లోపభూయిష్టమైన పర్యావరణ ప్రభావ అంచనాలతో పాటు, అటవీ హక్కుల చట్టం-2006ను ఉల్లంఘిస్తూ చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి పౌరులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పునరుద్ఘాటిస్తూ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఈ పిటిషన్‌ను అందజేశారు.
న్యూఢిల్లీ: గ్రేట్ నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టదలచిన ప్రాజెక్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆన్లైన్ పిటిషన్ ద్వారా పౌరులు డిమాండ్ చేశారు.
మే 21 గురువారం రాత్రి నాటికి ఈ పిటిషన్‌పై 2.10 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టులు “విస్తృతమైన అటవీ నిర్మూలనకు” దారితీస్తాయని, ద్వీపంలో అభివృద్ధి కోసం పర్యావరణ అనుకూలమైన సుస్థిర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ పిటిషన్ స్పష్టం చేసింది.
కార్పొరేట్ ప్రాజెక్టుల పేరుతో అటవీ విధ్వంసం..
అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో దక్షిణాన చిట్టచివరి ప్రాంతమైన గ్రేట్ నికోబార్ ద్వీపంపై కేంద్ర ప్రభుత్వం పలు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
వీటిలో అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, ఒక టౌన్షిప్, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలు ఉన్నాయి.
చట్టాల ఉల్లంఘన – నిపుణుల ఆందోళన..
ఈ ప్రాజెక్టుల కోసం నరికివేయాల్సిన చెట్ల సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తక్కువ అంచనా వేస్తోందని జీవశాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, పర్యావరణ సంరక్షకులు, మాజీ సివిల్ సర్వెంట్లతో సహా ఎంతోమంది పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ప్రజల వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా, లోపభూయిష్టమైన పర్యావరణ ప్రభావ అంచనా ద్వారా, అటవీ హక్కుల చట్టంతో సహా పలు కీలక చట్టాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు అమలుకు అనుమతులు ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు.
ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 9.6 లక్షల చెట్లను నరికివేసి 130 చదరపు కిలోమీటర్ల మేర వర్షారణ్యాలను నాశనం చేస్తున్నారన్న ఆందోళనలను ఈ పిటిషన్ పునరుద్ఘాటించింది.
అయితే నరికివేసే చెట్ల సంఖ్య పది లక్షల(ఒక మిలియన్) వరకు ఉండవచ్చని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ పోర్టు ప్రాజెక్టు ద్వీపంలోని ఆగ్నేయ భాగంలో ఉన్న గలాథియా బే ప్రాంత జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.
గిరిజనుల మనుగడకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు..
భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు స్థానిక ‘షోంపెన్’, ‘నికోబారీ’ గిరిజన తెగలపై తీవ్ర ప్రభావం చూపి, వారిని స్వస్థలాల నుంచి గెంటివేస్తాయన్న భయాన్ని పిటిషన్లో వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టులకు సరైన పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనాలు లేవని, పైగా భూకంపాలు ఎక్కువగా వచ్చే, సునామీ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో వీటిని ప్రతిపాదించడం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు.
చిత్రం: 2016లో గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్‌లోని వాచ్‌టవర్ నుంచి అటవీ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న సముద్రంపై కురుస్తున్న వర్షం దృశ్యం. (ఫోటో: ప్రసూన్ గోస్వామి/వికీమీడియా కామన్స్).
ఆర్థిక ప్రయోజనాల కోసం పర్యావరణ బలి..
“ఈ ప్రాజెక్టు.. నివాస టౌన్‌షిప్‌లు, హోటళ్ల ద్వారా పట్టణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, కేవలం వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే నొక్కి చెబుతోంది. అయితే ఆర్థిక వృద్ధిపై పెట్టిన ఈ దృష్టి, పర్యావరణం, సమాజంపై తీవ్రమైన, కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని విస్మరించలేము” అని పిటిషన్ స్పష్టం చేసింది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిపాదించిన సుస్థిర గ్రామీణాభివృద్ధి వ్యూహమైన PURA(Providing Urban Amenities in Rural Areas) చొరవతో ఈ పిటిషన్‌ను రూపొందించారు.
దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యావరణ, అటవీ- వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అలాగే వన్యప్రాణుల జాతీయ బోర్డుకు పంపారు.
Change.Orgలో ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ఆన్లైన్ పిటిషన్‌పై మే 21 రాత్రి 7:50 గంటల సమయానికి ఏకంగా 2,10,669 మంది పౌరులు సంతకాలు చేశారు.
అనువాదం: గంట రాజు,సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
