స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాలను తన జాతీయ నినాదంగా ప్రకటించుకున్న ఫ్రాన్స్‌లో, 2026 సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు అక్టోబర్ 9 నాటికి జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, పాఠశాల భవనాల దుస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రభుత్వ విద్యకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం ఉద్యమానికి ప్రధాన కారణాలు.
సెప్టెంబర్ చివరి వారంలో మొదట హైస్కూల్ విద్యార్థులు పాఠశాలల వద్ద నిరసనలు, తరగతుల బహిష్కరణ, పాఠశాలల దిగ్బంధనం వంటి రూపాల్లో ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ఇతర కార్మిక సంఘాలు కూడా వారికి మద్దతుగా నిలిచారు.
అక్టోబర్ 6న జరిగిన భారీ నిరసనల తరువాత అక్టోబర్ 8న కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. అక్టోబర్ 9న ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకానికి అత్యవసర చర్యలను ప్రకటించినప్పటికీ, విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
ఈ పరిణామాన్ని కేవలం విద్యార్థుల సమస్యగా కాకుండా, ప్రజా విద్యకు ప్రభుత్వాల ప్రాధాన్యత, ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రజా సేవలను కుదించడం, విద్యలో సమానత్వం లేకపోవడం వంటి సమస్యలన్నీ కలసి ఉద్యమానికి దారి తీశాయి.
ఉద్యమం ప్రారంభం
సెప్టెంబర్ చివరి వారంలో పారిస్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, బోధనకు అనుకూలం కాని పరిస్థితులపై విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి.
అక్టోబర్ 1 నుంచి 5 మధ్య అనేక పాఠశాలలో నిరసనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
కొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసుల అమానుష లాఠీచార్జ్ సర్వత్రా విమర్శలకు, ఆందోళనలకు దారి తీసింది.
అక్టోబర్ 6న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ నిరసనలు జరిగాయి. ఇందులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యా సమస్యలతో పాటు పోలీసు బలప్రయోగం ప్రధాన చర్చగా మారింది.
యువత ఆగ్రహానికి తగిన కారణాలు ఉన్నాయని ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అక్టోబర్ 7న అంగీకరించారు. విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబోదని చెప్పారు.
అక్టోబర్ 8న అత్యవసర ఉపాధ్యాయ నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 3,000 మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు పంపే ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ రోజు జరిగిన నిరసనలలో సుమారు 71,500 మంది పాల్గొన్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వం హామీ ఇచ్చినా అక్టోబర్ 9న కూడా ఉద్యమం కొనసాగింది. 141 పాఠశాలలు మూతపడినట్లు నివేదికలు తెలిపాయి.
విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు అక్టోబర్ 13 మంగళవారం మరొక మారు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఉపాధ్యాయుల కొరత – ఉద్యమానికి ప్రధాన కారణం
ఫ్రాన్స్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల ఆగ్రహానికి ప్రధాన కారణం అయింది. ఉపాధ్యాయులు దీర్ఘకాలం సెలవులో ఉండటం, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం, సబ్జెక్టులకు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం బాగా పెరిగింది.
విద్యార్థులకు క్లాసుల గంటలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వెనుకబడే ప్రమాదం ఏర్పడింది. ఈ సమస్యలన్నీ విద్యార్థుల ఆందోళనలకు దారి తీశాయి.
ఫ్రాన్స్ ప్రభుత్వ హైస్కూళ్లలో బోధన జరగాల్సిన గంటల్లో దాదాపు 10 శాతం గంటలకు ఉపాధ్యాయులు లేరని ఫ్రాన్స్ విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలియజేసింది.
ఇది సమస్య తీవ్రతకు నిదర్శనం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులు దీనివల్ల చాలా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం విద్యను హక్కుగా ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు, ఆ హక్కు అమలు జరగాలంటే ప్రతి తరగతికి అవసరమైనంత మంది ఉపాధ్యాయులు ఉండే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తరగతి గదుల్లో రద్దీ – నాణ్యమైన విద్యకు అవరోధం
ఉపాధ్యాయుల కొరతతో పాటు తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం మరో ప్రధాన సమస్యగా ఉంది.
మార్సెయ్లోని ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో 37 మంది విద్యార్థులు ఉన్నారని, అందరూ కూర్చోవడానికి పక్క తరగతి గదుల నుంచి కుర్చీలు, బల్లలు తెచ్చుకోవాల్సి వస్తోందని టీచర్ తెలిపినట్లు అక్టోబర్ 8న రాయిటర్స్ పేర్కొంది.
ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య పెరిగితే ప్రతి విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా లేదా అని ఉపాధ్యాయుడు పరిశీలించడం కష్టం. చదువులో వెనుకబడినవారికి అదనపు సహాయం అందించడం కూడా సాధ్యం కాదు.
దీని ప్రభావం ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఎక్కువగా ఉంది. సంపన్న కుటుంబాల పిల్లలకు ప్రైవేటు ట్యూషన్లు, అదనపు శిక్షణ వంటి సదుపాయాలు పొందగలరు. కానీ ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడే పేద కుటుంబాల పిల్లలకు అలాంటి అవకాశం ఉండదు. అందువల్ల తరగతి గదుల్లో రద్దీ అనేది కేవలం పరిపాలనా సమస్య కాదు. విద్యలో సమానత్వానికి అది ఆటంకం.
పాఠశాల భవనాలు, మౌలిక వసతుల దుస్థితి
విద్యార్థుల నిరసనల్లో మరో ముఖ్యమైన అంశం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేకపోవడం.
కొన్ని పాఠశాలల్లో నీటి లీకేజీ, పాడైన మరుగుదొడ్లు, శుభ్రత సమస్యలు, పాత భవనాలు, ఉష్ణోగ్రత నియంత్రణకు సరైన వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ 8న వచ్చిన రాయిటర్స్ సంస్థ కూడా ఈ సమస్యలను ధ్రువీకరించింది.
పిల్లలు రోజులో ఎక్కువ సమయం ఉండేది పాఠశాలలోనే. అక్కడ పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, సురక్షితమైన భవనాలు, తగినంత వెలుతురు, గాలి, విద్యార్థులు కూర్చొనే బల్లలు లాంటి సౌకర్యాలు కల్పించడం విలాసం కాదు, అవి ప్రాథమిక అవసరాలు. అందుకే విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలు లేదా పరీక్షల విధానంలో మార్పులను మాత్రమే డిమాండ్ చేయడం లేదు.
గౌరవప్రదమైన, సురక్షితమైన వాతావరణంలో చదువుకునే హక్కును డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి
ఫ్రాన్స్‌లో అనేక హైస్కూల్ విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులకు హాజరవుతున్నారని, దీనికి తోడు ఇంటి పనులు, పరీక్షల తయారీ ఉంటాయని రాయిటర్స్ పేర్కొంది.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విశ్రాంతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుటుంబంతో గడిపే సమయం ఉండటం లేదని కూడా రాయిటర్స్ పేర్కొంది.
విద్యను కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే ప్రక్రియగా చూడకూడదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
పిల్లల మానసిక ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, సృజనాత్మకత కూడా విద్యలో భాగమేనని వారు వెల్లడించారు.
అయితే ఫ్రాన్స్‌లోని అన్ని పాఠశాలల్లోనూ ఒకేలా ఉందని కాదు. ప్రధానంగా అధిక పనిభారం, సుదీర్ఘమైన పాఠశాల రోజు, తగిన విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పార్కుర్సప్ వ్యవస్థపై అసంతృప్తి
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యలో ప్రవేశానికి ఉపయోగించే పార్కుర్సప్ ఆన్లైన్ విధానంపై కూడా విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది.
ఈ విధానం ద్వారా విద్యార్థులు విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి.
తమకు నచ్చిన కోర్సులో ప్రవేశం దొరుకుతుందో లేదో అనే అనిశ్చితి, ప్రవేశ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత కావాలనే డిమాండ్, కుటుంబ నేపథ్యం, పాఠశాలల మధ్య వ్యత్యాసాలు అవకాశాలను ప్రభావితం చేస్తాయనే ఆందోళన, ఉన్నత విద్య పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం లభిస్తుందా అనే భవిష్యత్ భయం వంటి సమస్యలు విద్యార్థులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుత ఉద్యమానికి తక్షణ కారణం ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల పరిస్థితులే అయినప్పటికీ పార్కుర్సప్ వంటి ఉన్నత విద్యా అంశాలు కూడా విద్యార్థుల అసంతృప్తిలో భాగంగా కనిపిస్తున్నాయి.
విద్యలో అసమానత – పేద ప్రాంతాల విద్యార్థుల సమస్య
ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా విద్యా అవకాశాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా లేవని ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం తెలియజేస్తున్నది.
ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల నిర్వహణ సమస్యలు తీవ్రంగా ఉంటే, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించే అవకాశాలు తక్కువ.
నివేదిక పేర్కొన్న మరో అంశం ఏమిటంటే, కొంతమంది సంపన్న కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలల నుంచి తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలకు మార్చుతున్నట్లు రాయిటర్స్ అక్టోబర్ 9న వెల్లడించింది.
ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ విద్యపై ఆధారపడే కుటుంబాల పిల్లలు మరింత వెనుకబడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత తగ్గితే, ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఆర్థికంగా స్తోమత ఉన్నవారికి మాత్రమే అవకాశం లభిస్తుందా అనే సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడటం వల్ల విద్యలో సామాజిక విభజన మరింత పెరగవచ్చని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వ బడ్జెట్ – ప్రజా రుణం
ప్రభుత్వం విద్యారంగంలో ఖర్చులు పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఫ్రాన్స్‌కు అధిక ప్రభుత్వ రుణాలు, బడ్జెట్ లోటును ఒక సమస్యగా ఉందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ప్రస్తుత ఆందోళనలోని ప్రధాన వైరుధ్యం. ఒక వైపు ఉపాధ్యాయులను నియమించాలి, పాఠశాల భవనాలను మరమ్మతు చేయాలి, తరగతి గదుల్లో రద్దీని తగ్గించాలి, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలి. మరో వైపు ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థల ఒత్తిడి ఉంది.
అయితే విద్యపై చేసే ఖర్చును కేవలం తక్షణ ప్రభుత్వ వ్యయంగా చూడకూడదు. నాణ్యమైన విద్య భవిష్యత్తులో నైపుణ్యాలు, ఉపాధి, పరిశోధన, ఆర్థిక ఉత్పాదకతకు పునాది అవుతుంది. అందువల్ల అసలు సమస్య ప్రభుత్వం ఎంత ఖర్చు చేయగలదు అనేది కాదు. అందుబాటులో ఉన్న వనరులను ఏ రంగాలకు, ఏ ప్రాధాన్యతతో కేటాయించాలి అనేదే అసలు సమస్య.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు
అక్టోబర్ 6న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థలో సమస్యలకు తోడు పోలీసుల అమానుష లాఠీచార్జితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
దాంతో ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అక్టోబర్ 7న టెలివిజన్‌లో ప్రసంగిస్తూ యువత ఆగ్రహానికి కారణాలు ఉన్నాయని అంగీకరించారు.
విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండదని భరోసా ఇచ్చారు. అదే సమయంలో నిరసనల్లో హింసను సమర్థించబోమనే ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.
అక్టోబర్ 8న ప్రభుత్వం 3,000 మంది ఉపాధ్యాయుల నియామకానికి అత్యవసర ప్రణాళికను ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి ఎడ్వార్ జెఫ్రే సుమారు 3,000 మంది అర్హత కలిగినప్పటికీ ఇంకా ఉద్యోగాల్లో చేరని ఉపాధ్యాయులను అత్యవసరంగా సంప్రదించి, అవసరమున్న పాఠశాలలకు పంపే చర్యలు చేపట్టినట్లు అక్టోబర్ 9 న తెలిపారు.
ప్రభుత్వం ఒక వైపు దీనిని అత్యవసర ప్రణాళికగా పేర్కొంటూనే మరొక వైపు దీనికి కొన్ని దశాబ్దాల మిలియన్ యూరోల వ్యయం అవుతుందని మంత్రి వెల్లడించారు. ఇది ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తున్నది.
ప్రభుత్వ ప్రకటన విద్యార్థి ఉద్యమం సాధించిన విజయం. అయితే ఇది అమలు కావాలంటే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన చేస్తే చాలదు. వారిని వాస్తవంగా అవసరమైన పాఠశాలల్లో నియమించి, తరగతులు నిర్వహించేలా తక్షణం చర్యలు చేపట్టాలని విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉద్యమం తొలి విజయం సాధించినట్లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇతర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నందున నిరసనలను కొనసాగిస్తామని తెలిపారు.
పోలీసుల బలప్రయోగం – మరో కీలక వివాదం
విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల దుశ్చర్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ చివరి నుంచి 6,600 మందికి పైగా అరెస్టులు జరిగినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయని అక్టోబర్ 8న అసోసియేటెడ్ ప్రెస్ తెలియజేసింది.
అరెస్టయిన వారిలో అధిక సంఖ్య మైనర్లు. పోలీసుల దమనకాండకు రెచ్చిపోయిన నిరసనకారులు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు చేయడం, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరో వైపు పోలీసుల లాఠీఛార్జీలో కొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 9న లే మోండ్ ప్రచురించిన నివేదికలో, సెప్టెంబర్ 28న సెయింట్-ఔన్-లోమోన్ ప్రాంతంలో జరిగిన ఘటనలో 14 ఏళ్ల విద్యార్థి ఈడెన్‌కు ముఖంపై తీవ్రమైన గాయాలు, దవడ రెండు చోట్ల విరిగినట్లు తెలిపింది.
ఈ ఘటనలో సంబంధిత పోలీసు అధికారిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది.
నిరసనల సమయంలో హింస, విధ్వంసం జరిగితే వాటిని చట్టబద్ధంగా నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాపాడటం, ముఖ్యంగా మైనర్ల విషయంలో ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరించకుండా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యతే.
విద్యార్థుల అసలు సమస్యలను పరిష్కరించకుండా కేవలం పోలీసు చర్యలతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కార్మిక సంఘాలు, ఉపాధ్యాయుల మద్దతు
ఉద్యమం విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైనప్పటికీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కార్మిక సంఘాలు కూడా ఇందులో భాగస్వాములయ్యాయి. ఉపాధ్యాయుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పరస్పరం సంబంధం కలిగినవి.
ఉపాధ్యాయుల కొరత, అధిక పనిభారం, తరగతి గదుల్లో రద్దీ వంటి సమస్యలు విద్యార్థుల విద్యా ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.
అదేవిధంగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యత తగ్గితే పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది.
పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి రావడం లేదా అదనపు ట్యూషన్లు ఏర్పాటు చేయాల్సి రావడం కుటుంబాలకు భారంగా మారుతుంది. అందువల్ల ఈ ఉద్యమంలో విద్యార్థుల డిమాండ్లు విస్తృతమైన ప్రజా సేవల పరిరక్షణ అంశంతో ముడిపడి ఉన్నాయి. అందుకే విద్యార్థుల ఉద్యమానికి సర్వత్రా మద్దతు లభించింది.
అక్టోబర్ 13 సమ్మె పిలుపు
విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు అక్టోబర్ 13 మంగళవారం మరో మారు దేశవ్యాప్తంగా పాఠశాల సమ్మెకు పిలుపునిచ్చాయని రాయిటర్స్ అక్టోబర్ 9న వెల్లడించింది.
3,000 మంది ఉపాధ్యాయులను నియమిస్తామనే హామీ ఒక ముందడుగు అయినప్పటికీ, మిగిలిన సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయుల నియామకాలను వెంటనే అమలు చేయాలి. అత్యవసరంగా ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలను గుర్తించాలి. పాఠశాలల మౌలిక వసతుల మరమ్మతులకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలి.
విద్యార్థులపై ఒత్తిడి నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలి. నిరసనల సమయంలో పోలీసు బలప్రయోగంపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలి.
విద్యార్థి సంఘాలతో నిరంతర చర్చలు జరపాలి. వీటిపై ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉద్యమ భవిష్యత్తు ఉంటుంది.
ఫ్రాన్స్ రాజకీయాలపై ఉద్యమ ప్రభావం
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు ప్రభుత్వ ప్రజా సేవల నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలకు దారితీసింది. ప్రభుత్వం ఒక వైపు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెబుతున్నది.
మరో వైపు ప్రభుత్వ రుణం, బడ్జెట్ లోటును నియంత్రించడం గురించి మాట్లాడుతున్నది. విద్యార్థుల సమస్యలను రాజకీయ పార్టీలు తమ విధానాల మద్దతుకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.
అయితే ఈ ఉద్యమాన్ని కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా పేర్కొనడం తప్పు.
భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం భారతదేశంలో విద్యా విధానం పట్ల ప్రభుత్వ వైఖరికి ఒక గుణపాఠం కావాలి.
1) ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం సామాజిక సమానత్వానికి అత్యంత అవసరం. పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని కారణంగా ఆర్థిక అసమానతలు తరతరాలుగా కొనసాగడమే కాక, రానురాను మరింత పెరుగుతున్నాయి. నూతన విద్యా విధానం 2020 పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
2) ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం, పాఠశాల భవనాలను నిర్వహించడం, మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల సదుపాయాలు కల్పించడం వంటి వాటిని విద్యా విధానంలో మొదటి ప్రాధాన్యతలుగా చూడాలి.
3) విద్యార్థుల సమస్యలను కేవలం పరీక్షల ఫలితాలు లేదా మార్కుల ఆధారంగా అంచనా వేయకూడదు. వారి మానసిక ఆరోగ్యం, విశ్రాంతి, భవిష్యత్తుపై భద్రతా భావం, ఉన్నత విద్యకు అవకాశాలు కూడా ప్రధానమైనవి.
4) విద్యార్థులు నిరసన తెలిపినప్పుడు ప్రభుత్వం వారితో చర్చించాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తూ, హింసాత్మక ఘటనలను చట్టబద్ధంగా నియంత్రించడం మధ్య సమతుల్యత అవసరం.
5) ప్రభుత్వ విద్యకు కేటాయించే నిధులను కేవలం ఖర్చుగా కాకుండా, భవిష్యత్తు సమాజ నిర్మాణానికి పెట్టుబడిగా చూడాలి.
విద్యార్థుల డిమాండ్లకు ఆచరణాత్మక పరిష్కారాలే సమాధానం
2026 అక్టోబర్ 9నాటికి ఫ్రాన్స్ విద్యార్థుల ఉద్యమం ఒక కీలక దశలో ఉంది. సుమారు 3,000 మంది ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రకటించడం విద్యార్థుల నిరసనల వల్ల వచ్చిన ముఖ్యమైన తొలి ఫలితం.
అయితే మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అప్పటిదాకా విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.
ఈ ఉద్యమం లేవనెత్తిన సమస్యలు ఒక్క రోజులో వచ్చినవి కావు. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల్లో రద్దీ, పాఠశాల భవనాల నిర్వహణ లోపాలు, విద్యార్థులపై అధిక ఒత్తిడి, సామాజిక అసమానతలు, ఉన్నత విద్యలో అనిశ్చితి వంటి సమస్యలు దీర్ఘకాలంగా పేరుకుపోయి ఉన్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ నియామకాలు ఎంతవరకు అమలవుతాయి, పాఠశాలల మౌలిక వసతులు మెరుగుపడతాయా, విద్యార్థులతో చర్చలు కొనసాగుతాయా, పోలీసు చర్యలపై న్యాయమైన పరిష్కారం లభిస్తుందా అనే అంశాలు రాబోయే రోజుల్లో కీలకం కానున్నాయి.
ప్రభుత్వం ముందు ఉన్న అసలు పరీక్ష నిరసనలను తాత్కాలికంగా ఆపడం కాదు. విద్యార్థులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం.
విద్య కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, అది సామాజిక సమానత్వానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి, ఆర్థిక అభివృద్ధికి పునాది. అందువల్ల విద్యార్థుల గొంతును వినడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ముఖ్యమైన బాధ్యత.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఉద్యమ సారాంశం ఇదే. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కావాలంటే, ముందుగా అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
