మే నెలలో, కర్ణాటక ప్రభుత్వం కనీస వేతనాలపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 81 రకాల షెడ్యూల్ ఉపాధి రంగాలలో వేతనాలను సవరిస్తూ, ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే సగటున 60% వేతనాల పెరుగుదల ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, బెంగళూరులో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 23,376 కాగా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 19,318 గా ఉంటుంది.
బెంగళూరు, చిన్న పట్టణాల వేతనాల మధ్య రూ. 4,000 కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంది.
మెట్రో నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల ఉంది.
పట్టణ మెట్రోలలో అధిక జీవన వ్యయాన్ని గుర్తించి ఆ మేరకైనా పెంపుదల చేయడం సంతోషదాయకం.
సుప్రీంకోర్టు ఆదేశాలు – వాస్తవ పరిస్థితులు..
మీడియా ఇంటర్వ్యూలలో, కర్ణాటక కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కనీస వేతన సవరణను చేపట్టామని చెప్పారు.
భారతదేశంలో కనీస వేతన చట్టానికి సంబంధించిన, తరచుగా విస్మరించబడే ఒక వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుంది.
అదేమిటంటే, కనీస వేతన నిర్ధారణ పద్ధతి వివరంగా రూపొందించబడింది. దేశవ్యాప్తంగా సమానంగా వర్తిస్తుంది. అయినప్పటికీ రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య కనీస వేతనాలలో పెద్ద తేడా ఉంది. పారిశ్రామిక యజమానులతో కార్మిక శాఖ కుమ్మక్కవడమే ఇందుకు కారణం.
యజమానుల అభ్యంతరాలు – ద్రవ్యోల్బణ సాకులు..
అధిక వేతనాలు చెల్లిస్తే ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, తద్వారా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని యజమానులు వాదిస్తున్నారు.
అయితే, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం భారతీయ జనాభాలో అత్యల్ప వర్గాల వేతనాలను తగ్గించి, వారి వినియోగాన్ని అడ్డుకోవడం అనేది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే మార్గం కాజాలదు. అంతేకాకుండా, సగటు కుటుంబ వినియోగ స్థాయిలు ఇంకా కోవిడ్‌కు పూర్వ స్థాయికి చేరుకోలేదని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వానికి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
అందులో ఉత్పత్తి వ్యయాన్ని అదుపు చేయడానికి జీఎస్టీ నిర్మాణాన్ని సర్దుబాటు చేయడం కూడా ఒకటి.
వేతనాలు పెంచడం వల్ల పరిశ్రమలు తరలిపోతాయని యజమానులు వాదిస్తున్నారు. ఈ వాదన నిజం కాదు.
చాలా రంగాలలో మొత్తం వ్యయంలో వేతనాల వాటా తగ్గుతోంది. పెట్టుబడి నిర్ణయాలను కేవలం వేతనాలు మాత్రమే నిర్దేశించవు.
మౌలిక సదుపాయాలు, ఆర్థిక వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి లభ్యత, పారిశ్రామిక శాంతి వంటి అనేక ఇతర అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్‌లో అధిక వేతనాల కోసం గార్మెంట్, ఇతర ఫ్యాక్టరీ కార్మికులు ఇటీవల చేసిన నిరసనలు, కార్మికుల పేదరికాన్ని, వారి నిరాశను స్పష్టంగా గుర్తుచేశాయి.
పారిశ్రామిక శాంతిని నిర్ధారించడానికి గౌరవప్రదమైన వేతనాల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్పింది.
విస్మరించిన రంగాలు..
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, ఈ నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన లోపాలు ఉన్నాయి.
మొదటిది ఇది నాలుగు ముఖ్యమైన రంగాలను వదిలివేసింది: గార్మెంట్ పని, బీడీలు చుట్టడం, అగర్బత్తి తయారీ, ప్లాంటేషన్ పని.
ఈ నాలుగు రంగాలలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు, అందులో మెజారిటీ మహిళలే. ఈ నోటిఫికేషన్ అమలుతో, ఈ నాలుగు రంగాలలోని కార్మికుల వేతనాలు నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చే ఇతర 81 రంగాలలో సమాన నైపుణ్య స్థాయి కలిగిన కార్మికుల వేతనాలలో దాదాపు సగమే అవుతాయి.
ప్రధానంగా ఇళ్ల వద్దే జరిగే బీడీలు చుట్టే పని, తక్కువ వేతనాలు ఇచ్చే ఉపాధి వల్ల తరతరాలుగా ఎదురయ్యే ప్రమాదాలను తెలియజేస్తుంది.
బీడీలు చుట్టే తమ తల్లులు ఉండే ప్రదేశంలోనే పిల్లలు కూడా ఉంటారు, దీనివల్ల వారు కూడా తరచుగా తమ తల్లులకు సహాయం చేయడానికి లాగబడతారు.
ఇది వారు పేదరికపు ఊబి నుంచి బయటపడే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. బీడీలు చుట్టడానికి పీస్ రేట్(చేసే పని పరిమాణాన్ని బట్టి ఇచ్చే ధర)తో ముడిపడి ఉన్న గౌరవప్రదమైన కనీస వేతనం ఈ పిల్లలకు ఇతర అవకాశాలను పెంచుతుంది.
వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ సమస్యలు..
మరొక సమస్య వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌కి సంబంధించినది.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన రెండు వేతన నిర్ణయాల మధ్య కాలంలో, ద్రవ్యోల్బణం నుంచి వాస్తవ వేతనాలను రక్షించడానికి వీడీఏ ఉద్దేశించబడింది.
దురదృష్టవశాత్తు కర్ణాటకలోని పాయింట్ల ఆధారిత వేతన తటస్థీకరణ విధానం, కేవలం అత్యల్ప నైపుణ్యంలేని వర్గాలలో మాత్రమే వాస్తవ వేతనాలను పూర్తిగా రక్షిస్తుంది.
సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ కార్మికుల ఉన్నత వర్గాలకు, ఇటువంటి రక్షణ పాక్షికంగా మాత్రమే ఉంటుంది.
పైగా, ప్రతి వేతన సవరణతో, పాత వీడీఏ సూత్రం వాస్తవ వేతనాలను రక్షించడానికి సరిపోదు.
పాయింట్లను సవరించాల్సిన అవసరం ఉంది. గతంలో వేతన సవరణలతో పాటు వీడీఏ సవరణ కోసం యూనియన్ల ఆధ్వర్యంలో కోర్టు కేసులు జరిగాయి.
ప్రస్తుత నోటిఫికేషన్ కూడా ఈ లోపాన్ని పరిష్కరించాలి.
వ్యాపార నిర్వహణకు ఒక ప్రత్యామ్నాయ నమూనా..
కనీస వేతన నోటిఫికేషన్ ఇప్పటికీ ఒక సానుకూల అడుగు. ఇది రాష్ట్రంలో సమానమైన వృద్ధికి అవకాశాన్ని (సంభావ్యతను) కలిగి ఉంది.
ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
సంపద అసమానతలు పెరుగుతున్న ఈ సమయంలో ఇది ఒక ప్రత్యామ్నాయ నమూనాను నొక్కి చెబుతుంది.
అదేమిటంటే, మితిమీరిన దోపిడీ లేని లాభాలే “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కి(వ్యాపార నిర్వహణ సౌలభ్యానికి) మార్గం కావాలి.
(మోహన్ మణి, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో విజిటింగ్ ఫెలోగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
