“కశ్మీర్లో పని చేయడానికి ఆర్ఎస్ఎస్కు స్థలం, అధికారం ఉన్నప్పుడు- జమాత్-ఏ-ఇస్లామీని ఎందుకు నిషేధించారు?” అని ఒక పీడీపీ నాయకుడు ప్రశ్నించారు.
శ్రీనగర్: కశ్మీర్లో తన మొట్టమొదటి ప్రత్యక్ష అడుగుజాడగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ కార్మిక సంఘమైన ‘భారతీయ మజ్దూర్ సంఘ్'(బీఎంఎస్) దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో తన తొలి బహిరంగ కార్యాలయాన్ని ప్రారంభించింది. కశ్మీర్లో సంఘ్ అనుబంధ సంస్థల ప్రారంభోత్సవాలలో ఇది అతి పెద్దది.
కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల బర్సూ గ్రామంలో కార్యాలయ ఇంఛార్జ్ సమీర్ కుచయ్ సమక్షంలో అక్టోబర్ 16న ఈ కొత్త బీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
శ్రీనగర్‌లోని శివ్పొరాలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న గది నుంచి బీఎంఎస్ ఇప్పటికే పని చేస్తోందని 36 ఏళ్ల కుచయ్ చెప్పారు.
“మేము క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాం. మాకు శ్రీనగర్‌లో ఒక చిన్న స్థలం ఉండేది, అక్కడి నుంచే మేము కార్యకలాపాలు సాగించేవాళ్లం. కానీ ఇప్పుడు బర్సూలో మా తొలి డివిజినల్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. కశ్మీర్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఇది పునాది అవుతుంది” అని కుచయ్ మీడియాకు చెప్పారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కశ్మీర్లో తమ సంస్థాగత ఉనికిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తమ క్యాడర్‌ను పెంచుకోవడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండగా, ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సంస్థలు లోయలో చొచ్చుకుపోవడం మొదలుపెట్టాయి.
కశ్మీర్ వ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణ
కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి బీఎంఎస్ అఖిల భారత సంస్థాగత కార్యదర్శి బి. సురేంద్రన్, ఉత్తర భారత సంస్థాగత కార్యదర్శి సోహన్ లాల్ గుప్తా, ఉత్తర భారత సంస్థాగత డిప్యూటీ కార్యదర్శి అశోక్ చౌదరి హాజరయ్యారు.
“కశ్మీర్‌లోని 10 జిల్లాల్లో మా సంస్థ పని చేస్తుంది. రాంబన్, బనిహల్‌కు కూడా కార్యకలాపాలను విస్తరిస్తాం” అని కుచయ్ అన్నారు.
కశ్మీర్లో తీవ్రవాదం పెరుగుతున్న దశలో ఉన్న 2016వ సంవత్సరంలో ఆయన ఈ సంస్థలో చేరారు.
“నా పిల్లలు ఐఏఎస్, ఐపీఏస్ అధికారులు కావాలని నేను ఎలా కోరుకుంటున్నానో ఇతర తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలు విద్యను అభ్యసించి వారి కలలను సాకారం చేసుకునేందుకు వీలుగా, ఈ రోజు ప్రజలు శాంతియుత వాతావరణం కావాలని భావిస్తున్నారు” అని ఆయన మీడియాతో చెప్పారు.
శ్రీనగర్‌లో ఆర్ఎస్ఎస్ ఒక మెగా సదస్సును నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రారంభోత్సవం చోటు చేసుకుంది. ఆ సదస్సులో అనేక మంది సంఘ్ నాయకులు పాల్గొన్నారు. “ప్రజలు రాళ్లు రువ్వే సంస్కృతి నుంచి దూరంగా జరిగి, తమ పిల్లల చేతుల్లో పెన్నులు పెడుతున్నారనడానికి ఇది ఒక బలమైన సందేశం ఇస్తుంది” అని కుచయ్ పేర్కొన్నారు.
గతంలో సంఘ్, దాని అనుబంధ సంస్థలు లోయలో రహస్యంగా పని చేసేవి. సేవా భారతి అనుబంధ పాఠశాలలు నడుస్తున్న సరిహద్దు ప్రాంతాలపైనే అప్పుడు ఎక్కువ దృష్టి సారించారు.
ప్రజల గుర్తింపు పొందడం కోసం ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ ప్రాజెక్టులపై ఎన్జీఓలతో కలిసి సంఘ్ వివేకంతో పనిచేసింది.
“ఇప్పుడు కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, మన ప్రజల కోసం బహిరంగంగా పని చేయడానికి ఇదే సరైన సమయం” అని బీఎంఎస్ కశ్మీర్ ఇంఛార్జ్ అన్నారు.
బీఎంఎస్ ప్రకారం కశ్మీర్లో ఈ సంస్థ 20 అనుబంధ కార్మిక యూనియన్లతో కలిసి పని చేస్తోంది. ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పని చేయడానికి ఈ అనుబంధాలు అవకాశాన్ని కల్పిస్తాయని వారు నమ్ముతున్నారు.
“మా బంధువులు కూడా నన్ను ‘సంఘీ’ అని పిలుస్తారు. 2020లో నేను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. నాకు 1,384 కామెంట్లు రాగా, అందులో కేవలం రెండు కామెంట్లు మాత్రమే సానుకూలంగా వచ్చాయి” అని కుచయ్ తెలియజేశారు.
దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో తమ సంస్థకు బలమైన ఉనికి ఉందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్, శ్రీనగర్ రెండింటికీ సులభంగా అందుబాటులో ఉండటం వల్లే అవంతిపొరాను డివిజనల్ కార్యాలయంగా ఎంచుకున్నామని ఆయన తెలిపారు.
సంఘ్‌తో తమకున్న అనుబంధాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ నాయకులు మీడియాతో ఎలా వ్యవహరిస్తారో అదే తరహాలో కుచయ్ కూడా బీజేపీకి కొంత దూరం పాటిస్తూ మాట్లాడారు.
“మేము ఏ రాజకీయ పార్టీ లేదా మతపరమైన వర్గాల కోసం పని చేయడం లేదు. మేము బీజేపీ లేదా మరే ఇతర పార్టీ చేతిలో కీలుబొమ్మలం కాము. మేము ముస్లింలకు వ్యతిరేకమనే భావన కశ్మీరీల్లో ఉంది, కానీ అది నిజం కాదు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరినీ మా సంస్థలోకి ఆహ్వానిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
సంస్థ బహిరంగంగా కార్యకలాపాలు సాగించడం వల్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడానికి సహాయపడుతుందని కుచయ్ విశ్వసిస్తున్నారు.
“ఒకసారి ప్రజలు మాతో చేరితే వారికే ఆ తేడా అర్ధం అవుతుంది. మేము ఏ రాజకీయ పార్టీకో లేదా ఏ మతానికో వ్యతిరేకం కాము. కార్మికుల సంక్షేమం కోసమే మేము ఉన్నాము” అని ఆయన చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పెరిగిన ఉనికి
కశ్మీర్లో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలకు దాదాపుగా ఎలాంటి ఉనికి లేనప్పటికీ, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత చొచ్చుకుపోవడానికి ఈ సంస్థ తీవ్రంగా శ్రమించింది.
“1990కి ముందు, డెబ్భైవ దశకంలో కూడా, బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ కశ్మీర్లో ఎన్నికల్లో పోటీ చేసేది.
హిందూ హైస్కూల్‌కు ఆనుకుని ఉన్న శీతల్ నాథ్ కశ్మీర్లో ప్రసిద్ధ ఆర్ఎస్ఎస్ ప్రదేశంగా ఉండేది” అని రాజకీయ వ్యాఖ్యాత షేక్ షౌకత్ ‘ది వైర్’తో అన్నారు.
బీఎంఎస్ రాక కొత్తేమీ కాదని, అయితే నేడు ఇటువంటి సమూహాలు అనుభవిస్తున్న ‘భద్రతా భావానికి ఇదొక ప్రతీకాత్మక సూచిక’ అని ఆయన అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు కంటే, వారి వద్ద ఉన్న భారీ భద్రతా బందోబస్తుతోనే ఈ ప్రారంభోత్సవానికి ఎక్కువ సంబంధం ఉందన్నారు.
“ఆర్టికల్ 370 చెక్కుచెదరకుండా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంస్థలు ఇక్కడ పనిచేసేవి” అని ఆయన ఎత్తి చూపారు.
“సాధారణ పరిస్థితుల్లో గనుక బీఎంఎస్ అధికారికంగా ప్రారంభమై ఉంటే, అది శాంతిభద్రతల మెరుగుదలకు సూచికగా పరిగణించబడేది. ఏఎఫ్ఎస్పిఏ, డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ వంటి చట్టాలు ఇంకా అమలులో ఉన్నందున, ఈరోజు మెరుగైన పరిస్థితి ఉందని మీరు ఊహించలేరు. చాలా రాజకీయ సమూహాలపై ఇంకా నిషేధం కొనసాగుతోంది, వారి సభ్యులు జైళ్లలో ఉన్నారు” అని షౌకత్ వివరించారు.
నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలన్న ప్రతిపక్షాలు
కశ్మీర్లో సైద్ధాంతిక సంస్థల పట్ల అసమానంగా వ్యవహరిస్తున్నారని సంఘ్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
“ఆర్ఎస్ఎస్ కశ్మీర్లో కార్యాలయాన్ని తెరిచింది. లోయలో బహిరంగంగా పనిచేసే స్వేచ్ఛ దానికి ఉంది. అదే సమయంలో, స్థానిక సంస్థలకు పనిచేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక్కడ ప్రశ్న చాలా సులభం. కశ్మీర్లో పని చేయడానికి ఆర్ఎస్ఎస్కు స్థలం, అధికారం ఉన్నప్పుడు- దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘాలు స్వేచ్ఛగా పనిచేస్తుంటే జమాత్-ఏ-ఇస్లామీని ఎందుకు నిషేధించారు? క్షేత్రస్థాయి నిబంధనలు ప్రతి ఒక్కరికీ ఒకటే అయితే, వాటిని అందరికీ సమానంగా వర్తింపజేయాలి” అని పుల్వామా ఎమ్మెల్యే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకుడు వహీద్ ఉర్ రెహ్మాన్ ‘ది వైర్’తో అన్నారు.
నిజమైన సమాన మైదానం అంటే “అన్ని చట్టబద్ధమైన సంస్థలను పని చేయడానికి అనుమతించడం లేదా అందరికీ ఒకే ప్రమాణాన్ని వర్తింపజేయడం” అని ఆయన అన్నారు.
“ఒక సైద్ధాంతిక సమూహానికి విస్తరించడానికి అవకాశం ఇచ్చి, స్థానిక సంస్థలను అణచివేస్తుంటే, ప్రజలు దానిని పక్షపాతంగా చూస్తారు. ఇది విశ్వాసాన్ని పెంపొందించడానికి బదులుగా అపనమ్మకాన్ని మరింత తీవ్రం చేస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికార నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్ మాట్లాడుతూ.. ముస్లింలలో, ఆర్ఎస్ఎస్ లేదా దాని అనుబంధ సంస్థలకు కశ్మీర్లో ఎలాంటి సైద్ధాంతిక పునాది లేదని, దానికి కారణం వారి ‘ప్రాథమిక ఆధిపత్య భావన’ అని పేర్కొన్నారు.
ఈ భావన ముస్లింలకు పూర్తిగా విరుద్ధమైనదని ఆయన అన్నారు. “ఆర్ఎస్ఎస్ వాస్తవానికి మైనారిటీల పట్ల ద్వేషం అనే ప్రాతిపదికన నిర్మించబడిన ఫాసిస్ట్ సంస్థ” అని ఆయన ‘ది వైర్’కు తెలిపారు.
కశ్మీర్లో బీఎంఎస్ ఉనికి ఆశ్చర్యం కలిగించలేదని దార్ అన్నారు. “నిజానికి గత కొన్నేళ్లలో ఆర్ఎస్ఎస్ తన ఉనికిని బలంగా చాటుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడి వక్ఫ్ బోర్డు అధిపతి స్వయంగా ఆర్ఎస్ఎస్ సదస్సులకు, నాయకులకు బహిరంగంగా ఆతిథ్యం ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన ప్రోత్సాహం ఉందన్నది స్పష్టం” అని దార్ అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
