ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ వీధులు ఇప్పుడు కేవలం నిరసనలకు వేదిక కాదు. అవి నవభారత యువత అణచివేయబడిన ఆక్రందనకు, ఉవ్వెత్తున ఎగసిన చారిత్రాత్మక తిరుగుబాటుకు సజీవ సాక్ష్యాలు.
అహర్నిషలు కష్టపడి కోట్లాది మంది విద్యార్థులు రాసిన ప్రవేశ పరీక్షల భవిష్యత్తును ‘లీకేజీల’ బూడిదలో కలిపేసిన పాలకులు, ఇప్పుడు అధికారమనే అంధకారంలో మునిగిపోయారు.
ఒకవైపు అయోధ్య రామాలయ రాజకీయాలు, మరోవైపు ఇథనాల్ లాంటి భారీ కుంభకోణాల నీడలో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం- దేశభక్తుడు, ప్రఖ్యాత విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నా కరడుగట్టిన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది.
పాలకుల నైతిక పతనం..
18 రోజులుగా అన్నపానాలు లేక, శారీరకంగా క్షీణిస్తూ, మృత్యువుతో పోరాడుతున్న ఒక మహోన్నత వ్యక్తిని పలకరించే తీరిక లేని ఈ పాలకుల వైఖరి చూస్తుంటే- ‘రాజు దిగంబరుడు’ అనే పాత కథ గుర్తొస్తోంది.
తప్పులను ప్రశ్నిస్తే ‘దేశద్రోహులు'(యాంటీ నేషనల్స్) అని ముద్ర వేసే ఈ నిరంకుశ ధోరణి, భావి భారత పౌరులను నిలువునా అవమానించడమే.
ఇది కేవలం పరీక్షల అక్రమాలపై జరుగుతున్న పోరాటం కాదు-ఇది పాలకుల నైతిక పతనానికి వ్యతిరేకంగా, దేశ మనుగడ కోసం ప్రతి పౌరుడూ, ప్రతి రాజకీయ పార్టీ ఏకోన్ముఖంగా గొంతు కలపాల్సిన అత్యంత కీలకమైన సమయం.
రాజు నగ్నత్వాన్ని నిలదీస్తూ యువత సాగిస్తున్న ఈ చారిత్రాత్మక సమరంలో- అసలు ఏం జరుగుతుందో విశ్లేషించే కథనం ఇది.
లీకేజీలతో యువత కలలతో చెలగాటం..
గడచిన పదేళ్లుగా యువత భవిష్యత్తుతో, విద్యార్థుల కలలతో చెలగాటం ఆడటమే కాకుండా- మరోవైపు అయోధ్య రామాలయం నిర్మాణ వివాదాలు, ఇథనాల్ లాంటి భారీ కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర పాలకులు, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే నిరసనకారులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే శక్తులు, ఒకవైపు కోట్లాది మంది విద్యార్థుల నమ్మకాన్ని లీకేజీల రూపంలో తుత్తునియలు చేసి, మరోవైపు అవినీతి నీడలో బతుకుతూ అధికారాన్ని చెలాయిస్తున్నాయి.
విద్యావ్యవస్థలో జవాబుదారీతనం కోరినందుకు శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న దేశభక్తులను సైతం ‘యాంటీ నేషనల్స్'(దేశద్రోహులు) అంటూ ముద్ర వేయడం పాలకుల నైతిక పతనానికి నిదర్శనం.
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమం..
వైద్య నివేదికల ప్రకారం సోనమ్ వాంగ్‌చుక్ శారీరక స్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి ఆయన దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుత బరువు కేవలం 57.15 కిలోలుగా నమోదైంది. రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో పాటు, నిరంతరం నీరసం, కండరాల క్షీణతతో ఆయన బాధపడుతున్నారు. ఆయన పక్కనే దీక్ష చేస్తున్న పలువురు యువ విద్యార్థులు ఇప్పటికే స్పృహ తప్పి ఆసుపత్రి పాలయ్యారు.
ఇంత జరుగుతున్నా, మానవత్వం లేని ఈ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు జరిపేందుకు ఒక్క మంత్రిని కానీ, అధికారుల బృందాన్ని కానీ పంపకపోవడం అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించవచ్చు.
నిరుద్యోగపు కోరల్లో యువత – వ్యవస్థాగత హత్యలు..
దేశంలో పెచ్చుమీరుతున్న నిరుద్యోగం యువతను నిర్వేదంలోకి నెడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 15 నుంచి 29 ఏళ్ల లోపు యువతలో నిరుద్యోగ రేటు దాదాపు 10 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 13.6 శాతానికి పైగా ఉంది.
ఎన్నో ఏళ్లపాటు రాత్రింబగళ్లు కష్టపడి చదివి రాసిన ప్రవేశ పరీక్షలు లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు.
ఈ మరణాలన్నీ కేవలం వ్యవస్థ చేసిన హత్యలే తప్ప మరొకటి కాదని, వీటికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందేనని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
‘రాజు దిగంబరుడు’ – యువత గర్జన..
అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వ ధోరణి చూస్తుంటే- చిన్నప్పుడు చదువుకున్న “రాజు దిగంబరుడు” కథ గుర్తొస్తోందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహ అభిప్రాయపడ్డారు.
చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ అద్భుతమైన వస్త్రాలు ధరించానని భ్రమపడే రాజు లాగే, నేటి పాలకులు తాము ఏ తప్పు చేయలేదని బుకాయిస్తున్నారు. కానీ, దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థ కుప్పకూలిపోయిందని, లీకేజీలతో యువత భవిష్యత్తు బూడిదలో పోసిన పన్నీరవుతోందని జంతర్ మంతర్ వద్ద గొంతెత్తుతున్న విద్యార్థులు స్పష్టంగా చెబుతున్నారు.
‘రాజు నగ్నంగా ఉన్నాడు’ అనే సత్యాన్ని చాటిచెప్పడమే ఈ నిరసన ముఖ్య ఉద్దేశం.
ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు..
ఈ అణచివేత ధోరణి భావి భారత పౌరులను తీవ్రంగా అవమానించడమే. శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలను కూడా హింసతో, అక్రమ అరెస్టులతో తొక్కివేయాలని చూడటం పాలకుల నిరంకుశత్వానికి అద్దం పడుతోంది.
ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన సోనమ్ వాంగ్‌చుక్ లాంటి శాస్త్రవేత్త, విద్యావేత్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, వారి గొంతును నొక్కేందుకు ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్య. ఇది కేవలం విద్యార్థుల సమస్య కాదు, దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన ముప్పు.
దేశవ్యాప్త మద్దతు – జూలై 20న ‘చలో సంసద్’..
ప్రస్తుతం ఈ చారిత్రాత్మక ఉద్యమానికి విపక్ష శ్రేణుల నుంచి, పౌర సమాజం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) ముఖ్యుడు ఉద్ధవ్ ఠాక్రే లాంటి అగ్ర నాయకులు వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ దీక్షను విరమించాలని కోరారు.
అలాగే సీనియర్ నటి జీనత్ అమన్, ప్రముఖ నటి స్వరా భాస్కర్ లాంటి సినీ ప్రముఖులు, మేధావులు కూడా నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 16న దేశవ్యాప్తంగా ఒక రోజు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.
అలాగే లీకేజీ రహిత పారదర్శక పరీక్షా విధానాన్ని సాధించేందుకు, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 20న లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన “చలో సంసద్” (పార్లమెంట్ మార్చ్) కోసం దేశవ్యాప్త సమీకరణ జరుగుతోంది.
ఇప్పటివరకు 1.3 లక్షల మందికి పైగా ప్రజలు మిస్డ్‌కాల్ ప్రచారం ద్వారా ఈ పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు ప్రకటించారు.
కార్పొరేట్ పాలకులపై ఎర్రజెండా సమరం..
‘యువత భవితను తాకట్టు పెడుతున్న నయా-ఉదారవాద పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా ఎర్రజెండా ఎప్పుడూ ముందుంటుంది. లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను, వారి శ్రమను విద్యా మాఫియాకు అమ్ముకుంటున్న ఈ కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి కాలం చెల్లింది.
ప్రశ్నించే గొంతుకలపై నిరంకుశంగా అణచివేత చర్యలకు పాల్పడటం, దేశభక్తుడైన సోనమ్ వాంగ్చుక్ను ‘యాంటీ నేషనల్’ అని చిత్రీకరించడం పాలకుల బేలతనానికి నిదర్శనం.
ఇది కేవలం పరీక్షల లీకేజీ సమస్య కాదు, ఇది దేశ విద్యావ్యవస్థను ప్రైవేటీకరించి సామాన్యుడికి విద్యను దూరం చేసే కుట్ర. చలో సంసద్ మార్చ్ ద్వారా ఈ నిరంకుశ పాలకుల గుండెల్లో నిద్రపోతామని ఐసా (ఏఐఎస్ఏ), వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు నేహా, మనీష్, ఆమీన్‌లు ఎలుగెత్తి చాటారు.
చరిత్రను తిరగరాయనున్న విద్యార్థి లోకం..
ఈ దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి యువతను నిర్లక్ష్యం చేసే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని చరిత్ర నిరూపించింది.
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి 1975 నాటి అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) వ్యతిరేక పోరాటం వరకు విద్యార్థి లోకం ఎల్లప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా ముందంజలోనే నిలిచింది.
నేడు కూడా జంతర్ మంతర్ వద్ద వర్షాన్ని, ఎండను సైతం లెక్కచేయకుండా రహదారులపై పడి నిద్రిస్తున్న విద్యార్థుల నిబద్ధత దేశ ప్రజల హృదయాలను ద్రవింపజేస్తోంది.
ఇలాంటి తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం, మేధావులు ఏకోన్ముఖంగా తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది.
రాజకీయ రంగులకు అతీతంగా, మన దేశ బిడ్డల భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ గొంతు కలపాలి. సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులు చేస్తున్న ఈ ప్రాణత్యాగ పోరాటం వృథా పోకూడదు. పాలకుల అణచివేత ధోరణిని పాతరేస్తూ, దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించే వరకు ఈ పోరాట జ్వాలలు చల్లారకూడదు.
సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా పిలుపునిచ్చినట్లు, “ఇతరులలో హీరోలను వెతకడం ఆపేసి, మీ జీవితాలకు మీరే హీరోలుగా మారండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి.” జూలై 20న జరగబోయే పార్లమెంట్ మార్చ్ కేవలం నిరసన ప్రదర్శన కాదు. అది మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వేయబోయే చారిత్రాత్మక అడుగు.
ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి తక్షణమే చర్చలు ప్రారంభించి, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని దేశం మొత్తం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
