విదేశీ పెట్టుబడుల విషయంలో స్వతంత్ర వార్తా సంస్థ ‘న్యూస్ క్లిక్’పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పెట్టిన మరో కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
విదేశీ పెట్టుబడుల వివాదంలో ఢిల్లీ పోలీసులు న్యూస్ క్లిక్ వార్తా సంస్థపై సాగిస్తున్న దర్యాప్తును అనుమతించడమంటే చట్టాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేయడమేనని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలలో పస లేదని, ఆరోపణలకు కనీస ఆధారాలు కూడా చూపలేదని వ్యాఖ్యానిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యూస్ క్లిక్ స్వతంత్ర వార్తా సంస్థపై ప్రభుత్వ విభాగాలు పెట్టిన కేసులను కొట్టేసింది.
మే 29వ తేదీన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఈ తీర్పు ప్రకటించినప్పటికీ, జూన్ 10వ తేదీ వరకు తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి రాలేదు.
దీంతో దాదాపు ఆరేళ్లపాటు న్యూస్ క్లిక్ వార్తా సంస్థపై మోదీ ప్రభుత్వం కనుసన్నులలో ప్రభుత్వ ఏజెన్సీలు నడుపుతున్న కుట్ర కేసు ముగింపుకు వచ్చింది.
2020 ఆగస్టులో ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం విదేశీ పెట్టుబడుల స్వీకరణ విషయంలో న్యూస్ క్లిక్ వార్తా సంస్థ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించడమే కాక మోసం, విశ్వాస ఘాతకం వంటి చర్యలకు పాల్పడిందని కూడా కేసులు నమోదు చేసింది.
ఇటువంటి నిరాధారపూరితమైన ఆరోపణలు ఉన్న ఎఫ్ఐఆర్ ప్రాతిపదికగా చేసుకొని దర్యాప్తు అనుమతించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వర్తించని నిబంధనల సాకుతో..
న్యూస్ క్లిక్ ప్రచురణ సంస్థ 2018లో తన వాటాలను అమ్మే విషయంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించబడినప్పటికీ, 2018 నాటికి ఈ షరతులు డిజిటల్ వార్తా సంస్థలకు వర్తించేవిగా లేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
తాజాగా ఉన్న నిబంధనల ప్రకారం ఏ రకమైన వార్తా సంస్థ అయినా విదేశీ పెట్టుబడులను స్వీకరించాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి.
2018లో ఇటువంటి నియమాలను డిజిటల్ వార్తా సంస్థలకు వర్తింపజేయలేదు.
నష్టాల్లో నడుస్తున్న న్యూస్ క్లిక్ వార్తా సంస్థ సిబ్బందికి అధిక వేతనాలు చెల్లించేందుకుగాను విదేశీ పెట్టుబడులను స్వీకరించిందని, ఈ చెల్లింపులు వేర్వేరు ఉద్దేశాలతో జరిగాయని ఢిల్లీ పోలీసు విభాగం పరిధిలో పనిచేస్తున్న ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ వాదించింది.
ఈ వాదనలపై స్పందిస్తూ- ఢిల్లీ హైకోర్టు ఏదైనా ఒక కంపెనీలో అత్యధిక స్థాయిలో ఖర్చులు ఉన్నంత మాత్రాన అది నేరపూరితమైన చర్యగా పరిగణించడం సరికాదని తేల్చి చెప్పింది.
మోసం, విశ్వాస ఘాతకం అనడానికి ఆధారాల్లేవు..
పోలీసుల ఆరోపణ ప్రకారం అమెరికాలోని డెలావేర్ కేంద్రంగా పనిచేసే ఒక కంపెనీ నుంచి న్యూస్ క్లిక్ వార్తా సంస్థకు 15 లక్షల డాలర్ల నిధులు సమకూరాయి.
అయితే ఈ సంస్థ న్యూస్ క్లిక్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒక సంవత్సరం ముందే తన లావాదేవీలు నిలిపివేసింది.
ఈ విషయంపై వివరణ ఇస్తూ- న్యూస్ క్లిక్ వార్తా సంస్థలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీ స్థానిక చట్టాలకు అనుగుణంగా తన పేరు మార్చుకున్నదే తప్ప పూర్తిగా రద్దు కాలేదని న్యాయస్థానం నిర్ధారించింది.
మోసం అంటే మోసపూరిత ప్రయత్నాల ద్వారా ఇతరుల ఆస్తులను కాజేయడం అని, కానీ ప్రస్తుత వివాదంలో న్యూస్ క్లిక్‌లో వాటాలు కొన్న అమెరికా కంపెనీ కానీ, మరొకరు గానీ న్యూస్ క్లిక్ వార్తా సంస్థ తమను మోసగించిందని ఆరోపణలు చేయలేదన్న విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది.
ఫిర్యాదు చేసిన శోభన్ సింగ్ నష్టపోయిన వ్యక్తి కాదని, కేవలం సమాచారం ఇచ్చిన వ్యక్తి మాత్రమేనని వివరించింది.
విశ్వాస ఘాతకానికి న్యూస్ క్లిక్ సంస్థ పాల్పడిందన్న ఆరోపణ గురించి కూడా చర్చిస్తూ, న్యాయస్థానం ఈ తరహా ఆరోపణలు గానీ, ఫిర్యాదు గానీ న్యూస్ క్లిక్ సంస్థపై ఏమీ లేవని చెప్పింది.
వీసమెత్తు ఆధారాలు లేని కుట్ర సిద్ధాంతం..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2020 సెప్టెంబర్‌లో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ పోలీసు శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని కుట్ర కోణం సిద్ధాంతంపై మాత్రమే ఆధారపడుతోందని, ఇటువంటి కుట్రకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించలేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.
ప్రబీర్ పురకాయస్థ, జాసన్ ఫెచ్చర్ల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం కుట్రకు ఆధారం కాబోదని స్పష్టం చేసింది.
రెండు పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరినంత మాత్రాన దాన్ని కుట్రతో పోల్చడం సరికాదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు ఏవీ న్యాయస్థానం దృష్టికి తీసుకురాలేకపోయారని, మనీలాండరింగ్‌కు న్యూస్ క్లిక్ సంస్థ యాజమాన్యం పాల్పడిందని చెప్పటానికి కావలసిన వీసమెత్తు ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఉపా కేసు – సుప్రీంకోర్టు తీర్పు..
న్యూస్ క్లిక్ వార్తా సంస్థపై ఢిల్లీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులే కాకుండా, 2023లో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, చివరకు ఆ సంస్థ నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన వారిపై కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వం దాడులు జరిపింది.
ఏడు నెలల తర్వాత ఈ దాడులు, ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
