ఫ్రాన్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ పొదుపు విధానాలు, పెన్షన్ సంస్కరణలు, విద్యార్థుల నిరసనలు, కార్మిక సంఘాల సమ్మెలు దేశంలో తీవ్రమైన సామాజిక అసంతృప్తికి దారితీశాయి.
గత రెండు నెలలుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు నవంబర్ 5న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ పరిణామాలు అకస్మాత్తుగా ఏర్పడినవి కావు. ఫ్రాన్స్‌లో దశాబ్దాలుగా అమలవుతున్న సంక్షేమ విధానాలను పరిరక్షించాలని కార్మికులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు కోరుకుంటుండగా, ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణలు, పొదుపు చర్యలు, ప్రజా సేవలపై వ్యయ నియంత్రణ విధానాలు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మారుతున్నాయి.
ఈ రెండు విభిన్న దృక్పథాల మధ్య ఏర్పడిన ఘర్షణే ప్రస్తుత సామాజిక, రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం.
ఫ్రాన్స్‌లో ప్రస్తుత అసంతృప్తికి ప్రధాన కారణాలు:
1. పెన్షన్ సంస్కరణలు
అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ సంస్కరణలను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు రకరకాల ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నారు.
అంతేకాకుండా, పూర్తి పెన్షన్ పొందడానికి అవసరమైన ఉద్యోగ కాలాన్ని కూడా పెంచే ప్రతిపాదనలు తీసుకువచ్చింది.
కార్మిక సంఘాలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా శారీరక శ్రమపై ఆధారపడే కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులు, దీర్ఘకాలం పనిచేసే శ్రామికులు ఈ సంస్కరణల వల్ల తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2020 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన కార్మిక సంఘాలు ఐక్యంగా భారీ సమ్మెలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రవాణా, విద్య, ఇంధనం, చమురు శుద్ధి కేంద్రాలు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు.
2023 మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. కార్మిక సంఘాలతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు, యువజన సంఘాలు, ఉపాధ్యాయులు, రైల్వే ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
2. ప్రజా సేవలపై వ్యయ నియంత్రణ – ప్రభుత్వ పొదుపు విధానాలు
బడ్జెట్ లోటును తగ్గించడం, ప్రభుత్వ అప్పులను నియంత్రించడం పేరుతో మాక్రాన్ ప్రభుత్వం పలు పొదుపు చర్యలను ప్రతిపాదించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధించడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై నియంత్రణలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయింపులను తగ్గించడం వంటి అంశాలు ఉన్నాయి.
అలాగే పెన్షన్లు, సామాజిక భద్రతా ప్రయోజనాలు, ప్రజా సేవల నిర్వహణకు సంబంధించిన ఖర్చులను నియంత్రించే ప్రతిపాదనలు కూడా ప్రజల్లో ఆందోళనకు కారణమయ్యాయి.
ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజా రవాణా, సామాజిక భద్రతా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, పెన్షనర్లు, నిరుద్యోగులు, సామాజిక సంక్షేమ పథకాలపై ఆధారపడే ప్రజలు ఈ విధానాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
3. రాజకీయ మెజారిటీ లేకపోవడం – అవిశ్వాస తీర్మానాలు, ప్రభుత్వ మార్పులు
రాజకీయ అస్థిరత కూడా ప్రజా ఆందోళనలకు ప్రధాన కారణంగా మారింది. 2024 యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర మితవాద శక్తులు భారీ విజయాలు సాధించడంతో అధ్యక్షుడు మాక్రాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నారు.
2024 జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు అనుమతించలేదు. మిచెల్ బార్నియర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు.
అయితే బడ్జెట్, ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత కారణంగా 2024 డిసెంబర్ 4న ఆయన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది.
తర్వాత ఫ్రాంకోయిస్ బైరో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రభుత్వం కూడా ఆర్థిక పొదుపు విధానాల విషయంలో ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొంది.
2025లో బడ్జెట్ కోతలు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, సామాజిక సంక్షేమంలో కోతల ప్రతిపాదనలు రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
ప్రభుత్వాలు తరచూ మారడం, పార్లమెంటులో స్థిరమైన మెజారిటీ లేకపోవడం, ప్రజల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే భావన ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి.
4. విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి
ఫ్రాన్స్‌లో విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి ప్రజా ఉద్యమాలకు మరో ముఖ్యమైన కారణం. విద్యా వ్యయం, ఉపాధి అవకాశాల కొరత, జీవన వ్యయం పెరుగుదల, సామాజిక అసమానతలు, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు తగిన విధంగా లేకపోవడం వంటి సమస్యలతో యువత నిరసనలు చేపట్టింది.
విశ్వవిద్యాలయాలకు తగిన నిధులు కేటాయించకపోవడం, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించకపోవడం, ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇంటి అద్దెలు, ఆహార పదార్థాలు, రవాణా ఖర్చులు పెరగడంతో తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చదువు పూర్తయిన తర్వాత కూడా స్థిరమైన ఉద్యోగాలు లభించక, తాత్కాలిక ఉద్యోగాలపై ఆధారపడాల్సి రావడం, అతి తక్కువ వేతనాలు యువతలో నిరాశను పెంచుతున్నాయి.
పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.
5. కార్మిక పోరాటాలు
వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పెన్షన్ల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, ప్రజా సేవల మెరుగుదల కోసం కార్మిక సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయి.
రవాణా, విద్య, వైద్యం, ఇంధనం, విద్యుత్, ప్రభుత్వ సేవలు తదితర రంగాల్లో వివిధ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రజలపై భారం మోపడం కంటే, సంపన్న వర్గాలు, పెద్ద సంస్థలు తమ ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల ఆందోళనలు – సెప్టెంబర్, అక్టోబర్ 2026 పరిణామాలు
1. మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత
2026 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత, విద్యా ఖర్చుల పెరుగుదల, విద్యా వ్యవస్థలో అసమానతలు వంటి అంశాలపై విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
ప్రారంభంలో పాఠశాల విద్యార్థులు చేపట్టిన నిరసనలు క్రమంగా విస్తృతమైన విద్యారంగ ఉద్యమంగా మారాయి.
వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తరగతి గదుల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా చేరుతున్నాయి.
అయితే అనేక పాఠశాలల్లో తగిన శీతలీకరణ సౌకర్యాలు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. తరగతి గదుల నిర్వహణ సరిగా లేదు. మరుగుదొడ్లలో సరైన సౌకర్యాలు లేవు.
ఈ సమస్యలన్నీ విద్యార్థుల ఆందోళనలకు కారణమయ్యాయి. పాఠశాల భవనాలను పునరుద్ధరించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
2. బడ్జెట్ కోతలు, నియామకాల కొరత
ప్రభుత్వ బడ్జెట్ కోతలు, నియామకాల కొరత కారణంగా అనేక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లేకపోవడం పలు సమస్యలకు దారితీసింది.
ఒక ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నప్పుడు వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తరగతులు రద్దవుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల బోధనా సమయం వృథా అవుతోంది. అందువల్ల ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యాసంస్థల్లో తగినంత బోధనా సిబ్బందిని నియమించాలని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
3. పెరిగిన జీవన వ్యయం
నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, ఆహారం, రవాణా ఖర్చులు పెరగడంతో విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఖర్చులను భరించలేక చదువును కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్య కేవలం విద్యార్థులకే పరిమితం కాదు. లక్షలాది కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. వివిధ తరగతుల ప్రజలు విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు.
4. విశ్వవిద్యాలయ ప్రవేశాల విధానంపై అసంతృప్తి
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఉపయోగించే ‘పార్కోర్సప్’(జాతీయ స్థాయి ప్రవేశ ప్రక్రియ) విధానంపై కూడా విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకత లోపించడం, కఠినతరమైన నిబంధనలు, విద్యార్థులకు తమకు నచ్చిన కోర్సుల్లో ప్రవేశం పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఆందోళనలకు కారణమయ్యాయి.
విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, ప్రవేశాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనల తీవ్రత – పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ముట్టడి
2026 సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ నెలలో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. జెన్-జీ తరానికి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను వ్యక్తం చేశారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యాసంస్థల కార్యకలాపాలను అడ్డుకున్నారు.
హింసాత్మక ఘటనలు – పోలీసుల అరెస్టులు
సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ నెలలో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
పోలీసులకు, నిరసనకారులకు మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జీలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థులు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలకు రాజకీయ పరిష్కారం చూపకుండా కేవలం పోలీసు చర్యలతో ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని నిరసనకారులు విమర్శిస్తున్నారు.
సార్వత్రిక సమ్మెకు దారితీసిన పరిస్థితులు
విద్యార్థుల ఆందోళనలు, ప్రజా నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్న కార్మిక సంఘాలు విద్యార్థుల ఉద్యమాలకు మద్దతు ప్రకటించాయి.
కొన్ని సంఘాలు ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐదు జాతీయ స్థాయి కార్మిక సంఘాల సమాఖ్యలు ఐక్యంగా చర్చించి 2026 నవంబర్ 5న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఇది దేశంలో జరుగనున్న అతిపెద్ద సమ్మె అని ఒక కార్మిక సంఘ నేత పేర్కొన్నారు. ఈ సమ్మెకు కార్మిక సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సమాఖ్యలు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని ప్రభుత్వ సేవలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రజా రవాణా, ఇతర కీలక రంగాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉద్యమంలో ప్రధానంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలు కలిసి పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు – కార్పొరేట్ ప్రయోజనాలు – ప్రజా సంక్షేమంపై ప్రభావం
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రజా ఆందోళనలు కేవలం రాజకీయ సంక్షోభం కాదు. వీటి వెనుక పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు, సామాజిక, తీవ్ర ఆర్థిక అసమానతలు తదితర సమస్యలు ఉన్నాయి.
మిలియన్ల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు ఐక్యంగా వారికి మద్దతు ప్రకటించడం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు, యూరోపియన్ యూనియన్‌లోని ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరికగా మారింది.
గతంలో ఫ్రాన్స్‌లో అధిక ఆదాయం కలిగిన వర్గాలు తమ ఆదాయానికి అనుగుణంగా ఎక్కువ పన్నులు చెల్లించేవి.
పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వానికి గణనీయమైన పన్ను ఆదాయం సమకూరేది. ఆ ఆదాయాన్ని ప్రభుత్వం విద్య, వైద్యం, ప్రజా రవాణా, పెన్షన్లు, సామాజిక భద్రత, ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించేది.
అయితే, సరళీకరణ విధానాలతో ప్రభుత్వం తక్కువ ఆదాయ వర్గాలపై పన్నుల భారం మోపి, అధిక ఆదాయ వర్గాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తున్నది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి ప్రజా సేవలకు కేటాయించే నిధులు తగ్గుతున్నాయని కార్మిక సంఘాలు, వామపక్ష సంస్థలు విమర్శిస్తున్నాయి.
అమెరికాతో సహా ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసే దేశాలన్నింటిలో కార్పొరేట్ సంస్థలకు, సంపన్న పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు కల్పించడం, ప్రభుత్వ ప్రజా సేవల వ్యయాలను తగ్గించడం, మరోవైపు సైనిక వ్యయాన్ని విపరీతంగా పెంచడం సంక్షోభాలకు దారితీస్తున్నది.
అందువల్ల ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఉద్యమాలు కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు.
యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సంక్షేమ రాజ్య భవిష్యత్తు, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయని అర్థమవుతున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
