పత్రికా స్వేచ్ఛ అనేది ఒక దేశంలో ప్రజాస్వామ్యానికి ఎంతటి ప్రాణవాయువో అర్థం కావాలంటే రెండు విరుద్ధ ప్రపంచాలను చూడాలి.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) నివేదిక ప్రకారం, 180 దేశాల ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో నార్వే వరుసగా పదో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచి విశ్వవిజేతగా నిలిచింది.
అదే సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పుకునే భారతదేశం ఘోరంగా 157వ స్థానానికి పడిపోయింది.
ఈ రెండు దేశాల మధ్య ఉన్న అసలు తేడా ఆర్థిక సంపదలో కాదు, నిజాన్ని అంగీకరించే సంస్కృతిలో ఉంది. ఈ రెండు స్థానాల మధ్య ఉన్న వ్యత్యాసమే- ఆయా దేశాల పాలకుల జవాబుదారీతనానికి, ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పడుతోంది.
నార్వేలో అవినీతి ఎందుకు లేదు?
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో నార్వే అగ్రగామి.
అక్కడ అవినీతి పుట్టకముందే సమాధి అవ్వడానికి ప్రధాన కారణం—అక్కడి పత్రికా రంగం పాలకులకు పెట్టే ‘సహస్ర నేత్రాల’ పహారా.
నార్వేలో మీడియా అనేది ప్రభుత్వానికి భజన చేసే సంస్థ కాదు. ప్రజల తరఫున పాలకుల కాలర్ పట్టుకుని ప్రశ్నించే ఒక స్వతంత్ర వ్యవస్థ.
అక్కడ ప్రతి పైసా ఖర్చుపై పారదర్శకత ఉంటుంది. మంత్రి నుంచి సామాన్యుడి వరకు ఎవరైనా సరే, వ్యవస్థను ధిక్కరిస్తే మీడియా ముందు నిలబడాల్సిందే.
పౌర చైతన్యం.. ప్రజలే సమాజపు కావలి కాపలాదారులు..
నార్వే సాధించిన ఈ విజయానికి అసలు సిసలైన పునాది అక్కడి పౌర చైతన్యం. నార్వే ప్రజలు వార్తలను కేవలం వినోదం కోసం చూడరు, అక్షరాన్ని సామాజిక ఆయుధంగా భావిస్తారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఆ నిజాన్ని బయటపెట్టిన జర్నలిస్టులకు దేశం అండగా నిలుస్తుంది.
పత్రికలు రాసే ప్రతి పరిశోధనాత్మక కథనాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూ, ప్రజాప్రతినిధులను నిలదీస్తారు.
పాలకుల అవినీతిని సహించని ఈ ఉన్నత పౌర సంస్కృతే ఆ దేశాన్ని అవినీతి రహిత స్వర్గధామంగా మార్చింది.
చట్టం ఇచ్చిన రక్షణ – పాలకుల నిబద్ధత..
నార్వేలో 1814 రాజ్యాంగం ద్వారానే భావప్రకటన స్వేచ్ఛకు అత్యున్నత రక్షణ కల్పించారు.
ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునేందుకు సామాన్యుడికి సైతం ‘సమాచార హక్కు’ చట్టం పూర్తి హక్కును ఇస్తుంది.
అక్కడ ప్రభుత్వాలు మీడియాను శత్రువుగా చూడవు, ప్రభుత్వం చేసిన తప్పును వెలికితీసిన జర్నలిస్టును దేశద్రోహిగా కాకుండా ప్రజాస్వామ్య రక్షకుడిగా చూస్తారు. ప్రజాస్వామ్య భాగస్వామిగా గౌరవిస్తాయి.
పాలకులకు నచ్చని వార్తలు రాసినా, అక్కడ ఏ జర్నలిస్టుపైనా ఐటీ దాడులు జరగవు, అర్ధరాత్రి అరెస్టులు ఉండవు. ఈ చట్టబద్ధమైన, నైతికమైన రక్షణే మీడియాను నిర్భయంగా ఉంచుతోంది.
భారత మీడియా.. అమ్ముడుపోయిన అక్షరం..
నార్వే వెలుగుల నుంచి భారతదేశ వాస్తవాల్లోకి అడుగుపెడితే పరిస్థితి హృదయవిదారకంగా ఉంటుంది. 2025లో 151వ స్థానంలో ఉన్న భారతదేశం, 2026 నాటికి 157వ స్థానానికి దిగజారిపోయింది.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం’లో మీడియా నేడు పాలకులను ప్రశ్నించడం మానేసి, ప్రతిపక్షాలను నిలదీసే విచిత్ర పోకడను అవలంబిస్తోంది.
కొన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి మీడియా యాజమాన్యాలు వెళ్ళిపోవడంతో, బహుళత్వానికి చరమగీతం పాడారు. నిజాలు మాట్లాడే పత్రికల గొంతు నొక్కేస్తూ, కేవలం ప్రభుత్వ ప్రచార సాధనాలుగా మార్చేశారు.
‘గోదీ మీడియా’ అలిఖిత అత్యవసర పరిస్థితి..
అంతర్జాతీయ నివేదికలు భారతదేశంలో ‘అనధికారిక అత్యవసర పరిస్థితి’ నడుస్తోందని స్పష్టంగా పేర్కొంటున్నాయి. అధికార పక్షానికి సాగిలపడి, వారి ఎజెండాను మోసే మీడియా విభాగాలను ‘గోదీ మీడియా’గా ప్రజలే పిలుచుకునే దుస్థితి దాపురించింది.
పాలకుల తప్పులను ఎండగట్టాల్సిన ప్రైమ్ టైమ్ చర్చలు- మతపరమైన విద్వేషాలను, రాజకీయ బురదజల్లే కార్యక్రమాలను ప్రసారం చేయడానికి పరిమితమయ్యాయి. ఫలితంగా, దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలైన ప్రజా సమస్యలు, భారీ అవినీతి స్కామ్‌లు తెరమరుగైపోతున్నాయి.
నార్వే జర్నలిస్ట్ అడిగిన ఆ ఒక్క ప్రశ్న..
భారతదేశంలో మీడియాను ఎంతగా లొంగదీసుకున్నప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై పాలకుల నియంతృత్వ పోకడలు నవ్వులపాలవుతూనే ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశం ముగిశాక ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
నార్వేజియన్ పత్రిక ‘దగ్సావిసెన్’ మహిళా జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్, వెనుతిరుగుతున్న ప్రధాని మోదీని ఉద్దేశించి గాల్లోకి ఒక పదునైన ప్రశ్న విసిరారు.
‘ప్రధాని మోదీ, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛా పూరితమైన ప్రెస్ (నార్వే మీడియా) నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీకెందుకు అంత భయం?’
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, కనీసం ఆమె వైపు చూడలేక ప్రధాని మోదీ మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ లేని పన్నెండేళ్ల ప్రయాణం..
2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు, ప్రధాని మోదీ భారతదేశంలో ఒక్కటంటే ఒక్క ముందస్తు స్క్రిప్ట్ లేని బహిరంగ పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదు.
కేవలం తనకు అనుకూలంగా ఉండే ఛానళ్లకు, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారనే విమర్శ ప్రపంచవ్యాప్తంగా ఉంది.
గతంలో వైట్ హౌస్ వేదికగా వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరి సబ్రినా సిద్ధిఖీ భారతదేశంలో మైనారిటీల హక్కులపై ప్రశ్నించినప్పుడు ‘మా నరనరాల్లో ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని చెప్పిన మాటలకు, నేటి 157వ ర్యాంకుకు పొంతనే లేదు.
చట్టాల వేట – విలేకరుల జైలు పాలన..
నార్వేలో చట్టాలు జర్నలిస్టులను రక్షిస్తుంటే, భారతదేశంలో చట్టాలను జర్నలిస్టులపై వేటకత్తుల్లా వాడుతున్నారు. వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహం చట్టాలు, కఠినమైన యాంటీ-టెర్రరిజం చట్టాలను (ఉపా లాంటివి) నిజాలు రాసే జర్నలిస్టులపై ప్రయోగిస్తున్నారు.
అవినీతిని ప్రశ్నించినందుకు, క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించినందుకు ఎంతోమంది స్వతంత్ర జర్నలిస్టులు ఇరకాటంలో పడ్డారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వ అనుకూల ట్రోలింగ్ సైన్యంతో మహిళా జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాలను సైతం రోడ్డున పడేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు.
న్యూస్‌క్లిక్ లాంటి గొంతుకలు.. ఇనుప బూట్ల కింద నలుగుతున్నా… లొంగని అక్షరాలు..
భారతదేశంలో పాలకుల అణచివేతకు, వేధింపులకు సజీవ సాక్ష్యం ‘న్యూస్‌క్లిక్’ లాంటి స్వతంత్ర వార్తా సంస్థల దయనీయ స్థితి.
ఈ పత్రికలపై ఈడీ, ఐటీ, ఉపా లాంటి కఠినమైన చట్టాల ముసుగులో తప్పుడు దేశద్రోహం కేసులు బనాయించి, నిధులు స్తంభింపజేసి, యాజమాన్యాలను, జర్నలిస్టులను జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు.
కార్యాలయాలకు సీళ్లు వేసి, ఆర్థికంగా వారి ఊపిరి తీసేందుకు పాలకవర్గం సర్వశక్తులూ ఒడ్డినా- ఆ అక్షరాలు మోకరిల్లలేదు. కోర్టు మెట్లు ఎక్కుతూ, అవమానాలను భరిస్తూ, తిండికి పైసలు లేకపోయినా క్రౌడ్ ఫండింగ్ (ప్రజల విరాళాలు) సాయంతో ఈ పత్రికలు నేటికీ నిజాలను నిర్భయంగా సమాజం ముందుంచుతున్నాయి.
పాలకుల ఇనుప బూట్ల కింద నలుగుతున్నా, వ్యవస్థలన్నీ లొంగిపోయినా- సత్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఇలాంటి ఒంటరి గొంతుకలే నేటికీ భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా శవం కాకుండా కాపాడుతున్న నిప్పుకణికలు.
కార్పొరేట్ మాఫియా – అవినీతికి రక్షణ కవచం..
భారతదేశంలో అగ్రగామి మీడియా సంస్థలన్నీ దేశంలోని అతిపెద్ద సంపన్న పారిశ్రామిక కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి.
ఈ కార్పొరేట్-రాజకీయ బంధం కారణంగా క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానం) పెచ్చరిల్లిపోతోంది.
బిలియన్ల కొద్దీ ప్రజాధనం దోపిడీకి గురవుతున్నా మీడియా నోరు విప్పదు. ఎందుకంటే, ఆయా మీడియా సంస్థల మనుగడకు కావలసిన వందల కోట్ల ప్రకటనల నిధులు ప్రభుత్వాల నుంచే వస్తాయి.
పత్రికా స్వేచ్ఛ చనిపోయిన చోట, అవినీతి అనేది వ్యవస్థీకృతమై దేశాన్ని గుల్ల చేస్తుంది.
మన నిశ్శబ్దం మనకే ప్రమాదం..
నార్వేతో పోలిస్తే భారతదేశంలో పౌర చైతన్యం ఇంకా రాజకీయ పక్షపాత రంగుల్లోనే మునిగి ఉంది. ప్రజలు తమకు ఇష్టమైన నాయకుడు అవినీతి చేసినా సమర్థించే స్థాయికి దిగజారారు.
మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను, మతపరమైన పక్కదారి పట్టించే కుట్రలను నిజమని నమ్ముతూ చైతన్యరహితంగా మారుతున్నారు.
నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే పౌర సమాజం నిశ్శబ్దంగా చూస్తోంది. పౌరుల్లో ఈ చైతన్య లోపమే పాలకులకు మరింత నిరంకుశంగా మారడానికి లైసెన్స్ ఇస్తోంది.
అక్షరం గొంతు కోసి… ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారా?..
ఒక దేశం ఆర్థికంగా ఎంత ఎదిగినా, ప్రపంచ వేదికలపై ఎంత గొప్పలు చెప్పుకున్నా.. పత్రికా స్వేచ్ఛా సూచీలో పాతాళానికి పడిపోయినప్పుడు ఆ దేశ నైతికత నవ్వులపాలవుతుంది.
ఓస్లోలో నార్వేజియన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కేవలం ఒక వ్యక్తిని అడిగింది కాదు- భారతదేశంలో చనిపోతున్న పత్రికా స్వేచ్ఛపై అంతర్జాతీయ సమాజం వేసిన ఛీత్కారం.
నార్వేలా మనం కూడా అవినీతి లేని దేశంగా మారాలంటే, కేవలం భవనాలు, రోడ్లు మారితే సరిపోదు. అక్షరానికి స్వేచ్ఛనివ్వాలి, పాలకులను ప్రశ్నించే ధైర్యాన్ని మీడియా పుణికిపుచ్చుకోవాలి.
ప్రజాస్వామ్యాన్ని బలపరచాలంటే ఎన్నికలు మాత్రమే సరిపోవు. విమర్శలను స్వీకరించే ప్రభుత్వం, ప్రశ్నించడానికి వెనుకాడని మీడియా, చైతన్యవంతమైన పౌర సమాజం, స్వతంత్ర న్యాయవ్యవస్థ- ఈ నాలుగు స్తంభాలు కలిసి పనిచేసినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. నార్వే ప్రపంచానికి నేర్పిన గొప్ప పాఠం ఇదే.
భారత్ కూడా ప్రపంచ గురువుగా నిలవాలంటే ముందు పత్రికా స్వేచ్ఛను గౌరవించే ప్రజాస్వామ్యంగా నిలవాల్సిందే.
ప్రశ్నల గొంతు నొక్కిన ఏ దేశమూ చరిత్రలో గొప్పగా బతికిన దాఖలాలు లేవు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
