2016, 2026 మధ్య కాలంలో కుంచించుకుపోయిన ఏకైక G20 ఆర్థిక వ్యవస్థ జపాన్. పాశ్చాత్య ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను 83 శాతం మేర విస్తరించుకుని జపాన్, జర్మనీలను దాదాపుగా చేరుకుంది.
ద్రవ్యోల్బణపు షాక్స్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మహమ్మారి అంతరాయాలు, ఏఐ-ఆధారిత పరిశ్రమలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశాలు తమ స్థానాలను పునఃసమీక్షించుకోవడంతో, గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాటకీయంగా మారిపోయింది.
ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక దృక్పథం డేటాను ఉపయోగించి 2016, 2026 సంవత్సరాలలో ప్రపంచంలోని 15 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూపిస్తుంది. దీని ద్వారా ఏ దేశాలు పురోగతి సాధించాయో, ఏవి వెనుకబడ్డాయో, ఏవి అత్యంత ఆశ్చర్యపరిచాయో వెల్లడిస్తుంది.
2026 అంచనాల ప్రకారం, అమెరికా 32.4 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుండగా, చైనా 20 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు నమోదు చేయగా, ఈ దశాబ్దంలో క్షీణించిన ఏకైక G20 ఆర్థిక వ్యవస్థగా జపాన్ నిలిచింది.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ..
2016 నుంచి 2026 మధ్య కాలంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ప్రధాన పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో మెక్సికో స్పెయిన్‌ను, భారతదేశం ఫ్రాన్స్‌ను అధిగమించగా, రష్యా బ్రెజిల్- కెనడా రెండింటినీ దాటి ముందుకు దూసుకెళ్లింది.
దిగువ పట్టిక 2016, 2026 సంవత్సరాలలో ప్రపంచంలోని 15 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను, వాటి జీడీపీ ఆధారంగా బిలియన్ యూఎస్ డాలర్లలో తెలియజేస్తుంది.
ర్యాంకింగ్‌లలో అతిపెద్ద మార్పులలో ఒకటి భారతదేశం. దీని ఆర్థిక వ్యవస్థ 2016 – 2026 మధ్య 83% విస్తరించింది. ఈ కాలం ముగిసే నాటికి, భారతదేశ జీడీపీ జపాన్, జర్మనీ రెండింటినీ దాదాపుగా చేరుకుంది.
వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే ఒక మాదిరి అభివృద్ధిని సాధించిన జర్మనీ, జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
చైనా, భారతదేశం, మెక్సికో వంటి వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే జర్మనీ వృద్ధి ఒక మాదిరిగా ఉంది.
కోవిడ్ అనంతర కాలమంతటా ఎదుర్కొన్న ఆర్థిక మందగమనం వల్ల ఇది కొంతవరకు మందగించింది.
స్పెయిన్ దేశ అభివృద్ధి(68%) కంటే తక్కువే అయినప్పటికీ, ఫ్రాన్స్ (46%), ఇటలీ (45%) వంటి ఇతర ప్రధాన యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థల కంటే జర్మనీ వేగంగా వృద్ధి చెందింది.
2016 – 2026 మధ్య దశాబ్దంలో, యూరోపియన్ యూనియన్ తన రెండవ అతిపెద్ద సభ్య దేశమైన యునైటెడ్ కింగ్డమ్ను 2020లో కోల్పోయింది. 2026 నాటికి యూకే తన జీడీపీని 57% పెంచుకుని $4.3 ట్రిలియన్లకు చేరుకుంది. 
మరొక దశాబ్దం కోల్పోయిన జపాన్..
ఒక ముఖ్యమైన మినహాయింపుతో, గత దశాబ్దంలో ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది.
జపాన్ జీడీపీ 2016లో 5.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 4.4 ట్రిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఇది 14% తగ్గుదలను సూచిస్తుంది.
20వ శతాబ్దం చివరిలో దశాబ్దాల పాటు వేగవంతమైన ఆర్థిక విస్తరణ తర్వాత, 1990ల నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ప్రభుత్వ రుణం 200%కి పైగా రుణ-జీడీపీ నిష్పత్తికి చేరుకుంది.
అదే సమయంలో ఆటో- టెక్ రంగాలలోని ప్రధాన పోటీని, అమెరికా, చైనాలతో కూడిన వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొన్నది.
బహుశా జపాన్ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు దాని జనాభా సంక్షోభమే.
2026తో పోలిస్తే 2016లో ఆ దేశ జనాభా సుమారు 5 మిలియన్లు ఎక్కువగా ఉంది.
ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంతానోత్పత్తి రేటు క్షీణతను ప్రతిబింబిస్తోంది.
ఈ క్షీణత భవిష్యత్ వృద్ధి అవకాశాలకు ముప్పుగా పరిణమిస్తోంది.
రష్యా ఆర్థిక విస్తరణ..
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య రష్యా ఆర్థిక వ్యవస్థ రెట్టింపు కంటే ఎక్కువై(107%), 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ప్రధానంగా చమురు ధరల పతనం కారణంగా 2014-2016 మధ్య ఏర్పడిన రష్యా ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఈ విస్తరణ జరిగింది.
2014లో క్రిమియాను ఆక్రమించుకొని, 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి చేసిన తర్వాత ఆంక్షలు విధించబడినప్పటికీ, చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా వృద్ధి చెందింది.
అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ- రష్యా ఇంధన ఎగుమతులు రాయితీ ధరలకు చైనా, భారతదేశం కొనుగోలుదారుల వైపు మళ్లించబడ్డాయి.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

