నయా ఉదారవాదంలో అమాంతంగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థను సంక్షోభాల పాల్చేస్తున్నాయి.
దీంతో ప్రస్తుత ప్రభుత్వం చెప్పకుంటున్న భారీ ఆర్థికాభివృద్ధి రేటు కూడా దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు.
కేంద్రంలోని అధికార ప్రభుత్వం గురించి చెప్పాలంటే- పేదల ఆదాయాన్ని పెద్దలకు బదిలీ చేసే ప్రభుత్వంగా నిర్ధారించవచ్చు, వర్గీకరించవచ్చు.
కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న ఉత్పత్తిదారులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారి ఆదాయాన్ని ఈ పాటికే అవసరానికి మించిన మిగులు వనరులు పోగేసుకున్న కొద్దిమంది చేతుల్లోకి బదిలీ చేస్తోంది.
పేదలు తమకు వచ్చే ఆదాయంలో ఎక్కవ మొత్తం ఖర్చు చేస్తారు. కానీ ధనికుల వినియోగ శైలి దీనికి బిన్నంగా ఉంటుంది. పైన ప్రస్తావించిన తరహా ఆదాయ బదిలీ అంటే, ఆర్థికవ్యవస్థలో వినియోగాన్ని కుదించడమే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పోటును పూడ్చటానికి, లోపాన్ని సవరించడానికీ పెట్టుబడి ముందుకు రాదు. రావాల్సిన అవసరం, ఆసక్తి కూడా పెట్టుబడికి ఉండదు.
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా జరిగే వినియోగ వ్యయాన్ని బట్టే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే, ఒక ఆర్థికవ్యవస్థలో వినిమయ వ్యయం, పెట్టబడులు పెట్టడమనేది పరస్పరం పోషకాలు- పూరకాల మీద ఆధారపడి ఉంటుంది.
అయితే, ఏదైనా ఆర్థిక వ్యవస్థలో వినిమయ వ్యయం తగ్గితే పెట్టుబడులు తగ్గుతాయి. పెట్టుబడులు తగ్గితే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
ఇటువంటి అధికోత్పత్తి సంక్షోభాన్ని ప్రభుత్వాలు నివారించలేవు, ప్రతిఘటించలేవు. ఇటువంటి సందర్భంలో నగదు సరఫరా విధానం కూడా నిరుపయోగంగా మారుతుంది.
ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత ఫలితాన్ని ఇచ్చేదీ, ప్రభావాన్ని చూపగలిగేది ఏమైనా ఉందంటే అది ద్రవ్య విధానం. కానీ ఈ ద్రవ్య విధానం నయా ఉదారవాదం నిర్ణయించిన చట్రాల్లో చిక్కుకుపోయింది.
ద్రవ్యలోటు పెంచకుండా, సంపన్నులపై పన్నులు వేయకుండా ఉన్నంతకాలం ప్రభుత్వ వ్యయం పెరగదు. తమ ఆదాయంలో అత్యధిక భాగం ఖర్చు చేసే పేదలపై పన్నులు వేసి, పైన వివరించిన విధంగా సంపద బదిలీకి వినిమయం మోతాదు తగ్గుతూనే ఉంటుంది. దీనికి భిన్నంగా ద్రవ్యలోటు పెంచడం ద్వారా కానీ, సంపన్నులపై పన్నులు పెంచడం ద్వారా– కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని పెంచినపుడు ఆర్థిక వ్యవస్థలో స్థూల గిరాకీ పెరుగుతుంది.
అంతర్జాతీయ నయా ఉదారవాద చట్రం దీనికి పూర్తి వ్యతిరేకం. అందువల్లనే ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సంక్షోభాలను నివారించడానికీ, నియంత్రించడానికీ ద్రవ్య విధానాలు పెద్దగా ఉపయోగపడవు.
ఈ సంక్షోభాలు ప్రపంచవ్యాప్త ప్రభావం చూపడంలో ఆలస్యమవ్వడానికి కారణాలు అనేకం.
నిరంతరం విలువలు పెంచుకుంటూ పోవడమే– తొలుత డాట్.కామ్ గాలి బుడగ ఊహాజనిత రూపంలో 1980 దశకంలో వచ్చిన సంక్షోభాన్ని వాయిదా వేయగలిగారు. తరువాత స్థిరాస్థి రంగంలో ఓ గాలి బుడగను తయారు చేయడం ద్వారా ఈ సంక్షోభాన్ని మరింతకాలం వాయిదా వేశారు. చివరకు ఈ గాలిబుడగ 2008లో బద్ధలయ్యింది.
భారతదేశంలో ఈ సంక్షోభం ప్రభావం పరిమితంగానే ఉండటానికి కారణం అప్పటి ప్రభుత్వ ద్రవ్య విధానాలను సాధనంగా మార్చుకోవడమే. యూపీఏ- 2 పాలనా కాలంలో మనం ఈ మార్పును చూడవచ్చు.
ఆర్థికాభివృద్ధి అంచనాలు సత్యదూరంగా ఉన్నాయని అప్పటి కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆర్థికాభివృద్ధిని అతిగా అంచనా వేయడం వల్ల సంక్షోభం మరింత పేట్రేగిపోయిందని ఆయన అన్నారు.
కానీ పేదరికం, నిరుద్యోగం కారణంగానే సంక్షోభం తీవ్రతను సంతరించుకున్నదన్న వాస్తవాన్ని విస్మరించలేము.
గతంలో ప్రస్తావించినట్టుగానే 1993- 94 నుంచి 2011- 12 మధ్యకాలంలో పౌష్టికాహారం విషయంలో పేదరికం గణనీయంగా పెరిగింది. ఈ తరహా పేదరికం 2011- 12 నుంచి 2017- 18 మధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. ఈ పతనం కొంత ఎక్కువగా ఉందంటే, చివరకు మోదీ ప్రభుత్వం ఏకంగా జాతీయ నమూనా సర్వే నివేదకనే పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
అంతేకాదు సమాచారం- గణాంకాల సేకరణ, ప్రాతిపాదికలనే మార్చేయాల్సి వచ్చింది. దీంతో తాజా ప్రమాణాలతో నిర్వహించిన 2022- 24 సర్వే; పాత సర్వే వెలుగులో పోల్చడానికి వీలు లేనిదిగా మారింది.
2017- 18 సర్వేలో 18 పరిశీలనాంశాలకు సంబంధించిన వివరాలు, నిర్ధారణలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాల ప్రకారం, 2011- 12కంటే 2017- 18నాటికి తలసరి వినిమయ వ్యయం అంతా పడిపోయింది. కనీసం రోజుకు 2200 కేలరీల ఆహారం తీసుకోలేని జనాభా సంఖ్య గ్రామీణ జనాభాలో 30 శాతానికి పెరిగింది.
పట్టణ ప్రాంత పేదరికాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే కనీసం రోజు 2200కిలో కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కూడా తినలేని వారి సంఖ్య మొత్తం జనాభాలో 60శాతం ఉన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీలాంటి వినాశకర విధానలే ఈ దుర్భర స్థితికి కారణమని అంటుంటారు. ఇలాంటి పరిస్థితికి ఏ ప్రభుత్వ విధానం కొంత మేరకు కారణమని నిర్ధారించడం పెద్ద కష్టమేమి కాదు.
అదే సమయంలో, నయా ఉదారవాద విధానంలాంటి అంతర్గత ధోరణులు– ఈ పరిస్థితులకు ఎంత దోహదం చేస్తున్నాయో గమనించ నిరాకరిండం/ విస్మరించడం; ఈ ధోరణులలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం ఎలా ఎరుగుతుందో కూడా పరిశీలించాల్సిన విషయం.
భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించిన వివరాలు నిర్ధారించడం అంతతేలిక కాదు. ఎందుకంటే నిరుద్యోగి, ఉద్యోగి అనే దాన్ని ఇదమిత్థంగా చెప్పలేము, వేరుచేయలేము.
ఇక్కడ ఉపాధి అంటే కొంతమందికి కొన్ని రోజులపాటు పని దొరకడం, మిగిలిన రోజుల్లో దొరకక పోవడం. నిరుద్యోగమంటే పని దొరికే ఆ కొద్దిపాటు రోజుల సంఖ్య కూడా మరింత తగ్గిపోవడం. రోజులో కొన్ని గంటలు మాత్రమే పని దొరకడం. అది కూడా వీరంతా లేదా ఎక్కువమంది స్వయం ఉపాధిపై ఆధారపడటమే తప్ప నికరమైన నెలసరి వేతనంపై ఆధారపడే ఉద్యోగాలు కాదు.
2019 నాటికి ఎన్ఎస్ఎస్ సర్వేలో లెక్కకు వచ్చిన వారు కూడా దారుణస్థాయిలో నిరుద్యోగులుగా ఉన్న వారే. ఈ విధంగా తీవ్రమైన నిరుద్యోగంతో పతనమవుతున్న వారి సంఖ్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది. అప్పటి నుంచి నిరుద్యోగగం అత్యధిక స్థాయిలోనే కొనసాగుతోంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రచార హంగామా కప్పిపెడుతోంది.
వేతనం లేని మహిళా శ్రామికులు పెరుగుతున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఉపాధిగా పరిగణిస్తోంది. నిజానికి అది కూడా నిరుద్యోగమే.
నిరుద్యోగం గురించి రూపొందించిన అనధికార అంచనాలలో భాగంగా, “మీరు ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటూన్నారా?” అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వాళ్లిచ్చిన సమాధానం స్పష్టంగా పెరిగిన నిరుద్యోగాన్ని వెల్లడిస్తోంది.
సీఎంఐఈ నిర్ధారణల ప్రకారం, దేశంలో నిరుద్యోగం రేటు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.
ఇంకా స్పష్టంగా గమనిస్తే, గత ఐదేళ్లలో ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్యలో ఏ మార్పు లేదు. ఈ వాస్తవికత సమస్య తీవ్రతను గుర్తు చేస్తోంది.
అయితే ఈ పెరిగిన నిరుద్యోగానికి కోవిడ్, జీఎస్టీ ఎంత మేరకు కారణం? ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంతమేర కారణం– అన్నీను ప్రశ్నలే.
scroll.inలో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాము.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
