న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి.
ఈ కొద్ది కాలంలోనే ఇంధన ధరలు రూ 7 మేర పెరిగాయి.
ఆహారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు, తాజాగా జరుగుతున్న ఈ ఇంధన ధరల పెంపు సామాన్య భారతీయులకు మరింత ఆందోళన కలిగించనుంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినందు వల్ల పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం వల్లే ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు.
అయినప్పటికీ- నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పెంపును అమలు చేయడం గమనార్హం.
భారీ లాభాల్లో చమురు సంస్థలు..
దేశీయ ఇంధన రిటైల్ మార్కెట్లో 90%కు పైగా వాటా కలిగిన మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ 19,470 కోట్ల ఉమ్మడి నికర లాభాన్ని నమోదు చేశాయి.
మార్చి నెలలో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంస్థలు 40.74% వృద్ధిని సాధించడం విశేషం.
చమురు సంస్థలు ఇంత లాభాల్లో ఉన్నప్పటికీ ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.
ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న, వినియోగిస్తున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్- రిటైల్ ఇంధన ధరలను పెంచిన చివరి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి.
అయితే, అంతర్జాతీయంగా చూసుకుంటే అప్పటికే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.
సెంచరీ దాటిన పెట్రోల్..
తాజా పెంపుతో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ 100 దాటాయి.
ఢిల్లీలో తాజాగా పెట్రోల్‌పై రూ 2.61, డీజిల్‌పై రూ 2.71 చొప్పున పెంచారు.
నిరాశావాద కథనాలను కొట్టిపారేసిన ఆర్థిక మంత్రి..
మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ భయాలను కొట్టిపారేశారు.
ఇదంతా “నిరాశావాద కథనం” అని ఆమె విమర్శించారు.
“భారత దేశీయ ఆర్థిక పరిస్థితి నేటికీ సానుకూలంగా, పటిష్టంగా ఉంది. కొందరు ప్రతికూలవాదులు రంగంలోకి దూరి అంతా పతనమైపోతోందని చెబుతున్నారు. మన ప్రజలు సాధించిన విజయాలను వెంటనే తక్కువ చేసి చూపాలనుకునే భారతీయుల వర్గం ఒకటి ఉంది. ఒక నిరాశావాద, ప్రతికూల కథనం సృష్టించబడుతోంది, ఇది ఏమాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఇది భయాందోళనలు సృష్టించే చర్య. ఇలాంటి భయాలను భారత్ భరించలేదు; మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోంది” అని ఆమె స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, దేశంలోకి వచ్చిన సానుకూల ఎఫ్‌డీఐ పెట్టుబడుల కంటే ఎఫ్‌పీఐ పెట్టుబడులు భారీగా వెనక్కి మళ్లాయి. దీంతో, 2026 మార్చిలో భారతదేశంలో నికర విదేశీ పెట్టుబడులు -$11.7 బిలియన్లకు పడిపోయాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


