ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య హక్కును సాధించే అసంపూర్ణ ప్రయాణం: జీవితం–మరణం మధ్య పోరాటం పుస్తకం నుంచి కొంత భాగం. ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది మొదటి భాగం.
హర్ష్ మందర్ తన కొత్త పుస్తకంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు.
ప్రాణాంతకమైన బొంబాయి ప్లేగు మహమ్మారి సమయంలో మానవత్వంతో వ్యవహరించిన కొద్దిమంది దూరదృష్టి గల వలస పాలక అధికారులు, అలాగే నార్మన్ బెత్యూన్ జీవిత అనుభవాలు మనకు ఒక కీలకమైన పాఠాన్ని నేర్పుతాయని ఆయన చెబుతారు.
ఆ పాఠం ఏమిటంటే మనిషి ఆరోగ్యం అనేది కేవలం మంచి ఆసుపత్రులు, మందులు, వైద్యులు ఉన్నంత మాత్రాన సాధ్యపడదు. ఆరోగ్యాన్ని నిర్ణయించే అనేక సామాజిక అంశాలు కూడా అంతే కీలకమైనవి. వాటిలో సరైన పోషకాహారం, గౌరవప్రదమైన ఉపాధి, సురక్షితమైన నివాసం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత, తగిన గాలి ప్రసరణ, సామాజిక భద్రత లాంటి ప్రాథమిక అవసరాలు ఉంటాయి.
ఈ అంశాలపై అనేక మంది పరిశోధకులు విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు.
వాటి ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే కేవలం వైద్య సేవలు అందించడం మాత్రమే కాదని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక పరిస్థితులను కూడా మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతేనని ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరిగిందని హర్ష్ మందర్ వివరిస్తారు.
వ్యాధులకు సూక్ష్మక్రిములే కాదు, పేదరికమూ కారణమే..
జర్మన్ తత్వవేత్త కారల్ మార్క్స్‌కు అత్యంత సన్నిహిత సహచరుడైన ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ కొన్ని వ్యాధులు వ్యాపించడానికి సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఎలా ప్రధాన కారణాలవుతాయో శాస్త్రీయంగా గుర్తించిన తొలి ప్రముఖుల్లో ఒకరు.
ఆ కాలంలో లండన్‌లోని కార్మిక వర్గంలో టైఫస్, స్కార్లెట్ ఫీవర్ లాంటి అంటువ్యాధులు విస్తృతంగా వ్యాపించాయి.
కార్మికులు అత్యంత అపరిశుభ్రమైన, దయనీయమైన నివాస పరిస్థితుల్లో జీవించడానికి బలవంతం చేయబడటమే ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన వారు సులభంగా పడటానికి ప్రధాన కారణమని ఎంగెల్స్ గుర్తించారు.
ఈ పరిశీలన ద్వారా ఎంగెల్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. వ్యాధులకు కేవలం సూక్ష్మక్రిములే కారణం కావు.
పేదరికం, అస్వచ్ఛమైన నివాసాలు, దారుణమైన జీవన పరిస్థితులు లాంటి సామాజిక, ఆర్థిక అసమానతలు కూడా వ్యాధుల వ్యాప్తిని పెంచే ప్రధాన కారణాలు.
ఇదే తరువాత ప్రజారోగ్య విధానాల్లో ఆరోగ్యానికి సంబంధించిన సామాజిక నిర్ణాయక అంశాలు అనే భావనకు బలమైన పునాది అయింది.
మెరుగైన పోషకాహారంతో వ్యాధి నిరోధక శక్తి..
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ పరిశోధనల తర్వాత దాదాపు ఒక శతాబ్దం గడిచిన అనంతరం బ్రిటిష్ వైద్య పరిశోధకుడు థామస్ మెక్యూన్ ఆ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లాడు.
ఆయన అధ్యయనాల ప్రకారం 19వ శతాబ్దం ద్వితీయార్థంలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడటంతో అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల రేటు స్పష్టంగా తగ్గింది.
అయితే ఈ మార్పుకు పారిశుద్ధ్య చర్యలు ఒక్కటే కారణం కాదని మెక్యూన్ అభిప్రాయపడ్డాడు.
వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, ప్రజలకు ఆహార సరఫరా మెరుగుపడడం లాంటి అంశాలే అంటువ్యాధుల మరణాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించాయని ఆయన ప్రతిపాదించాడు.
అంటే ప్రజలకు మెరుగైన పోషకాహారం అందుబాటులోకి రావడం వల్ల వారి శారీరక నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే సామర్థ్యం కూడా పెరిగిందని ఆయన భావించాడు.
డ్రమండ్, మేసన్ నిర్వహించిన మరో ముఖ్యమైన అనుభవాధారిత అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చూపించింది.
వారి పరిశోధన ప్రకారం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు మధుమేహాన్ని నియంత్రించడానికి అవసరమైన జీవన విధానాన్ని(అనగా సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన మందులు కొనుగోలు చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం లాంటి చికిత్సా విధానాన్ని) అనుసరించలేకపోతున్నారు.
మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో కేవలం వైద్య సలహా ఉండటం మాత్రమే సరిపోదు.
పేదరికం, ఆర్థిక పరిమితులు లాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే రోగులు చికిత్సను సక్రమంగా కొనసాగించకుండా అడ్డుకుంటాయని డ్రమండ్, మేసన్ తమ అధ్యయనంలో నిర్ధారించారు.
పంజాబ్‌లో పేదరికం, పోషకాహార లోపం: మలేరియా మరణాల వెనుక ఉన్న సామాజిక కారణాలు..
ప్రజారోగ్య పరిశోధకురాలు షీలా జుర్బ్రిగ్ 19, 20వ శతాబ్దాల పంజాబ్ చరిత్రను అధ్యయనం చేసి మలేరియా వల్ల అధిక మరణాలకు కేవలం దోమలు లేదా వ్యాధి కారకాలు మాత్రమే కారణం కాదని, పేదరికం, పోషకాహార లోపం కూడా ప్రధాన కారణాలని నిర్ధారించారు.
ఆమె పరిశోధన ప్రకారం 19వ శతాబ్దం చివరి నుంచి పంజాబ్‌లో భారీ మలేరియా మహమ్మారులు సంభవించాయి.
ఈ కాలంలో ఆహార ధాన్యాల ధరలు తీవ్రమైన స్థాయిలో పెరగడం, కరువు పరిస్థితులను తలపించే ఆహార కొరత ఏర్పడడం వల్ల పేద ప్రజలు తగినంత పోషకాహారం పొందలేకపోయారు.
దీనివల్ల వారి శరీర నిరోధక శక్తి తగ్గి మలేరియా బారిన పడినప్పుడు మరణాల సంఖ్య పెరిగింది.
షీలా జుర్బ్రిగ్ మరో ముఖ్యమైన మార్పును కూడా గుర్తించారు.
1870 తర్వాత రైల్వేలు అభివృద్ధి చెందడంతో పెద్ద భూస్వాములు గ్రామాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచడం కంటే దానిని మార్కెట్లకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు.
దీంతో గ్రామాల్లో ధాన్యం కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగాయి.
ఈ పరిస్థితి ముఖ్యంగా భూమిలేని వ్యవసాయ కూలీలు, చిన్న రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.
అదనంగా కూలీలకు పంట రూపంలో కాకుండా నగదు రూపంలో వేతనాలు చెల్లించడం, అలాగే వడ్డీ వ్యాపారుల అప్పుల భారం పెరగడం వల్ల అనేక కుటుంబాలు ఆకలికి దగ్గరైన దుస్థితికి చేరుకున్నాయి.
ఈ పోషకాహార లోపం, పేదరికమే పంజాబ్‌లో మలేరియా మరణాల రేటు పెరగడానికి ముఖ్యమైన సామాజిక కారణాలని షీలా జుర్బ్రిగ్ తన అధ్యయనంలో వివరించారు.
కాశ్మీరీ శాలువా నేతల విషాదం– మలేరియా కంటే ముందే పేదరికం వారిని బలహీనులను చేసింది..
షీలా జుర్బ్రిగ్ తన అధ్యయనంలో మరో విషాదకరమైన ఉదాహరణను ప్రస్తావిస్తారు.
1830లలో కరువు కారణంగా కాశ్మీర్ నుంచి పంజాబ్‌కు వలస వచ్చిన కాశ్మీరీ శాలువా నేతలు కూడా మలేరియా వల్ల తీవ్రంగా నష్టపోయిన వర్గాల్లో ఒకరని ఆమె చెబుతారు.
వారి సంప్రదాయ వస్త్ర పరిశ్రమపై బ్రిటన్‌లో తయారైన చవకైన వస్త్రాల ప్రవాహం తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కాశ్మీరీ నేతల జీవనోపాధి దెబ్బతిని, వారు తీవ్రమైన పేదరికంలోకి జారిపోయారు.
ఆర్థికంగా బలహీనపడిన ఈ వర్గం మలేరియా మహమ్మారి సమయంలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది.
ఈ అధ్యయనం ఆధారంగా షీలా జుర్బ్రిగ్ ఒక ముఖ్యమైన నిర్ధారణకు వచ్చారు. 1868 నుంచి 1940ల వరకు పంజాబ్‌లో మలేరియా విస్తృతంగా వ్యాపించినప్పటికీ మలేరియా కారణంగా మరణించిన వారిలో అధిక భాగం పోషకాహార లోపంతో బాధపడుతున్న అత్యంత పేద వర్గాల ప్రజలేనని ఆమె పేర్కొన్నారు.
దీని ద్వారా ఆమె చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే మలేరియా మరణాలను నిర్ణయించింది కేవలం వ్యాధి మాత్రమే కాదని పేదరికం, పోషకాహార లోపం, జీవనోపాధి కోల్పోవడం లాంటి సామాజిక-ఆర్థిక పరిస్థితులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని.
ఇదే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక నిర్ణాయక అంశాలు అనే భావనకు బలమైన ఉదాహరణగా నిలుస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని పెంచేది వ్యక్తిగత అలవాట్లు మాత్రమే కాదు. సామాజిక, ఆర్థిక అసమానతలూ కారణమే.
పరిశోధకుల అధ్యయనాల ప్రకారం తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాలు దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని అత్యధికంగా ఎదుర్కొంటున్నాయి.
ఈ దేశాల్లో ఒకవైపు అంటువ్యాధులు ఇంకా కొనసాగుతుండగా మరోవైపు అంటుకోని వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య వ్యవస్థపై రెండింతల భారం పడుతోంది.
బ్రెజిల్, చైనా, భారత్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాలు; అంటువ్యాధులు, మాతృ ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపాల వల్ల కలిగే మరణాల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
