ఒక జాతికి సాధారణమైన ఒక జీవిత విధానం, విశ్వాసాలు, ఆచారాలు, విలువలు, భాషా సాహిత్యాలు, కళలు, సంస్కారవంతమైన సాంఘిక సంబంధాలు- ఈ అన్నింటి సమాహారమైన భౌతిక భావజాల విలక్షణతల సారం సంస్కృతి. అది ఎవరో ఒకరు ఏదో ఒక రోజు పనిగట్టుకొని తయారుచేసిన వస్తువు కాదు.
విశాలమైన భూమి మీద భిన్న భౌగోళిక ప్రత్యేకతల మధ్య వేల లక్షల సంవత్సరాల కాలపు సామాజిక పరిణామ దశల గుండా ప్రయాణిస్తూ మానవ సమూహాలు ఉమ్మడిగా నిర్మించుకుంటూ వచ్చినది.
ఒకే ప్రపంచం ప్రాచ్య, పాశ్చాత్య, మధ్య ఆసియా, పర్షియన్ తదితర సంస్కృతుల వైవిధ్యంతో ఉన్నట్లే భారతదేశం కూడా ఉత్తర దక్షిణ సంస్కృతుల వైవిధ్యంతో, అలాగే ప్రతి రాష్ట్రం అంతర్గత ప్రాంతీయ భిన్న సంస్కృతులతో మనుగడలో ఉన్నాయి.
కనుక సంస్కృతి అనేది ఏకశిలా సదృశం కాదు. కానీ సమూహ సృష్టి అయిన సంస్కృతిలోని వైవిధ్య సౌందర్యాన్ని మింగేస్తూ, తాము సంస్కృతి అనుకున్నదానినే ఏకైక, అత్యుత్తమ, అంతిమ సంస్కృతిగా నిర్ధారించి అందరినీ నయానా, భయానా ఆ గొడుగు నీడకు చేర్చే ప్రచారము, బలవంతం, దౌర్జన్యం వర్తమాన వాస్తవం. ఇది ప్రమాదకరమైనది.
స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం వంటి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకమైనది.
విధ్వంసకర పోకడలు
దళితుల, ముస్లింల ఆహార సంస్కృతిని నేరంగా చూపిస్తూ చంపటం వరకు వాళ్లను శిక్షించే అధికారాన్ని వ్యక్తుల చేతుల్లో పెట్టటం దగ్గర నుంచి- సనాతన ధర్మ సంస్కృతి పరిరక్షణ పేర ఆధునిక హేతుబద్ధ ప్రశ్నలను, తర్కాన్ని తట్టుకోలేని అసహన వైపరీత్యంతో ప్రశ్నిస్తున్నవాళ్లపై అశ్లీల పదజాలంతో అంతర్జాలంలో విషం కక్కటం, ఏ పుస్తకం ప్రచురించాలో, ఏది అమ్మాలో, ఏది చదవాలో, ఎలా విమర్శించాలో, దేని గురించి ఏమి మాట్లాడాలో అన్నింటినీ నిర్దేశించటం వరకు జరుగుతున్న విధ్వంసకర కార్యక్రమాలన్నీ ఈ కోవలోనివే.
సంస్కృతీ నిర్మాతలను పక్కకు నెట్టి నిర్దేశకులుగా ఆధిపత్య శక్తులు రంగం మీదకు వచ్చిన కాలం ఇది. అయితే ఇదంతా ఈ పది పన్నెండేళ్లుగా కొట్టవచ్చినట్లు కనబడుతున్నప్పటికీ, వీటికి మూలాలు కుటుంబం, కులం, మతం, రాజ్యం వంటి ఆధిపత్య వ్యవస్థల చరిత్రలో ఉన్నాయి.
ఉత్పత్తిపై అధికారంతో కొత్త విధానం
ప్రాచీన మానవ సమాజం శిలాయుగాన్ని దాటి లోహయుగంలోకి వచ్చి రాతి పనిముట్ల స్థానంలో ఇనుముతో చేసిన గొడ్డళ్లు, కత్తులు, ఈటెలు, బాణాలు, నాగలి కర్రు వాడటం మొదలయ్యాక వ్యవసాయం అభివృద్ధి చెందింది. అక్కడి నుంచే సంస్కృతిని స్థిరీకరించే ఆధిపత్య వ్యవస్థలుగా పరస్పర సంబంధంలో రూపొంది స్థిరపడ్డవే కుటుంబం, కులం, మతం, రాజ్యం.
మొత్తం మీద మానవ జీవన అవసరాలు, అవసరాల నుంచి పరికరాల ఆవిష్కరణలు, ఆవిష్కరణల ఫలితంగా ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో రూపొందే సంస్కృతీ సంవిధానం ఆగిపోయి.. ఉత్పత్తి మీద అధికారమే సంస్కృతిని నిర్మించే కొత్త విధానంగా బలపడుతూ వచ్చింది.
వ్యవసాయ మిగులుతో ఏర్పడిన సొంత ఆస్తిపై యాజమాన్యంతో పాటు పురుషుడికి శ్రమ చేసే బానిసలతో పాటు వంశ వారసులను కని పెంచే భార్య పైన, పిల్లలపై కూడా సంక్రమించిన యాజమాన్య పునాదిపై నిర్మించబడిన కుటుంబంలో అందరూ సమానులు కారు.
పెద్దవాళ్లకు చిన్నవాళ్లు, అన్నలకు తమ్ముళ్లు, భర్తకు భార్య, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండాలని ఆశించే కుటుంబ సంస్కృతి నిస్సందేహంగా ప్రజాస్వామిక సంస్కృతి కాదు.
నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ
నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ హిందూ సమాజపు అసమానతల తీవ్ర రూపం అంటారు అంబేద్కర్. అన్నింటికన్నా పైన అత్యున్నత స్థానంలో ఉండే కులం ఒకటైతే అన్నింటికన్నా అట్టడుగున ఉండే కులం మరొకటి.
ప్రతి కింది కులమూ పై కులానికి విధేయంగా ఉండటం, విశ్వాసంగా ఉండటం లక్షణంగా చెప్పబడుతున్నప్పుడు పై మెట్టు కులానికి కింది మెట్టు కులాల మీద ఆధిపత్యం ధర్మంగా చలామణి అవుతున్నప్పుడు అందులో స్నేహానికి, సోదరత్వానికి, సమానత్వానికి తావు లేదు.
ఇక చాతుర్వర్ణ వ్యవస్థకు అవతల, ఊరవతల మిగిలిపోయిన దళిత వర్ణం మొత్తంగా కులం ఒక ఆధిపత్య వ్యవస్థలో అత్యంత శోషణకు గురికావటం మనకు తెలిసిన వర్తమానమే.
కుటుంబం కుల ఆధిపత్యాన్ని నిలబెట్టే వ్యవస్థ. కులాంతర వివాహాల పట్ల వ్యతిరేకత, పరువు హత్యలు ఆ ఆధిపత్య భావం నుంచే జరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టానికి అతీతమైన స్వయంప్రతిపత్తితో కులం చలామణిలో ఉండటం వర్తమాన విషాదం.
మతం ఒక హింసాత్మక వ్యవస్థ
కులానికి సంక్రమించిన ఈ అతీత శక్తికి ప్రాతిపదిక మతం. వ్యక్తిగత జీవితానికి పరిమితమై ఉండవలసిన మతం సామాజిక సంబంధాల నిర్దేశక శక్తి కావటం, స్వీయ మతంలో స్త్రీ పురుషులకు, భిన్న కులాల వారికి మధ్య వేర్వేరు ధర్మాలను, విధులను నిర్దేశించటం ద్వారా అసమ, అమానవ, అవమాన సంబంధాలకు కారణం కావటం చారిత్రక వాస్తవం.
ఇక ఇతర మతాలను సహించగల లౌకిక తత్వం లేకపోవటం సరేసరి.
మనుషుల మధ్య ఉండవలసిన ప్రేమను రద్దు చేస్తూ ఆ స్థానాన్ని ద్వేషంతో నింపటమే మతం అవుతున్న పరిస్థితుల్లో అది హింసాత్మక ఆధిపత్య వ్యవస్థ కాక మరేమంటాం?
ఆధిపత్య శక్తులకు అనుకూలంగా భావజాలం
కుటుంబం, కులం, మతం సామాజిక సంబంధాల్లో సంక్షోభ కారకాలు అవుతున్నప్పుడు, రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి పౌర హక్కులకు అవరోధంగా మారినప్పుడు జోక్యం చేసుకొనవలసిన రాజ్యమే కుల మత ఆధిపత్య శక్తుల కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకున్నప్పుడు మొత్తంగా దేశంలో పునరుత్పత్తి అయ్యేది, ప్రచారంలో ఉండేది ప్రజా సంస్కృతి కాదు.
ఆధిపత్య వ్యవస్థల రాజకీయ, ఆర్థిక అవసరాలకు, ప్రయోజనాలకు అనుకూలంగా నిర్వచించబడే భావజాల సంస్కృతే సనాతన ధర్మంగా చలామణిలోకి వస్తుంది.
ప్రశ్నకు, విమర్శకు అతీతంగా సర్వులకూ అనుల్లంఘనీయ శాసనం అవుతుంది. ఆధిపత్యం ఇప్పుడు ప్రజా ప్రతినిధుల్లో అధిక సంఖ్యాకుల అభిప్రాయంతో కూడా నిమిత్తం లేకుండా వ్యక్తి స్థాయిలో కేంద్రీకృతమై వాయుగుండంగా మారి వైవిధ్యభరిత ప్రజా సమూహాల సంస్కృతులను ముంచెయ్యగల ప్రమాద హెచ్చరిక అవుతున్నది.
యువత ఈ ప్రమాదాన్ని గుర్తించి ఎదుర్కొనటానికి తనదైన పద్ధతుల్లో సంసిద్ధం అవుతుండటం, పైపైకి పెరుగుతున్న ఆధిపత్య అహంకార పర్వతాలను ఏదో ఒక మూల నుంచి బద్దలు కొట్టటానికి తమవైన ఆయుధాలతో ప్రయత్నపరులు కావటం ఆశావహంగా ఉంది.
రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు వాళ్లతో కలిసి నినాదం కావలసిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్, అక్టోబరు 31న హైదరాబాద్లో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో యువ సాహిత్యోత్సవం 2026 నిర్వహిస్తున్నది. ‘సంస్కృతి – ఆధిపత్య వ్యవస్థలు’ అనే అంశం మీద చర్చతో ఈ సాహిత్యోత్సవం ప్రారంభమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
