ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అత్యంత గోప్యంగా జారీ చేస్తుంది. దీంతో, తమకు వచ్చిన నోటీసులను వినియోగదారులు బహిర్గతం చేయడం ద్వారా ఈ సెన్సార్షిప్ వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను, ఆయన వ్యవహార శైలిని, జవాబుదారీతనం నుంచి తప్పించుకునే తీరును ఎగతాళి చేస్తూ లేదా తీవ్రంగా విమర్శిస్తూ పెడుతున్న అనేక సోషల్ మీడియా పోస్టులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69Aను ప్రయోగిస్తోంది.
గమనించాల్సిందేంటే, తొలగిస్తున్న వాటన్నింటిలో ఒకే విధమైన లక్షణం- విమర్శ ఉంటుంది.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా జరిగిన తడబాటు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఆయన వహించిన వివాదాస్పద మౌనం, ఇరాన్ నేత హత్య, భారత్‌కు సమీపంలోనే ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ తొలగింపుల పరంపర పెరిగింది.
అదే సమయంలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సమానత్వ నిబంధనలను విమర్శించే ఖాతాలను కూడా గత నెల రోజులుగా లక్ష్యంగా చేసుకున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
ఐటీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీవై) ఈ ఆదేశాలను అత్యంత గోప్యంగా ఉంచుతుంది.
దీంతో, ‘ఎక్స్’ వేదిక తమకు పంపిన ‘టేక్‌డౌన్’ నోటీసులను వినియోగదారులు స్వయంగా పబ్లిష్ చేస్తుండటంతో- ఈ సెన్సార్షిప్ ఆధారాలు బయటపడుతున్నాయి.
ఈ గోప్యత కారణంగా సమగ్రమైన గణాంకాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులను తొలగించినప్పుడు ‘ఎక్స్’ తన వినియోగదారులకు సమాచారం ఇస్తుంది.
కానీ, ప్రభుత్వ తొలగింపుల పూర్తి వివరాలతో కూడిన పారదర్శక నివేదికలను ఇప్పుడు ప్రచురించడం లేదు.
2025 జనవరి నుంచి జూన్ వరకు(పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న తాజా డేటా) మెటా సంస్థ డేటాను ‘ది హిందూ’ వార్తా పత్రిక సమీక్షించింది.
దీని ప్రకారం, 2023లో ఇదే కాలంతో పోలిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో తొలగించిన కంటెంట్ ఏకంగా 300% పెరిగింది.
అయితే, సోషల్ మీడియాలో @zerix_v వంటి వారు క్రోడీకరించిన జాబితాలు, ఇతరత్రా కనిపించిన సాక్ష్యాలను బట్టి చూస్తే, ఈ సెన్సార్షిప్ ట్రెండ్ ఆ తర్వాత మరింత విపరీతంగా పెరిగిందని అర్థమవుతోంది.
కార్టూన్లపై సెన్సార్ కత్తెర
2026 మార్చి 10న, భారత్-ఇరాన్ సంబంధాలు; అమెరికాను ఉద్దేశించి తాను వేసిన రెండు కార్టూన్లను ‘ఎక్స్’ భారతదేశంలో నిలిపివేసిందని ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య వెల్లడించారు.
“భారత్-ఇరాన్ స్నేహం చారిత్రకమైనది!” అనే శీర్షికతో ఉన్న మొదటి కార్టూన్లో, కళ్లకు గంతలు కట్టుకున్న మోదీ పక్కనే “అమెరికా & ఇజ్రాయెల్ చేతిలో హతం” అని రాసి ఉంటుంది.
ఇక రెండో చిత్రంలో, “అతిథి దేవోభవ” అని రాసిన బట్టను నోటికి కట్టుకున్న వ్యక్తి బొమ్మ ఉండి, దాని పక్కకు “భారత్‌లో నావికాదళ విన్యాసాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌక ‘ఐఆర్ఐఎస్ దెనా’ను ధ్వంసం చేసిన అమెరికా జలాంతర్గామి” అనే క్యాప్షన్ ఉంటుంది.
“ఈ ప్రభుత్వంలో చాలా మంది ‘తేజస్వీ లోగ్'(తెలివిగల వాళ్లు) ఉన్నప్పటికీ, నేనొక ఉచిత సలహా ఇస్తాను,” అని ఆచార్య అన్నారు.
“సోషల్ మీడియాలో నా 15 ఏళ్ల అనుభవం నాకు నేర్పిందేమిటంటే, ఏ ప్రభుత్వమైనా లేదా రాజకీయ నాయకుడైనా ఒక కార్టూన్‌ను బలవంతంగా ఆపాలని చూస్తే, ఆ కార్టూన్ సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువ మంది పాఠకులకు చేరువవుతుంది.”
తన డిగ్రీ సర్టిఫికెట్లను ప్రజలకు చూపించడానికి మోదీ ఇష్టపడరని ఎగతాళి చేస్తూ @Doc_RGM పోస్ట్ చేసిన ఒక వీడియోను కూడా బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వినియోగదారులు పంచుకున్న నోటీసులను పరిశీలిస్తే, వ్యంగ్య మీమ్స్ నుంచి ప్రతిపక్షాల రాజకీయ విమర్శల వరకు విస్తృతమైన కంటెంట్‌ను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
భారతదేశంలో కంటెంట్‌ను నిలిపివేయాల్సిన చట్టపరమైన బాధ్యత తమపై ఉందని ‘ఎక్స్’ తన నోటీసుల్లో తెలుపుతూనే, ఈ ఆదేశాలను సవాలు చేయాలనుకునే వినియోగదారులు నేరుగా MeitYని cyberlaw@meity.gov.in ద్వారా సంప్రదించవచ్చని సలహా ఇస్తోంది.
గత నెలలో జారీ అయిన ఆర్డర్లన్నింటినీ పరిశీలిస్తే, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కిందనే ఈ తొలగింపులు జరిగినట్లు ‘ఎక్స్’ స్పష్టంగా వినియోగదారులకు తెలియజేసింది.
గతంలో ఎన్నడూ ఇలా స్పష్టంగా సెక్షన్‌ను పేర్కొనలేదు; కేవలం “చట్టపరమైన డిమాండ్” అని మాత్రమే సాధారణంగా చెప్పేవారు.
వివిధ వేదికలలోని అనేక మంది వినియోగదారులు ఇలాంటి టేక్‌డౌన్ నోటీసుల స్క్రీన్షాట్లను పోస్ట్ చేస్తున్నప్పటికీ, కింద పేర్కొన్న ఉదంతాలను ‘ది వైర్’ స్వయంగా ధృవీకరించింది.
లక్ష్యంగా చేసుకున్న ఖాతాలు, కంటెంట్
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ పోస్టులు పెట్టిన జర్నలిస్ట్ సుశాంత్ సింగ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ‘Amockx2022’ అనే ట్విట్టర్ హ్యాండిల్స్ నోటీసులు అందుకున్నాయి.
సుశాంత్ సింగ్ బ్లాక్ అయిన పోస్ట్‌లో ఒక వార్తా క్లిప్పింగ్ ఉంది- అందులో దివంగత ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో “స్పష్టమైన సంబంధం” ఉన్న వ్యక్తి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా కొనసాగడం ఒక్క మన దేశంలోనే సాధ్యమేమో అని ఆరోపించారు.
ఇక ప్రశాంత్ భూషణ్ తన పోస్ట్‌లో, ఎప్స్టీన్ కేసుతో సంబంధం ఉన్న ప్రపంచవ్యాప్త అరెస్టులు, రాజీనామాలకు సంబంధించిన గ్రాఫిక్‌ను ఉంచుతూ, ఎప్స్టీన్తో “దొంగల వలె కుమ్మక్కై” అంత సన్నిహితంగా ఉన్నప్పటికీ పూరీ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని ఆరోపించారు.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనను కూడా ఆయన ప్రస్తావించారు.
‘Amockx2022’ ఖాతా కూడా రాహుల్ గాంధీ వీడియోను పంచుకుంటే ఇదే తరహా నోటీసును అందుకుంది.
ఫైల్స్‌లో ఇతర పేర్లు ఉన్నందున వాటితో “బ్లాక్మెయిల్” చేయడానికి ఆ మంత్రి పేరును వాడుకుంటున్నారని, అందుకే మోదీ “లొంగిపోయారని” ఆ పోస్ట్‌లో ఆరోపించారు.
అమెరికా నావికాదళం ఇరాన్ నౌకను ముంచేసినా భారత్ మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ @sandeep_PT, @iArpitSpeaks చేసిన పోస్టులను తొలగించాలని ఆదేశాలు వచ్చాయి.
రెండో పోస్ట్‌లో, హిందూ మహాసముద్ర ప్రాంతం తనకు ఎంత ముఖ్యమో చెబుతూ మోదీ 2016లో చేసిన ట్వీట్‌ను గుర్తుచేస్తూ, ప్రధానిని పరోక్షంగా అబద్ధాలకోరుగా అభివర్ణించారు:
“ఒకానొకప్పుడు ఆయన ఇలా చెప్పారు – ‘ఈ ప్రభుత్వం విమర్శలకు గురికావాలని నేను కోరుకుంటున్నాను, విమర్శలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి’. ఏది ఏమైనా,” అని తన సెన్సార్ ట్వీట్ వార్తను పంచుకుంటూ శర్మ పేర్కొన్నారు.
‘Honest Cricket Lover’ అనే వినియోగదారుడి ఖాతాలోని పోస్ట్‌ను కూడా నిలిపివేశారు.
ఇందులో ప్రధానిపై పలు ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఆపేశారని, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారని, అమెరికా ఆదేశాల మేరకే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేశారని ఆ పోస్ట్ పేర్కొంది.
ఇరాన్ నౌక మునిగిపోయిన ఘటన తర్వాత మోదీ భారతదేశాన్ని “అమెరికాకు అనధికారిక బానిసగా” మార్చేశారా అని కూడా ఆ పోస్ట్ ప్రశ్నించింది.
‘Gss’ అనే యూజర్ “ప్రస్తుతం భారతదేశ విదేశీ విధానం” అనే క్యాప్షన్‌తో బాలీవుడ్ నటుడు నవ్వుతున్న వీడియో థంబ్‌నెయిల్‌ను పోస్ట్ చేయగా, దానిని తొలగించారు.
విదేశీ నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మోదీ ఇబ్బందికరంగా నవ్వే విధానాన్ని ఎగతాళి చేస్తూ @nkk_123 చేసిన పోస్ట్‌ను కూడా ఐటీ చట్టం సెక్షన్ 69A కింద బ్లాక్ చేయాలని ఆదేశించారు.
సంస్కృత సుభాషితాన్ని మోదీ తప్పుగా చదివిన వీడియోను ప్రస్తావిస్తూ హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా పెట్టిన పోస్టులను కూడా తొలగించారు.
‘Team Saath Official’ అనే ఖాతా “ఈ ప్రభుత్వం భయపడిపోయింది” అని క్యాప్షన్ పెట్టి, మోదీ ట్రంప్‌కు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఎడిట్ చేసిన ఒక చిత్రాన్ని పోస్ట్ చేయగా దాన్ని బ్లాక్ చేశారు.
ఆ చిత్రంలో “సార్, నేను టాయిలెట్‌కి వెళ్లొచ్చా?” అనే టెక్స్ట్ కూడా ఉంది.
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు గురించి ‘మింట్’ పత్రిక వేసిన ట్వీట్‌కు “పూర్తిగా నిరుపయోగం” అనే పదాన్ని జోడిస్తూ @kapsology చేసిన పోస్ట్‌ను సైతం తొలగించాలని ఆదేశాలు వెళ్లాయి.
మరో యూజర్ ‘SirKazam’ చేసిన టెక్స్ట్ పోస్ట్ కూడా సెన్సార్‌కు గురైంది. అందులో “పులిని పెంచుకుంటున్నాం (షరతులు వర్తిస్తాయి)”, “56 అంగుళాలు* *కేవలం 12 నాటికల్ మైళ్ల వరకే” అని రాసి ఉంది.
ఎక్స్, ఇన్స్టాగ్రామ్ రెండు వేదికలపైనా మోదీపై ఉన్న రెండు వ్యంగ్య మ్యూజిక్ వీడియోలకు సంబంధించి ‘ది వైర్’ సంస్థ టేక్‌డౌన్ నోటీసులు అందుకుంది.
ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ రీపోస్ట్ చేసిన ఒక పోస్ట్‌ను కూడా తొలగించారు.
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన తొమ్మిది ఏఐ జెనరేటెడ్ వ్యంగ్య పోస్టులను ఐటీ నిబంధనల ప్రకారం లేబుల్ చేశారు.
అయినప్పటికీ, వాటిని తొలగించారని ఫిబ్రవరి 14న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే తెలిపారు.
ఏఐ సమ్మిట్‌లో జరిగిన నిరసనకు మద్దతుగా షబ్నం హష్మీ చేసిన పోస్ట్‌ను కూడా తొలగించారు.
పవన్ ఝా వైరల్ పాట ‘ఆల్ ఇజ్ హెల్’లోని కొంత భాగాన్ని పంచుకున్న వింగ్ కమాండర్ (రిటైర్డ్) అనుమా ఆచార్య ట్వీట్ కూడా భారతీయ వీక్షకులకు కనిపించకుండా బ్లాక్ చేశారు.
ఈ వైరల్ పాట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంది కానీ, అందులో మోదీ పేరు గానీ, ఫొటో గానీ ఉండదు.
అయితే ఆచార్య తన పోస్ట్‌లో మోదీ ఫొటోను జత చేయడం వల్లే బహుశా అది సెన్సార్‌కు గురై ఉండొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక) నిబంధనలు-2026 ను విమర్శించే ఖాతాలను భారతదేశంలో నిలిపివేశారు.
ఇందులో 2.7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న హిందూ కార్యకర్త సార్థక్ భగత్ ఖాతాతో పాటు, రెండు లక్షల ఫాలోవర్లు ఉన్న మితవాద ఖాతా ‘@woke_kashmiri’ కూడా ఉన్నాయి.
ఈ సెన్సార్షిప్ వల్ల ది వైర్ స్వంత సోషల్ మీడియా ఖాతాలు కూడా పదేపదే బ్లాక్‌లకు, అంతరాయాలకు గురయ్యాయి.
సెన్సార్ ఎలా జరుగుతుందో వ్యంగ్యంగా చెప్పే ఒక వీడియో ఇక్కడ ఉంది(అయితే ఆ వీడియో ఇంకా బ్లాక్ కాలేదు.
న్యాయపరమైన చట్రం, పారదర్శకత లోపం
సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు ప్రణేష్ ప్రకాష్, #69A, #censorship అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ‘Team Saath Official’ టేక్‌డౌన్ నోటీసును పంచుకుంటూ ఈ చర్యలను ఎక్స్ వేదికగా తప్పుబట్టారు.
ఈ ఆదేశాలు “రాజ్యాంగ విరుద్ధం” అని, ఎందుకంటే వినియోగదారులకు ముందుగా తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా, పబ్లిక్‌గా “కారణాలతో కూడిన ఆదేశాలు” లేవని ఆయన పేర్కొన్నారు.
2024 జూన్‌లో ‘ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూ’లో ప్రచురితమైన ఒక పత్రంలో, ఈ ఆదేశాలకు వీలు కల్పిస్తున్న న్యాయపరమైన చట్రాన్ని ప్రకాష్ విశ్లేషించారు.
చట్టబద్ధత, చట్టబద్ధమైన లక్ష్యాలు, దామాషాకు సంబంధించి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం విధించిన ప్రమాణాలకు ఈ దేశీయ చట్టం సరితూగడం లేదని ఆయన గుర్తించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార ప్రాప్యతను నిరోధించే విధానం, రక్షణలు) నిబంధనలు, 2009లోని రూల్ 16 ప్రకారం- ప్రభుత్వ అభ్యర్థనలకు “కఠినమైన గోప్యత” తప్పనిసరని ప్రకాష్ తన పత్రంలో రాశారు.
ఈ పారదర్శకత లోపం వల్ల, బ్లాక్‌కు గురైన వారు దాన్ని చట్టపరంగా సవాలు చేసే అవకాశం లేకుండా పోతోందని ఆయన వాదించారు.
ఒకవేళ వినియోగదారులకు బ్లాక్ గురించి నోటీసు వచ్చినా, ఏ ప్రభుత్వ విభాగం దీన్ని ఆదేశించింది? ఏ నిర్దిష్ట చట్టపరమైన ఆధారంతో ఆదేశించింది? లేదా పరిష్కారం కోసం ఎవరిని ఆశ్రయించాలి? అనే విషయాలపై ఎలాంటి స్పష్టతా ఉండటం లేదు.
శ్రేయా సింఘాల్ కేసులో తగిన విధానపరమైన రక్షణలు ఉన్నాయన్న కారణంతో సుప్రీంకోర్టు సెక్షన్ 69ఏ రాజ్యాంగబద్ధతను సమర్థించినప్పటికీ, రూల్ 16 సృష్టిస్తున్న గోప్యత కారణంగా “అదృశ్య సెన్సార్షిప్” రాజ్యమేలుతోందని ప్రకాష్ వాదించారు.
శ్రేయా సింఘాల్ తీర్పులో “ఇటువంటి బ్లాకింగ్ ఆదేశాలకు గల కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలి, తద్వారా వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా సవాలు చేసే అవకాశం ఉంటుంది” అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇంటర్నెట్ షట్డౌన్ల విషయంలో “ఆదేశాలను పబ్లిక్ చేయడం ప్రజాస్వామ్య విధి” అని సుప్రీంకోర్టు ఇచ్చిన అనురాధా భాసిన్ తీర్పును, ప్రస్తుత గోప్యతా విధానంతో ఆయన పోల్చి చూశారు.
అయితే ఇంటర్నెట్ షట్‌డౌన్ తీర్పు ఇంకా వెబ్సైట్ బ్లాకింగ్ ఆదేశాలకు వర్తించలేదని తెలిపారు.
కంటెంట్‌ను బ్లాక్ చేయడం “అవసరం లేదా సమయోచితం” అని కేంద్రం భావిస్తే, బ్లాక్ చేయడానికి సెక్షన్ 69ఏ అనుమతిస్తుందని ఆ పత్రం వివరిస్తుంది.
“సమయోచితం— అంటే కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తగినది లేదా అనువైనది అనే లక్షణం— ఇది కచ్చితంగా ‘అవసరం’ కంటే చాలా తక్కువ స్థాయి ప్రమాణం,” అని ప్రకాష్ ఆ పత్రంలో పేర్కొన్నారు.
ఇటువంటి చర్యలు భావప్రకటనా స్వేచ్ఛపై తీవ్రమైన భారాన్ని మోపుతాయని, బ్లాక్‌లకు నిర్దిష్ట కాలపరిమితి లేదని, ఇది చట్టబద్ధ పాలన లోపాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన తెలిపారు.
ప్లాట్‌ఫామ్‌ల మీదున్న ఒత్తిడికి తోడు, ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద వినియోగదారుల పోస్టుల వల్ల వచ్చే చట్టపరమైన బాధ్యత నుంచి సోషల్ మీడియా సంస్థలకు లభించే “సేఫ్ హార్బర్” గడువును 24-36 గంటల నుంచి కేవలం రెండు, మూడు గంటలకు కుదించారు.
ఈ ప్రత్యేక లా ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు సెక్షన్ 69ఏ ఆదేశాలలా చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
అయినప్పటికీ, ఆ పోస్ట్ నిజంగా చట్టవిరుద్ధమా కాదా అని నిర్ధారించుకునే సమయం లేకపోవడంతో, సంస్థలకు ఆ ఆదేశాలను వేగంగా పాటించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.





