ఆల్ ఇండియా సెంట్రల్ సర్వీసులకు చెందిన 71 మంది పదవీ విరమణ చేసిన సివిల్ సర్వెంట్ల బృందం- భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ఒక బహిరంగ లేఖ రాసింది.
పర్యావరణ వ్యాజ్యాలు వేసే వారిపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు “భయాందోళన వాతావరణాన్ని” సృష్టించే ప్రమాదం ఉందని, ఇది పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులను పౌరులు సవాలు చేయకుండా నిరుత్సాహపరుస్తుందని వారు అందులో పేర్కొన్నారు.
లేఖ రాయడానికి నేపథ్యం.. సీజేఐ వ్యాఖ్యలు..
‘కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్’ బ్యానర్‌పై ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ రాయడానికి ఒక నేపథ్యం కూడా ఉంది. గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ విస్తరణ ప్రాజెక్టుకు మంజూరు చేసిన పర్యావరణ, తీరప్రాంత నియంత్రణ జోన్(CRZ) అనుమతులను సమర్థిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 26 నవంబర్ 2025న ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలపై దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా సీజేఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈ సివిల్ సర్వెంట్లు స్పందిస్తూ ఈ లేఖ రాశారు.
సీజేఐ విచారణ సందర్భంగా, “పర్యావరణ కార్యకర్తలు ఫలానా ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని ఏనాడైనా చెప్పారా?” అని ప్రశ్నించారు.
దేశ అత్యున్నత న్యాయాధికారి చేసిన ఈ వ్యాఖ్యలు “ఆందోళన కలిగించే పక్షపాత వైఖరిని” ప్రతిబింబిస్తున్నాయని రిటైర్డ్ అధికారులు పేర్కొన్నారు.
ఈ మౌఖిక పరిశీలన లిఖితపూర్వక ఉత్తర్వుల్లో భాగం కాకపోయినప్పటికీ, ఇది విస్తృతంగా ప్రచారమైంది.
ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ధోరణి..
“ఇలాంటి ప్రకటనలు పౌరుల భిన్నాభిప్రాయాలను అణచివేసి, వారిలో భయాన్ని పెంపొందిస్తాయి. పర్యావరణ నష్టం, సమాజాలు, ప్రజారోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను ప్రశ్నించకుండా వారిని నిరుత్సాహపరుస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైన ధోరణులను సృష్టించగలదు” అని మాజీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ కార్యదర్శి మీనా గుప్తా, మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మందర్, మాజీ విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబీరో తదితరులు ఉన్నారు.
పర్యావరణ పోరాటాలను మరువొద్దు..
భారతీయ పౌర సమాజం చారిత్రాత్మకంగా పర్యావరణ పరిరక్షణను, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసేలా కృషి చేస్తోందని ఈ బృందం వాదించింది.
కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఉత్తరాఖండ్‌లోని చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, కర్ణాటకలోని అప్పికో ఉద్యమాలను వారు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
“దశాబ్దాలుగా పర్యావరణ స్పృహ ఉన్న పౌరులకు, బాధితులకు సుప్రీంకోర్టే చివరి ఆశగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న పౌరులను ఉద్దేశించి సీజేఐ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ కమిటీలపై నమ్మకమా? అవి ‘రబ్బర్ స్టాంపులే’..
ప్రభుత్వం నియమించే పర్యావరణ అంచనా కమిటీలపై కోర్టు చూపుతున్న నమ్మకాన్ని కూడా సంతకం చేసిన వారు ప్రశ్నించారు.
పిపావావ్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు “ప్రభుత్వ పర్యావరణ అంచనా సంస్థలు, నిపుణుల కమిటీలపై” నమ్మకాన్ని వ్యక్తం చేసిందని, అటువంటి సంస్థలు ఆమోదించిన ప్రాజెక్టులను సాధారణంగా నిలిపివేయకూడదని సూచించిందని లేఖలో పేర్కొన్నారు.
అయితే, భారతదేశ పర్యావరణ పరిపాలనా వ్యవస్థలో “తీవ్రమైన లోపాలు” ఉన్నాయని రిటైర్డ్ అధికారులు వాదించారు. ఇటీవల అరావళి కొండల కేసులో, అరావళి శ్రేణిపై ఒక నిపుణుల కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు మొదట అంగీకరించి, ఆ తర్వాత పునఃసమీక్షించడాన్ని వారు గుర్తు చేశారు.
అలాగే సరిస్కా టైగర్ రిజర్వ్‌లో రాజస్థాన్ సరిహద్దుల హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు, 2025 ఆగస్టులో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కోర్టు విమర్శించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన పర్యావరణ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాలకు కేవలం “రబ్బర్ స్టాంపులు”గా మారుతున్నాయని లేఖలో ఆరోపించారు. ఈ సందర్భంగా కొన్ని లెక్కల్ని కూడా వారు ప్రస్తావించారు.
పర్యావరణ అంచనా కమిటీలు వివిధ రంగాలలోని 95 నుంచి 100 శాతం ప్రాజెక్టులకు కళ్లు మూసుకుని అనుమతులు ఇస్తున్నాయని ఆరోపించారు.
ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ 2014-2024 మధ్య మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం 1.73 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ అటవీ భూమిని బదలాయించడానికి ఆమోదం తెలిపిందని, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ 2014-2026 మధ్య పరిశీలించిన 2,186 ప్రతిపాదనలలో 2,121 ప్రతిపాదనలను క్లియర్ చేసిందని వారు పేర్కొన్నారు.
“దేశ పర్యావరణ సంపదను బాధ్యతాయుతంగా రక్షించాల్సిన సంస్థల పనితీరు, వివేచనాత్మక నిర్ణయాలు, పర్యావరణ జాగ్రత్తల పతనాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది” అని లేఖలో వివరించారు.
గుడ్డి నమ్మకం వద్దు.. పౌరుల గొంతు నొక్కొద్దు..
పర్యావరణ అంచనా కమిటీలపై కోర్టులు “గుడ్డి నమ్మకం” ఉంచవద్దని, ప్రజా ప్రయోజన పర్యావరణ వ్యాజ్యాలను “సమాజానికి చేసే గొప్ప సేవగా” గుర్తించాలని ఈ బృందం సీజేఐ, సుప్రీంకోర్టును కోరింది.
“గౌరవనీయులైన సీజేఐ మన దేశ పర్యావరణ సమగ్రత కోసం పౌరులు గొంతు ఎత్తడాన్ని నిరుత్సాహపరచకుండా, ప్రోత్సహిస్తారని మేం ఆశిస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు.
అభివృద్ధి vs పర్యావరణం – లేఖ ముఖ్య ఉద్దేశం..
పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి మధ్య భారతదేశంలో చాలా కాలంగా జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో ఈ లేఖ రాశారు.
గుజరాత్‌లోని పిపావావ్ ఓడరేవు విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి.
అభివృద్ధి ప్రాజెక్టులను పర్యావరణ కార్యకర్తలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారనే ధోరణిలో సీజేఐ మాట్లాడారు.
దీనిపై స్పందించిన మాజీ బ్యూరోక్రాట్లు.. పర్యావరణ అనుమతులు ఇచ్చే ప్రభుత్వ కమిటీలు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, దాదాపు అన్ని ప్రాజెక్టులకూ ‘రబ్బర్ స్టాంప్’ లాగా అనుమతులు ఇచ్చేస్తున్నాయని గణాంకాలతో సహా నిరూపించారు.
న్యాయవ్యవస్థ కూడా పౌరుల గొంతుకను నొక్కేలా మాట్లాడితే, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్నించడానికి ప్రజలు భయపడతారని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పని హెచ్చరించడం ఈ లేఖ ముఖ్య ఉద్దేశం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
