రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ విజయవాడ ఓటరుగా నా ఆలోచనను ప్రజలతో పంచుకుంటున్నాను.
విజయవాడ ప్రకృతి ప్రసాదించిన అందమైన, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన నగరం. ఇది కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నది.
శ్రీ కనకదుర్గా ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి కొండ, గాంధీ హిల్స్, గుణదల మేరీ మాత కొండ మొదలు మొగల్రాజపురం కొండల వరుస(గుహలు), కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి కొండలు – ఆ కొండపై అద్భుతమైన నాలుగు అంతస్తుల రాతి గుహాలయం, ఇబ్రహీంపట్నం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో 14వ శతాబ్దానికి చెందిన చారిత్రక కొండపల్లి కోట, ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మలు విజయవాడకు వన్నె తెస్తున్నాయి.
నేను నివాసం ఉన్న మాచవరం డౌన్లో మా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి సాయంత్రం పూట వెళ్లి నగరం నాలుగు దిక్కులా చూస్తే కనువిందు చేసే దృశ్యాలు కనపడతాయి.
ఏ పట్టణమైనా ఒక చిన్న గ్రామంగానే మొదలై ఉంటుంది. అలాగే దశాబ్దాల క్రితం విజయవాడ పెద్ద గ్రామంగా మొదలై, నగరంగా వృద్ధి చెందింది.
1944లో అఖిల భారత కిసాన్ సభ 8వ జాతీయ మహాసభ బెజవాడలోని మొగల్రాజపురంలో జరిగిందట. మహాసభ కోసం నిర్వాహకులు భూమిని చదును చేసి, గుడారాలను ఏర్పాటు చేశారట. ఆ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ఎడ్ల బండ్లపై రైతులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా హాజరైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంటే, ఆనాటికి విజయవాడ ఈనాటి పాత పట్టణ ప్రాంతానికే పరిమితమై ఉండేదన్న మాట. ఆ దశ నుంచి అనేక కీలక దశలను దాటుకుంటూ ఒక ముఖ్యమైన నగరంగా ఎదిగింది.
1981 జూన్‌లో నగర పాలక సంస్థగా ఆవిర్భవించింది. ప్రప్రథమ మేయర్‌గా కమ్యూనిస్టు ప్రముఖ నేత కా.టి. వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. 1981 డిసెంబరులో విజయవాడలో జరిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. నాటి నుంచి విజయవాడ అభివృద్ధి, విస్తరణను చూస్తూనే ఉన్నాను. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ తర్వాత నేటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన నగరంగా ఉన్నది. అయినప్పటికీ, ఇది పూర్తిస్థాయి ఆధునిక నగరంగా అభివృద్ధి చెందడంలో మాత్రం వెనుకబడింది.
మౌలిక వసతుల లేమి
దేశ నలుమూలలకు అనుసంధానించబడిన రైల్వే కూడలి విజయవాడ. అన్ని వైపులకు జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి.
పౌర విమానయాన సదుపాయాలే అవసరాలకు అనుగుణంగా విస్తరించలేదు. బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో ఒకనాటి బెజవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన మొదటి ఆనకట్ట (1852-1855) ఈ ప్రాంత రూపురేఖలను మార్చేసింది. ఇది విజయవాడ చుట్టుపక్కల వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. దాని స్థానంలో ప్రకాశం బ్యారేజీ 1959లో పునర్నిర్మాణం చేయబడింది. అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్‌లలో ఒకటిగా విజయవాడకు గుర్తింపు ఉన్నది.
నగర పారిశ్రామికాభివృద్ధికి ఇది పెద్ద మైలురాయి వంటిదని అభివర్ణిస్తుంటారు. ఆర్థిక సంస్కరణల యుగంలో స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందింది.
దేశంలో అన్ని పట్టణాలు, నగరాలలాగే విజయవాడ కూడా విస్తరించింది. జనాభా పెరిగింది. జనావాసాలు పెరిగాయి. తదనుగుణంగా మౌలిక వసతులు పెరగలేదు. అసలేం జరగలేదా అంటే చెప్పుకోదగ్గవి కొన్ని ఉన్నాయి.
జాతీయ రహదారిపై బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, సత్యనారాయణపురం రైలు మార్గాన్ని తొలగించి నిర్మించిన బీఆర్టీఎస్, నగరంలో కొంతమేరకు అంతర్గత రహదారుల విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా తదితరాలు ఉన్నాయి.
ఉదాహరణకు, మా వార్డులో తాజాగా సిమెంటు రోడ్లు వేశారు. ఆ కృషి చేసిన కార్పొరేటర్ అభినందనీయురాలు. కానీ వనరులు, అవకాశాలు మెండుగా ఉన్నా విజయవాడలో పౌరుల మెరుగైన జీవనానికి అవసరమైన ఆధునిక మౌలిక వసతులు మాత్రం అత్యంత నాసిరకంగానే ఉన్నాయి.
నగర ప్రజల ఆకాంక్షలు
అందరికీ ఆరోగ్యం కావాలంటే మెరుగైన భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ, మెరుగైన పారిశుధ్యం, దోమల నివారణ అవసరం.
నగరంలో ప్రవహిస్తున్న కృష్ణా డెల్టా కాలువల వ్యవస్థను(బందరు కాలువ-ఏలూరు కాలువ-రైస్ కాలువ) ఆధునీకరించి, కాలుష్యం నుంచి విముక్తి చేయాలి.
డెల్టా కాలువల ఒడ్డున “వాకింగ్ ట్రాక్స్” అభివృద్ధి చేసి, కనీస వ్యాయామ సదుపాయాలు కల్పించాలి. కాలువల ఒడ్డున పాములు, కోతులు, వీధి కుక్కల బెడద లేకుండా చేయాలి. బుడమేరు వరద నివారణకు శాశ్వత పరిష్కారంతో పాటు మెరుగైన వర్షపు నీటి పారుదల వ్యవస్థను నిర్మించాలి.
ఆరోగ్య వైద్య సదుపాయాలను మెరుగుపరచాలి. శబ్ద కాలుష్యం తగ్గించాలి. నాణ్యమైన రహదారులు, రవాణా సౌకర్యాలు, అందరికీ నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించాలి.
మెరుగైన మురుగు కాలువల వ్యవస్థను నిర్మించాలి. పరిశుభ్రమైన, పర్యావరణ సమతుల్యత ఉన్న నగరంగా అభివృద్ధి చేయాలి.
బుడమేరు వరద సృష్టించిన విధ్వంసం కళ్లముందు కదలాడుతోంది. కృష్ణా డెల్టా కాలువల ఒడ్డున ఉన్న నీటిపారుదల శాఖ భూమి, బుడమేరు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు భూకబ్జాదారుల ఆక్రమణలకు గురయ్యాయి, ఇంకా అవుతున్నాయి. వాటిని పరిరక్షించాలి.
రహదారి కూడళ్లలో తీవ్రంగా ఉన్న “ట్రాఫిక్ జామ్” సమస్యను పరిష్కరించాలి. ఇలాంటి వాటినే కదా నగర పాలక సంస్థ నుంచి విజయవాడ ఓటర్లు కోరుకునేది.
ఓటర్ల విజ్ఞతే కీలకం
నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో, కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సమర్థులైన వారిని విజ్ఞతతో ఎన్నుకునే సదవకాశం ఓటర్ల తలుపు తడుతోంది.
“నాకేంటి” అన్న స్వార్థ ఆలోచన చేయకుండా, నేను నివసిస్తున్న విజయవాడకు అవినీతిరహిత సుపరిపాలన, నాణ్యమైన పౌర సదుపాయాలు కల్పించే, ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా పాలన చేస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే విజయవాడ ప్రజలకు కాస్తోకూస్తో మేలు జరగవచ్చు. విజయవాడ నగరానికి సంబంధించి అనుభవాలను ఒకసారి నెమరువేసుకుని విజ్ఞతతో ఓటేద్దాం.
నా అనుభవం
ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారితో నేను, ప్రముఖ రైతు ఉద్యమ నేత అక్కినేని భవానీప్రసాద్ గారు కలిసి గత ఏడాదిన్నర కాలంగా “నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి” అన్న నినాదంతో వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల భారీ ఎత్తిపోతల పథకాన్ని విరమించుకోవాలని బలంగా గళమెత్తాం. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి రెండు విడతలుగా వారం రోజులకు పైగా క్షేత్రస్థాయి పర్యటన చేశాం.
ప్రత్యేకించి నిత్య కరువు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించాం.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును, ‘ప్లంజ్ పూల్’ సమస్యను ఎదుర్కొంటున్న శ్రీశైలం జలాశయాన్ని, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ – తెలుగుగంగ – గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదలుకొని, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు, గోరకల్లు రిజర్వాయర్లను, హంద్రీ-నీవా సుజల స్రవంతికి నీటిని ఎత్తిపోసే మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను, ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన గాలేరు-నగరి సుజల స్రవంతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వివక్షతకు అద్దంపడుతున్న పనులను, గత ప్రభుత్వ కాలంలో వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును సందర్శించాం.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో విద్యుత్ పంపిణీ సంస్థల అవినీతిని ఎండగడుతూ తిరుపతిలో సదస్సు నిర్వహించాం. ఏబీ వెంకటేశ్వరరావు గారు చిత్తశుద్ధితో ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు.
అలాగే, 22-ఏ భూముల సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, సభలు నిర్వహించారు, ప్రదర్శనలు చేశారు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు, అధికారులకు విన్నవించారు. బలంగా గొంతు విప్పారు.
రాష్ట్ర సమస్యలు, ప్రజా సమస్యలపై ఒక ఉద్యమకారుడిగా తనదైన సొంత ఆలోచనలతో పయనిస్తున్న ఏ.బి. వెంకటేశ్వరరావు గారు విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
మేయర్ స్థానం కోసం పోటీపడుతున్న అభ్యర్థుల్లో నిస్సందేహంగా సమర్థుడైన అభ్యర్థి శ్రీ ఏబీ వెంకటేశ్వరరావు గారే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
