. నిన్న రాత్రి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు” వైస్ ఛాన్సలర్‌ను సంప్రదించలేకపోయామని, విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని, పోలీస్ హెల్ప్‌లైన్ 100 ద్వారా మౌఖికంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మరో విద్యార్థి వాపోయారు.
అయితే, ప్రమాదం గురించిన స్పష్టమైన సమాచారం అరవిందో భవన్‌లోని భద్రతా సిబ్బంది నుంచి వచ్చింది. “నిన్న రాత్రి, నేను 30 నుంచి 35 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులను అరవిందో భవనం లోపల దాచిపెట్టాను. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లకు తాళం వేశాను. లేకపోతే, వారు హత్యకు గురయ్యేవారు” అని ఆయన ‘ది వైర్’తో చెప్పారు.
బయటి వ్యక్తులు గేట్లు తెరవాలని డిమాండ్ చేశారని, అయితే తాను నిరాకరించానని గార్డు తెలిపారు. చివరకు పోలీసులు వచ్చిన రెండు మూడు గంటల తర్వాతే గార్డు దానిని తెరిచాడు.
ఆరోపణలను ఖండించిన ఏబీవీపీ, దూరంగా ఉండటానికి ప్రయత్నించి విఫలమైన బీజేపీ..
ఏబీవీపీ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది. హింసకు వామపక్ష విద్యార్థులే కారణమని ఆరోపించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ యూనిట్ ప్రెసిడెంట్ నిఖిల్ దాస్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి దీప్తిమాన్ కర్ సహా తమ సభ్యులపై దాడి జరిగిందని పేర్కొంది.
ఫెట్సూకి(ఎఫ్‌ఈటీఎస్‌యూ) చట్టపరమైన అధికారం లేదని, ఆ సమస్యను లేవనెత్తినందుకే తమ మద్దతుదారులపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపించింది.
తర్వాత, దాస్ స్వయంగా తెల్లవారుజామున 3 గంటలకే తాను, కర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపాడు.
గురువారం మధ్యాహ్నం, దాస్ క్యాంపస్ చుట్టూ తిరుగుతూ, విలేకరుల సమావేశం నిర్వహిస్తూ, ఫోన్ మాట్లాడటం కనిపించింది.
ఏబీవీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన శుభ్రబ్రత అధికారి గురువారం మాట్లాడుతూ “ఏది ఏమైనా మేము జాదవ్‌పూర్‌లో ప్రవేశిస్తాము. ఈ విషయంలో ఏబీవీపీకి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో దిమాగీ నక్సల్స్‌పై ప్రజాస్వామ్యబద్ధంగా సర్జికల్ స్ట్రైక్ ఉంటుంది.”
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు షమీక్ భట్టాచార్య మాట్లాడుతూ కాషాయ జెండాల కింద ఊరేగింపుగా వెళ్తున్న వ్యక్తులకు, పార్టీకి మధ్య ఎలాంటి అనుబంధం లేదని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
“ఏబీవీపీ అనేది ఒక స్వతంత్ర జాతీయవాద సంస్థ. బీజేపీతో వారికి ఎలాంటి సంబంధం లేదు. బీజేపీకి విద్యార్థి విభాగం లేదు. మా పార్టీ యూనివర్సిటీ క్యాంపస్‌ల లోపల ఎప్పుడూ పనిచేయలేదు” అని ఆయన మీడియా ముందు చెప్పారు.
అయితే, ఆయన ఆ తర్వాత ఇచ్చిన వివరణలో దొరికిపోయారు. హింస రోడ్డుపైకి పాకిన సమయంలో విశ్వవిద్యాలయం వెలుపల బీజేపీ ఎమ్మెల్యే సర్బరీ ముఖర్జీ ఉన్నారని భట్టాచార్య అంగీకరించారు.
“పరిస్థితిని అదుపు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేగా ఆమె అక్కడ ఉండి ప్రయత్నించారు” అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ మద్దతుదారులు ఏ జెండాలను తగలబెట్టలేదని భట్టాచార్య చెప్పారు. “ఇది మా సంస్కృతి కాదు” అని ఆయన పేర్కొన్నారు.
పోలీసుల సమాధానాలు అనేక ప్రశ్నలకు తావిచ్చాయి..
కోల్‌కతా పోలీసులకు చెందిన ఒక సీనియర్ అధికారి పేరు చెప్పకూడదనే షరతుపై ఈ 12 గంటల ఎపిసోడ్‌పై భిన్నమైన వివరాలు తెలియజేశారు.
“జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్(ఓసీ) వైస్ ఛాన్సలర్, ఇతర విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ వారిని సంప్రదించలేకపోయారు. తర్వాత డయల్ 100 ద్వారా క్యాంపస్‌లో అలజడిపై ఫిర్యాదు అందింది. ప్రొ-వైస్ ఛాన్సలర్ కూడా జాదవ్‌పూర్ పీఎస్ అధికారిని సంప్రదించి క్యాంపస్ లోపల పోలీసు సహాయం కోరారు” అని చెప్పారు.
“అప్పుడు పోలీసు బృందం క్యాంపస్‌లోకి ప్రవేశించి, బయటి వ్యక్తులను పంపించివేసింది. అరవిందో భవనం వెలుపల కొన్ని పోస్టర్లు, ఫెస్టూన్లు చించి, కాల్చివేయబడి ఉన్నట్లు గమనించింది. భవనం లోపల దాదాపు 50 నుంచి 60 మంది సభ్యులు కనిపించారు. అక్కడ సమావేశం ఇంకా కొనసాగుతోంది. బయటకు రావాలని కోరగా వారు వెళ్లేందుకు నిరాకరించారు” అని ఆయన పేర్కొన్నారు.
సురక్షితంగా భావించే క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు ఎందుకు, ఎలా ప్రవేశించారు? అరాచక మూకల నుంచి విద్యార్థులను కాపాడటానికి భవనంలో ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? జెండాలు తగులబెట్టి యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదు?
పెద్ద సంఖ్యలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించినప్పటికీ మరుసటి రోజు మధ్యాహ్నం ఏబీవీపీ ఒకదాని తర్వాత ఒకటి బారికేడ్లను బద్దలు కొట్టుకుని గేట్ నెంబర్ 4కి ఎలా చేరుకోగలిగింది? యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉన్న 8బీ క్రాసింగ్ వద్ద పోలీసులు వామపక్ష ఊరేగింపును అదుపు చేయగలిగారు.
అదే సందర్భంలో ఏబీవీపీ యూనివర్సిటీ గేట్‌కు చేరుకోకుండా, దాడి చేయకుండా ఎందుకు నిరోధించలేదు? ఈ ప్రశ్నలకు పోలీసులు జవాబు చెప్పాలి.
అది కావాలని చేసిన విలాసమా లేక అద్భుతమైన పోలీసు వైఫల్యమా అనే దానితో సంబంధం లేకపోయినా, ఫలితం ఒక్కటే. కాషాయ విధ్వంసకారులు క్యాంపస్‌కు చేరుకుని బారికేడ్లు ఇతరులకు వర్తించినట్లు తమకు వర్తించవని రుజువు చేశారు.
ఉపాధ్యాయులు హింసను ఖండించగా, విశ్వవిద్యాలయం స్పందన..
జాదవ్‌పూర్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(జూటా) అధ్యక్షుడు పార్థప్రతిమ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, “మధ్యరాత్రి 1:00 గంటలకు బయటి వ్యక్తులు ప్రవేశించి అలజడి సృష్టించడాన్ని ఖండించడానికి మాకు మాటలు చాలడం లేదు. అంతేకాకుండా దీన్ని బీజేపీ ఎందుకు రాజకీయంగా రెచ్చగొడుతున్నది అని మేము ప్రశ్నిస్తున్నాము.”
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా జూటా డిమాండ్ చేసింది. బుధవారం రాత్రి 4వ నంబర్ గేట్ తాళాన్ని ఎవరు పగులగొట్టారనే దానిపై విచారణ జరిపించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ధర్నా ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ చిరంజీబ్ భట్టాచార్య క్యాంపస్‌కు వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పారు.
వీసీ భట్టాచార్య పత్రికలతో మాట్లాడుతూ, “విశ్వవిద్యాలయం దేశానికి వెలుపల లేదు. కాబట్టి, భారతీయ న్యాయ సంహిత 2023 క్యాంపస్ లోపల కూడా వర్తిస్తుంది. ఏ చర్యలు తీసుకోవాలో, నేను దానికి అనుగుణంగా తీసుకుంటాను” అని చెప్పారు.
గురువారం రాత్రి ఆలస్యంగా వైస్ ఛాన్సలర్ విశ్వవిద్యాలయ భాగస్వాములకు ఇమెయిల్ పంపారు. అందులో ఆగస్టు 21 ఉదయానికల్లా ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
“క్యాంపస్‌లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన సమస్యలపై ఆగస్టు 19 రాత్రి(ఆగస్టు 20న కూడా) జరిగిన సంఘటనలపై విశ్వవిద్యాలయ అధికారి జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేస్తారు. ఆగస్టు 19 రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలు భద్రంగా ఉంచుతాము. అక్రమంగా క్యాంపస్ లోపలికి ప్రవేశించిన బయటి వ్యక్తులు, నేరానికి పాల్పడిన నేరస్థులను గుర్తించడానికి వీలుగా ఫుటేజ్‌లను విచారణ కమిటీకి అప్పగిస్తాము. జాదవ్‌పూర్ యూనివర్సిటీ వైపు ఏవైనా వైఫల్యాలు ఉంటే వాటిపై కూడా సదరు కమిటీ విచారణ జరుపుతుంది. తగిన సమయంలో సరైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటాము” అని వీసీ చెప్పారు.
వదంతులు, తనిఖీ చేయని నివేదికలు లేదా రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా ప్రభావితం కాకుండా ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విశ్వవిద్యాలయ పరిధిలోని అందరికీ వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, అధికారులు, సిబ్బంది భయం లేకుండా పనిచేసే విద్యా వాతావరణాన్ని పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
“రాత్రి 9 గంటల వరకు జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయుల తీవ్ర ఒత్తిడి తర్వాత, వైస్ ఛాన్సలర్ ఏబీవీపీ-ఎన్ఎస్ఎఫ్-ఆర్ఎస్ఎస్ గూండాల విధ్వంసాన్ని అంగీకరించారు. జేయూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉంచిన అన్ని డిమాండ్లకు అంగీకరించారు” అని ఆర్ఎస్ఎఫ్ కి చెందిన రాయ్ ఒక ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు. ఆయన ఇంకా ఇలా రాశారు “ప్రజలు ఐక్యమైతే, ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు.”
“గుర్తింపు కార్డు లేకుండా, ప్రవేశం నిషేధించబడింది” అని ముఖ్యంగా, గేట్ల వద్ద ఉన్న ఒక నోటీసు స్పష్టం చెబుతోంది.
అయినప్పటికీ, బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో క్యాంపస్‌లోకి ప్రవేశించి, తిరుగుతూ, సామాగ్రిని చించివేయడం, తగులబెట్టడం జరిగాయి. ఆ రోజు తర్వాత కూడా సమర్థవంతమైన భద్రతా తనిఖీలు లేవు.
ఏర్పాట్లను పరీక్షించేందుకు, ఈ విలేకరి 2వ నంబర్ గేట్ ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా లోపలికి ప్రవేశించి, క్యాంపస్ గుండా నడిచి, ఛాయాచిత్రాలు తీసి, వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. ఏ గార్డూ ఐడెంటిఫికేషన్ అడగలేదు.
విలేకరి ఆ తర్వాత మరో గేట్ ద్వారా వెళ్లిపోతున్నప్పుడు కూడా ఎవరూ ప్రశ్నించలేదు. ఎలాంటి తనిఖీ లేకుండా ఎవరైనా క్యాంపస్‌లోకి ప్రవేశించగలరని అనిపించడంతో తాము భయపడుతున్నామని క్యాంపస్‌లోని విద్యార్థులు చెప్పారు.
పాత ఆరోపణల పునరావృతం..
ఏబీవీపీకి చెందిన నిఖిల్ దాస్ వివాదాస్పద వ్యక్తి. 2014లో, యూనివర్సిటీ సంస్కృతి ఉత్సవంలో ఒక జూనియర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దాస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయన అప్పట్లో థర్డ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేశారు. ఆయన పలు రోజులు పోలీసు కస్టడీలో గడిపారు.
ఈ సంఘటన, ఫిర్యాదుపై యూనివర్సిటీ యాజమాన్యం నిర్వహించిన ప్రాథమిక విచారణ తర్వాత “హోక్ కొలోరోబ్” ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన అలజడికి దోహదపడింది.
విద్యార్థులపై పోలీసు చర్యలు, నాటి వైస్ ఛాన్సలర్ అభిజిత్ చక్రవర్తి రాజీనామా డిమాండ్‌తో ఉద్యమం జరిగింది. ఆ కేసు అంతటితో ముగిసింది.
దాస్ కూడా తనపై వచ్చిన ఆరోపణను ఖండించాడు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి యూనివర్సిటీలోని ఏబీవీపీ విభాగానికి ఎలా నాయకత్వం వహిస్తున్నాడని సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నించారు.
‘ది వైర్’ వ్యాఖ్యల అభ్యర్థనకు దాస్ స్పందించలేదు. “అప్పుడు నన్ను ఇరికించారు. నాకు కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చింది. పాత ఘటనను లాగడానికి ఎలాంటి ఆధారం లేదు” అని గురువారం ఫేస్బుక్ రీల్లో దాస్ చెప్పారు.
‘ది వైర్’ జర్నలిస్టుకు బెదిరింపులు..
గురువారం ‘ది వైర్’ రిపోర్టర్ పట్ల ఏబీవీపీ మద్దతుదారుల ప్రవర్తన బెదిరింపు ధోరణిలో ఉంది.
ఏబీవీపీ మద్దతుదారులు యూనివర్సిటీ వైపు మార్చ్‌కు సిద్ధమవుతున్నప్పుడు, “వీర్ సావర్కర్ జిందాబాద్”, “భారత్ మాతా కీ జై”, “నక్సల్స్‌కు ఇక్కడ స్థానం లేదు”, “ఎస్ఎఫ్ఐ-యర్ చమ్రా, గుటియే నేబో ఆమ్రా” అని నినాదాలు చేశారు. దాని అర్థం, “మేము ఎస్ఎఫ్ఐ చర్మాన్ని చుట్ట చుడతాము.”
దాస్‌పై ఉన్న ఆరోపణ గురించి ఈ రిపోర్టర్ అడిగినప్పుడు, ఏబీవీపీ మద్దతుదారులు మొదట ఆ ప్రశ్నను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అప్పుడు గుంపులోని ఇద్దరు వ్యక్తులు భయపెట్టే ప్రయత్నంలో, “నామ్ కి మామని? రాతే దేఖా కోరి?(నీ పేరేంటి డార్లింగ్? రాత్రి కలుద్దామా?)” అన్నారు.
జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వెలుపల కూడా ఈ బెదిరింపులు కొనసాగాయి. పోలీసు ఏర్పాట్లను ఫోటో తీస్తుండగా, ఈ విలేకరి ఇద్దరు వ్యక్తులు అధికారులతో మాట్లాడుతున్న చిత్రాన్ని వారికి తెలియకుండా తీశారు.
కొద్ది సెకన్ల తర్వాత, మూడో వ్యక్తి ఇది చూసి, ఏం ఫోటోలు తీశారని ఆగ్రహంతో ప్రశ్నించాడు. ప్రచురణ సమయానికి పోలీసుల పాత్రపై వచ్చిన ప్రశ్నలకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్, సౌత్ సబర్బన్ డివిజన్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమేష్ జీ. ఖండబాహలే స్పందించలేదు.
గురువారం నాటి దాడి సంఘ్ పరివార్ జాదవ్‌పూర్ యూనివర్సిటీలోకి బలవంతంగా ప్రవేశించడానికి చేసిన మొదటి ప్రయత్నం కాదు.
కనీసం 2016 నుంచి, ఏబీవీపీ పదేపదే దాని గేట్ల వైపు మార్చ్ చేసింది, క్యాంపస్‌లోకి రాజకీయ ప్రముఖులను తీసుకువచ్చింది.
బయటి వ్యక్తులను సమీకరించి యూనివర్సిటీలోకి తీసుకొని వచ్చి ఎన్నికల హడావుడికి ప్రయత్నించింది. ప్రతి ఘర్షణ కూడా చాలా ప్రణాళికాబద్ధమైన ప్రచారంతో కూడి ఉంటుంది.
జాదవ్‌పూర్ “దేశద్రోహుల కేంద్రం”, వేర్పాటువాదులు, కమ్యూనిస్టుల “అడ్డా”, “బాలాకోట్ వంటి సర్జికల్ స్ట్రైక్”కు తగిన ప్రదేశం అని ఏబీవీపీ ప్రచారం చేసేది.
సెప్టెంబరు 2019లో, ఏబీవీపీ మద్దతుదారులు క్యాంపస్‌పై దాడి చేసి, ఆర్ట్స్ విద్యార్థుల యూనియన్ గదిని ధ్వంసం చేశారు.
సైకిళ్లు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలకు నిప్పు పెట్టారు. 2023 లో, ర్యాగింగ్ ఆరోపణల కారణంగా ఒక యువ విద్యార్థి మరణించిన సంఘటనను కూడా “దేశద్రోహ శక్తులను” తరిమికొట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడానికి ఉపయోగించుకున్నారు.
అన్వేషా బెనర్జీ రాసిన ది వైర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైంది. దానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
