రాహత్ ఇందోరి రాసిన కవిత్వంలోని వాక్యాలు గుర్తుకొచ్చాయి- “లగేగీ ఆగ్ తో ఆయెంగే ఘర్ కై జద్ మే / యహాన్ పే సిర్ఫ్ హమారా మకాన్ థోడీ హై..(మంటలు చెలరేగితే, అది చాలా ఇళ్లను దహించివేస్తుంది/ ఇక్కడ నా ఇల్లు మాత్రమే లేదు కదా..!)” ఇన్నాళ్లూ నా సామాజిక హోదా, వెసులుబాట్లే నన్ను కాపాడాయని గ్రహించాను. ద్వేషమనే అగ్ని చివరికి నా వరకు కూడా వచ్చింది. ముందో వెనుకో అది అందరినీ దహించివేస్తుంది.
మత విద్వేషమనే అగ్ని చివరికి నన్ను కూడా తాకింది. ముందో వెనుకో అది మనందరినీ దహించివేస్తుంది.
ఢిల్లీలో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళగా, మే 17వ తేదీ తెల్లవారుజామున మా తల్లిదండ్రులతో కలిసి మా ఇంటి నుంచి ప్రయాణిస్తున్నప్పుడు నేను మొదటి సారిగా ద్వేషాన్ని ఎదుర్కొన్నాను.
మా అమ్మానాన్నలు రాంచీకి విమానంలో వెళ్లాల్సి ఉంది. నేను దారిలో హౌజ్ ఖాస్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోతానని క్యాబ్ డ్రైవర్‌కి చెప్పాను. ఆ మెట్రో స్టేషన్ ఎయిర్ పోర్టు వెళ్ళే దారిలోనే ఉండటంతో, నేను అదనంగా దిగాల్సిన చోటును(డ్రాప్ లొకేషన్) యాప్‌లో చేర్చలేదు.
నేను అదనంగా మరో డ్రాప్ లొకేషన్ పెట్టాలని డ్రైవర్ భావించాడు. దానికి నేను ఒప్పుకోలేదు. అతను మధ్యలోనే రైడ్ ఆపేసి, మమ్మల్ని దిగమని చెబుతూ, “ఇది నా కారు. నాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటాను, నచ్చినప్పుడు దించేస్తాను” అన్నాడు.
క్యాబ్ డ్రైవర్లు ప్రయాణం మధ్యలోనే రైడ్ ఆపేస్తున్నారని నేను వార్తల్లో విన్నాను. దానిని వారి దుష్ప్రవర్తనగా మాత్రమే అనుకున్నాను.
సంఘటన జరిగిన ప్రదేశంలోనే నేను ఉబెర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను. నేను ఉబెర్ సపోర్ట్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా, ఆ డ్రైవర్ నా ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు.
ఉబెర్ సపోర్ట్ ప్రతినిధి ఆ డ్రైవర్ అరుపులు విని, వెంటనే అతనికి దూరంగా వెళ్ళమని నన్ను కోరారు. వారు కాల్ కట్ చేసి, అతని వాదన వినడానికి డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. డ్రైవర్ వారి కాల్ తీసుకున్నాడు కానీ వారిపై అరవడం మొదలుపెట్టాడు.
ఉబెర్ సపోర్ట్ నాకు తిరిగి కాల్ చేసే సమయానికి, ఆ డ్రైవర్ మమ్మల్ని వెంబడిస్తూ తన ఫోన్లో మమ్మల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాడు.
అతను మా అమ్మ అబాయా, నా హిజాబ్‌ను జూమ్ చేసి, “ఈ జనం, ఇలాంటి జనం, ఈ జామియా వాళ్ళు” వంటి మాటలు గొణుగుతూ ఉన్నాడు. అతను మా అనుమతి లేకుండా మమ్మల్ని చిత్రీకరిస్తూనే ఉన్నాడు.
నా తల్లిదండ్రుల భద్రతే నా ఆందోళన. అందుకే నేను మరో క్యాబ్ బుక్ చేయడం ప్రారంభించాను. ఆ క్యాబ్ డ్రైవర్ తన ఫోన్ కెమెరాతో మమ్మల్ని వెంబడించాడు.
నేను వెనక్కి వెళ్ళమని కోరుతున్నప్పటికీ, అతను దగ్గరికి వస్తూనే ఉన్నాడు.
నేను బుక్ చేసిన కొత్త రాపిడో క్యాబ్‌లో మా అమ్మానాన్నలను కూర్చోబెట్టి, నేను మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లాను.
క్షేమంగా నేను స్టేషన్లోకి ప్రవేశించే వరకు చూడాలని మా అమ్మానాన్నలు పట్టుబట్టారు.
లోపలికి వెళ్ళాక, వాళ్ళు క్యాబ్‌లో బయలుదేరారా అని అడగడానికి మా నాన్నకు ఫోన్ చేశాను.
తీరా చూస్తే, ఆ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ కొంతమందిని సమీకరించాడని, వాళ్ళు మా తల్లిదండ్రులను గేలి చేయడం మొదలుపెట్టారని తెలిసింది.
ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చిత్రీకరిస్తుండగా, అతను తెచ్చుకున్న గుంపు రాపిడో క్యాబ్ తలుపులు తెరవమని అడిగిందని మా తల్లిదండ్రులు తరువాత నాకు చెప్పారు.
ఫలితంగా, రాపిడో క్యాబ్ డ్రైవర్ మా తల్లిదండ్రులను తీసుకెళ్లడానికి నిరాకరించాడు.
మా నాన్నగారు కిందకు దిగి, అక్కడ గుమిగూడిన ప్రజలకు ఏమి జరిగిందో వివరించారు. దాంతో వారు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయారు.
ఈ మొత్తం సంఘటన నాలో ఒక బలమైన మానసిక గాయాన్ని మిగిల్చింది. ఇది నన్ను నేను అనేక ప్రశ్నలు వేసుకునేలా చేసింది. నేను ఢిల్లీకి వచ్చి ఎనిమిదేళ్లకు పైగా అయింది. ఇంతటి దూకుడును నేను స్వయంగా చూడటం ఇదే మొదటిసారి. ప్రజల ఈ ఆకస్మిక వైఖరి మార్పుకు ఎవరు బాధ్యులు? స్పష్టంగా ముస్లింలుగా కనిపించే వ్యక్తులపై ఈ యాదృచ్ఛిక దాడుల వెనుక ఎవరున్నారు? ఒక సాధారణ కార్మికుడు అకస్మాత్తుగా గూండాగా మారి తన ప్రయాణికులను వేధించడానికి కారణం ఏమిటి? నిరాయుధులైన ప్రజలపై గుంపును సమీకరించడానికి, వారిని బెదిరించడానికి, భయం, ఆందోళనను వ్యాప్తి చేయడానికి అతనికి అధికారం ఎవరు ఇచ్చారు? ఒకరి మతంపై అవమానకరమైన భాషను ఉపయోగించే ధైర్యం అతనికి ఎవరు ఇచ్చారు?
ఈ సంఘటన ఒక బహిరంగ నిదర్శనం, నాలాంటి వ్యక్తుల విషయంలో ‘వ్యక్తిగతం’ అనేది ఒక నిర్దిష్ట కోణంలో ‘రాజకీయమైనది’ అనడానికి ఒక హెచ్చరిక.
ప్రజలు ఎలా తయారవుతారో రాజకీయాలు నిర్వచిస్తాయి.
క్యాబ్ డ్రైవర్ విషయంలో, అతను ముస్లింల గురించి ఏమి ఆలోచిస్తాడో అది(ఆ రాజకీయమే) నిర్వచిస్తుంది.
నా విషయంలో, నా ఉనికికి శత్రుపూరితంగా మారిన ఈ ప్రపంచం నేపథ్యంలో నన్ను నేను అర్థం చేసుకునేలా ఇది నన్ను బలవంతం చేస్తోంది.
హిందుత్వ రాజకీయాలు దేశ ప్రజల మనస్తత్వాన్ని దెబ్బతీశాయి. సంవత్సరాలుగా, భారతదేశంలో మైనారిటీలపై దాడుల గురించిన వార్తలను నేను ప్రతిరోజూ వింటూ నిద్రలేస్తున్నాను. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత నేరాలు విపరీతంగా పెరిగాయి. మతపరమైన పండుగల సమయంలో ఈ సంఘటనలు పెరుగుతాయి. బాధితుల్లో ఎక్కువ మంది సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందినవారు. బలహీనులలో భయాన్ని కలిగించడం సులభం.
నేను ఈ సంఘటన గురించి నా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాను.
ఎక్స్ (ట్విట్టర్)లో నా పోస్టుకు వచ్చిన కామెంట్లు ముస్లింల పట్ల ద్వేషం ఏ స్థాయిలో ఉందో చూడటానికి కారణమయ్యాయి.
“జిహాదీ”, “ముల్లే”, “పందులు” వంటి పదాలు ఎటువంటి నైతిక సంకోచాలు లేకుండా, అప్రయత్నంగా వాడబడుతున్నాయి. ముస్లింల పట్ల ఈ ద్వేషం చాలావరకు సాంస్కృతికమైనది, కానీ ఇది నిర్మాణాత్మకమైనది కూడా.
ఈ ద్వేష సంస్కృతికి నిర్మాణాత్మక రూపాన్ని, ప్రేరణను సోషల్ మీడియా ఇస్తుంది.
స్వేచ్ఛగా ప్రవహించే ఈ ద్వేషం వృద్ధి చెందడానికి రాజకీయ వర్గం- మౌనం లేదా ప్రోత్సాహం కూడా వీలు కల్పించింది.
ఉబెర్‌ను ఫోన్ నుంచి తొలగించమని ఈ సంఘటన తర్వాత మా అమ్మ నన్ను కోరింది.
ఆమె భయం, వృత్తిపరమైన పరస్పర చర్యలతో కూడిన ప్రపంచ సాంకేతిక వేదికల పట్ల నన్ను ఆలోచింపజేసింది. ఉద్యోగుల కోసం కేవలం కమ్యూనిటీ మార్గదర్శకాలు ఉండటం సరిపోదు.
ప్రయాణీకుల భద్రతను నిర్ధారించే మరింత సమర్థవంతమైన విధానం తప్పక ఉండాలి. కఠినమైన హెచ్చరికలు ఉండాలి, కొన్ని నేరాలకు తప్పక శిక్ష విధించాలి.
మరుసటి రోజు ఉబెర్ కస్టమర్ సపోర్ట్ నాకు ఫోన్ చేసి, ఆ ఉద్యోగిపై చర్య తీసుకున్నామని హామీ ఇచ్చింది. అయితే, వారు నా భద్రతకు హామీ ఇవ్వలేమని కూడా చెప్పారు. మరి మన భద్రతకు ఎవరు హామీ ఇస్తారు?
నాకు రాహత్ ఇందోరి రాసిన కవిత్వంలోని వాక్యాలు(కప్లెట్) గుర్తుకొచ్చాయి, “లగేగీ ఆగ్ తో ఆయెంగే ఘర్ కై జద్ మే / యహాన్ పే సిర్ఫ్ హమారా మకాన్ థోడీ హై..(మంటలు చెలరేగితే, అది చాలా ఇళ్లను దహించివేస్తుంది/ ఇక్కడ నా ఇల్లు మాత్రమే లేదు కదా..!)”
ఇన్నాళ్లూ నా సామాజిక హోదా, వెసులుబాట్లే నన్ను కాపాడాయని గ్రహించాను. ద్వేషమనే అగ్ని చివరికి నా వరకు కూడా వచ్చింది. ముందో వెనుకో అది అందరినీ దహించివేస్తుంది.
(మిధత్ సమ్రా న్యూఢిల్లీలోని నెహ్రూ సెంటర్లో పరిశోధకురాలు, మల్టీమీడియా నిర్మాతగా పనిచేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
