సొంత లాభం కంటే సామాజిక స్పృహే పరమావధిగా, దేశ ప్రగతికి వెన్నెముకగా నిలిచిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఈ సెప్టెంబరు ఒకటికి డెభ్భై వసంతాలు పూర్తి చేసుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
అయితే, మోదీ ప్రభుత్వ విధానాల పుణ్యమా అని నేడు వాటాల విక్రయం ప్రమాదంలో పడింది. 1956లో నాడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేవలం 5 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమైన ఎల్ఐసీ, నేడు 60 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎదిగి, గతేడాది ప్రభుత్వానికి 12,207 కోట్ల రూపాయలను డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది.
దేశంలోనే అత్యధికంగా గతేడాది 7946 కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను కట్టి బాధ్యతాయుత సంస్థగా నిలిచింది.
ప్రైవేటీకరణ ముప్పు, విదేశీ పెట్టుబడులు..
ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక దిగ్గజ సంస్థను ప్రైవేటీకరించాలని, ఐపీవో ద్వారా వాటాల అమ్మకాలను సాగిస్తూ క్రమంగా నిర్వీర్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఎల్ఐసీ ప్రైవేటీకరణ అంటే కేవలం ఒక సంస్థ అమ్మకం కాదు. దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి, కోట్ల మంది పాలసీదారుల నమ్మకానికి గొడ్డలి పెట్టు. దీనికి తోడు దేశ ప్రజల పొదుపు సొమ్మును విదేశీ బహుళజాతి సంస్థలు కొల్లగొట్టుకు పోవడానికి అవకాశం ఇస్తూ, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.
మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామి..
ఎల్ఐసీ దేశ ప్రగతికి ఊపిరి. మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామి. దేశంలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్, తాగునీరు వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం, ఇతర రూపంలోను ఎల్ఐసీ సుమారు 55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది.
మంచినీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు వంటి మౌలిక వసతుల కల్పనకై వేల కోట్ల రూపాయలను వెచ్చించింది. ఇలాంటివి ప్రైవేట్ కంపెనీలు చేస్తాయా?
ప్రజల నమ్మకం, సామాజిక భద్రత..
ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం ముఖం చాటేసే చోట, ఎల్ఐసీ దాదాపు 98 శాతం కంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి, ఆర్జిత లాభాలను సామాజిక భద్రత కోసం మళ్ళిస్తోంది.
ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభాలు వచ్చే నగరాలకే పరిమితమవుతాయి. ఎల్ఐసీ మాత్రమే లాభనష్టాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలకు, సామాన్య ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది.
గతంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రైవేట్ బీమా కంపెనీలు దివాళా తీశాయి. కానీ, ఎల్ఐసీ వెనుక ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల ప్రజల సొమ్ముకు పూర్తి రక్షణ ఉంది.
ప్రైవేటీకరణతో ఈ రక్షణ కరువవుతుంది. ప్రైవేటీకరణ వల్ల ప్రజలు దాచుకున్న ప్రీమియం సొమ్ము దేశ నిర్మాణానికి కాకుండా, కార్పొరేట్ శక్తుల లాభాల వేటకు బలైపోతుంది.
నయా ఉదారవాద విధానాల దుష్ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే ఒక విధానంగా పెట్టుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మేయాలనే నిర్ణయం, రక్షణ రంగంతో సహా అన్ని సంస్థలను ప్రైవేటీకరించడం, ఎల్ఐసీ వంటి ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థల వాటాల అమ్మకం వంటివి ఆ విధానాల ఫలితమే.
25 కోట్లమందికి పైగా ఉన్న పాలసీదారుల పొదుపు సొమ్ముకు పూర్తి భద్రతనిస్తూ, సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలా నిలిచింది ఎల్ఐసీ.
ఇటువంటి ప్రజా బాహుళ్య సంస్థ వాటాలను ఉపసంహరించడం కేవలం షేర్ మార్కెట్ జూదగాళ్లకు, కార్పొరేట్ ఫైనాన్స్ శక్తులకు లాభం చేకూరుస్తుందే తప్ప, దేశ సార్వభౌమత్వానికి, ప్రజా ప్రయోజనాలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
మన దేశంలో విచిత్రమేమిటంటే పాము తన గుడ్లను తానే తినేసినట్లు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని తెగనమ్మాలని చూస్తోంది.
గత మూడున్నర దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో భాగమే ఇది.
ప్రభుత్వ రంగాన్ని కాపాడుతున్న ట్రేడ్ యూనియన్లు..
అయినా నేటికీ దేశంలో ప్రభుత్వ రంగం బలంగా ఉండడానికి కారణం ట్రేడ్ యూనియన్ ఉద్యమమే. స్టీల్, కోల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, భారీ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో సుదీర్ఘ కాలంగా ఈ పోరాటాలు జరుగుతూ, ప్రభుత్వాల ప్రైవేటీకరణ దూకుడుకు అడ్డుకట్టలు కొంతమేరకైనా వేయగలుగుతున్నాయి కాబట్టే, నేటికీ ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడలో ఉన్నాయి.
ఎల్ఐసీలో కూడా ఇటువంటి ఉద్యమమే సిబ్బంది భాగస్వామ్యంతో, పాలసీ దారుల సహకారంతో కొనసాగుతోంది.
దేశ ప్రజల పొదుపు సొమ్ముకు రక్షణగా ఎల్ఐసీ ఉంటే, ఆ ఎల్ఐసీకి రక్షణగా ఆ సంస్థలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిలబడింది.
ప్రజా ధనం పరిరక్షణ అందరి బాధ్యత..
ఎల్ఐసీకి, మిగిలిన ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు ఒక ప్రధాన తేడా ఉంది. అదేమిటంటే జీవిత బీమా వ్యాపారంలో కేవలం ఆ సంస్థ ఇచ్చే హామీని నమ్మి ప్రజలు దశాబ్దాలపాటు తమ సొమ్మును పొదుపు చేస్తారు.
అంటే జీవిత బీమా అంటే ఒక హామీ. ఆ హామీకి అనుగుణంగా ఎల్ఐసీ నిలిచింది కాబట్టే దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగింది.
ఏ ప్రైవేట్ సంస్థ ఇలా హామీని నిలబెట్టుకోగలదు? మధ్యలో బోర్డు తిప్పేసి వెళ్ళిపోతే? అనేక చిట్ ఫండ్ కంపెనీలను చూస్తూనే ఉన్నాం కదా.
గతంలో ప్రైవేట్ జీవిత బీమా సంస్థలు ఇలా చేయబట్టే, కార్మికోద్యమ వత్తిడి, ఇతర ఆర్థిక వ్యవస్థ అవసరాల రీత్యా 1956లో 245 ప్రైవేటు సంస్థలను నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయం చేయడం ద్వారా 1956 సెప్టెంబరు 1న ఎల్ఐసీ ఏర్పడింది.
అందువల్ల ఎల్ఐసీ ఆస్తులు ప్రజల సొత్తు, దేశ సంపద. వాటిని కార్పొరేట్ శక్తుల పాలు కాకుండా కాపాడుకోవడం, ఆ సంస్థ పరిరక్షణకై ఉద్యోగులు చేస్తున్న కృషికి అండగా నిలవడం ప్రతి ఒక్క భారతీయ పౌరుడి బాధ్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
