అమెరికా వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, దాని సిద్ధాంతం పట్ల వ్యతిరేకత బాగా పెరుగుతోంది. రాజకీయాలు, సమాజంపై దాని ప్రభావాన్ని తిరస్కరించాలని రాజకీయ నాయకులు, పౌర సమాజం గ్రూపులు, కార్యకర్తలు కలిసి పిలుపునిచ్చారు. కెనడాలో కూడా పెరుగుతున్న దాని ప్రభావం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో ముడిపడి ఉన్న రాజకీయ విరాళాలను తిరస్కరించాలని అమెరికాకు చెందిన డెమోక్రాట్, రిపబ్లికన్ వర్గాల నుంచి 90 మంది రాజకీయ ప్రముఖులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు.
విస్తృతంగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన అమెరికా పర్యటనను ముగించుకున్న క్రమంలో ఒక సంయుక్త ప్రకటనలో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్, సాక్రెడ్(ఎస్ఏసీఆర్ఈడీ) యాక్ట్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి.
“అత్యంత సంపన్నుల తీవ్రవాద ఎజెండాలను అమెరికన్ ప్రజాస్వామ్యానికి తీసుకురానివ్వబోమని చెబుతూ బహుళ విశ్వాసాలు, బహుళ జాతుల సంకీర్ణం నుంచి దాదాపు 100 మంది రాజకీయ నాయకులు తమ వెంట గట్టిగా నిలబడ్డారని ఈ రోజు మేము ప్రకటిస్తున్నాం” అని సాక్రెడ్ యాక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్కర్ శర్మ చెప్పారు.
అహింసా ప్రతిజ్ఞ – మూడు కట్టుబాట్లు..
ఎన్నికైన అధికారులకు, అభ్యర్థులకు అహింసా ప్రతిజ్ఞ మూడు కట్టుబాట్లను స్థాపించింది. అవి ఇలా ఉన్నాయి:
1. రాజకీయ హింసను, బెదిరింపులను తిరస్కరించాలి.
2. ప్రజాస్వామ్య వ్యతిరేక ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలతో ముడిపడి ఉన్న విరాళాలను నిరాకరించాలి.
3. ప్రజాస్వామ్య అనుకూల సంఘాలకు అలాంటి రాజకీయ విరాళాలను తిరిగి ఇచ్చేయాలి లేదా దారి మళ్లించాలి.
భగవత్ సందర్శనపై స్పందిస్తూ “పక్షపాతం లేని ప్రతిజ్ఞ”గా తాము, తమ భాగస్వామ్యదారులు ప్రకటిస్తున్నట్లు రెండు సంఘాలు తెలియజేశాయి.
“దక్షిణాసియా, హిందూ అమెరికన్ వర్గాల గురించి తప్పుగా చూపిస్తున్న ఆర్ఎస్ఎస్కు ఈ ప్రతిజ్ఞ ఒక చారిత్రక మందలింపు. దీన్ని దాదాపు 100 మంది రాజకీయ నాయకులు ఆమోదించడం ద్వారా ఆ మందలింపు చేశారు” అని సాక్రెడ్ యాక్ట్స్‌తో కలిసి హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియా చక్రవర్తి అన్నారు.
అమెరికాలో భగవత్ పర్యటనపై నిరసనలు..
న్యూయార్క్‌లో భగవత్ కిక్కిరిసిన హాలులో ప్రసంగించినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్)తో సహా ద్వైపాక్షిక సంఘాలు ఆయన సందర్శనను అనుమతించరాదని డిమాండ్ చేస్తూ వేదిక వద్ద నిరసనలు తెలియజేశాయి.
ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ డిమాండ్ చేసింది. కాగా, సందర్శనను నిరోధించకుండా దాని సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ చెప్పారు.
ప్రతిజ్ఞపై ఎనిమిది రాష్ట్రాలలో స్థానిక లేదా మున్సిపల్ స్థాయి, ఫెడరల్, రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు, ఎన్నికైన అధికారులతో పాటు రెండు డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల నాయకులు సంతకాలు చేసినట్లు సంయుక్త ప్రకటన తెలిపింది.
డెమోక్రాట్ నేతల తీవ్ర విమర్శలు..
ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న మాగా అనుకూల కోటీశ్వరుడి నుంచి ఇటీవల కనుగొన్న 6,600 డాలర్ల సహకారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రో ఖన్నా చెప్పినట్లు ఆ ప్రకటనలో తెలియజేయబడింది.
“ఈ ప్రతిజ్ఞలో ముందుండటం పట్ల గర్వపడుతున్నాను. గ్లోబల్ ప్రజాస్వామ్యంపై ఆర్ఎస్ఎస్, వారి మద్దతుదారులు జరుపుతున్న దాడిని అధిగమించడానికి నా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తున్నాను” అని ఆయన చెప్పారు.
“దేశంలో, విదేశాల్లో కూడా మతపరమైన చీలికను, హింస, తీవ్రవాదాన్ని అమెరికన్లు కచ్చితంగా తిరస్కరించాలి” అని న్యూయార్క్ 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కోసం డెమోక్రాటిక్ నామినీ బ్రాడ్ లాండర్ అన్నారు.
ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న రాజకీయ విరాళాలను తిరస్కరిస్తూ, అహింసా ప్రతిజ్ఞ చేసిన ఆయనను వేదిక వద్ద నిరసనకారులతో చేరగా అడ్డుకున్నట్లు గార్డియన్ కథనం తెలియజేసింది.
“భారత్‌లో ఆర్ఎస్ఎస్ లేదా అమెరికాలో తీవ్ర జాతీయవాద ఉద్యమం ఏదైనా సరే ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి అస్థిరత్వాన్ని కోరుకునే మితవాద సంఘాలను కచ్చితంగా తిరస్కరించాలి” అని ప్రమిలా జయపాల్ అన్నారు.
మోదీ సర్కార్ నుంచి జవాబుదారీతనం..
“ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతానికి దగ్గరిగా విధానాలను అమలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని కోరాలని యూఎస్సీఐఆర్ఎఫ్ ఇటీవల చేసిన డిమాండ్‌ను ఈ ప్రకటన ప్రస్తావిస్తూ, మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా అంతర్గతంగా వివక్షత చూపుతోందని విమర్శించింది.
“భారత ప్రజల మతపరమైన స్వేచ్ఛ కోసం అమెరికా గట్టిగా నిలబడుతుందని సంకేతమిస్తూ భారత్ నుంచి జవాబుదారీతనాన్ని కోరే అవకాశం అమెరికా ప్రభుత్వానికి ఉంది” అని యూఎస్సీఐఆర్ఎఫ్ వైస్ చైర్మన్ సీసీ హెయిల్ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
“ఈ జవాబుదారీతనం లేకపోవడంతో మతపరమైన స్వాతంత్ర్యం మరింత క్షీణిస్తుంది. చట్ట వ్యతిరేక గుంపులు, మతపరమైన మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై మత మార్పిడి వ్యతిరేక చట్టాలు, ఇతర హానికర విధానాల ముసుగులో దాడులను కొనసాగిస్తారు” అని హెయిల్ అన్నారు.
అమెరికాలో స్టీవ్ బ్యానన్‌ను కో-చైర్‌గా 2019లో చేసిన రిపబ్లికన్ హిందూ కోయలిషన్తో సహా 113 గ్రూపులతో ఆర్ఎస్ఎస్కు అనుసంధానం ఉందని ఫ్రాన్స్‌లోని సైన్సెస్ పో ప్యారిస్ చేసిన పరిశోధనకు ఈ ప్రకటన వేలెత్తి చూపుతోంది.
కెనడాలోనూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలపై ఫిర్యాదులు..
ఇదిలా ఉండగా, ఆర్ఎస్ఎస్తో అనుసంధానం ఉన్నట్లు 21 సంస్థలకు వ్యతిరేకంగా కెనడియన్ హక్కుల సంఘం, జస్ట్ పీస్ అడ్వకేట్స్ (జేపీఏ) ఫిర్యాదు చేసింది.
స్వచ్ఛంద సంస్థలని వాదిస్తున్న వాటికి వ్యతిరేకంగా వాస్తవంగా వాటి స్థాయిని పరిశీలించాలని కెనడా రెవెన్యూ ఏజెన్సీని ఆ ఫిర్యాదు కోరింది.
కెనడా ఏకల్ విద్యాలయ ఫౌండేషన్, హిందూ స్వయంసేవక్ సంఘ్ కెనడా, ఒంటారియో విశ్వ హిందూ పరిషత్, సేవా కెనడా ఇంటర్నేషనల్ ఎయిడ్ ఇంక్, ఇతరులతో ఆర్ఎస్ఎస్కు ఉన్న సంబంధాలను జేపీఏ ఫిర్యాదులో ప్రస్తావించింది.
కెనడాలో ఉన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల మధ్య “సుమారు 46 మిలియన్ డాలర్లు కదులుతున్నట్లు, అదే సైన్సెస్ పో నిల్వ డేటాను ఉపయోగించడం ద్వారా గుర్తించినట్లు” ఫిర్యాదు చేసిన జేపీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది.
అంతేకాకుండా ఆయా సంఘాల ద్వారా విదేశాలలో ఉన్న ఆర్ఎస్ఎస్ అనుసంధాన గ్రూపులకు 21.5 మిలియన్ డాలర్లు పంపించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
