న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ నుంచి ఎన్డీటీవీ సేకరించిన పెట్టుబడుల విషయంలో 2016లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులు చెల్లవంటు ఢిల్లీ హైకోర్టు 2026 జనవరి 19న తీర్పిచ్చింది.
ఆదాయాన్ని పునర్మదించే అధికారాన్ని దుర్వినియోగపర్చినందుకుగాను ఆదాయపు పన్ను శాఖపై రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.
జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల ఆదాయాలను పునఃమదించేందుకు ఆదాయపు పన్ను తీసుకున్న నిర్ణయం చట్టరీత్యా చెల్లదని, ఈ అధికారాలను ఉపయోగించి ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లను ఇబ్బంది పెట్టినందుకు వారికి చెరో లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది.
బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ తీర్పును వెలువరిస్తూ ధర్మాసనం “చర్చ కొనసాగింపుగా రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నాము. 2016 మార్చి 31న పిటిషనర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులు, ఆ నోటీసుల ఆధారంగా తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటిస్తున్నాము” అని తెలియజేసింది.
అంతేకాకుండా, “ఇటువంటి కేసుల్లో ఎంత పెనాల్టీ వేసినా సరిపోదు. అయితే, ఎటువంటి పెనాల్టీ వేయకుండా ఇటువంటి కేసులను వదల్లేము. ఇద్దరు రిట్ పిటిషనర్లకు నామకా అయినా చెరో లక్ష రూపాయలు చెల్లించాల” ని ఆదేశించింది.
ఈ నోటీసుల ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలూ, నిర్ణయాలూ కూడా రద్దవుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎన్డీటీవీకి ఆర్ఆర్పీఆర్ కంపెనీ వడ్డీలేని రుణాలు ఇవ్వటంతో వివాదం మొదలైంది. ఈ హోల్డింగ్ కంపెనీలో రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లు 50 శాతం వాటా కలిగి ఉన్నారు.
వీరిద్దరూ 2009- 10లో సమర్పించిన వార్షిక ఆదాయపు పన్ను వివరాలను 2011లో ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు చేపట్టింది.
ఆరఆర్పీఆర్కూ, ఎన్డీటీవీకీ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను పునఃపరిశీలించనారంభించింది.
ఈ పరిశీలన తర్వాత ఈ లావాదేవీలో పన్ను వేయాల్సిన ఆదాయాలు ఏమీ లేవని విచారణాధికారి నిర్ధారిస్తూ 2013లో ఫైల్ మూసేశారు.
అయినప్పటికీ, 2016లో ఆదాయపు పన్ను శాఖ మరో సారి రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లకు నోటీసులు జారీ చేసింది.
వడ్డీలేని అప్పుగా ఇచ్చిన అప్పు ఒక వేళ వడ్డీకే ఇచ్చి ఉంటే, ఎంత ఆదాయం వచ్చి ఉండేదనే కోణంలో లెక్కలు వేసిన ఆదాయపు పన్ను అధికారులు- ఆ విధంగా లెక్కించిన ఆదాయం ప్రాతిపదికన రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లకు నోటీసులు ఇచ్చారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదన
అయితే, అప్పటికే ఆర్ఆర్పీఆర్ కంపెనీకి సంబంధించిన ఆదాయపు మదింపు విభాగం మరో చోటికి మారింది. ఈ లోగానే ఫిర్యాదు నమోదు చేయటం, కావల్సిన పత్రాలు సేకరించటం జరిగిపోయింది.
తాజాగా జారీ చేయబడిన నోటీసులను సవాలు చేస్తూ రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లు 2017 నవంబరులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా జరుగుతున్న పునర్మదింపు ఒకే సంవత్సరానికి చెందిన ఆదాయంపై పునర్మదింపు కూడా పూర్తి అయిన తర్వాత కొత్తగా మదింపు చేయటం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
ఒకసారి పునఃపరిశీలన చేపట్టిన తర్వాత ఆదాయ పన్ను శాఖ అన్ని కోణాల్లో పరిశీలించే అధికారం కలిగి ఉందని ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు వాదించారు.
అంతేకాకుండా, దీంతో గతంలో జరిగిన పునఃపరిశీలనలో కొన్ని కోణాలు విస్మరించామని చెప్పటం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
తాజా నోటీసులు ఆదాయపన్ను శాఖ అభిప్రాయంలో వచ్చిన మార్పుకు నిదర్శనమని, న్యాయసూత్రాల ప్రకారం- అలా మనసు మార్చుకునేందుకు అవకాశం లేదని ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల తరపున వాదించిన న్యాయవాదులు ధర్మాసనానికి వివరించినట్లు బార్ అండ్ బెంచి వెబ్సైట్ కథనం పేర్కొంది.
తుది ఆదేశాలు ఉన్నప్పటికీ ఆరఆర్పిఆర్ హోల్డింగ్స్ కంపెనీపై వేర్వేరు పునఃపరిశీలనలు చేపట్టం కూడా న్యాయస్థాన ఆదేశాల ఉల్లంఘనేనన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. మరో ధర్మాసనం 2024 సెప్టెంబరులో ఈ నోటీసులు చెల్లవని ప్రకటిస్తూ తీర్పిచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
