స్వాతంత్ర్య సమర యోధురాలు హంసా మెహతా జయంతి జూలై 3. ఈ సందర్భంగా వారిని గురించి సంక్షిప్తంగా.
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో మహిళల పాత్ర అత్యంత విశిష్టమైనది. అలాంటి గొప్ప మహిళా నాయకుల్లో హంసా మెహతా పేరు చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆమె 1897 జూలై 3న గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించారు. 1995 ఏప్రిల్ 4న కన్నుమూశారు. స్వాతంత్ర్య సమర యోధురాలు, విద్యావేత్త, సామాజిక సంస్కర్త, మహిళా హక్కుల పరిరక్షణకు రాలిగా ఆమె దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
హంసా మెహతా ప్రముఖ ప్రజానాయకుడు మనుభాయ్ మెహతా కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యాభ్యాసంపై ఆసక్తి కనబరిచి బరోడాలో ఉన్నత విద్యను అభ్యసించి, అనంతరం ఇంగ్లాండ్‌లో జర్నలిజం మరియు సామాజిక శాస్త్రాలపై అధ్యయనం చేశారు. 1924 – ప్రముఖ వైద్యుడు, ప్రజా జీవిత నాయకుడు డాక్టర్ జీవరాజ్ మెహతాను వివాహం చేసుకున్నారు.
అనంతరం మహాత్మా గాంధీ ఆలోచనల ప్రభావంతో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, సివిల్ నిరసన ఉద్యమం, విదేశీ వస్త్రాల బహిష్కరణ కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ, ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. మహిళలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో ఆమె విశేష కృషి చేశారు.
హంసా మెహతా స్వాతంత్ర్య సమరయోధు రాలిగానే కాకుండా స్వతంత్ర భారత నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ సభ సభ్యురాలిగా మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలనే అంశాలపై ఆమె గట్టిగా వాదించారు. మహిళలపై వివక్ష తొలగించేందుకు ఆమె చేసిన కృషి రాజ్యాంగంలోని అనేక నిబంధనలపై ప్రభావం చూపింది. 1937 లో బొంబాయి శాసనసభకు ఎన్నికై మహిళల విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కృషి చేశారు. 1945–1946 లలో మహిళల హక్కులు మరియు సమాన అవకాశాల కోసం జాతీయ స్థాయిలో బలమైన ఉద్యమాన్ని నడిపించారు. 1946 లో భారత రాజ్యాంగ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభ చర్చల్లో మహిళలకు సమాన హక్కులు, వివక్ష నిషేధం మరియు సమాన అవకాశాల అంశాలపై గట్టిగా వాదించారు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె సేవలు చిరస్మరణీయ మైనవి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘంలో భారత ప్రతినిధిగా పనిచేసిన ఆమె, విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ఉన్న “ఆల్ల్ మెన్ అరె బొర్న్ ఫ్రీ అంద్ ఎqఊల్” అనే వాక్యాన్ని “ఆల్ల్ హుమన్ బైంగ్స్ అరె బొర్న్ ఫ్రీ అంద్ ఎqఊల్”గా మార్చాలని సూచించారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా మహిళా సమానత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
విద్యారంగంలో కూడా ఆమె సేవలు అపార మైనవి. మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం, బరోడాకు తొలి మహిళా ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించి భారతదేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవిని చేపట్టిన తొలి మహిళల్లో ఒకరిగా నిలిచారు. మహిళల ఉన్నత విద్యాభివృద్ధి, శాస్త్రీయ దృక్పథం మరియు సామాజిక చైతన్యానికి ఆమె విశేష కృషి చేశారు. బాల్య వివాహాలు, మహిళలపై వివక్ష, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలపై ఆమె నిరంతరం పోరాడారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలని ఆమె ప్రోత్సహించారు.
1995 ఏప్రిల్ 4 న 97 ఏళ్ల వయసులో పరమపదించారు. హంసా మెహతా కేవలం స్వాతంత్ర్య సమర యోధురాలు మాత్రమే కాదు. మహిళా సమానత్వానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దూరదృష్టి కలిగిన నాయకురాలు. విద్య, సమానత్వం, మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన సేవలు భారత చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతాయి.
సేకరణ: ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
