ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు, పాలనా యంత్రాంగానికి మధ్య ఘర్షణ. విద్యార్థులపై అసాధారణ స్థాయిలో జరిమానా.
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు, అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు న్యాయపోరాటం స్థాయికి చేరుకుంది.
సంస్థ ఆరుగురు విద్యార్థులను రెండు నుంచి మూడు సెమిస్టర్ల వరకు బహిష్కరించింది. వారిలో శుభం వేదాండే అనే విద్యార్థిపై వైస్ ఛాన్సలర్‌పై దాడి చేశాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణకు సహకరించాలని పోలీసులు అతనికి నోటీసులు కూడా జారీ చేశారు.
విద్యార్థుల వాదనలు వినకుండా బహిష్కరించడం అక్రమ చర్య అని విద్యార్థుల తరఫున వాదిస్తున్న కలకత్తా హైకోర్టు న్యాయవాది ఝుమా సేన్ అన్నారు.
హాస్టల్ సౌకర్యాల రద్దు, క్యాంపస్‌లో పోలీసుల మోహరింపుపై ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం సెప్టెంబరు చివరి వారంలో మొదలైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు.
‘ది వైర్’ నివేదించినట్లుగా, ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. దాంతో వైస్ ఛాన్సలర్ సంతోష్ అజ్మేరా నుంచి భద్రత, జవాబుదారీతనం కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
వీసీ కార్యాలయం చుట్టూ నిరసనలు చేపట్టి, ఆ తర్వాత నిరవధిక బైఠాయింపు మొదలుపెట్టారు.
దీనికి ప్రతీకారంగా సంస్థ అనేక మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆరుగురు విద్యార్థులను బహిష్కరిస్తూ అక్టోబరు 15న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే రోజు శుభం వేదాండేపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
క్రమశిక్షణా చర్యకు గల కారణాలను పరిపాలనా విభాగం స్పష్టంగా వెల్లడించలేదని విద్యార్థులు చెప్పారు. మరోవైపు, ఇన్స్టిట్యూట్లో విద్యా సంబంధమైన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ, క్యాంపస్‌ను ఖాళీ చేయాలని విద్యార్థులను ఆదేశిస్తూ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
నిరసనలకు దారితీసిన సంఘటనలు
సంస్థ ప్రధాన ఆడిటోరియంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ సెప్టెంబరు 27న ఒక వేడుకను నిర్వహించింది.
ఈ కార్యక్రమం కోసం సెప్టెంబరు 24న సంస్థ పరిపాలనా విభాగం అనుమతి మంజూరు చేసింది. అనుమతి లేఖ ప్రకారం వేడుక మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగాలి.
విద్యార్థులు తమ విద్యా సంబంధమైన పనులకు అంతరాయం కలుగుతుందన్న కారణంతో ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత వెంటనే బయటి వ్యక్తులు వచ్చి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై దాడికి దిగారు. అనేక మందిని గాయపరిచారు. నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని విద్యార్థి సంఘం తెలియజేసింది.

ఈ సంఘటన తర్వాత భద్రత కల్పించాలని వైస్ ఛాన్సలర్‌ను కోరినట్లు విద్యార్థులు చెప్పారు. ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు పేర్కొన్నారు.
ఆ తర్వాత అక్టోబరు 4న రెండో సంఘటన జరిగింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ మరో సంస్థ ‘హిందూ జాగరణ్ మంచ్’ ఇన్స్టిట్యూట్ వరకు మార్చ్‌ను ప్రకటించింది. “విద్యార్థుల రక్తాన్ని చిందిస్తాం” అని ఆ సంస్థ సోషల్ మీడియా పోస్ట్‌లో బెదిరించింది.
ఈ బెదిరింపు గురించి విద్యార్థి సంఘం ముందుగానే వీసీకి, పరిపాలనా విభాగానికి సమాచారం ఇచ్చినప్పటికీ, అక్టోబరు 4న ఒక గుంపు క్యాంపస్ ప్రధాన గేటు వద్ద రాళ్లు, సీసాలు విసిరేసింది.
కొంతమంది వ్యక్తులు గేటును పగులగొట్టి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
బయట జరిగిన అశాంతిని ధ్రువీకరిస్తూ సంస్థ అక్టోబరు 5న పత్రికా ప్రకటన జారీ చేసింది. పోలీసులు ఆ గుంపును చెదరగొట్టారని తెలుపుతూ, ఈ హింసను పరిపాలనా విభాగం కూడా ఖండించింది.
ఈ రెండు సంఘటనలు జరిగినప్పటికీ తమ భద్రత విషయంలో చర్యలు తీసుకోవడంలో పరిపాలనా విభాగం విఫలమైందని విద్యార్థులు ఆరోపించారు. వీసీ నుంచి వివరణ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
ఒక నిరసన
వీసీ కార్యాలయం బయట విద్యార్థులు అక్టోబరు 7న నిరసన మొదలుపెట్టారు. పరిపాలనా సిబ్బందితో ఘర్షణకు దారితీసిన అనంతరం, వారు ఆ ముట్టడిని ఆపేసి పరిపాలనా భవనం బయట నిరవధిక బైఠాయింపు ప్రారంభించారు.
వీసీ అజ్మేరా రాజీనామాతో పాటు సెప్టెంబరు 27, అక్టోబరు 4న జరిగిన సంఘటనలకు సంబంధించి పరిపాలనా విభాగం సమాధానాలు చెప్పాలన్నది విద్యార్థుల ప్రధాన డిమాండ్.
వీసీ తమతో చర్చించడానికి నిరాకరిస్తున్నారని విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ క్రమంలో, వీసీ కార్యాలయాన్ని అనధికారికంగా ఆక్రమించుకున్నారని, ఘర్షణలకు దిగారని, క్యాంపస్ ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణలతో కొంతమంది విద్యార్థులకు క్రమశిక్షణా నోటీసులు రావడం మొదలైంది.
పరిపాలనా భవనం మొదటి అంతస్తును అక్టోబరు 14న మూసివేశారు. అక్కడ సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు ఆ తర్వాత అక్టోబరు 15న విద్యార్థులకు తెలిసింది.
ఈ చర్యను విద్యార్థులు వ్యతిరేకించారు. కెమెరాలను అమర్చడానికి ముందు తమను సంప్రదించలేదని విద్యార్థులు చెప్పారు.
ఇదిలా ఉండగా, విద్యార్థులు తన కార్యాలయాన్ని ధ్వంసం చేసి నీటి సరఫరా పైపులను కోసేశారని వీసీ ఆరోపించారు. విద్యార్థులు ఈ ఆరోపణలను తిరస్కరించారు.

ఆరుగురు విద్యార్థుల బహిష్కరణ, మూడు సెమిస్టర్లకు శుభం సస్పెన్షన్
ఆరుగురు విద్యార్థులను బహిష్కరిస్తున్నట్టు అక్టోబరు 15న సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల వద్ద ఉన్న జాబితా, వారి న్యాయవాది ఝుమా సేన్ ప్రకటన ప్రకారం- ఐదుగురు విద్యార్థులను రెండు సెమిస్టర్ల పాటు, శుభం వేదాండేను మూడు సెమిస్టర్ల పాటు బహిష్కరించారు.
బహిష్కరణకు గురైన ఇతర విద్యార్థులు: నచికేత్ పవార్(యానిమేషన్), ఆరోన్ పి జాయ్(సౌండ్ ఈడీఎం), అభిలాష్ నాయర్ (యానిమేషన్ సినిమా), దివాకర్ ముత్తువీరన్ (యానిమేషన్), అప్పు సోమన్ (యానిమేషన్).
బహిష్కరణకు ముందు తమ వాదనలు వినిపించడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదని న్యాయవాది సేన్ అన్నారు. వారికి న్యాయమైన విచారణ అవకాశం కల్పించలేదని, లేదా వారికి వ్యతిరేకంగా ఉన్న నిర్దిష్టమైన ఆరోపణలు ఏమిటో చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.
“బహిష్కరణ ఉత్తర్వులో స్పష్టమైన సమాచారం లేదు. డీన్ కౌన్సిల్, జాయింట్ డీన్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాత్రమే అందులో ఉంది” అని సేన్ ‘ది వైర్ హిందీ’తో మాట్లాడుతూ తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, వీసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఐదుగురిపై ఆరోపణలు రాగా, వీసీపై దాడికి ప్రయత్నించాడని శుభంపై ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని ఆమె అన్నారు. వీసీ కార్యాలయాన్ని అక్టోబరు 14 నుంచే మూసివేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ధ్వంసం చేశారనే ఆరోపణలు కూడా ప్రశ్నార్థకమే.
ఆరుగురు విద్యార్థుల తరఫున సంస్థకు లీగల్ నోటీసు పంపినట్లు సేన్ తెలిపారు. స్పందించడానికి పరిపాలనా విభాగానికి రెండు వారాల గడువు ఇచ్చామన్నారు.
గడువులోగా స్పందన రాకపోయినా, విద్యార్థుల బహిష్కరణను ఉపసంహరించుకోకపోయినా, విద్యార్థులు తదుపరి న్యాయ పోరాటానికి వెళ్తారని ఆమె చెప్పారు.
శుభంపై ఎఫ్ఐఆర్
సంస్థ రిజిస్ట్రార్ పంచ్సయార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా శుభం వేదాండే, ఇతరులపై అక్టోబరు 15న ఎఫ్ఐఆర్ నమోదైంది.
అక్టోబరు 15న వీసీ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం రిజిస్ట్రార్‌ను శుభం దుర్భాషలాడుతూ తోసేశాడని, దీనివల్ల ఆయన శారీరకంగా గాయపడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు.
వీసీ, సంస్థకు చెందిన ఇతర అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, వారిని బెదిరించారని పలువురు ఇతర విద్యార్థులపై కూడా ఫిర్యాదులో ఆరోపించారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 35(3) కింద శుభంకు నోటీసు అందజేసి దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని ఏడు సెక్షన్లు- 126(2), 115(2), 121(1), 221, 351(2), 352, 324(4)లను నోటీసులో పేర్కొన్నారు.
‘ది వైర్ హిందీ’తో శుభం మాట్లాడుతూ- పోలీసుల నుంచి అక్టోబరు 26 రాత్రి సుమారు 11 గంటలకు ఈ-మెయిల్ వచ్చిందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పారని అన్నాడు. అయితే తాను ప్రాంగణంలో లేనని, రావడానికి కొంత సమయం కావాలని కోరినట్లు చెప్పాడు.
దాంతో పోలీసులు రెండు రోజుల గడువు ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి బయలుదేరుతుండగా, ఈ కేసును లాల్‌బజార్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసినట్టు దర్యాప్తు అధికారి సమాచారం ఇచ్చారు.
కొత్త పోలీస్ స్టేషన్‌కు ఏ రోజు, ఏ సమయంలో రావాలని కోరుతూ శుభం ఈ-మెయిల్ పెట్టాడు. అయినా ఎలాంటి అధికారిక స్పందన రాలేదని తెలిపాడు. ఈ పరిణామాలను న్యాయవాది సేన్ ధ్రువీకరించారు.
విద్యార్థులు ముందుగా మీడియా కథనాల ద్వారా ఫిర్యాదుల గురించి తెలుసుకున్నారని, ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీలు, ఫిర్యాదు లేఖలను అందుకున్నారని సేన్ చెప్పారు.
ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్ 121(1) నాన్-బెయిలబుల్. ఒక ప్రభుత్వ అధికారి తన విధులను నిర్వహించకుండా అడ్డుకుని గాయపరచడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది. దీనికి గరిష్ఠంగా ఐదు సంవత్సరాల శిక్ష పడుతుంది.
కలకత్తా హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తును కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
విద్యార్థులకు, పరిపాలనా విభాగానికి మధ్య అక్టోబరు 27న కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. అక్టోబరు 28న వీసీకి రాసిన లేఖలో, సెప్టెంబరు 27 సంఘటన జరిగి 30 రోజులు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు క్యాంపస్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారని, పలువురు చిత్ర నిర్మాతలను ఆహ్వానించారని విద్యార్థి సంఘం పేర్కొంది.
అయితే ఆ అతిథులను ప్రధాన గేటు వద్దే ఆపివేశారని ఆరోపించింది. అదే సమయంలో ఇన్స్టిట్యూట్ సిబ్బందికి వస్తువులు తెచ్చే డెలివరీ వర్కర్లను క్యాంపస్‌లోకి అనుమతించారని, విద్యార్థులు మూసి ఉన్న గేటు అవతలి వైపు తమ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందని విద్యార్థి సంఘం తెలిపింది.
పోలీసు సిబ్బంది కూడా అర్ధరాత్రి క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్స్, విద్యాపరమైన భవనాల వద్ద మోహరించారని విద్యార్థి సంఘం ఆరోపించింది.
క్యాంపస్‌లో పోలీసుల మోహరింపు ఉద్దేశం, అధికారం, కాలవ్యవధి గురించి బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
‘ప్రతీకార చర్య’
విద్యార్థుల నిరసన తర్వాతే ఆరుగురు విద్యార్థుల బహిష్కరణ, శుభంపై ఎఫ్ఐఆర్ నమోదు వంటి చర్యలు తీసుకున్నారని న్యాయవాది సేన్ ఆరోపించారు. బయటి వ్యక్తులు వచ్చి సెప్టెంబరు 27, అక్టోబరు 4న దాడులు చేసిన తర్వాతే విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయని ఆమె గుర్తుచేశారు.
భద్రతను మెరుగుపరచడంతో పాటు ఈ సంఘటనల గురించి పరిపాలనా విభాగం నుంచి సమాధానాలను మాత్రమే విద్యార్థులు కోరుతున్నారని ఆమె వివరించారు. అయితే పరిపాలనా విభాగం వారిని కలవలేదని అన్నారు.
“న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం వేరు. నేను రాజకీయ పోరాటంలో భాగస్వామిని కాను. విద్యార్థుల న్యాయ పోరాటానికే నా పాత్ర పరిమితం” అని సేన్ స్పష్టం చేశారు.
హాస్టళ్లను ఖాళీ చేయాలని పరిపాలనా విభాగం వరుసగా నోటీసులను జారీ చేస్తోందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు పంపిన లీగల్ నోటీసుపై స్పందించడానికి బదులుగా, బహిష్కరణ ఉత్తర్వుల అమలును పరిపాలనా విభాగం కొనసాగిస్తోందని సేన్ చెప్పారు.
సంస్థ నిలిపివేత, హాస్టళ్లు ఖాళీ, మెస్ మూసివేత
నవంబరు 13వ తేదీ వరకు రోజువారీ విద్యా సంబంధమైన కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్టు అక్టోబరు 15న ఒక కార్యాలయ ఉత్తర్వు ద్వారా సంస్థ ప్రకటించింది.
హాస్టల్స్‌లో ఉంటున్న వారితో సహా క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులందరూ 24 గంటల్లోగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని అది ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హాస్టల్ మెస్ సౌకర్యాలు కూడా నవంబరు 13 వరకు మూసివేయబడతాయని చెప్పింది.
పండగలు, పరిపాలనకు సంబంధించిన అవసరాల వల్లే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆ ఆర్డర్లో కారణాలను వెల్లడించారు.
ఈ నిర్ణయాన్ని విద్యార్థి సంఘం వ్యతిరేకించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇంత తక్కువ సమయంలో క్యాంపస్, హాస్టల్‌ను వీడటం కష్టమవుతుందని వాదించింది. మెస్ సౌకర్యాన్ని మూసివేయడంతో ఆహారం, మంచినీటి కోసం వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
మొదటిసారి జారీ చేసిన ఆర్డర్‌పై విద్యార్థులు ఇంకా నిరసన తెలుపుతుండగానే, క్యాంపస్ మూసివేతను ఇన్స్టిట్యూట్ డిసెంబరు 11వ తేదీ వరకు పొడిగించింది. ఫిల్మ్, ఈడీఎం విభాగాల డీన్లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారని పీటీఐ కథనం వెల్లడించింది.
నిరసనలో చేరిన తల్లిదండ్రులు
నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇందులో చేరారు. క్యాంపస్ భద్రత, పరిపాలనా నిర్ణయాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సంస్థ చైర్మన్, వీసీకి అక్టోబరు 28న దాదాపు 40 మంది తల్లిదండ్రులు లేఖ రాశారు.
సెప్టెంబరు 27, అక్టోబరు 4న బయటి వ్యక్తులు వచ్చి విద్యార్థులపై దాడులు చేశారన్న ఆరోపణలను కూడా వారు ప్రస్తావించారు.
ఈ సంఘటనలపై సంస్థ వైఖరిని స్పష్టం చేయకుండా, తీసుకున్న భద్రతా చర్యల గురించి వివరణ ఇవ్వకుండా, తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని అక్టోబరు 23న తమకు ఈ-మెయిల్ చేశారని వారు చెప్పారు.
తరగతులను పునఃప్రారంభించాలని, విద్యుత్, నీరు, భోజనం, ఇతర హాస్టల్ సేవలను పునరుద్ధరించాలని, హాస్టల్, క్యాంపస్ నుంచి పోలీసులను తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
సెప్టెంబరు 27, అక్టోబరు 4, అక్టోబరు 27 తేదీలలో జరిగిన ఈ మూడు సంఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా వారు కోరారు.
ఆందోళన వ్యక్తపరుస్తున్న టీచర్లు
సంస్థ టీచర్లు కూడా పరిపాలనా విభాగానికి లేఖ రాశారు. రిజిస్ట్రార్‌కు అక్టోబరు 28న పంపించిన లేఖలో క్యాంపస్‌లో పోలీసు సిబ్బంది ఉనికి గురించి, విద్యార్థుల హాస్టల్స్‌లో స్థితిగతుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి విద్యా సంస్థ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. క్యాంపస్ నుంచి పోలీసుల ఉనికిని తొలగించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విద్యార్థులు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని పొందాలంటే అన్ని హాస్టల్ సౌకర్యాలను పునరుద్ధరించాలని కూడా టీచర్లు విజ్ఞప్తి చేశారు.
తదుపరి ఏమిటి?
బయటి సంస్థలకు క్యాంపస్ స్థలాన్ని అద్దెకు ఇచ్చే విషయంలో నిబంధనలను మార్చడం, కార్యక్రమాలను ఆమోదించిన అధికారులను జవాబుదారీ చేయడం, వీసీ రాజీనామా, బహిష్కరణ ఉత్తర్వుల ఉపసంహరణ.. ఇవి విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లు.
సంస్థ పరిపాలనా విభాగానికి, పోలీసులకు ప్రశ్నలు పంపించాం. విద్యార్థులను బహిష్కరించడానికి గల కారణాలు, వారి వాదనలు వినిపించడానికి అవకాశం ఇచ్చిన ప్రక్రియ, ఎఫ్ఐఆర్లో ఆరోపణల జాబితా, క్యాంపస్‌లో పోలీసుల మోహరింపు వంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి.
అప్డేట్
ఈ నివేదిక ప్రచురించిన కొద్ది గంటల తర్వాత, నవంబరు 10, 2026 మధ్యాహ్నం 12:22 గంటలకు వాట్సాప్ ద్వారా ఒక సీనియర్ ఎస్ఆర్ఎఫ్టీఐ అధికారి ‘ది వైర్’ అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఆ స్పందనను యథాతథంగా దిగువన అందిస్తున్నాం.
“2026 అక్టోబరు 15న వైస్ ఛాన్సలర్‌ను ఘెరావ్ చేయడం, బెదిరించడం, భయపెట్టడం, దుర్భాషలాడటం చేసినందుకు డీన్స్ కౌన్సిల్ సిఫార్సు మేరకు ఆరుగురు విద్యార్థులపై అదే రోజు క్రమశిక్షణా చర్య తీసుకున్నాం. ఐదుగురు విద్యార్థులను రెండు సెమిస్టర్ల పాటు రస్టికేట్(బహిష్కరించాం) చేయగా, వైస్ ఛాన్సలర్‌పై భౌతికంగా దాడి చేసిన ఆరో విద్యార్థిని మూడు సెమిస్టర్ల పాటు రస్టికేట్ చేశాం. ఈ ఘటనకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించాం.
సెప్టెంబరు 27, 2026 ఘటనకు సంబంధించి, ఇన్స్టిట్యూట్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు సాయంత్రమే క్యాంపస్‌కు తిరిగి వచ్చిన వైస్ ఛాన్సలర్.. విద్యార్థులు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, క్యాంపస్ భద్రతను బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపట్టారు. అంతర్గత భద్రతా ఏర్పాట్లను పెంచడంతో పాటు, ఇన్స్టిట్యూట్ వెలుపల నిరంతర పోలీసు సహాయం కోరారు.
సైబర్ బెదిరింపులు, ఆన్లైన్ వేధింపులు (ముఖ్యంగా విద్యార్థినులకు సంబంధించినవి) వంటి విద్యార్థుల ఆందోళనలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడానికి వీసీ, డీన్లు విద్యార్థులు, సీనియర్ పోలీసు అధికారుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.
అక్టోబరు 4, 2026న ఇన్స్టిట్యూట్ వెలుపల జరగబోయే సమావేశం గురించి ముందే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తగినంత పోలీసు బలగాలను మోహరించాం. ముందుజాగ్రత్త చర్యగా ప్రధాన గేటు వద్ద లేదా చుట్టుపక్కల గుమికూడవద్దని విద్యార్థులకు కూడా సూచించాం.
సకాలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గుంపు చెదిరిపోయి, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా నివారించగలిగాం. స్థానిక పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశాం.
క్యాంపస్ భద్రతను బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో సీసీటీవీ కవరేజ్ అవసరమని భావించాం. ముఖ్యంగా అక్టోబరు 14, 2026 రాత్రి వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో జరిగిన విధ్వంసం (దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం) దృష్ట్యా ఇది అవసరమైంది.
అక్టోబరు 15, 2026న వైస్ ఛాన్సలర్‌పై జరిగిన భౌతిక దాడి ఘటన సంస్థాగత క్రమశిక్షణ తీవ్రంగా దెబ్బతినడానికి నిదర్శనం.
రెండు విభాగాల డీన్లు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, సిబ్బందితో సంప్రదింపుల అనంతరం అసాధారణ పరిపాలనా చర్యలు తీసుకోవడం అవసరమని భావించాం. దీనికి అనుగుణంగా సంస్థాగత క్రమశిక్షణను పునరుద్ధరించడానికి, సురక్షితమైన, అనుకూలమైన విద్యా వాతావరణాన్ని నిర్ధారించడానికి నవంబరు 13, 2026 వరకు రెగ్యులర్ అకడమిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాం. విద్యార్థులు ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ఆదేశించాం. హాస్టల్ మెస్ సౌకర్యాలను నిలిపివేశాం.
ఇన్స్టిట్యూట్కు వచ్చిన అన్ని విజ్ఞాపనల పట్ల తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తాం.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.



